భవిష్య పురాణము

24 - సత్యనారాయణ వ్రతకథ

(భరతవర్షంలో సత్యనారాయణ వ్రతకథ బహుళప్రచారాన్ని, ప్రసారాన్నీ పొంది యున్నది. ఇది చాలామందికి ఇష్టమైన వ్రతంగా ఈరోజు వెలుగొందుతున్నది. భారతీయ సనాతన పరంపరలో ఏశుభకార్యమైనా గణపతి పూజతో ప్రారంభమై సత్యనారాయణ వ్రతంతో పూర్తిచేయబడుతుంది. వర్తమాన ప్రపంచంలో ప్రచలితమై వున్న సత్యనారాయణ స్వామి కథకి మూలాధారం స్కందపురాణంలో రేవాఖండంలో ఆరు అధ్యాయాలలో చెప్పబడిన వ్రతవిధానం, కథాశ్రవణములే. భవిష్యపురాణ ప్రతిసర్గ పర్వంలో కూడా ఇదే అంశము ఆరు అధ్యాయాలలో చెప్పబడినప్పటికీ ఇందులో ఈ ధర్మాచరణ ప్రక్రియ మరింత శోభాయమానంగా, రోచకంగా కనిపిస్తున్నది. ఇందులో కథ యొక్క ప్రసిద్ధి గూర్చిన మాటలతో బాటు అనేక శంకలకు సమాధానాలు కూడా కనిపిస్తాయి. ఇక ఈ వ్రతం సచ్చిదానంద పరమాత్మను పొందే సాధనాలలో నొకటని భాగవతంలో కూడా చెప్పబడింది, ఇలా:

సత్యవ్రతం సత్యపరం త్రి సత్యం సత్యస్య యోనిం నిహితంచసత్యే

సత్యస్య సత్యా మృత సత్య నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః

(శ్రీ మద్భాగవతం 10/2/26)

అంతర్ధవేఽనంత భవంతమేవ హ్యత త్యజంతో మృగయంతి సంతః

అసంత మప్యంత్యహి మంతరేణ సంతం గుణంతం కిముయంతి సంతః

 (శ్రీమద్భాగవతం 10/14/28)

ప్రపంచంలో, మనీషుల ద్వారా, సత్యతత్త్వం తెలుసుకోవాల్సిన తీరు నిర్దిష్టంగా చెప్పబడింది. దానిని అధ్యయనం చేస్తే మనుష్యులు కృతార్థులు కాగలరు. అన్ని ఆరాధనలూ ఫలిస్తాయి. నిష్కామంగా చేసే ఉపాసనల వల్ల సత్యస్వరూపుడైన నారాయణునే పొందగలము.

కాబట్టి శ్రద్ధతో, భక్తితో పూజను చేసి, కథాశ్రవణం చేసి, ప్రసాదాన్ని అత్యంత గౌరవంతో సేవించడం ద్వారా సత్యస్వరూపుడు, పరమాత్మ, పరబ్రహ్మ, సత్యనారాయణ భగవానుల అనుగ్రహాన్ని పొంది సుఖించాలి - సంపాదకులు.)

నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తున్న మహామునులతోబాటు, ఆచార్య పీఠమైన శౌనకమహర్షి అటువస్తున్న పరమ పౌరాణికుడు, వ్యాసభగవానులు శిష్యుడునైన సూతమహర్షికి ఎదురేగి నమస్కరించి, ఆహ్వానించి అతిధి మర్యాదలను గావించి ఇలా ప్రార్థించాడు.

“హే భగవన్! నాలుగు యుగాలలోనూ అత్యంత పూజ్యుడూ, సేవ్యుడూ, అందరి అభీష్ట మనోరథాలనూ సంపూర్ణము చేయు దేవదేవుడూ ఎవరు? సామాన్యమానవుడు కూడా అనాయాసంగానే ఎవరిని ఆరాధించి తన మంగళమయమైన కామనలను ఈడేర్చుకోగలడు? మీరు మాపట్ల, మానవజాతిపట్ల దయను చూపి మనుష్యుని కీర్తిని కూడా పెంచగల సత్యమైన ఉపాయాన్ని సెలవీయండి. చతుర్వేదాలూ, సర్వశాస్త్రాలూ, ఇతిహాసపురాణాలూ మీకు కరతలామలకాలు. మీకు తెలియని దైవకార్యాలు లేవు. మీరు చెప్పలేని వ్రతాదికాలు లేవు.” శౌనకాది ఋషుల ప్రార్థనను విన్న సూతమహర్షి సత్యనారాయణ దేవ ప్రార్ధనను చేశాడు. ఇలా

నవాంభోజ నేత్రం రమాకేళి పాత్రం

చతుర్బాహు చామీకరం చారుగాత్రం ।

జగత్ర్పాణ హేతుం రిపౌ ధూమ్రకేతుం

సదా సత్యనారాయణం స్తామి దేవం (ప్రతి సర్గపర్వం 2/24/5)

పూర్తిగా వికసించిన నవీన కమలముల వంటి నేత్రములు కలవాడును, లక్ష్మితోనే క్రీడలాడగల వాడును, చతుర్భుజుడును, సువర్ణకాంతితో సమానమైన దేహకాంతి గలవాడును, లోకైక రక్షకుడును, శత్రువులకు తోకచుక్కవంటి వాడును నగు సత్యనారాయణస్వామిని స్తుతిస్తున్నాను.

శ్రీరామం సహ లక్ష్మణం సకరుణం సీతాన్వితం సాత్త్వికం

వైదేహీ ముఖపద్మలుబ్ధ మధుపం పౌలస్త్య సంహారకం 

వందే వంద్య పదాంబుజం సురవరం భక్తానుకంపాకరం

శత్రుఘ్నేన హనూమతాచ భరతేనా సేవితం రాఘవం

(ప్రతిసర్గపర్వం 2/24/5)

ఏ భగవానుడు కరుణకు సముద్రుని వంటివాడో, ఎవరి చరణకమలములు సురులకు కూడా వందనీయాలో, భక్తులపై దయను కురిపించు దేవుడెవ్వడో, సీతా, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్సేవితుడైన పరబ్రహ్మ స్వరూపుడెవ్వరో ఆ రఘురామునికి మనసారా నమస్కరిస్తున్నాను.

ఋషివరులారా! ఇపుడు మీముందొక ఇతిహాసాన్నుంచబోతున్నాను. దీని శ్రవణం కలియుగంలో జరుపబడే ఏ పాపాన్నయినా నశింపజేయగలదు. సర్వసత్కామాలనూ నెరవేర్చగలదు. దేవతాభాసితము, బ్రాహ్మణ ప్రకాశితము, విద్వాంసులు కానంద సంధాయకము, సకల సత్సంగాలలో చర్చితము ఈ పవిత్రాఖ్యానము.

కలికలుష వినాశం కామ సిద్ధి ప్రకాశం

సురవర ముఖభాసం భూసురేణ ప్రకాశం

విబుధబుధి విలాసం సాధు చర్చా విశేషం

నృపతి వర చరిత్రం భోఃశ్రుణు ష్వేతి హాసం

(ప్రతి. 2/24/6)

ఒకమారు మహాయోగీ, దేవర్షియైన నారదుడు లోకకళ్యాణార్థమై వివిధలోక భ్రమణం చేస్తూ మృత్యులోకానికి వెళ్ళాడు. అక్కడ ఎందరో ప్రాణులు తాముచేసిన దుష్కర్మల ఫలితంగా క్లేశాలనూ దుఃఖాలనూ అనుభవిస్తూ శోకిస్తుండడం చూశాడు. ఆధి వ్యాధులతో అతలాకుతలమై రోదిస్తుండడం గాంచి జాలిపడి వీరి బాధను నశింపజేసే మార్గమేమైనా దొరికితే బాగుండును. అనుకుంటూ విష్ణులోకానికేగాడు. అక్కడ ఆయన శంఖ, చక్ర, గదా, పద్మ, వనమాలాలంకృతుడు, ప్రసన్నముఖుడు, శాంతుడు, సనత్కుమారాదులచే సంస్తుతుడు, భగవంతుడునైన నారాయణుని దర్శించాడు. ఆ దేవాధిదేవుని నారదుడు ఇలా స్తుతించాడు. ‘వాణికీ మనస్సుకీ ఆవలనున్నవాడవు. అనంతశక్తి సంపన్నుడవు, ఆది మధ్యాంతరహితుడవు, మహాత్ముడవు, నిర్గుణస్వరూపుడవు, పరమాత్మవు నగు నీకు నా నమస్కారము. అందరికీ ఆది పురుషుడవు, లోకోపకార పరాయణుడవు. సర్వవ్యాపివి. తపోమూర్తివియగు నీకు నా పునఃపునర్వందనములు.’

‘దేవర్షీ! నీ ఆగమనం నాకానందదాయకమే గానీ నీలో ఆనందం కనబడడంలేదు. ఓయి మహాభాగా! నీ మనశ్చింతను వాగ్రూపంలో పెట్టు. దానిని పోగొట్టే ఉపాయం ఆలోచిద్దాం’ అని అనుగ్రహించాడు నారాయణుడు.

‘ప్రభో! సర్వలోక భ్రమణం చేస్తూ ఇపుడే మృత్యులోకం చూసి వస్తున్నాను. అక్కడ ప్రాణులందరూ క్లేశవశులై దుఃఖసంతప్తులై వుండడం, రోగగ్రస్తులై, దుర్దశాపీడితులై వుండడం, అలమటించడం కనులారా గాంచిన నామనసు వికలమైపోయి రోదించ సాగింది. ఏ విధంగా వీరిని మనం ఉద్ధరించగలం? ఈ ప్రాణులకు దుఃఖవిముక్తీ, సకల సన్మంగళప్రాప్తీ కలిగేదెలా? మీరు సర్వజ్ఞులు. మీరే వీరి బాధను పోగొట్టే శ్రేష్ఠమైన సుగమమైన మార్గాన్ని నామీది కృపానురాగాలతో చూపించాలి’ అని తన లోక కళ్యాణ కాంక్షచే అర్థించాడు నారదుడు.

నారాయణుడు ముందు ఇంత మంచి మనస్సున్నందుకు, దానిని మాటల ద్వారా ప్రార్థనా పూర్వకంగా తన ముందు పెట్టినందుకూ నారదమహర్షిని అభినందించి ఇలా అన్నాడు.

‘నీకొక సనాతన వ్రతాన్ని గూర్చి చెప్తాను. సత్య, త్రేతాయుగాల్లో విష్ణు స్వరూపుడనై ద్వాపరంలో శ్రీకృష్ణాది అనేక రూపధరుడనై భక్తికీ, వ్రతాలకూ ఫలాలనిచ్చిన నేను కలియుగంలో సత్యనారాయణ స్వరూపుడనై భక్తుల వ్రతాలకు ఫలాలనిస్తాను. ఎందుకంటే ధర్మానికి నాలుగు పాదాలు. అవి సత్యశౌచతపదానాలు. వీటిలో సత్యమే ప్రధాన ధర్మము. సత్యమే లోకాన్ని మంచివైపు నడిపిస్తుంది. సత్యంలోనే బ్రహ్మనివసిస్తాడు. అందుకే సత్యస్వరూపుడైన భగవంతుడు సత్యనారాయణస్వామి వారి వ్రతం పరమశ్రేష్ఠంగా పరిగణింపబడుతుంది.’

‘భగవన్! సత్యనారాయణ వ్రతాన్ని ఎలా చేయాలి? దీనికి నిర్దేశింపబడిన ఫలాలేమిటి? హే కృపాసాగరా! దేవా! అన్ని విషయాలనూ, వ్రతవివరాలనూ నాపై అనుగ్రహంతో ఆజ్ఞాపించు.’

అపుడు భగవానుడిలా చెప్పసాగాడు. ‘నారదా! ఈ వ్రతఫలాలను వర్ణించడానికి చతుర్ముఖ బ్రహ్మ నాలుగు నాలుకలూ చాలకపోవచ్చు. అందుచేత సంక్షిప్తంగా చెప్తాను. విను.

సత్యనారాయణస్వామిని పూజించిన నిర్ధనుడు ధనాఢ్యుడవుతాడు, పుత్రహీనుడు పుత్రవంతుడౌతాడు. రాజ్యచ్యుతునికి మరల రాజ్యం ప్రాప్తిస్తుంది. దృష్టిహీనుడు దృష్టి సంపన్నుడవుతాడు. బందీ బంధవిముక్తుడౌతాడు భయము చేత ఆర్హుడైన వ్యక్తి నిర్భయుడై గొప్ప ధైర్యవంతుడవుతాడు. ఇంతేకాక ఏయే కోరిక ఆయా వ్యక్తులకు ఇబ్బడి ముబ్బడిగా తీరుతుంది. ఎన్నో కోరికలున్న వ్యక్తికి అన్ని కోరికలూ తీరుతాయి. కాబట్టి ఓ దేవమునీ! మానవునిగా జన్మించినవాడు అవశ్యం సత్యనారాయణ స్వామిని ఆరాధించాలి. నిస్సందేహంగా వాని జన్మ చరితార్థమవుతుంది.

ఈ వ్రతాన్ని చేయడానికి ప్రతి ప్రాతఃకాలముననే లేచి పవిత్రుడై తులసీ - మంజరిని చేతబట్టి సత్యప్రతిష్ఠితుడైన శ్రీహరిని ఈ విధంగా ధ్యానించాలి.

నారాయణం సాంద్రఘనావదాతం చతుర్భుజం పీతమహర్హ వాసనం

ప్రసన్నవక్త్రం నవకంజ లోచనం సనందనా ద్యౌరుపసేవితం భజే

కరోమితే వ్రతం దేవ సాయం కాలేత్వదర్చనం

శ్రుత్వాగాథాంత్వదీయాం హి ప్రసాదంతే భజామ్యహం

(ప్రతిసర్గ పర్వం 2/ 24/2)

( ప్రసాదం అంటే తినేది మాత్రమే కాదు. ప్రసన్న పదలోంచే ప్రసాదం వచ్చింది. దీనికి అనుగ్రహమని అర్థం.)

దట్టమైన మేఘవర్ణంలో వుండి దానిలాగే సంపదలను కురిపిస్తూ, చతుర్భుజాలనూ, అతి శ్రేష్ఠపీతాంబరాన్ని ధరించి, ప్రసన్నముఖుడడై నవకమల సమాన నేత్రాలతో మమ్ము కరుణతో చూస్తూ, సనక సనందనాది వేదాంత వేద్య, వైరాగ్యశ్రేష్ఠుల సేవలందుతూ వెలుగొందు భగవంతుడైన నారాయణుని నేను ప్రార్థిస్తున్నాను. దేవ దేవా! మీ సత్యస్వరూపాన్ని నేటి సాయంకాలం పూజిస్తాను. మీ రమణీయ చరిత్రను శ్రవణం చేసి మీ ప్రసాదాన్ని స్వీకరించి సేవించి ధన్యుడనౌదామని ఆశపడుతున్నాను. నన్ను అనుగ్రహించండి. అని పై శ్లోకభావం చెప్పుకొని సాయంకాలం శాస్త్రోక్తంగా సత్యనారాయణస్వామిని పూజించాలి. పూజార్థమై అయిదు కలశలను సిద్ధం చేసుకోవాలి. అరటి స్తంభాన్నీ తోరణాలను ఏర్పాటు చేయాలి. పురుషసూక్తం (యజు. 31/1-16) ద్వారా స్వర్ణమండితమైన సత్య దేవుని సాలగ్రామాన్ని (సంస్కృతంలో శాలగ్రామమే సరైన శబ్దం.) పంచామృతాలతో బాగుగా శుద్ధిచేసి భక్తిపూర్వకంగా దానికి అర్చన చేయాలి. తరువాత క్రిందపొందుపరుపబడిన మంత్రాన్ని ఉచ్చరిస్తూ భగవంతునికి ప్రణామం చెయ్యాలి.

నమో భగవతే నిత్యం సత్యదేవాయ ధీమహి

చతుః పదార్థ దాత్రే చ నమస్తుభ్యం నమోనమః

(ప్రతిసర్గపర్వం. 2/24/30)

షడైశ్వర్యరూపుడవైన హే భగవన్ సత్యదేవా! మీకు నమస్కారము. నేనెల్లప్పుడూ మిమ్మల్నే ధ్యానిస్తుంటాను. మీరు ధర్మ, అర్ధ, కామ, మోక్షములను చతుర్విధ పురుషార్థాలను దయతో మాకిచ్చి కాపాడు భగవంతుడు. మీకు పునఃపునర్వందనాలు. (షడైశ్వర శబ్దం శ్లోకంలో లేదు భావంలో చెప్పబడింది.) ఈ మంత్రాన్ని యథాశక్తి మననం చేసి 108 మార్లు హవనం చేయాలి. దానిలో పదవవంతు తర్పణం మరో పదవ అంశ మార్జనం చేసి ఆరు అధ్యాయాలలో గల సత్యనారాయణ భగవానుని వ్రతకథను శ్రద్ధగా శ్రవణం చేయాలి. భగవానుని ఈ కథలో సత్య, ధర్మాలదే ప్రముఖపాత్ర. కథానంతరం ప్రసాదాన్ని నాలుగు భాగాలుగా విభజించి ప్రసన్నంగా పంచిపెట్టాలి. ప్రథమ భాగాన్ని ఆచార్యులకు, రెండవభాగాన్ని ప్రతి కుటుంబానికీ, మూడవభాగాన్ని శ్రోతలకీ పంచి నాలుగవ భాగాన్ని తన కోసం ఉంచుకోవాలి. ఆతరువాత బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి, తాను మౌనంగా భోజనం చేయాలి. దేవర్షీ! ఈవిధంగా సత్యనారాయణ పూజ చేయాలి. శ్రద్ధాభక్తులతో పద్ధతి ప్రకారం సత్యనారాయణ స్వామిని పూజించిన వారికి ఈ జన్మలోనే అన్ని వాంఛితాలూ నెరవేరుతాయి.

‘భగవన్! నేనిపుడే భూలోకానికి పోయి ఈ వ్రతరాజాన్ని వీలైనంతమందికి ఉప దేశిస్తాను’ అంటూ నారాయణునికి పాదాభివందనం చేసి ఆయన ప్రసన్నంగా తలయూచి అంతర్ధానం కాగానే నారదుడు భూలోకానికి బయలుదేరాడు. నారాయణుడు కాశీపురిలో ప్రత్యక్షం కావడానికి వెళ్ళాడు.

సత్యనారాయణ వ్రత కథలో మొదటి అధ్యాయము పూర్తి