బృహస్పతి ఇంద్రాదులతో చెప్పిన మాటలను సూతుడు శౌనకాదులతో ఇలా చెప్పడం ప్రారంభించాడు. ‘ప్రాచీనకాలంలో దితి పుత్రులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను విష్ణువు వరాహ, నృసింహ రూపాలలో వచ్చి వధించాక దితి మిక్కిలి దుఃఖితమతియై తన భర్తయే అయినా దైవాంశ సంభూతుడు కాబట్టి దేవతలకు చేసినట్టే ఆయనకూ పన్నెండేళ్ళపాటు పూజలూ, ఆరాధనా చేసింది. ఆయన ప్రసన్నుడై వరం కోరుకొమ్మన్నాడు. ఆమె ఇలా తన గోడు వెళ్ళబోసుకొంది. ప్రభో! నా సవతికి - అదే అదితికి పన్నెండుగురు పుత్రులు. నాకిద్దరే. వారిని కూడా అదితిపుత్రుడు, దేవరక్షకుడునైన విష్ణువు సంహరించాడు. కాబట్టి నాకు ద్వాదశాదిత్య వినాశకుడైన పుత్రుని ప్రసాదించండి.
ఈ భయంకర వాణిని విని కశ్యప బ్రహ్మ ఇలా అన్నాడు. ‘దేవీ! బ్రహ్మ తన సృష్టిలో రెండు మార్గాలను ఏర్పరిచాడు. ఒకటి ధర్మమార్గమైతే ఇంకొకటి అధర్మ మార్గము. వీటినే క్రమంగా పర, అపర మార్గాలని అంటారు. ధర్మ పక్షాన్నవలంబించే వారాయనకు ప్రీతిపాత్రులు, అధర్ములు ఆయనకు వైరులు. కాబట్టి అధర్మం వైపు మొగ్గుచూపిన నీ పుత్రులకు ఆగతి పట్టింది. కావున ఓ ధర్మప్రియా! నీవు ముందుగా నీ ఆలోచనలను శుద్ధి చేసుకొని పవిత్రీకరించుకో. నీకొక మహాబలశాలి, బుద్ధిమంతుడు, చిరంజీవియగు కొడుకు పుడతాడు. దితి ఆయన చెప్పినట్లుగా చేసి పరిశుద్ధయై, పవిత్రయై ధర్మవ్రతాన్ని చేస్తుండగా గర్భవతి అయింది. బృహస్పతి, ఆ వ్రతాన్ని చూసి భయంపుట్టి తన వద్దకు వచ్చిన దేవేంద్రుని దితికి పరిచర్య చేస్తూవుండిపొమ్మన్నాడు. ఆమె ఏడునెలల గర్భవతిగానుండగా నొకరోజు ఇంద్రమాయ వల్ల విమోహితయై అపవిత్రంగానే శయనించింది. వెంటనే అక్కడే పరిచర్యలు, వ్రతంలో సహాయక చర్యలు చేస్తూ అవకాశం కోసం కాచుకొనియున్న ఇంద్రుడు బొటనవ్రేలి ప్రమాణంగల సూక్ష్మరూపం ధరించి అదేవిధంగా వజ్రాయుధాన్నీ కుదించి పట్టుకొని దితి ఉదరంలో ప్రవేశించాడు. లోపల నుండిన పిండాన్ని నలభై తొమ్మిది ముక్కలు చేసి బయటికి వచ్చేశాడు. దితితో ‘నీకు నలభైతొమ్మిదిమంది పుత్రులు పుడతారు. వారిని దేవతలుగానే పరిగణించి లోకం పూజిస్తుంది. నేను వారిని ఎల్లవేళలా రక్షిస్తాను’ అని చెప్పి నమస్కరించి నిష్క్రమించాడు. దితి సంతోషించింది. ఈ విధంగా మరుద్గణ జననం జరిగింది. నిజానికి, వాయుదేవుడే మరుద్గణాలు.
ప్రాచీన కాలంలో అనిలుడను లోకవిశ్రుతుడైన వేదజ్ఞ బ్రాహ్మణుడుండేవాడు. అతడు మిక్కిలి అరుదైన అగ్నియాగాన్ని చేశాడు. అందులో భాగంగా తన తలను తానే ఖండించుకొని హోమగుండంలో పడవేశాడు. ఈ అద్భుత బలిదానానికి ప్రసన్నుడై అగ్నిదేవుడతనికి ప్రత్యక్షమై ‘అనిలా! నీ పుణ్యానికి తగినట్టుగా గొప్ప వరమివ్వబోతున్నాను. ఇక నీవు నా మిత్రునిగా శాశ్వతంగా వాయుదేవరూపంలో నిలిచిపోతావు. వచ్చే జన్మలో నలభైతొమ్మిది మరుద్గణాలుగా విడివడి జన్మించి దేవతలతో సమానంగా పూజలందుకుంటావు. వాయువుగా నామైత్రితో లోకాలందు స్థితుడవైవుంటావు’ అని వరమిచ్చాడు.
మునులారా! అనంతరకాలంలో ఆవాయుదేవుడే వైశ్యజాతీయుడైన ధాన్యపాలుని ఇంట మూలగడాంత ప్రాంతంలో ఉద్భవించాడు. తల్లిదండ్రులతో కాశీ వెళ్ళిన ఆ బాలకుడు వింధ్యవనంలో తప్పడిపోయాడు. ఒక నిస్సంతానుడైన అలీకుడను వస్త్ర నిర్మాత రోదిస్తున్న ఆ బాలకుని తన ఇంటికి గొనిపోయి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. సుందరకాంతులు విరజిమ్ము అతని ముఖాన్ని చూసి ‘కబీర్’ అని పేరు పెట్టాడు. ఆవు పాలు తాగి పెరిగిన కబీరు ఏడేళ్ళ వయసులోనే రామానందుని గురువుగా భావించుకున్నాడు. ఒకరోజు అప్రయత్నంగా రామానందుల పాదము కబీరుపై పడింది. ఆయన వెంటనే ‘రామ్ రామ్’ అన్నారు. ఆ ‘రామ’ శబ్దమే కబీరుకి గురూపదేశంగా, మంత్రంగా మారింది. అలా శ్రీరామజపం చేస్తూనే చివరిదాకా జీవించాడు కబీరు. తన చేతితో అద్భుతమైన వంటకాలను వండి విష్ణుదేవునికి నైవేద్యం పెట్టేవాడు. విష్ణువే అతని కోరికలన్నిటినీ తీరుస్తుండేవాడు.
బృహస్పతి దేవతలకు, ఆ తరువాత, ధ్రువుని కథను వినిపించాడు. ప్రాచీన కాలంలో ఉత్తాన పాదుడని ఒక మహారాజుండేవాడు. అతని పుత్రుడే భగవద్భక్తులలో ఉత్తమునిగా ప్రసిద్ధిచెందిన ధ్రువుడు. అతడు అయిదేళ్ళ వయసులోనే మాతాపితలను త్యజించి విష్ణువు కోసం బయలుదేరిపోయి, నారద మహర్షి ఉపదేశం మేరకు గోవర్ధన పర్వతంపై మహావ్రత ధారణంచేసి ఆరునెలలపాటు భగవత్ ధ్యానంలోనే వుండిపోయాడు పసిబాలుడు ధ్రువుడు. శ్రీ మహావిష్ణువతనికి ప్రసన్నుడై సాక్షాత్కరించి ఆకాశమండపంలో శాశ్వతంగా నభోమయ స్థానాన్నిచ్చాడు.
అంతకుముందు జన్మలో ధ్రువుడు మాధవుడను పేరు గల బ్రాహ్మణుడు. ఇతడు తీర్థ స్నాన తత్పరుడు. అరవై సంవత్సరాలు ప్రాతః స్నానాన్నీ పూజనీ ఏదో ఒక పుణ్య తీర్థంలోనే గతి తప్పకుండా చేశాడు. తీర్థ సేవన పుణ్యం వల్ల అతడు విష్ణుదేవునికి ప్రీతి పాత్రుడై మరుజన్మలో ఆయన దయవల్ల రాజపుత్రుడు, ధ్రువుడునై జన్మించి అరవైయేళ్ళు రాజ్యపాలనం చేసి నభోమండలంలో స్థిరపడిపోయాడు.
మునులారా! బృహస్పతి ద్వారా వసుచరిత్రలను వింటున్న దేవతలలో పంచమ వసువైన ధ్రువుడు తన తేజూంఽదేశని గుజరాత్ ప్రాంతానికి భక్త నరశ్రీ (నరసీ మెహతా) రూపంలో పంపించాడు. నరశ్రీకి శంకర భగవానుని అనుగ్రహంవల్ల బృందావనంలో శ్రీకృష్ణ దివ్యరాస లీలలను ‘ఆ యుగంలోకి వెళ్ళి’ దర్శించే అదృష్టం పట్టింది. అతని పిల్లల పెళ్ళిళ్ళకు శ్రీకృష్ణుడే స్వయంగా విచ్చేసి ఆశీర్వదించి వెళ్ళాడు. వివాహాల అనంతరం నరశ్రీ ‘పరమ వైష్ణవ భక్తరాట్’గా గౌరవాన్నందుకొంటూ కాశీపురికి వచ్చి రామానందుని శిష్యునిగా స్థిరపడ్డాడు.
బృహస్పతి ఇలా చెప్పసాగాడు. ‘దేవేంద్రా! ఒకప్పుడు అనసూయాదేవితో సహా అత్రిమహాముని గంగాతటానికి వచ్చి అక్కడ తపస్సు చేశారు. వారి తపస్సుకి ప్రసన్నులై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ సాక్షాత్కరించి వరం కోరుకొమ్మన్నారు. అత్రి మహాముని ఇంకా తపస్సమాధిలోనే వుండడంతో మాట్లాడలేదు. అపుడు ముగ్గురూ అనసూయమ్మ వద్దకు పోయారు. ఆమెకు దర్శనమిచ్చి అంతర్హితులయ్యారు. అత్రి మహర్షి కోరిక వారికి తెలుసుకాబట్టి అనంతరకాలంలో త్రిమూర్తులే ఆమె కడుపున పుట్టారు. బ్రహ్మ చంద్రునిగానూ, విష్ణువు దత్తాత్రేయునిగానూ, పరమేశ్వరుడు దుర్వాసునిగానూ ఆ పుణ్యదంపతులకు పుత్ర రూపంలో అవతరించారు. ఈ ముగ్గురే తరువాతి కాలంలో వసువులలో చివరివారయ్యారు. చంద్రుడు సోమనామంతో ఆరవ వసువుకాగా, దుర్వాసుడు ప్రత్యూష నామంతో ఏడవ వసువు కాగా, దత్తాత్రేయుడు ప్రభాసనామంతో ఎనిమిదవ వసువైనాడు.’
మునులారా! బృహస్పతి మాటలను విని ఈ ముగ్గురు చివరి వసువులూ తమ అంశలను కలిశుద్ధికై ఈ లోకానికి పంపించి అవతరింపజేశారు. సోముడు దక్షిణదేశంలో వైశ్యవంశంలో సుదేవమహారాజు గృహంలో పీపుడను పేరుతో జనించాడు. సుదేవునిలాగే అతడును అన్ని గౌరవాలనూ పొందాడు. సుదేవ మహారాజులాగే రాచకార్యాలూ నిర్వహించాడు. తరువాత భగవంతుని సంకల్పంమేరకు పీపుడు రామానందుని వద్దకు పోయి కొన్నేళ్ళు శిష్యరికం చేసివచ్చి ద్వారకలో స్థిరపడ్డాడు. శ్రీకృష్ణుని పూజాదికముల ద్వారా ప్రసన్నం చేసుకోగా ఆయన ఇతనికొక హరిముద్రను ప్రసాదించాడు. అది ప్రేత తత్త్వవినాశిని, మరియు స్వర్ణమయి. దానిని లోకకల్యాణానికే వినియోగించి, చివర్లో వైష్ణవపీఠానికి దానంచేశాడు పీపయోగి.
సప్తమవసువు, రుద్రాంశుడైన ప్రత్యూషుడు పాంచాల రాజ్యంలో వైశ్యజాతీయుడైన మార్గపాలుని పుత్రునిగా పుట్టి నానక్ అనే పేరిట ప్రసిద్ధుడైనాడు. ఈ నానక్ బాబా కూడా రామానందుని వద్ద కొన్నేళ్ళు శిష్యరికం చేసి పాంచాలం (పంజాబ్) మరలి వచ్చి తన బోధనలతో భారతజాతి నొక మహాశక్తిగా మలచాడు. మ్లేచ్ఛులను సమర్థంగా ఎదుర్కోగలిగే జాతిని తయారుచేశాడు.
చివరి వసువు ప్రభాసుడు శాంతిపురంలో బ్రాహ్మణ జాతిలో శుక్రదత్తుడను ధర్మవేత్తకు పుత్రునిగా జనించి నిత్యానందుడను పేర ప్రసిద్ధినొందాడు. శౌనకాచార్యా! ఇదీ సంక్షిప్తంగా అష్టవసుమాహాత్మ్యము.”