భవిష్య పురాణము

19 - ద్వితీయాకల్పం - చ్యవన మహర్షికథః - పుష్ప ద్వితీయా వ్రత మహిమ

“ద్వితీయా తిథినాడే చ్యవన మహర్షి ఇంద్రుని సముఖంలో ఒక యజ్ఞంలో అశ్వనీ కుమారులచే సోమపానం చేయించాడు.” అన్నాడు మహర్షి.

తిథులలో పాడ్యమి గూర్చి విని విదియను గూర్చి అడిగి వినబోతున్న శతానీక మహారాజు పై మాటలను విని ఆశ్చర్యపడి, సహజంగా ఆవైనం వివరంగా తెలుపమని అడిగాడు, పాడ్యమి, విదియ, తదియ, చవితి అనే మాటలు కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే వినబడుతున్నాయి. కాబట్టి సార్వలౌకికమైన ప్రతిపద, ద్వితీయ, తృతీయ, చతుర్థి అనే మాటలే ఈ పురాణంలో కనిపిస్తాయి.

సుమంతుముని ఇలా చెప్పసాగాడు.

“మహారాజా! మొదట్లో చ్యవన మహర్షి సత్యయుగ పూర్వసంధ్యలో గంగాతీరంలో సమాధిస్థితుడై కొన్నేళ్ళుగా తపస్సులో మునిగి అలాగే వుండిపోయాడు. ఒకనాడు శర్యాతి మహారాజు తన సైన్యంతో అంతఃపురంతో గంగా స్నానానికి బయలుదేరిన వాడై చ్యవన మహర్షి ఆశ్రమ(అన్యపురాణాల్లోనూ మహాభారతంలోనూ ఈ ఆశ్రమం సేనాభద్ర, వధూసర నదుల సంగమ ప్రదేశం వద్దనున్నట్టు చెప్పబడింది. అదే నేడు దేవకుండమనే పేరిట ప్రసిద్ధి పొందింది.) సమీపంలో విడిది చేసి గంగాస్నాన పుణ్యకార్యాన్ని నెరవేర్చుకున్నాడు. దేవతలనూ ఆరాధించాడు. పితృదేవతలకు పిండాలు వదిలాడు. తరువాత ఆయన తన నగరుకి వెళ్ళడాని కుద్యక్తుడౌతుండగా అతని సేనలో విలక్షణమైన వ్యాకులత, ఆందోళన రేగాయి. మూత్ర, విష్ఠ ద్వారాలు ఆకస్మాత్తుగా మూసుకుపోయి, కన్నులు పనిచేయడం మావేశాయి. ఆ రాజు చాలా కంగారు పడిపోయినా తెలివైనవాడు కాబట్టి తన పరివారంలో ప్రతి ఒక్కరినీ ఇది పరమ పవిత్రుడైన చ్యవన మహర్షి ఆశ్రమం. ఇక్కడెవరూ పిచ్చిపనులేవీ చేయలేదు కదా అని అడుగసాగాడు. ఎవరూ బదులు చెప్పలేకపోయారు. కానీ చివరికి అతని కూతురు, పేరుకు తగినట్టే మంచి కన్యయైన సుకన్య “నాన్నగారూ! నేనొక వింతను చూశాను. ఆశ్రమం ప్రక్కనే ఉద్యానవనములో మేము విహరిస్తుండగా సుకన్యా! నీవిక్కడకు రమ్ము! నీవిక్కడకు రమ్ము! అనే మాటలు వినిపించాయి. ఆ శబ్దం వస్తున్న చోటికి నా సఖులతో సహా నేను వెళ్ళాను. అక్కడొక బాగా ఎత్తుగా పెరిగిన పుట్ట కనిపించింది. ఆ పుట్ట కన్నాలలోనుండి బ్రహ్మాండమైన కాంతులు బయటకి వస్తున్నాయి. పద్మరాగమణులతో సమానమైన వస్తువేదో లోపల వుండి పోయి ఇలా వెలుగులు విరజిమ్ముతోందని నాకనిపించింది. నమస్కారం పెట్టి వెళ్ళిపోవడం మంచిదని ఓ పక్కనుండి అనిపిస్తున్నా,   మూర్ఖతా, చంచలతా ఎక్కువైపోగా ఒక కుశదర్భను తీసుకుని దాని కొనతో వెలుగు బాగా వస్తున్న రెండు కన్నాలను పొడిచాను. వెంటనే వెలుగులు ఆరిపోయాయి” అని చెప్పింది. శర్యాతి మహారాజు వెంటనే ఆమెను తోడ్కొని ఆ పుట్ట వున్న చోటికి వెళ్ళాడు. ఆ పుట్ట మహాతపస్వియైన చ్యవన మహర్షి చుట్టూ పెరిగియున్నది. ఆయన ఎన్నో సంవత్సరాలుగా సమాధి స్థితుడై అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. అతని కన్నుల అరమోడ్పు వెలుగులే సుకన్యకు కనిపించాయి. సరిగ్గా ఆమె పొడిచిన చోట ఆయన కన్నులున్నాయి. ఇపుడవి లేవు. మహారాజు తాను మహారాజునని విస్మరించి చ్యవనుని కాళ్ళపై పడి తమ అపరాధాన్ని మన్నింపవలసినదిగా అతిదీనంగా వేడుకున్నాడు.

“అపరాధాన్ని ఎపుడో క్షమించేశాను” అన్నాడు చ్యవన మహర్షి, “కాని నీ కన్యను నాకిచ్చి వివాహం చెయ్యి. నీకు అఖండ శుభాలు కలుగుతాయి”.

మహారాజు వెంటనే ఆనందంగా మహర్షి ఆజ్ఞను నెరవేర్చాడు. అతని పరివారానికి అంతకు ముందు కలిగిన బాధలన్నీ పోయాయి. రాజు కన్యను మహర్షికి ఒప్పగించి సహర్షుడై సపరివారంగా తన రాచనగరుకి వెళ్ళిపోయాడు.

సుకన్య భక్తి పూర్వకంగా పతిని సేవించుకోసాగింది. రాజ వస్త్రాలను, ఆభరణాలను త్యజించి నార చీరలను మృగ చర్మాన్ని ధరించసాగింది. ఆశ్రమ జీవనానికి అలవోకగా అతి సులువుగా అలవాటు పడిపోయిన ఆమెను చూచి సంప్రీతుడైన మహర్షి కొంత కాలానికి మరింత ప్రసన్నుడై ఆమెకు మాతృత్వాన్ని ప్రసాదిస్తానని వచించాడు.

ఆమె సిగ్గుపడుతూనే “స్వామీ! మీ ఆజ్ఞను ఏ విధంగానూ జవదాటలేను గానీ, మీరు యువావస్థలో అందంగా సుందర వస్త్రభూషణాలంకృతులై నావద్దకు వచ్చి నన్ను అనుగ్రహిస్తే “ అంటూ ఆపేసింది.

“అవన్నీ నాకెలా వస్తాయి?” అన్నాడాయన నవ్వుతూనే, “నేనేం మీ నాన్నలాగా రాజునా?” అన్నాడు.

“స్వామీ! మీకున్న తపోబలం ద్వారా మీరు ఏమి చేయడానికైనా సమర్థులు. మీరు తలచుకోవాలే గానీ మీకిదొక పెద్ద విషయమా?” అంది సుకన్య.

“రాజపుత్రీ! ఈపనికై నేను నా తపశ్శక్తిని వ్యర్థం చేయదలచుకోవటం లేదు” అంటూ ఆయన ప్రశాంతంగానే తపశ్చర్యలోకి మరల ప్రవేశించగా ఆమె మరింత ప్రశాంతంగా ఆయనకి సపర్యలు చేయసాగింది. ఇలా కొన్నేళ్ళు గడిచాయి.

ఒకరోజు అశ్వనీ కుమారుడు ఆ దారెంట వెళుతూ సుకన్యని చూశాడు.

“భద్రే! ఎవరు నీవు? ఈ అడవిలో ఒంటరిగా ఏమిచేస్తున్నావు?” అని అడిగాడు.

 “నేను శర్యాతి మహారాజు పుత్రికను. నాపేరు సుకన్య. నా పతిదేవులు చ్యవనమహర్షి ఇక్కడ తపస్సు చేస్తున్నారు. నేనాయనను సేవించుకుంటూ ఇక్కడున్నాను. ఇంతకీ తమరెవరు?”

“నేను దేవ వైద్యుడనైన అశ్వనీకుమారుడను. ఈ వృద్ధుడైన పతితో ఏం సుఖపడతావు గానీ మా ఇద్దరు అశ్వనీ కుమారులలో ఒకరిని వరించు” ఈలోగా రెండవ అశ్వనీ కుమారుడు కూడా ముందుకి వచ్చాడు.

“దేవతలారా! ఈ రకంగా మాట్లాడడం మీకు ఉచితం కాదు. నేను పవిత్రత గల పతివ్రతను. అన్నివిధాల అనురక్తితోనే పతిసేవ చేసుకుంటున్నాను.”

“సరే ఓ పనిచేద్దాం. మేము మా ఘనశక్తితో నీ పతిని యవ్వనవంతునిగా సుందరునిగా తయారుచేస్తాం. అపుడు ముగ్గురుమూ గంగలో స్నానం చేసి బయటకి వస్తాం. అపుడు మాత్రం నువ్వు మా ముగ్గురిలో ఒకరిని వరించాలి. సరేనా.”

“క్షమించండి ఆర్యా! నా పతి ఆజ్ఞ లేనిదే నేనేమీ చెప్పలేను.”

పతిదేవుని అనుజ్ఞ తీసుకుని ఆయనను తోడ్కొని రమ్మనీ అంతవరకూ తామక్కడే వేచియుంటామనీ చెప్పి పంపించారు అశ్వనీ దేవతలు.

సుకన్య ద్వారా మొత్తం విషయాన్ని విన్న చ్యవన మహర్షి తానే ఆమెను తోడ్కొని అశ్వనీకుమారులున్న తావునకు వచ్చాడు. తనను యువకునీ, రూపసినీ చెయ్యమన్నాడు. తమలో ఒకరిని సుకన్య వరిస్తుందన్నాడు. ఆయన అనుమతించగానే వారతనిని గంగలోకి గొనిపోయారు. తక్కువ సమయంలోనే సుకన్య కెదురుగా ముగ్గురు బహుసుందరులైన ముగ్గురు పురుషులు యౌవనంతో మిడిసిపడుతూ, గొప్పగా అలంకృతులై గోచరించారు. కాని, ఎక్కడా ఏమాత్రమూ వేషాలలో తేడా లేకుండా ముగ్గురూ ఒకేలాగున్నారు. ఆమె వైపు “ఎందుకాలస్యం? కానియ్” అన్నట్లు చూశారు.

వీరిలో తన పతియెవరు? సుకన్యకేమీ బోధపడలేదు. దేవతలకు దండం పెట్టడం తప్ప తానేమీ చేయలేనని తెలుసుకుంది. ఒక పతివ్రతగా మునిపత్నిగానే మనసా, వాచా, కర్మణా జీవించదలచుకుంది గానీ దేవకాంత పదవి ఆమె ఆశయానికి భిన్నం. అందుచేత వారినే ప్రార్థించింది ఇలా.

“దేవ దేవులారా! కురూపి, వృద్ధుడు అయివున్నపుడే నేను నా పతిని వదల దలుచు కోలేదు. ఇప్పుడాయన మీ దయవల్ల సుందరుడు, రూపసి, యువకుడు అయినాడు. ఇది నాభాగ్యము. ఇచ్చిన వరాన్ని శాపంగా చేయకండి. దయచేసి దేవతలలాగే ప్రవర్తించండి” అని సుకన్య ప్రార్ధించగానే దేవతలు తమ రూపాల్లో దేవతా లక్షణాలను కనబరచారు.

అపుడు జాగ్రత్తగా పరిశీలించింది సుకన్య. ఆ ముగ్గురిలో ఒకరికే కనురెప్పలు మూసుకు పోవడం తెరుచుకోవడం జరుగుతోంది. ఆ వ్యక్తి పాదాలే పుడమికి తగులుతున్నాయి. ఆ వ్యక్తియే తన జీవితభాగస్వామి చ్యవనమహర్షి అని పోల్చిన సుకన్య అతనినే వరించింది. వెంటనే ఆమెపై ఆకాశం నుండి పూలవాన కురిసింది. దేవ దుందుభులు మ్రోగాయి.

అప్పుడిలా అన్నాడు. చ్యవన మహర్షి

ఉపకారం వరిష్ఠం యోన కరోత్యుపకారిణః

 ఏకవింశత్ సగచ్ఛేచ్చ నరకాణి క్రమేణవై (బ్రాహ్మ 19-40,41)

 “ఉపకారాన్ని పొందినాక, ప్రత్యుపకారం చేయగలిగే దక్షత వుండీ ఆ ప్రయత్నం చెయ్యనివాడు క్రమంగా ఇరువది యొక్క నరకాల్లోనూ పడతాడు. ఇప్పుడు చెప్పండి అశ్వనీకుమారులారా, ఏమిటిలా వచ్చారు?” అన్నాడు.

“మహాత్మా! అందరు దేవతలకూ అందే యజ్ఞభాగాలు మాకు మాత్రమే అందడం లేదు. దానివల్ల మా లోకంలో మా ప్రతిష్ఠకు న్యూనత ఏర్పడుతుంది. మీరు దయతో మాకు హవిస్సులందేలాగ చూడాలి” అభ్యర్ధించారు అశ్వినులు.

అలాగేనన్నాడు చ్యవనముని. సెలవు తీసుకొని వెళ్ళారు దేవతలు.

శర్యాతి మహారాజుకు తన అల్లుడి అందాల కథ తెలిసింది. వెంటనే ఆయన మహారాణిని వెంటనిడుకొని ఆశ్రమానికి వచ్చాడు. రాజే ముందు మహామునికి నమస్కారం చేశాడు. చ్యవనుడు మహారాజుకి ధర్మం ప్రకారం స్వాగతం చెప్పాడు. సుకన్య తల్లిదండ్రు లిద్దరూ అల్లుడిగారి యౌవన రూపరేఖా విలాసాలను చూసి మురిసిపోయారు. చ్యవనుని ప్రవర్తనలో మార్పులేదు. ఆయన మహర్షిగానే వున్నాడు.

“మహారాజా! ఒక మహా యజ్ఞానికి సామగ్రిని సిద్ధం చేయించండి. నేను మీ చేత ఆ యజ్ఞాన్ని చేయిస్తాను” అని ఆదేశించాడు మహర్షి.

“మహాప్రసాదం” అంటూ వెంటనే బయలుదేరి మంత్రి పురోహిత సమేతంగా వీలైనంత తొందరగా అన్ని ఏర్పాట్లు చేసి చ్యవనుని ఆహ్వానించాడు శర్యాతి మహారాజు.

భార్యాసమేతుడై చ్యవన మహర్షి రాగానే యజ్ఞం ప్రారంభమైంది. ఋత్విక్కులు అగ్నికుండంలో స్వాహాకార సహితంగా దేవతలకు ఆహుతులివ్వసాగారు. చ్యవనమహర్షి చేయిస్తున్న యజ్ఞం కావడంతో దేవతలంతా స్వయంగా వచ్చి తమ తమ యజ్ఞ భాగాలందుకోవడానికి వేచియున్నారు. చ్యవనుడు పిలవడంతో అశ్వనీకుమారులు కూడా వచ్చారు. ఇంద్రుడికది నచ్చలేదు.

“మునులారా! ఈ అశ్వనీకుమారులు దేవవైద్యవృత్తిలో నున్నవారు. కాబట్టి వీరికి యజ్ఞభాగాన్నందుకునే అధికారం లేదు. మీరు వారికి ఆహుతి ప్రదానం చేయవద్దు” అన్నాడింద్రుడు.

“ఓ దేవరాజా! మాకు అశ్వనీకుమారులు కూడా దేవగణంగానే పరిగణింపబడుతున్నారు. మాకు వారు కూడా ఎంతో ఉపకారం చేశారు. అందుకే నేను వారిని ఆహ్వానించాను.

చ్యవనుడెంత వినయంగా చెప్పినా ఇంద్రుడు కోపం తెచ్చుకుని కఠోర స్వరంతో ఇలా అన్నాడు.

“నీవు నామాట వినకపోతే నా వజ్రాయుధాన్ని నీపై ప్రయోగిస్తాను.’’

తొణక్కుండా, బెణక్కుండా చ్యవనుడు ఏమాత్రమూ భయభీతుడు కాకుండా తన విధిని తానుచేసుకుపోతూ అశ్వినులకు యజ్ఞభాగాన్ని కూడా మంత్రపూర్వకంగా ఇచ్చేశాడు. కోపాన్ని పట్టలేని ఇంద్రుడు వజ్రాయుధాన్ని చ్యవనమహర్షి వైపు విసిరివేయబోతుండగా ఆయన తన తపశ్శక్తిని ప్రయోగించి ఇంద్రుని స్తంభింపజేశాడు. అంతటి మహేంద్రుడూ వజ్రాయుధంతో సహా చలనరహితుడై అలా స్థంభంలాగా వుండిపోయాడు. చ్యవనుడు తన మాటను నిలబెట్టుకున్నాడు. అశ్వనీకుమారులు ధన్యులైనారు.

అపుడు వారికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఇంద్రుని విడిపింపుమని చ్యవనుని కోరాడు. అశ్వనీ కుమారులకు యజ్ఞభాగాలికపై అందుతాయని నియమించాడు.

చ్యవనునిచే విముక్తుడైన ఇంద్రుడు “ఓ మహామునీ! మీ తపశ్శక్తి లోకప్రసిద్ధం కావడానికే ఈ ఘట్టం సృష్టించబడింది. అశ్వనీ దేవతలికపై మాలాగే సంపూర్ణ దేవతలవుతారు. మీ యొక్క ఈ తపోధనయుక్తమైన కథను విన్నవారికీ, చదివినవారికీ ఉత్తమరూప యౌవనాలు ప్రాప్తిస్తాయి.” ఈ విధంగా దీవించి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. చ్యవనముని, సుకన్య, శర్యాతి ఆశ్రమానికి మరలినారు.

అక్కడ ఆశ్రమానికి బదులుగా పెద్ద మహలు గోచరించింది. దానిచుట్టూ సుందరమైన వనాలు, ఉపవనాలూ, తటాకాలు, విహారయోగ్యాలై సృష్టింపబడివున్నాయి. అపురూపమైన శయ్యలు, గదుల నిండా రత్నాభరణాలు మహలు నిండా సద్దబడివున్నాయి. ఇవన్నీ దేవరాజు ఇంద్రుడు తనపై గల అనురాగాన్ని ప్రదర్శించిన తీరుగా, అనుగ్రహంగా, అర్థం చేసుకున్న చ్యవన మహర్షి ప్రసన్నుడయ్యాడు.

శతానీక మహారాజా! ఈ విధంగా ద్వితీయాతిథినాడు అశ్వనీకుమారులకు దేవత్వమూ, యజ్ఞభాగమూ ప్రాప్తించాయి. ఈ తిథిని విదియ అని కూడా అంటారు. విధి విధానాలతో శ్రద్ధగా కార్తికమాసంలో శుక్లపక్ష విదియనాడు ఈ వ్రతాన్ని ప్రారంభించి ఒక ఏడాదిపాటు సంయమనం పాటిస్తూ పుష్పభోజనాన్ని మాత్రమే గ్రహిస్తూ వ్రత సమాప్తి చేసిన పురుషులకు ఉత్తమ రూపం లభిస్తుంది. బంగారు లేదా వెండిపూలను గాని కమలా పుష్పాలను గాని వ్రతదినాల్లో బ్రాహ్మణులకు దానమిచ్చిన వానికి అశ్వనీ దేవతల అనుగ్రహం వల్ల  దేహాంతమందు కల్పపర్యంత స్వర్గప్రాప్తి, మరుజన్మలో సంపన్న, వేద వేదాంగ జ్ఞాన సముపేత బ్రాహ్మణావతారం సిద్ధిస్తాయి.