“యోగీశ్వరేశ్వరా! వినాయకశాంతి సమస్త ఆపత్తులనూ అణచివేస్తుందని విన్నాను. దయచేసి ఆ విధానాన్ని వినిపించండి” అని ప్రార్థించాడు ధర్మజుడు.
చెప్పసాగాడు సర్వజ్ఞ చూడామణి శ్రీకృష్ణుడు.
“నరేశ్వరా! ఈ శాంతిని చేయించడంవల్ల అన్ని అరిష్టాలూ పోతాయి. ఈ క్రియను సంపూర్ణ విఘ్నాలనూ దూరం చేసుకోవడానికి చేస్తారు. నీళ్ళలో దిగివున్నట్లు, తలలేనట్లు, కాషాయ వస్త్రాలు ధరించినట్లు, అకారణంగా దుఃఖిస్తున్నట్లు లేదా కార్యం సఫలం కానట్లు కలలు వచ్చినా, ఇలలోనే జరిగినా ఆ వ్యక్తిపై వినాయకుని అనుగ్రహం తప్పిందని అర్థం చేసుకోవాలి.
కాబట్టి ఒక పుణ్య దినం నాడు సామాన్య స్నానం కాకుండా స్నపన కార్యం చేయాలి. అనగా గానుగలో పిండి ఆడించిన పచ్చ ఆవాల ముద్దని నేతితోనూ సుగంధ ద్రవ్యాలతోనూ కలిపి కుంకుమను కూడా చేర్చి దానితో అభ్యంగనం చేసుకోవాలి. ఆ తరువాత స్నానం చేసి పవిత్రులు కావాలి. బ్రాహ్మణులచే స్వస్తి వాచనములను చేయించాలి. విధి పూర్వకంగా కలశ స్థాపనం గావించి అభిమంత్రిత జలం ద్వారా యజమానికి అభిషేకం చేసి బ్రాహ్మణులు ఇలా పలకాలి:
సహస్రాక్షం శతధార మృషిణా వచనం కృతం।
తేన త్వామభిషించామి పావమాన్యః పునంతుతే॥
భగం తే వరుణో రాజా భగం సూర్యో బృహస్పతిః
భగమింద్రశ్చ వాయుశ్చ భగం సప్తర్షయో దదుః॥
యత్తే కేశేషు దౌర్భాగ్యం సీమంతే యచ్చమూర్ధని।
లలాటే కర్ణయోరక్ష్ణోరాపస్తద్ ఘ్నంతు తే సదా॥ (ఉత్తరపర్వం 144/12-14)
తరువాత యజమాని తన కుడిచేతిలో కుశలను పట్టుకొని ఆవనూనెతో హవనం చేయాలి. మిత, సమ్మిత, సాల, కాలకంటక, కూష్మాండ, రాజపుత్ర శబ్దాలకు అంతంలో (‘య’తో) స్వాహాను చేర్చి హవనం చేయాలి. నాలుగు దారుల్లో కుశలను జల్లి తరువాత బలులను నైవేద్యాలను అర్పితం చేయాలి. వికసించిన పూలతో, దూర్వాతో అర్ఘ్య మివ్వాలి. మండలంలో అర్ఘ్యమిచ్చి వినాయకుని తల్లియైన అంబికను పూజించి ఇలా ప్రార్థించాలి. ‘మాతా! నీవు నాకు రూప, యశ, ఐశ్వర్య, పుత్ర, ధనాలను ప్రసాదించు. నా సర్వాభీష్టాలను నెరవేర్చు.’
తరువాత తెల్ల వస్త్రాలనూ, మాలనూ చందనాన్నీ ధరించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి గురువుగారికి రెండు వస్త్రాలనివ్వాలి. ఈ విధంగా గ్రహాలనూ వినాయకునీ విధి పూర్వకంగా పూజిస్తే సంపూర్ణంగా కర్మఫలాలన్నీ ప్రాప్తిస్తాయి. లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది.