పాండవాగ్రజా! ఇప్పుడు నీకు సర్వపాప నాశకమై సుర, అసుర, ముని ప్రవరులకు కూడా దుర్లభమైన బృహత్తపోవ్రత విధానాన్ని వినిపిస్తున్నాను. మహారాజా! ఈ వ్రతానికై ఆశ్వయుజ పూర్ణిమనాడు ఆత్మశుద్ధి పూర్వకంగా ఉపవాసం చేసి రాత్రి నేతిని కలిపిన పాయసంతో భోజనం చేయాలి. మరునాడు వేకువనే లేచి పవిత్రులై ఆచమనం చేసి బిల్వవృక్షపు పుల్లతో (మారేడు పుల్లతో) పళ్ళు తోముకోవాలి. అనంతరం ఈ మంత్ర పురస్సరంగా మహాదేవుడైన శివుని ప్రార్థించాలి.
అహం దేవవ్రత మిదం కర్తుమిచ్ఛామి శాశ్వతం ।
తవాజ్ఞాయా మహాదేవయథా నిర్వహతే కురు ॥ (ఉత్తరపర్వం 12/4)
పదహారేళ్ళపాటు నియమపూర్వకంగా ప్రతి పాడ్యమినాడూ ఈ వ్రతాన్ని చేయాలి. ప్రతి మార్గశిర పాడ్యమికీ ఉపవాసం చేసి గురుజనుల ఆదేశం మేరకు భక్తిగా శివపూజ నొనరించి రాత్రి దీపాన్ని వెలిగించి మహాదేవునికి నివేదించాలి. శివభక్తులైన పదహారు గురుబ్రాహ్మణులను పత్నీ సమేతంగా ఆహ్వానించి వారిని వస్త్రాలతో భూషణాలతో పూజించి భోజనం పెట్టాలి. పదహారుగురు దంపతులను సత్కరించే స్తోమతు లేకపోతే ఎనమండుగురు దంపతులను, అదీ ఆర్థికభారమనిపిస్తే ఒక బ్రాహ్మణునీ అతని పత్నినీ ఆహ్వానించి విధ్యుక్తంగా సత్కరించవలెను. నిరాహారంగా వ్రతము నాచరించి రాత్రి భూమిపై శయనీంచాలి. సూర్యోదయం కాగానే స్నానం చేసి అన్ని వస్తువులనూ సిద్ధం చేసుకొని శివుని ఉద్వర్తనం చేసి ఆయనకు పంచగవ్యాలతో స్నానం చేయించాలి. ఆ తరువాత పంచామృతాలతో తిలమిశ్రిత జలంతో వెచ్చని నీటితో స్నానం చేయించాలి. అప్పుడు కర్పూర చందనాదులను పూసి కమలాది ఉత్తమ పుష్పాలతో పూజించాలి. వస్త్ర, పతాక, వితాన, ధూప, దీప, ఘంటాది సేవలనాచరించి రకరకాల నైవేద్యాలను నీలకంఠునికి సమర్పించి అగ్నిని ప్రజ్వలింప జేసి ఈ సామగ్రితోనే హవనం చెయ్యాలి. ఇంటిలోపలి భాగానికి వచ్చి పంచగవ్యాలను నోట్లో వేసుకొని ఆచార్యునికీ వీలైనంతమంది గురువులకు భోజనం పెట్టిన తరువాత వ్రతి తన బంధువులతో కూడుకొని మౌనంగా భోంచేయాలి. తరువాత స్వర్ణ, వస్త్రాదులను బ్రాహ్మణులకు సమర్పించి ‘వ్రతంలో తేడాలుంటే క్షమించండ’ని వేడుకోవాలి. శివుడు వారిలో ప్రవేశించి మన్నిస్తాడు.
నిర్ధనులు ఏ ద్రవ్యానికి బదులుగానైనా పూలు, నీళ్ళు వాడవచ్చు. శ్రద్ధయే ముఖ్యం ఈ వ్రతానికి ఫలం వెంటనే కనిపిస్తుంది.
పదహారు సంవత్సరాలైనాక పారణ దినం నాడు శివపూజను చేసి బంగారపు కొమ్ము, వెండిమంచపు కోడు, గంట, కంచు పాత్రలను మహాదేవ నిమిత్తమై ఒక మహాశివభక్తుడైన బ్రాహ్మణునికివ్వాలి. తరువాత పదహారుగురు బ్రాహ్మణులను యథాశక్తి, వస్త్ర, ఆభూషణాదులతో సత్కరించి, పూజించి మధుర ఉత్తమ పదార్థాలతో భోజనాలు పెట్టాలి. దానాలు మనసు విప్పి చేయాలి. అంధులకు, దీనులకు అన్ని దానాలూ చెయ్యాలి. తగినంత సంపద వుండి కూడా దానం చేయని వాడు మూఢభుద్ధి. వానికి వ్రతఫలం దక్కడం కష్టమే. శ్రద్ధగా అన్ని పూజలూ దానాలు చేస్తే బ్రహ్మహత్య వంటి మహాపాతకాలను కూడా దగ్ధం చేసే శక్తి ఈ బృహత్తపోవ్రతానికున్నది. స్త్రీలలో సువాసినులు చేస్తే ఇక పతి నుండి ఎడబాటన్నది వుండదు; విధవలు ఆచరిస్తే ఇక ఏ జన్మలోనూ వైధవ్యముండదు. పదహారేళ్ళూ నియమ నిష్ఠలతో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేసినవారు దేహాంతంలో సూర్యమండలాన్ని ఛేదించుకుపోయి పరమేశ్వరుని లోకం చేరుకుంటారు.”