భవిష్య మహా పురాణము
10-13 - వస్తుపూజ
(ప్రస్తుతం దీని గురించి చాలా మందే ఆలోచిస్తుండడం వల్ల సూతమహర్షి చెప్పిన దానికంటె ముందు దీనిపై ఉపోద్ఘాతం అవసరం)
మనుష్యాది ప్రాణులు నివసించే భూమికే ‘వాస్తు’ అని పేరు. దీనిలో గృహ, దేవప్రాసాద, గ్రామ, నగర, పుర, దుర్గాది అనేక భేదాలున్నాయి. వాస్తు శాస్త్రం వాస్తురాజ వల్లభ, సమరాంగణ సూత్రాధార, బృహత్సంహిత, శిల్పరత్న, గృహరత్నభూషణ, హయ శీర్షపాంచరాత్ర, కపిలపాంచరాత్రాది గ్రంథాలలో విశేషంగా చర్చింపబడింది. మత్స్య, అగ్ని, విష్ణు ధర్మోత్తర పురాణాలలో కూడా ఈ మహత్త్వ పూర్ణ విషయప్రసక్తి వుంది. ‘కల్యాణ్’ యను సుప్రసిద్ధ పత్రిక దేవతాంకాలలో కూడా వాస్తు - చక్రాది విషయాలపై సామగ్రి సంకలితం చేయబడినది. వాస్తు పుట్టుక విషయంలో మత్స్య పురాణంలో ఇలా చెప్పబడింది.
అంధకాసురుని వధించినప్పుడు శివ భగవానుని నుండి స్రవించిన స్వేదం ఆయన లలాటం నుండి జారి నేలపై బడగా దాని నుండి ఒక భయంకరాకారుడు పుట్టుకొచ్చి మూడులోకాలనూ తినేయడానికి బయలుదేరగా శంకరాది దేవతలంతా ముందువాడి ఆకలి తీర్చి వాణ్ణి బుజ్జగించి ఒక దేవతగా నిలుపుతామని నమ్మబలికి నిద్రబుచ్చారు. ఆ తరువాత దేవతలందరూ తమతమ అంశాలతో అతని శరీరంలో ప్రవేశించి, నివసించి అనగా వాసము చేసి అతనిని వాస్తుదేవతా లేదా వాస్తు పురుషుడు అనే పేరుతో ప్రతిష్ఠించారు. అందరు దేవతలూ ఆయనలోనే వున్నారు కాబట్టి ఆయన వాస్తు దేవతగా యుగాల పాటు పూజింపబడతాడని వరమిచ్చి వెళ్లారు. వాస్తుదేవతను పూజించడానికి వాస్తుప్రతిమ, వాస్తుచక్రమూ కూడా తయారు చేయబడినాయి. వాస్తుచక్రం సుమారు 49 నుండి ఒక వేయి అడుగుల దాకా వుంటుంది. (పురాణంలో సహస్రపదాత్మకమనే మాట వాడబడింది.) ఏ రకం అవసరానికి ఆ రకం వాస్తు చక్రాన్ని నిర్మించాలి. అందులో దేవతల ఆవాహన, స్థాపన, పూజనలను నిర్వహించాలి. అరువది నాలుగు లేదా ఎనుబది యొక్క పదాత్మక వాస్తుచక్రాలే పరంపరానుగతంగా ఎక్కువగా వాడబడుతున్నాయి. అన్ని వాస్తు చక్రాలలోనూ ఇంద్రాది పది దిక్పాలకులనూ, శిఖీ మున్నగు మరో నలువది యైదుగురు దేవతలనూ పూజించడం జరుగుతుంది. వారందరికీ పాయసాన్నబలుల నివ్వడం జరుగుతుంది. వాస్తు కలశనొక దానిని తయారుచేసి అందులో వాస్తోష్పతి నామధరుడైన వాస్తుదేవత నావాహనం చేసి సర్వ విధశాంతి కోసం, సకల శుభాలకోసం ఈయనను ప్రార్థించాలి.)
సూతమహర్షి మునులమధ్య ఇలా ప్రవచించసాగాడు. “బాహ్మణులారా! ఇపుడు నేను వాస్తుమండలాన్ని సంక్షిప్తంగా వర్ణిస్తాను. ముందుగా భూమిని కొన్ని అంకురాలు (విత్తనాలు (బీజ) అనే మాట లేదు. పురాణంలో ‘అంకుర’ శబ్దమే వాడబడింది.) నాటి పరీక్షించాలి. తరువాత ఉత్తమభూమి మధ్యలో వాస్తు మండలాన్ని నిర్మించాలి. ఈ వాస్తు మండలస్థ దేవతలు నలభై అయిదుగురు. వారి పేర్లు - 1. శిఖి 2. పర్జన్య 3. జయంత 4. కులిశాయుధ 5. సూర్య 6. సత్య 7. వృష, 8. ఆకాశ 9. వాయు 10. పుష్ప 11. వితథ 12. గుహా 13. యమ 14. గంధర్వ 15. మృగరాజ 16. మృగ 17. పితృగణ 18. దౌవారిక 19. సుగ్రీవ 20. పుష్పదంత 21. వరుణ 22. అసుర 23. పశు 24. పాశ 25. రోగ 26. అహి 27. మోక్ష 28. భల్లాట 29. సోమ 30. సర్ప 31. అదితి 32. దితి 33.అప్ 34. సావిత్ర 35. జయ 36. రుద్ర 37. అర్యమ 38. సవిత 39. వివస్వాన్ 40. విబుధాధిప 41. మిత్ర 42. రాజయక్ష్మ 43. పృథ్వీధర 44. ఆపవత్స 45. బ్రహ్మ.
వీరితో బాటు వాస్తుమండలం వెలుపల ఈశాన్యకోణంలో చరుడినీ, ఆగ్నేయంలో విదారినీ నైరుతి (అసలు సిసలు సంస్కృతంలో ‘నైరృతి’ లేదా ‘నైరృవ్య’ లేదా నైరృత్య’ అనే మాటలు వాడేవారు. అలా చూసుకుంటే నైరుతి, నైఋతి రెండూ తప్పే) లో పూతననీ, వాయువ్యంలో (వాయవ్య అనే వుండాలి. వాయువ్యకాదు) పాపరాక్షసినీ స్థాపన చేసుకోవాలి. అలాగే మండలానికి తూర్పుదెసలో స్కంద, దక్షిణంలో అర్యమ, పశ్చిమంలో జృంభక, ఉత్తరంలో పిలిపిచ్చలను స్థాపించాలి. ఈ విధంగా వాస్తుమండలంలో యాభై ముగ్గురు దేవీ దేవతల స్థాపన వుంటుంది. వీళ్ళనందరినీ వేరువేరు మంత్రాలతో పూజించాలి. మండలం వెలుపలనే పూర్వాదిదశల్లో పది దిక్కుల పాలకులైన ఇంద్ర, అగ్ని, యమ, నిరృతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన, బ్రహ్మ, అనంతులను యథాస్థానాల్లో ప్రతిష్ఠించి పూజలొనరించి వారికి విధ్యుక్తంగా నైవేద్యాలను సమర్పించాలి. వాస్తు మండల రేఖలను శ్వేతవర్ణంతోనూ, మధ్యస్థకమలాన్ని రక్తవర్ణంతోనూ అనురంజితం చేయాలి. నలువదియైదుగురు దేవతల కోష్ఠకాలను రక్తవర్ణాదులతో అనురంజితం చేయాలి. గృహ, దేవమందిర, మహాకూపాది నిర్మాణాలలోనూ, దేవప్రతిష్ఠాదులలోనూ ముందుగా వాస్తు మండల నిర్మాణమును గావించి ఆ మండలస్థ దేవతలను ఆవాహన చేసి వారికి పూజాదికములను నిర్వర్తించాలి. పవిత్ర స్థానంలో జేనన్నర కొలతలో మంత్రాక్షరాలను వ్రాసి కుంకుమను పూసిన భూమిపై తూర్పు నుండి పడమరకీ ఉత్తరం నుండి దక్షిణానికి పది - పది రేఖలను గీయాలి. దీని వల్ల ఎనుబది యొక్క కోష్ఠక వాస్తు పదచక్ర నిర్మాణం జరుగుతుంది. ఈ రకంగా 9 - 9 రేఖలు గీస్తే 64 పదాల వాస్తు చక్రం నిర్మింపబడుతుంది.
వాస్తుమండల విధిలో పేర్కొనబడిన దేవతలందరి ధ్యాన పూజనాలూ భిన్నభిన్న మంత్రాలతో చేయబడాలి. స్థాపన, హవన కార్యాలు నిర్దుష్టం (నిర్దుష్ట = దోషరహితంగా)గా, శాస్త్రోక్తంగా నిర్వహింపబడాలి. తరువాత బ్రాహ్మణులను సువర్ణాది దక్షిణలతో సంతుష్టులను చేయాలి.
వాస్తుయాగాదులను చేసినపుడు ఒక విస్తృత మండలంలో యోని, మేఖలా సమన్వితమైన ఒక కుండమునూ, శాస్త్రానుసారముగా నొక వాస్తువేదికనూ ఏర్పాటు చేయాలి. మండలానికి ఈశానకోణంలో కలశను స్థాపించి మంత్రయుక్తంగా గణేశు నర్చించాలి. కుండ మధ్యంలో విష్ణు, దిక్పాల, బ్రహ్మాదులను వారివారి మంత్రాలతో పూజించాలి. ప్రాణాయామం చేసి భూతశుద్ధి చేసుకోవాలి. తరువాత వాస్తు పురుషుని ఈ విధంగా ధ్యానించాలి.:
శ్వేతం చతుర్భుజం శాంతం కుండలాద్యై రలంకృతం।
పుస్తకం చాక్ష మాలాంచ వరాభయంకరం పరం ॥
పితృవైశ్వానరో పేతం కుటిలభ్రూపశోభితం।
కరాలవదనం చైవ ఆజానుకంలంబితం॥ (మధ్యమ 2/11/11,12)
వాస్తు పురుషునికి స్నానం చేయించి పూజచేయాలి. ఆయన పూజనానికి మూల
మంత్రం ఇది:
వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాన్ త్స్వావేశో అనమీవోభవానః ।
యత్ త్వేమహే ప్రతి తన్నో జుషస్వ శంనో భవ ద్విపదిశం చతుష్పదే ॥ (ఋగ్వే/54/1)
పూజా సామగ్రినంతటినీ ప్రోక్షణ ద్వారా శుద్ధి చేసుకోవాలి. ఆసనశుద్ధిని గావించి గణేశ, సూర్య, ఇంద్ర, ఆధారశక్తి, రూపపృథ్వి, బ్రహ్మలను పూజించాలి. తరువాత చేతిలోకి తెల్ల చందనాన్నీ తెల్ల పూలనీ తీసుకొని విష్ణు రూపుడైన వాస్తు పురుషుని ధ్యానించాలి. ఈయనకి ఆసనం, పాద్యం, అర్ఘ్యం, మధుపర్కాదులను ఇచ్చి, వివిధ ఉపచారాలతో పూజ చేయాలి.
విద్వాంసుడైన బ్రాహ్మణుని చేత కుండానికీ వాస్తువేదికీ మధ్య కలశను స్థాపింప జేయాలి. కలశంలో పర్వతశిఖరం, గజశాల, వల్మీకం, నదీసంగమం, రాజద్వారం, నాలుగుబాటలకూడలి, కుశమూలం - అనే యేడు చోట్ల నుండి తెచ్చిన మట్టిని వేయాలి. ఈ తరువాత దానిలో ఇంద్రవల్లి, విష్ణుక్రాంత, అమృతి, త్రపుష, మాలతి, చంపక, ఊర్వారుక వనస్పతులను వేయాలి. వేపాకులతో కలశ కంఠాన్ని చుట్టి కలశ ముఖాన్ని పంచ పల్లవాలతో సర్పాకారంలో కప్పాలి. వాటిపై శ్రీఫల (మారేడు), బీజపుర (జామి), నారికేళ, దాడిమ (దానిమ్మ), ధాత్రీ (ఉసిరిక), జంబూ (నేరేడు) ఫలాల నుంచాలి. కలశలో సువర్ణాన్నీ పంచరత్నాలనూ వుంచాలి. గంధపుష్పాది పంచోపచారాలతో కలశను పూజించాలి. కలశలోకి వరుణ దేవుని ఆవాహనం చేయాలి. కలశనొక మారు భక్తిగా స్పృశించి సమస్త సముద్రాల, గంగాది పవిత్రనదుల, ఇతర పవిత్ర జలరాశుల జలాలను కలశలోకి ఆవాహన చేయాలి. ఈ విధంగా కలశను స్థాపించిన తరువాత నువ్వులు, బియ్యం, మధ్వాజ్యము, పెరుగు, పాలు మొదలగు వాటితో యథావిధిగా హోమం చేయాలి. ఈ వాస్తు హోమంలో వాస్తు హవనసమయంలో వాస్తుదేవత యొక్క మంత్రజపం చెయ్యాలి. అనంతరం వాస్తుమండలంలోని సమస్తదేవతలకూ పాయసాన్ని, కృశరాన్నాదులతో క్రమంగా వేర్వేరుగా బలులను నివేదించాలి. అందరు దేవతలకూ వారివారి కను రూపములైన పతాకలను ప్రదానం చేయాలి. ప్రతి సామర్థ్యానుసారము మంత్రజపాలు చేసి వాస్తుపురుషస్తవాన్ని చదవాలి. విష్ణుస్వరూపుడైన వాస్తోష్పతిని స్తుతిస్తూ శంకర భగవానుడు చెప్పిన ఈ శ్లోకాలను చదివితే వాస్తుపురుషునితో సహా అందరు దేవతలూ అనుగ్రహించి అమరత్వాన్ని ప్రసాదిస్తారు. వాస్తుపూజలోనే కాక రోజూ చదవలసిన ఈ శ్లోకాలివి: (మధ్యమ 2/12/156 -163)
విష్ణుర్జిష్ణుర్విభుర్యజ్ఞో యజ్ఞియో యజ్ఞ పాలకః ।
నారాయణో నరోహంసో విష్వక్సేనో హుతాశనః ॥
యజ్ఞేశః పుండరీ కాక్షః కృష్ణః సూర్యః సురార్చితః ।
ఆదిదేవో జగత్కర్తా మండలేశో మహీధరః॥
పద్మనాభోహృషీకేశో దాతా దామోదరో హరిః ।
త్రివిక్రమస్త్రిలోకేశో బ్రహ్మణః ప్రీతివర్ధనః ॥
భక్త ప్రియోఽచ్యుతః సత్యః సత్యవాక్యో ధ్రువః శుచిః ।
సన్యాసీ శాస్త్ర తత్త్వజ్ఞః త్రి పంచాశద్గుణాత్మకః॥
విదారీ వినయః శాంతః తపస్వీ వైద్యుత ప్రభః ।
యజ్ఞ స్త్వంహి వషట్కారః త్వ మోంకారస్త్వమగ్నయః ॥
త్వం స్వధా త్వం హి స్వాహా।
త్వం సుధాచ పురుషోత్తమః ।
నమో దేవాది దేవాయ విష్ణవే శాశ్వతాయచ ।
అనంతాయాప్రమేయాయ నమస్తే గరుడ ధ్వజ ॥
శివప్రోక్తమైన ఈ విష్ణుస్తుతిని బ్రహ్మ స్వయంగా విని మాకు చెప్పాడు. అందుచేత ఈ స్తోత్రాన్ని వాస్తు పురుషుని కంకితంగా రోజూ చదివే వారికి సర్వ సాధనాలూ, వైష్ణవ సిద్ధియూ లభిస్తాయి.
యజ్ఞ కర్మపూర్ణమైనపుడు ఆచార్యునికి పయస్వినియైన గోవునూ, సువర్ణ దక్షిణనూ ఇవ్వాలి. ఇతర బ్రాహ్మణులకు కూడా బంగారాన్ని దానంగా ఇవ్వాలి. ప్రాజాపత్య, స్విష్టకృత్ హవనాలు చెయ్యాలి. ఆచార్యుడూ ఋత్విజులూ, బ్రాహ్మణులూ కలిసి యజమానిని కలశజలంతో అభిషేకించాలి. పూర్ణాహుతి నిచ్చి సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఋత్విజుల అనుమతితో యజమాని తన గృహంలో ప్రవేశించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. దీనులకూ - ముఖ్యంగా అంధులకు శక్త్యనుసారము దానాలు చెయ్యాలి. వారితో తానూ కూర్చొని భోం చెయ్యాలి. ఆ రోజు భోజనంలో నిషిద్ధ పదార్థాలైన పాలు,వగరు రుచిగల సరకులు, వేపుడు కూరలు, కాకరకాయ వంటి వాటిని వడ్డించరాదు. ప్రశస్త పదార్థాలనే పెట్టాలి.
Summary of chapter 126 of the Bhavishya Mahā Purana is as follows:
The teaching on the cosmic structure continues with a focus on the sky — vyoma — as Sūrya's unique domain of governance. All that occurs in the sky — cloud-formation, wind-patterns, the movements of the other grahas, the cycles of rainfall — is under Sūrya's direct administration. The dimensions of the solar disc itself, its distance from the earth, and the speed of its chariot are given in traditional units. The chapter also describes the divine beings — gandharvas, apsarās, siddhas, and cāraṇas — who inhabit the various regions of the sky through which Sūrya passes in his daily and annual journey, and whose celestial music and dance constitute the continuous celebration of Sūrya's transit through the universe.