మహారాజా! సర్వపాపనాశకమై, పుత్ర వృద్ధిప్రదమై, సౌభాగ్యదాయకమై, సర్వవ్యాధి నిర్మూలకమై, పుణ్య, సౌఖ్యాలనపరిమితంగా నిచ్చునదిగా ఖ్యాతినొందిన రంభాతృతీయ వ్రతాన్ని వినిపిస్తాను. ఆకర్ణించు సవతుల ద్వారా వచ్చు క్లేశాలను రూపుమాపి ఐశ్వర్య ప్రదానం చేసే శక్తి ఈ వ్రతానికుంది. ఈ వ్రతవిధిని శంకరభగవానులు పార్వతీదేవికి ఉపదేశించియున్నారు.
శ్రద్ధాళువైన స్త్రీ మార్గశిర శుద్ధ తదియనాడు పెందలకడనే లేచి కాలకృత్యానంతరం భక్తి పూర్వకంగా ఉపవాసదీక్షను గ్రహించాలి. దేవిని ఈ విధంగా ప్రార్థించాలి.
దేవి సంవత్సరం యావత్తృతీయాయాముపోషితా।
ప్రతిమాసం కరిష్యామి పారణంచాపరేఽహని
తదవిఘ్నేన మేయాతు ప్రసాదాత్ తన పార్వతి॥ (ఉత్తరపర్వం 24/5)
ఈ విధంగా స్త్రీగాని పురుషుడుగాని వ్రత సంకల్పం చేసుకొని శ్రద్ధగా నదిలోగాని, చెరువులోగాని, ఇంట్లోనేగాని స్నానం చేసి పార్వతీదేవిని పూజించాలి. ఆ రాత్రి కుశోదకాన్ని మాత్రమే నోట్లో వేసుకోవాలి. మరునాటి పెందలకడనే పోయి విద్వాంసులు, శివభక్తులునైన బ్రాహ్మణులను సాదరంగా పిలిచి వారికి భోజనాలను పెట్టాలి. దక్షిణరూపంలో శక్తి కొలదీ బంగారాన్ని గాని లవణాన్నిగాని ఇవ్వాలి. అలాగే యథాశక్తి భగవానుడైన శంకరునికి భోగాలను నివేదించాలి.
మహారాజా! పుష్య శుక్ల తదియనాడు ఇలాగే పూజను, ఉపవాసాన్ని చేసి రాత్రి గోమూత్రాన్ని ప్రాశించి ప్రభాతకాలంలో బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణగా బంగారాన్ని గాని జీలకఱ్ఱనిగాని ఇవ్వాలి. దీనివల్ల వాజపేయ, అతిరాత్ర యజ్ఞాలు చేయించిన ఫలం కలుగుతుంది. దేహాంతమందు ఆకల్ప పర్యంతమూ ఇంద్రలోక నివాస ప్రాప్తి కలుగుతుంది. తరువాత శివలోక ప్రాప్తి కూడా కలుగుతుంది.
మాఘ శుక్ల తదియనాడు ‘సుదేవీ’ నామంతో పార్వతీదేవి నర్చించి రాత్రి గోమ యమును స్వీకరించి ఒంటరిగా నేలపై శయనించాలి. తెల్లవారినాక బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి శక్తినిబట్టి బంగారాన్నిగాని కేసరాన్నిగాని దక్షిణగా నివ్వాలి. దీనివల్ల ప్రతికి చిరకాల విష్ణులోకనివాస ప్రాప్తీ ఆపై శివసాయుజ్యమూ కలుగుతాయి.
ఫాల్గున శుక్లతదియనాడు దేవిని గౌరీ నామంతో పూజించి రాత్రి ఆవుపాలను మాత్రమే స్వీకరించి తెల్లవారాక విద్వాంసులూ, శివభక్తులునైన బ్రాహ్మణులకూ, ముత్తయిదువలకూ భోజనాలు పెట్టి బంగారాన్ని లేదా కడుహుండాన్ని దక్షిణగానివ్వాలి. దీనివల్ల వాజపేయ, అతిరాత్ర యజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుంది.
చైత్రశుక్ల తదియనాడు భక్తితో పార్వతీదేవిని విశాలాక్షీ నామంతో పూజించి ఆ రాత్రి పెరుగును మాత్రమే స్వీకరించి తెల్లవారినాక కుంకుమతో బాటు సువర్ణాన్ని బ్రాహ్మణులకు దానంచేయాలి విశాలాక్షి దయవల్ల వ్రతం చేసే స్త్రీకి మహాసౌభాగ్యం ప్రాప్తిస్తుంది.
వైశాఖ శుక్ల తదియనాడు పార్వతీదేవిని ‘శ్రీముఖీ’ నామంతో పూజించాలి. రాత్రి నేతిని మాత్రమే నోటిలో వేసుకొని ఏకాకిగా శయనించి ప్రాతఃకాలంలో శివభక్తులైన కొందరు బ్రాహ్మణులకు యథాశక్తి భోజనాలు పెట్టించి తాంబూలాన్నీ లవణాన్నీ ఇచ్చి ప్రణామం చేసి సాగనంపాలి. ఈ వ్రతంచేస్తే మంచి అందగాళ్ళయిన కొడుకులు పుడతారు.
(ఆషాఢ శుద్ధ తదియనాడు పార్వతీదేవిని ‘మాధవీ’ నామంతో పూజించాలి. రాత్రి తిలోదకాన్ని ప్రాశించాలి. ప్రాతఃకాలం స్నానాదికముల తరువాత విప్రులకు భోజనాలను పెట్టించి బంగారాన్నీ బెల్లాన్నీ దానం చెయ్యాలి. దీనివల్ల శుభలోకాలు ప్రాప్తిస్థాయి.) జ్యేష్ఠ శుద్ధ తదియనాడు పార్వతీదేవిని ‘నారాయణీ’ నామంతో తెల్లపూలతో పూజించాలి. రాత్రి లవణాన్ని ప్రాశించి నిద్రించాలి. ఏకాకిగానే శయనించాలి. తెల్లవారాక శివభక్తులైన బ్రాహ్మణులను, పెద్ద ముత్తయిదువలను సాదరంగా ఆహ్వానించి, యథాశక్తి కమ్మని భోజనం పెట్టాలి. బ్రాహ్మణులకు తాంబూలంలో సువర్ణ దక్షిణల నుంచి ప్రణామం చేసి క్షమను కోరుతూ ప్రార్థించాలి. ఈ వ్రతఫలం శివలోకప్రాప్తి.
శ్రావణ శుద్ధ తదియనాడు పార్వతీదేవిని ‘శ్రీదేవీ’ నామంతో పూజించి ఆవు కొమ్మును స్పృశించి నీటిని త్రాగి పడుకోవాలి. శివభక్తులకు, మరునాడు, భోజనాలను పెట్టి సువర్ణాన్నీ, పండ్లనూ దక్షిణగానివ్వాలి. దీని ఫలితంగా సర్వలోకేశ్వరత్వం లభిస్తుంది.
భాద్రపద శుద్ధ తదియనాడు పార్వతీదేవిని ‘హరతాలీ’ నామంతో పూజించాలి. రాత్రి గేదెపాలు తాగి శయనించాలి. మరునాడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి యథాశక్తి దక్షిణలివ్వాలి. ఈ వ్రతం వల్ల ఇహంలో అతుల సౌభాగ్యాలూ, పరంలో శివలోక ప్రాప్తీ కలుగుతాయి.
ఆశ్వయుజ శుద్ధ తదియనాడు పార్వతీ దేవిని ‘గిరిపుత్రీ’ నామంతో పూజించి రాత్రి తండుల మిశ్రిత జలాన్ని స్వీకరించి మరుసటి రోజున బ్రాహ్మణులను పూజించి భోజనాలు పెట్టి చందనయుక్త సువర్ణాన్ని దక్షిణగా నివ్వాలి. దీనివల్ల సర్వయజ్ఞులూ చేసిన పుణ్యం ఒకనగూడుతుంది.
కార్తిక శుక్ల తదియనాడు పార్వతీదేవిని ‘పద్మోద్భవా’ నామంతో పూజించి రాత్రి పంచగవ్యాలను ప్రాశించి జాగరణ చేసి తెల్లవారాక స్నానాదుల అనంతరం సదాచారులైన కొందరు బ్రాహ్మణులకు వారి పత్నులతో సహా భోజనాలను పెట్టి వస్త్ర, మాల్య, అలంకారాలతో సత్కరించాలి. కుమారీమణులకు కూడా భోజనం పెట్టాలి.
ఈ విధంగా ఏడాది పర్యంతమైన వ్రతం పూర్తయిన తరువాత ఉద్యాపన చేపట్టాలి. యథాశక్తి సువర్ణాది ఉమామహేశ్వరుల ప్రతిమలను తయారుచేసి వారినొక సుందర, అలంకృత వితానయుక్త మండపంపై స్థాపించి సుగంధిత ద్రవ్యాలు, ఫల, పత్ర, పుష్ప, ధూప, నేతి నైవేద్య, దీపమాల, శర్కర, నారికేళ, దాడిమ, బీజపూరక, జీరక (జీలకఱ్ఱ), లవణ, కుసుంభ, కుంకుమ, మోదకయుక్త రాగిపాత్రలతో దేవదేవేశుని విధివత్తుగా పూజించి చివర్లో క్షమాపననర్థించి శంఖ, వాద్యాదుల ధ్వనులను మ్రోగించాలి.
మహారాజా! ఈ విధంగా మహాదేవి పార్వతీదేవి యొక్క ఈ వర్ష పర్యంత వ్రతాన్ని సాకల్యంగా చేస్తే వచ్చే ఫలాన్ని వర్ణించడానికి నాకు కూడా సాధ్యం కాదేమో. ఈ వ్రతం చేసిన వారి మాటకు, ఒక వంద కల్పాలపాటు, తిరుగుండదు. దేవతలందరూ వారు చెప్పింది చేస్తారు; కోరింది ఇస్తారు. ఈ వ్రతాన్ని మొట్టమొదట రంభ చేసింది కాబట్టి దీనిని రంభా తృతీయ వ్రతమని వ్యవహరిస్తున్నారు.