మహారాజా! నాకు ఎనిమిదేళ్ళ వయసున్నపుడు యమునా తటంపై భాండీర వనంలో నొక మఱ్ఱిచెట్టు క్రింద సింహాసనంలో నన్ను కూర్చోబెట్టి సురభద్ర, మండలీక, యోగవర్ధన, యక్షేంద్ర భద్రాది విశ్వవిఖ్యాతులైన మల్లులు, గోపాలీ, ధన్యా, విశాఖ, ధ్యాన నిష్ఠికా, అనుగంధా, సుభగాది గోపికలు పెరుగు, పాలు, ఫల, పుష్పాదులతో నన్ను పూజించారు. ఆ తరువాత మూడువందల అరవైమంది మల్లులు భక్తిపూర్వకంగా నన్ను పూజించి మల్లయుద్ధ ప్రదర్శన నేర్పాటు చేసి నా ప్రసన్నత కోసం పెద్దయెత్తున భారీ వేడుకలను నిర్వహించారు. ఆ మహోత్సవంలో రకరకాల భక్ష్యాలూ, భోజ్యాలూ, గోదానాలూ, గోష్ఠులూ, పూజాది భక్తి కార్యాలూ సంపన్నం చేయబడినాయి. శ్రద్ధాభక్తులతో అక్కడి బ్రాహ్మణుల నందరినీ సత్కరించారు. ఆనాటినుండీ మల్ల ద్వాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఈ వ్రతాన్ని మార్గశిర శుద్ధ ద్వాదశినాడు ఆరంభించి కార్తిక శుద్ధ ద్వాదశి దాకా ఆచరించాలి. లక్ష్మీనాథుని ప్రతిమాసం క్రమంగా కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర అనే నామంతో పూజించాలి. గంధపుష్ప ధూపదీప గీతవాద్య నృత్య సహితంగా ఈ పూజ సాగాలి. అడుగడుగునా కృష్ణోమే ప్రీయతాం అను మాటల నుచ్చరిస్తుండాలి.
మల్లులు ప్రారంభించారు కాబట్టి దీన్ని మల్లద్వాదశి అన్నారు. దీనినాచరించిన గోప బృందానికి ఆవులు, మహిషాలు, పొలాలు పెద్ద మొత్తంలో చేకూరాయి. ఈ యాగాన్ని చేసేవారు నా (కృష్ణుని) అనుగ్రహానికి పాత్రులై ఆరోగ్య, బల, ఐశ్వర్యాలతో కలకాలం జీవించి దేహాంతంలో శాశ్వత విష్ణులోక నివాసప్రాప్తి నొందగలరు.
మహారాజా! ప్రాచీనకాలంలో విదర్భ దేశాన్ని భీమసింహుడను ప్రతాపియైన మహారాజొకడు పరిపాలిస్తుండేవాడు. ఆయన మహాపతి వ్రతయగు దమయంతికి తండ్రి; నలమహారాజుకి మామగారు. ప్రజారంజకంగా శాస్త్రసమ్మతంగా ధర్మవిహితంగా ఆయన పాలన పేరుగాంచింది. ఒక రోజు బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు తీర్థయాత్రలు చేసుకుంటూ విదర్భచేరాడు. భీముడాయన వద్దకు పోయి ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులతో ఆదరించి ప్రసన్నం చేసుకున్నాడు. ఒకవారం గడిచాక విదర్భాధిపతి బ్రహ్మపుత్రుడిని ఇలా ప్రార్ధించాడు. ‘గురుదేవా! ఈ సంసారంలో జీవులనేక దుఃఖాలచే పీడింప బడుతున్నారు. గర్భవాసము మహాదుఃఖదాయకమని వినియున్నాను. రకరకాల రోగాలు కూడా అదే స్థాయిలో దుఃఖపెడుతుంటాయి. లోకుల ఈ బాధలను వారి శ్రేయోభిలాషిగా నేను తొలగించాలి కాని ఆ విషయంలో నా శక్తి పనికిరావడం లేదు. కించిత్పరిశ్రమతోనే మనిషి ఈ దుఃఖాలకు దూరమయ్యే ఉపాయమేదైనా, వ్రత - దానాదుల వంటిది ఉంటే ఉపదేశించి, ఆదేశించి నన్ను ధన్యుని చేయండి.’
పౌలస్త్యుడు ఆ రాజు ఆవేదనను బాధ్యతను గమనించి మరింత ప్రసన్నుడై ఇలా చెప్పాడు:
‘మహారాజా! మాఘశుక్ల ద్వాదశినాడు ఉపవాసం చేసినవారికి ఏ కష్టాలూ రావు. ఇది పరమ పవిత్రీకర తిథి. ఇది కడుగుప్తవ్రతం. అయినా నీ పట్ల స్నేహం కొద్దీ బయట పెడుతున్నాను. దీక్షితుడు కాని వానికి ఈ వ్రతాన్ని చెప్పకూడదు. జితేంద్రియులు, ధర్మనిష్ఠులు విష్ణుభక్తులునగు పురుషులకే ఈ వ్రతమును చేయుట యందధికారము గలదు. పూర్వాశ్రమంలో బ్రహ్మ, గురు, స్త్రీ, ఘాతకులై కృతఘ్నులై, మిత్రద్రోహులై పిమ్మట పశ్చాత్తప్తులై ప్రస్తుతం దీక్షితులు, ధర్మనిష్ఠులై జీవిస్తున్నవారు ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే వారి పాపాలన్నీ కడుక్కుపోతాయి.
దీనికోసం శుద్ధ తిథినాట, మంచి ముహూర్తంలో పదిజానల పొడవు వెడల్పు గల మండలాన్ని తయారుచెయ్యాలి. దాని మధ్యలో అయిదు జానల వేదిని తయారు చెయ్యాలి. వేదిపై పంచవర్ణయుక్తమైన మరొక మండలాన్ని వెయ్యాలి. ఇందులో ఎనిమిదిగాని నాలుగుగాని కుండాలను నిర్మించాలి. కుండముల వద్ద బ్రాహ్మణులను కూర్చుండబెట్టి మండల మధ్యంలో కర్ణికపై చతుర్భుజుడైన జనార్దనుని ప్రతిమను స్థాపించి దానికి గంధపుష్ప ధూపదీపాది ఉపచారాలతో నైవేద్యాలతో శాస్త్రోక్తంగా బ్రాహ్మణుల ద్వారా వ్రతియే పూజ చేయాలి. నారాయణుని సమ్ముఖంలో రెండు స్తంభాల నెత్తించి వాటిపైనొక అడ్డకఱ్ఱను కట్టి దానికొక ఉట్టిని కట్టి, ఒక కలశలో బంగారం లేదా వెండి లేదా మట్టిని ఉంచిన కుండకు వందగాని ఒకటిగాని కన్నాన్ని పెట్టి అందులో పాలనుగాని నేతినిగాని నింపి ఉట్టిపై పెట్టాలి. పలాశసమిధలూ, నువ్వులూ, నెయ్యీ, పాయసమూ, శమీపత్రాలతో గ్రహాలకు ఆహుతులనివ్వాలి. ఈశాన్యంలో గ్రహపీఠాన్ని స్థాపించి గ్రహ - యజ్ఞ విధానంలో వాటిని పూజించాలి. తూర్పు మున్నగు దిక్కులలో ఇంద్రాది దిక్పతులను స్థాపించి పూజించాలి. యజమాని శుక్ల వస్త్రధారియై, చందనం పూసుకొని, చేతిలో కుశదర్భలను పట్టుకొని దేవునికెదురుగా నొక పీటపై కూర్చోవాలి. ఏకాగ్రచిత్తుడై కలశ నుండి పడుతున్న జలధార (వసోర్ధార)ను చేతిలో నందుకొని శిరస్సుపై జల్లుకొని భగవంతునికి నమస్కరించి ఈ మంత్రాన్ని పఠించాలి.
నమస్తే దేవదేవేశ నమస్తే భువనేశ్వరః।
వ్రతేనానేన మాం పాహి పరమాత్మన్ నమోఽస్తుతే॥ (ఉత్తరపర్వం 74/42)
ఆ సమయంలో నల్దిక్కులా వున్న కుండాలలో బ్రాహ్మణులు పావనం చెయ్యాలి. శాంతికాధ్యాయాన్నీ విష్ణుసూక్తాన్నీ చదవాలి. శంఖాన్ని ఊదాలి. రకరకాల మంగళ వాద్యాలను మ్రోయించాలి. పుణ్య జయఘోషను చేయించాలి. మాంగలిక స్తుతి పాఠాలూ గట్టిగా చదవబడాలి. యజమాని ఆ రాత్రంతా హరివంశ, సౌపర్ణికాభ్యాన, మహాభారత కథలను శ్రవణం చేస్తూ జాగరం చెయ్యాలి. వసోల్ధార భగవానునిపై పడేలాగ పెట్టి పీఠము క్రింద దానిని పట్టి తీర్థంగా అందరికీ ఇవ్వాలి. ఇది సమస్త సిద్ధి ప్రదాయకం.
మరునాటి ఉదయమే ప్రతి లేదా యజమానుడు బ్రాహ్మణులతో సహా ఒక పుణ్య జలాశయంలో గాని నదిలోగాని స్నానం చేసి శ్వేత వస్త్రాలను ధరించి ప్రసన్న చిత్తంతో భాస్కర భగవానులకు అర్ఘ్యమివ్వాలి. పుష్ప ధూప దీపాది ఉపచారాలతో పురుషోత్తముని పూజించాలి. పావనం చేసి భక్తిపూర్వకంగా పూర్ణాహుతి నివ్వాలి. యజ్ఞంలో పాల్గొన్న బ్రాహ్మణులందరినీ శయ్యా, భోజన, గోదాన, వస్త్ర, దక్షిణలు, ఆభూషణాలతో సత్కరించాలి. ఆచార్యుని మరింత గొప్పగా సత్కరించాలి. ఆయన దేవతుల్య గురువు. దీనులనూ, అనాధలనూ, అభ్యాగతులనూ కూడా సంతుష్టపఱచాలి. తరువాత ప్రతి హవిస్యాన్నమును తినాలి.
ఈ వ్రతాచరణ వల్ల పాపిష్ఠ వ్యక్తులంతా పాపముక్తులౌతారు. కొన్నివందల విష్ణు యాగాలకూ వాజపేయాలకూ అతిరాత్రయాగాలకు ఈ వ్రతమొక్కటి సమానము. వ్రతి ఏడుజన్మలదాకా సర్వసుఖాలనూ అనుభవించి ఆ తరువాత క్రమంగా విష్ణు, రుద్ర, బ్రహ్మలోక నివాసాన్ని పొందగలదు.
ఓరాజా! ఈ వ్రతాన్ని ప్రాచీన కాలంలో సగరుడు, అజుడు, ధుంధుసారుడు, దిలీపుడు, యయాతి వంటి గొప్ప చక్రవర్తులు చేశారు. భృగుమహర్షి వంటి మహాత్ములు కూడా ప్రజలకోసం లోకకల్యాణం కోసం చేశారు. ఇక నీవు దీనిని స్వార్థరహితంగా మానవజాతి సుఖం కోసం నన్నడిగి తెలుసుకొని చేయబోతున్నావు కాబట్టి ఇక ఈ మాఘ శుక్ల ద్వాదశీ వ్రతం నీపేర భీమ ద్వాదశి వ్రతంగా ప్రపంచంలో పరిఢవిల్లుతుంది.’
ఆవిధంగా పౌలస్త్య భీమ సంవాదంలో ఈ వ్రతం జాతికి లభించింది” అని చెప్పాడు కేశవుడు.