భవిష్య పురాణము

2-3 - సృష్టి,ఊర్ధ్వ - అధో లోకాలు

            సూతమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు. “మునులారా! ఇపుడు నేను కాలచక్రాన్ని వర్ణిస్తాను.

            సృష్టికి పూర్వం విశ్వమంతటా అంధకారమే అలముకొని వుండేది. అప్పుడు సకల కారణకారుడు, పరమకారణుడు, సర్వవ్యాపకుడునైన రుద్రుడొక్కడే అప్పటికి అవస్థితుడయ్యాడు. (అంటే ఉన్నాడు) సర్వ వ్యాపక భగవానుడే ఆత్మస్వరూపుడై ముందుగా మనస్సుని సృష్టించాడు. తరువాత అహంకారాన్ని సృష్టించాడు. అందులో శబ్ద, రస, రూప, స్పర్శ, గంధాలనే పంచతన్మాత్రలు, పంచమహాభూతాలనుత్పత్తి చేశాడు. ఆపై ప్రకృతులను వికృతులను విభజించాడు. ప్రకృతి, బుద్ధి, అహంకారం, రూప, రస, గంధ, శబ్ద, స్పర్శల తన్మాత్రలు అనే ఎనిమిదీ ప్రకృతులు. అంటే ఇవి మిగతా వాటిని సృష్టిస్తాయి. పంచ మహాభూతాలూ, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలూ, మనస్సూ - ఆ పదహారూ ఆ ఎనిమిదింటికీ వికృతులు. ఇవి వేటికీ ప్రకృతులు కాలేవు ఎందుకంటే వీటి నుండి ఉత్పన్నమయ్యేవి లేవు. శబ్ద, రస, రూప, స్పర్శ, గంధములైదునూ, పంచ జ్ఞానేంద్రియాల విషయాలు. చెవికి శబ్దము, చర్మానికి స్పర్శ, కంటికి రూపం, నాలుకకి రసం, ముక్కుకి గంధము విషయాలు. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన భేదాలతో వాయువులు అయిదు రకాలు. సత్త్వ, రజ, తమములనేవి గుణాలు. ప్రకృతియే స్వయంగా త్రిగుణాత్మకం కాబట్టి దానినుండి పుట్టిన మొత్తము చరాచర విశ్వమంతయు త్రిగుణాత్మకమే అయినది. ఆవసించు దేవుని అనగా భగవాన్ వాసుదేవుని తేజస్సు నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులావిర్భవించారు. వాసుదేవుడు అశరీరుడు, అజన్ముడు, అయోనిజుడు. ఆయనను దాటి ఇంకేదియును లేదు. ప్రతియొక్క కల్పంలోనూ జగత్తునీ ప్రాణులనూ సృష్టించేది ఆయనే, ఉపసంహరించేదీ ఆయనే.

            డెబ్బదిరెండు యుగాలొకమన్వంతరము; పదునాలుగు మన్వంతరాలైతే ఒక కల్పము. ఈ కల్పం బ్రహ్మదేవునకొకరోజు. భూ, భువః, స్వః, జన, తపో, సత్య, బ్రహ్మలోకాలు పైలోకాలైతే, పాతాళ, వితల, అతల, తల, తలాతల, సుతల, రసాతలాలు అధోలోకాలు. వీటికి ఆది మధ్యాంతాలలో రుద్రుడుంటాడు. మహేశ్వరుని లీలయే సృష్టి, సంహారాలుగా విభాగిత మయింది.బ్రహ్మజానప్రాప్తి ఊర్థ్వలోకాలవైపు తీసుకెళుతుంది.

            ఋషి, సర్వదర్శియైన పరమాత్మ సర్వప్రథమంగా ప్రకృతిని సృష్టించాడు. ఆ ప్రకృతి నుండే బ్రహ్మయూ, విష్ణువూ ప్రకటితమయ్యారు. ద్విజశ్రేష్ఠులారా! ఆ తరువాత బుద్ధి నుండి నైమిత్త సృష్టి జరిగింది. ఈ సృష్టి క్రమంలో స్వయంభువ బ్రహ్మ బ్రాహ్మణులను సృష్టించాడు. ఆ తరువాత క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను సృష్టించాడు. పృథ్వీ, అంతరిక్ష, దిశాదులను కల్పించాడు. లోకాలోకాలు, ద్వీపాలు, నదులు, సాగరాలు, తీర్థాలు, దేవస్థానాలు, మేఘగర్జనలు, ఇంద్రధనుస్సులు, ఉల్కాపాతాలు, కేతువులు, విద్యుత్తు మున్నగువానిని ఉత్పన్నం చేశాడు. యథాసమయంగా ఇవన్నీ మళ్ళా పరబ్రహ్మలోనే లీనమైపోతాయి. ధ్రువానికి పైన ఒక కోటి యోజన విస్తృతమైన మహర్లోకముంది. బ్రాహ్మణ శ్రేష్ఠులక్కడ కల్పాంత పర్యంతమూ ఉంటారు. మహర్లోకానికి పైన రెండుకోట్ల యోజనాల విస్తీర్ణంలో జనలోకముంది. అక్కడ బ్రహ్మపుత్రులైన సనకాదులుంటారు. జనలోకానికి పైన మూడుకోట్ల యోజనాలల్లో తపోలోకమున్నది. అక్కడ తాపత్రయరహితులైన దేవగణాల వారుంటారు, తపోలోకానికి పైన ఆరు కోట్ల యోజనాల విస్తృతిలో సత్యలోకముంది. అక్కడ భృగు, వసిష్ఠ, అత్రి, దక్ష, మరీచి మున్నగు ప్రజాపతులు నివసిస్తారు. ఇక సనత్కుమారాది సిద్ధయోగిగణాలు నివసించే లోకాన్ని బ్రహ్మలోకమంటారు. ఆ లోకంలో విశ్వాత్మయు విశ్వతోముఖ గురువునైన బ్రహ్మదేవులుంటారు. ఆస్తిక బ్రహ్మవాదులు, యతిగణాలు, యోగులు, తాపసులు, సిద్దులు, జాపకులు (జపంలో ఉత్తములు) బ్రహ్మదేవుని ఇలా స్తుతిస్తుంటారు. ‘పరమపదప్రాప్తిని కోరుకొనే యోగులు ఆ లోకం కోసం ప్రవేశించవలసిన ద్వారమిదే. బ్రహ్మసాన్నిధ్యంలో ఎటువంటి శోకమూ వుండదు. అక్కడికి వెళ్ళేవాళ్ళు శివ లేదా విష్ణు స్వరూపులైపోతారు. కోటి సూర్యప్రభలతో సమానమైన బ్రహ్మలోకం కష్టతరసాధ్యం. ఈ దేవదేవుని పురాన్ని, జ్వాలామాలా పరివ్యాప్తమైన దీని వైభవాన్ని వర్ణింపనలవికాదు.’

            ఈ బ్రహ్మధామంలో నారాయణునికి ఒక భవనముంది. మాయాసహచరుడై, పరాత్పరుడైన శ్రీహరి ఇందులో శయనిస్తాడు. దీనిని విష్ణులోకమని కూడా అంటారు. ఇక్కడికి రాగలిగిన వారిక ఏ జన్మానా ఎక్కడికీ పోనక్కర్లేదు, భగవానునికత్యంత ఇష్టులైన వారే, ఆయన ప్రసన్నతకు అర్హులైన మహాత్ములే ఇక్కడికి రాగలుగుతారు. బ్రహ్మాసనానికి పైననొక పరమజ్యోతిర్మయ శుభస్థానముంది. దానిచుట్టూ అగ్నిదేవుడుంటాడు. ఆ మధ్యలో పార్వతీసమేతుడై భగవానుడు పరమశివుడు విరాజమానుడై వుంటాడు. వేల సంఖ్యలోవిద్వాంసులూ, మనీషులు అక్కడ ధర్మచింతనమును (చర్చ) చేస్తూ నివసిస్తుంటారు. నియతులై బ్రహ్మవాదులైన ద్విజులే అక్కడికి చేరుకోగలరు. సతతమూ మహాదేవ ధ్యానంతులై, తాపసులై, బ్రహ్మజ్ఞాన సంపన్నులై, అహంకార మమకారరహితులై, కామక్రోధశూన్యులూ, బ్రహ్మత్వసమన్వితులైన బ్రాహ్మణులే ఆ వలయావృతులైన పార్వతీ పరమేశ్వరులను చూడగలరు. అదే రుద్రలోకం ఈ యేడులోకాలనూ మహాలోకాలంటారు.

            మునులారా! పృథ్వికి క్రింద మహాతలాది పాతాళలోకాలున్నాయి. మహాతలమను పాతాళము స్వర్ణమయము, సర్వవర్ణాలంకృతము. అది పెద్దపెద్ద భవంతులతో శుభకరమైన దేవాలయాలతో నిండి వుంటుంది. అక్కడ భగవానుడైన అనంతుడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన ముచుకుందుడు, వేదాంతి, పరమభక్తుడునైన బలిచక్రవర్తి నివసిస్తున్నారు, తరువాతి దైన రసాతలం శైలమయం శంకరదేవుని నివాసంతో సుశోభితం. సుతలం పసుపు పచ్చగా ప్రకాశిస్తుంటుంది. వితలం పెసలరంగులోనూ, కొన్నిచోట్ల శ్వేతవర్ణంలోను వెలుగు తుంటుంది. తలమను పేరుగల పాతాళము కృష్టవర్ణంలో మిలమిలలాడుతుంటుంది. ఇక్కడ వాసుకి, కాలనేమి, నముచి, శంఖకర్ణాది వివిధనాగులు నివసిస్తుంటారు. దీని కింద రౌరవము వంటి అనేక నరకాలుంటాయి. పాపులు వాటిలో విసరివేయబడుతుంటారు. పాతాళాలకి క్రింద శేషనామకమైన వైష్ణవ శరీరముంది. అక్కడ కాలాగ్నిలో రుద్రస్వరూపునిగా నరసింహుడు అనంతనాగరూపంలో లక్ష్మీపతియైన విష్ణువు ఉంటారు.”