ఋషులు సూతమహర్షిని ఇలా ప్రార్థించారు. “భగవన్! తాపత్రయనాశకము, సకల శుభదాయకమునగు సత్యనారాయణవ్రత కథను సాకల్యంగా విని ధన్యులమైనాము. ఇక బ్రహ్మచర్య మహత్త్వాన్ని మీ ద్వారా విని తరించగోరుచున్నాము.”
సూతుడిలా ప్రవచించసాగాడు.
“ఋషులారా! కలియుగంలో పితృశర్మ యనుపేరుగల శ్రేష్ఠ బ్రాహ్మణుడొకడుండేవాడు. అతడు వేద వేదాంగతత్త్వవేది. పాపభీతి కలవాడు. కలియుగం ఎంత భయంకర సమయమో చూసి తఱచుగా బాధపడుతుండెడివాడు. ఏ ఆశ్రమం ద్వారా కల్యాణ గుణకాంతులు కలుగ గలవు. శుభములు వెలయగలవు. అని ఆలోచిస్తుండేవాడు. ఎందుకంటే కలికాలంలో సన్యాసమార్గం దంభులచేత, పాఖండులచేత ఖండితమైపోయింది. వానప్రస్థమన్నది ఇంచుమించు లేకుండాపోయింది. బ్రహ్మచర్యమింకా అక్కడక్కడ నిలబడివున్నది. గార్హస్థ్య జీవనకర్మమే సర్వశ్రేష్ఠంగా పరిగణింపబడుతోంది. కాబట్టి తానుకూడా గృహస్థ ధర్మపాలనం చేయడానికి వివాహం చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చాడు పితృశర్మ. అదృష్టం బాగుండి తన మనోవృత్తికి తగిన పత్ని లభిస్తే జన్మ సఫలమవుతుందని ఆలోచించి ఉత్తమపత్నిని తనకు ప్రాప్తింపజేయుమని జగన్మాత భగవతి విశ్వేశ్వరీ దేవికి చందనాది ఉపచారాలతో పూజ చేసి ఈ విధంగా స్తుతించాడు.
నమఃప్రకృత్యై సర్వాయై కైవల్యాయై నమోనమః ।
త్రిగుణైక్య స్వరూపాయై తురీయాయై నమోనమః ॥
మహత్త్వజనన్యైచ ద్వంద్వ కర్యై నమో నమః ।
(మహత్ తత్వ) (కర్ర్త్యై)
బ్రహ్మమాతర్నమస్తుభ్యం సాహంకార పితామహి ॥
పృథగ్గుణాయై శుద్ధాయై నమో మాతర్నమో నమః ।
విద్యాయై శుద్ధ తత్త్వాయై లక్ష్మై సత్త్వరజోమయి ॥ (ప్రతిసర్గపర్వం. 2/30/10-12)
పితృశర్మపూజా స్తుతులకు ప్రసన్నురాలై దేవి సాక్షాత్కరించింది.
‘నాయనా! నీకు తగిన భార్యగా విష్ణుయశుడను బ్రాహ్మణుని కూతుర్ని నిశ్చయించాను. వెళ్ళి పెళ్ళిచేసుకో’ అని ఆదేశించింది. అతడలాగే చేసి మథురలో కాపురం పెట్టి గృహస్థ ధర్మానుసారం జీవనయాపనం చేయసాగాడు. నాలుగు వేదాలలోనూ నిష్ణాతుడైన పితృశర్మకు నలుగురు కొడుకులు పుట్టగా నతడు వారికి వేదాలపేర్లే పెట్టుకున్నాడు. ఋక్కు, యజుషుడు, సాముడు, అథర్వుడు అని. ఋక్కుని పుత్రుడు వ్యాడి. అతడు న్యాయశాస్త్ర విశారదుడయ్యాడు. యజుషుని పుత్రుడు లోక విఖ్యాతుడైన మీమాంసకారునిగా వర్ధిల్లాడు. సాముని పుత్రుడు పాణిని ప్రపంచమే గర్వించదగ్గ వ్యాకరణశాస్త్ర పారంగతుడు. అథర్వుని పుత్రుడు వరరుచి చాలా విధాల ప్రఖ్యాతుడు.
ఒకనాడీ నలుగురు బ్రహ్మతేజోమయులూ తాతగారైన పితృశర్మతో కలసి సమ్రాట్ చంద్రగుప్తుని సభకు వెళ్ళారు. ఆయన వీరిని చూడగానే లేచి నిలబడి వారిని ఘనంగా సన్మానించి ఇలా అడిగాడు. ద్విజులారా! ఎవనిని శ్రేష్ఠుడైన బ్రహ్మచారిగా నిశ్చయించ వచ్చును? వెంటనే నలుగురూ ఇలా అన్నారు.
‘మహారాజా! ఆ పరమపురుషుని న్యాయపూర్వకంగా ఆరాధించేవాడు శ్రేష్ఠుడు - వ్యాడి.
‘ప్రభో! యజ్ఞంద్వారా బ్రహ్మాది దేవతలను తృప్తిపరుస్తూ, రోచనాదులతో వారిని అర్చించి తర్పణాదులను సమర్పించే వ్యక్తియే శ్రేష్ఠుడు’ - మీమాంసుడు.
‘రాజేంద్రా! ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరాల ద్వారాగాని పరా, పశ్యంతీ, మధ్య మారకములతో కూడిన వాణి ద్వారా గాని శబ్ద బ్రహ్మనారాధిస్తూ, లింగ, ధాతు, గణ సమన్వితమైన స్తోత్ర పాఠాలతో శబ్దబ్రహ్మను సంతుష్టి పరచగలవాడే శ్రేష్ఠుడు’ - పాణిని.
‘ఓ మగధాధీశా! ఉపవీతుడై గురుకులంలో నివసిస్తూ దండ, కేశ, నఖదారిగా నుండి భిక్షార్థియై వేదాధ్యయన తత్పరుడై యుండి గుర్వాజ్ఞానుసారము ప్రవర్తించేవాడే శ్రేష్ఠుడైన బ్రహ్మచారి’ - వరరుచి.
‘బ్రహ్మచర్యమంటే వివాహం చేసుకోకపోవడం కాదు మహారాజా’ అంటూ మొదలు పెట్టాడు అన్ని విధాలా ఆనలుగురి తాతయైన పితృశర్మ. ‘గృహస్థధర్మాన్ని అనుష్టిస్తూనే పితరులనూ, దేవతలనూ, అతిథులనూ తృప్తిపరుస్తూ, ఇంద్రియాలను అదుపులో వుంచుకొంటూ, ఋతుకాలంలోనే అదీ సంతానేచ్ఛతో మాత్రమే భార్యతో సంగమించేవాడు శ్రేష్ఠుడైన బ్రహ్మచారి.’
చంద్రగుప్తుడు వెంటనే పితృశర్మ పాదములపై బడి ‘కలికాలానికి తగిన ధర్మం తెలిసిన వారు మీరు. దయచేసి నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి’ అని ప్రార్థించి కృతార్థుడైనాడు.
ఆ తరువాత వీరంతా కలసి చాలాకాలం జీవించారు. చంద్రగుప్త సమ్రాట్టు అనాయాస మరణానంతరము స్వర్గమును చేరుకోగా పితృశర్మ హిమాలయాలలోకి పోయి యోగధ్యాన పరాయణుడై శ్రీహరిని ధ్యానిస్తూ ఆయనలో లీనమైనాడు.”