భవిష్య పురాణము

175 - తులాపురుష దాన విధి

శ్రీకృష్ణపరమాత్మ ధర్మరాజు అనే మాధ్యమం ద్వారా మానవజాతికిస్తున్న ఉపదేశం కొనసాగుతోంది. ఆయన ఇలా అన్నాడు.

“యుధిష్ఠిర మహారాజా! పూర్వకాలంలో స్వాయంభువమను పుత్రుడు ప్రియవ్రత మహారాజు గొప్ప ప్రతాపవంతునిగా, ధర్మాత్ముడైన పాలకునిగా పేరుగాంచాడు. అతడు ముప్పదివేల యేండ్ల దాకా ధర్మపాలనను గావించి పృథ్విని ఏడు ద్వీపాలుగా విభజించి తన యేడుగురు కొడుకులనూ ఒక్కొక్క ద్వీపానికొకరుగా రాజుగా స్థాపించి తపస్సు చేసుకోవడానికి వనాలలోకి ప్రస్థానం చేశాడు.

ప్రియవ్రత మహారాజు వనాలలోకి విచ్చేశాడని తెలిసి గొప్ప గొప్ప మహాత్ములూ, తపస్వులూ, మునిగణాలూ అతని దర్శనానికై వచ్చారు. అతడు వారందరినీ సాదరంగా అర్ఘ్య, పాద్య, ఆచమనాదులతో పూజించి మధురవాణితో కుశల క్షేమాలడిగి ఆసనాలు చూపించాడు. అప్పుడు బ్రహ్మపుత్రుడూ, సూర్యసమాన తేజస్వియునైన పులస్త్య మునీంద్రుడక్కడకు విచ్చేశాడు. ఆయనను చూడగానే రాజుతో సహా మునులందరూ పరమానందభరితులై లేచి నిలబడి ఆయనకు నమస్కరించారు. ఆయనకొక ఉన్నతాసనాన్నేర్పాటు చేసి తాను సాధారణ ఆసన గ్రహణం చేసి ప్రియవ్రతుడాయనను మిక్కిలి సంభావించాడు. ఆ తరువాత చాలాసేపు ధర్మాధర్మ వివేకంపై చర్చా గోష్ఠులు సాగాయి. అక్కడివారంతా పులస్త్యమునిని ఇలా అడిగారు, ‘మునిసత్తమా! పురుషులూ స్త్రీలూ కూడా ఏ దాన, వ్రత, నియమాదులవల్ల సద్గతిని పొందగలరు?’

‘మునులారా! ఈ రాజుకూ మీకూ తెలియనివేవీ ఉండవు. ఐనా, దానాలలో నుత్తమం, సుగుప్తం, సర్వపాపహారియగు తులాదానవిధిని గూర్చి చెప్తాను, బ్రహ్మహత్య నుండి కూటసాక్ష్యం దాకా గల పాపాలన్నీ ఈ దానంవల్ల నశించి ఆ దాని విశుద్ధ శరీరుడవుతాడు. బ్రహ్మలోక ప్రాప్తిని కోరేవారు కృచ్ఛ్ర- చాంద్రాయణాది వ్రతాలనూ తులాపురుష దానాన్నీ చేయాలి. మునులారా! కృచ్ఛ్ర చాంద్రాయణాదులు వనవాసులైన బ్రాహ్మణుల కొఱకూ, భిక్షువులకై, విధవల కోసమూ నిర్దేశింపబడ్డాయి. వీటిలో శరీర కష్టమెక్కువ. రాజులూ, ధనవంతులూ, గృహస్థులూ వీటిని చేయలేరు. ధనం మానవులకు బహిఃప్రాణమే. కాబట్టి ధనవంతులు దానిని ధర్మానికే వెచ్చించి సార్థకం చేసుకోవాలి. ప్రపంచంలో అందరి, అన్ని కోరికలనూ తీర్చగలిగేదీ, ద్రవ్యాలన్నిటిలోకీ శ్రేష్ఠమైనదీ, దేవతలకి ముఖ్యంగా అగ్నిదేవునికి పుత్రసమానమైనదీ బంగారం. బుద్ధిమంతులూ, మహాధనవంతులూ కూడా అయినవారు తమను తామే బంగారంతో తూచుకొని ఆ తుల్య స్వర్ణాన్ని దానం చేస్తే వారి పాపాలన్నీ కడుక్కుపోతాయి; దివ్య శరీరం కూడా లభిస్తుంది.’

ధర్మజా! పులస్త్యముని ఈ విధంగా ప్రియవ్రతునికీ ఆ మునులకూ ఉపదేశించిన దాన్ని మునుల ద్వారా నేను విన్నాను. ఆ విధానాన్ని నీకు వినిపిస్తాను.

వ్యతీపాత, అయన సంక్రాంతి, విషువ యోగ, కార్తిక, మాఘ పూర్ణిమాది పర్వదినాల్లో గాని, తగినంత ధనం సమకూడిన వెంటనే గాని తులాపురుష దానాన్ని చేయాలి. మనిషికి ఎల్లపుడూ ఈ జీవనం అనిత్యమనీ సంపద చంచలమనీ మృత్యువు తన జుట్టు పట్టుకొనే వుంటుందని, తాను ఎప్పుడు పోతాడో తనకే కాదు ఎవరికీ తెలియదనీ గుర్తు, స్పృహ వుండాలి. అందుచేత తనకెంత సమయం వుందో తెలియదు కాబట్టి సమయం దొరికినపుడల్లా ధర్మాచరణ చేస్తూనే వుండాలి.

యదావాజాయతే విత్తం తదాదేయ మిదం భవేత్।

అనిత్యం జీవితం యస్మాద్వసుశ్చాతీవ చంచలం॥

కేశేషుచ గృహీతః సన్మృత్యునా ధర్మమాచరేత్ ॥ (ఉత్తరపర్వం 175/27,28)

తన ఇంటి, లేదా దేవాలయ ప్రాంగణంలో పదహారు హస్తాల పొడవు వెడల్పులతో నొక సుందర మండపాన్ని నిర్మించి దాని మధ్యలో ఏడుహస్తాల పొడవు వెడల్పులతో, ఒక హస్తం ఎత్తుతో నొక చతురస్రాకారపు వేదిని కట్టించి దానిపై త్రాసు నేర్పాటు చేయాలి. నేలను రెండుహస్తాల లోతుకి తవ్వించి నాలుగేసి హస్తాల ఎత్తున్న రెండు స్తంభాలను అక్కడ దృఢంగా పాతించాలి. ఇవి కఱ్ఱ స్తంభాలే అయి వుండాలి. ఇనుప వస్తువులను త్రాసుకి కావలసిన వాటిని పెట్టి మధ్యలో తులాపురుషుని ప్రతిమను స్థాపించి దానిని పూజించాలి. త్రాసును రత్నవస్త్రాభూషణ చందనపుష్పమాలాదులతో అలంకరించాలి.

మూడు మేఖలలతో యోనితో యుక్తమైన, హస్తప్రమాణంలో నున్న నాలుగు కుండములను నిర్మించి ఈశాన్య కోణంలో ఒక హస్తం పొడవు వెడల్పులతో నొక వేది నేర్పాటు చేయాలి. దానిపై గ్రహాలనూ దిక్పాలకులనూ పూజించాలి. గంధ పుష్ప ధూప దీపాక్షత చందన ఫలవస్త్రాదులచే బ్రహ్మవిష్ణు పరమేశ్వరులను పూజించాలి. పాలుగారే చెట్టు ఆకులతో తోరణాలు కట్టాలి. మండపానికి నాలుగువైపులావున్న ద్వారాలలో పుష్ప మాలలనూ, చిగురాకులనూ కట్టిన సప్తధాన్యాలపై నిలబెట్టిన కలశలను స్థాపించాలి. ఋగ్వేదజ్ఞాతలైన ఇద్దరు బ్రాహ్మణులను తూర్పుకుండము వద్దనూ, యజుర్వేదం తెలిసిన ఇద్దరు బ్రాహ్మణులను దక్షిణకుండం చెంతనూ, అలాగే సామాథర్వ వేదాల నిష్ణాత ద్వయాన్ని పశ్చిమ, ఉత్తర కుండాల దగ్గరా హవనాలు చేయడానికి నియుక్తం చేయాలి. వీరేకాక తొమ్మిదిమంది బ్రాహ్మణులు ధర్మోపదేశానికి వుండాలి. పదహారుగురు ఋత్విక్కులను హవనానికి వినియోగించాలని కొందరు ఋషులుంటారు. వరణసమయంలో ప్రతి ఋత్విజునికీ రెండు తామ్రపత్రాలనూ ఒక ఆసనాన్నీ ఇవ్వాలి. నువ్వులు, నెయ్యి, సమిధలు, విష్టరలు, పుష్పాలు, కుశలు, స్రుక్కులు, స్రువలు ఇలాటి హవన సామగ్రినంతటినీ ఒకచోటపెట్టి లోకపాలకుల పతాకలను వారి వారి రంగులతో వారి వారి దిక్కులలో ఎగురవేసి మధ్యలో మహాధ్వజాన్ని పాతించి దానికి పంచవర్ణ వితానాన్ని కట్టాలి.

యజమాని స్నానం చేసి తెల్లబట్టలు కట్టుకొని వచ్చి ఇంద్రాది దిక్పాలకులను ఆవాహన చేసి బలి ప్రదానాన్ని గావించాలి. తరువాత వారిని మంత్రయుక్తంగా ప్రార్థించాలి. (ఈ మంత్ర శ్లోకాలన్నీ ఈ పురాణంలోనే బ్రాహ్మపర్వంలో 178వ అధ్యాయములో శ్లోకం 28 నుండి శ్లో॥ 40 దాకా ఇవ్వబడ్డాయి.)

ఈ విధంగా దేవతలను ఆవాహనం చేసి ఋత్విజులకు స్వర్ణాభరణాలనూ, వస్త్రాలనూ, శయ్యనూ దానం చేయాలి. గురువుగారికీ ఇలాగే సర్వాంశాలనూ ఇచ్చి రెండు వస్త్రాలను సమర్పించాలి. ముందుగా ఆఘార (పాపనాశక) ఆజ్యభాగాలతో హవనం చేయాలి. ఏయే గ్రహాలనూ, లోకపాలురనూ, దేవతలనూ ప్రతిష్ఠ చేస్తున్నామో ఆయా దేవతల మంత్రాలతో హవనం చేయాలి. (ఈ మంత్రాలన్నీ బ్రాహ్మపర్వంలో చెప్పబడ్డాయి) తరువాత మంగళమయ శబ్దాలనుచ్చరిస్తూ వేదజ్ఞుల ద్వారా అభిషిక్తుడయిన యజమాని శ్వేతవస్త్రాలను ధరించి చేతిలో పూలను పెట్టుకొని అంజలి ఘటించి త్రాసుకి మూడుమార్లు ప్రదక్షిణ చేసి ఈ క్రింది మంత్రాలతో ప్రార్థించాలి:

నమస్తే సర్వదేవానాం శక్తిస్త్వం సత్యమాస్థితా।

సాక్షిభూతా జగద్ధాత్రి నిర్మితా విశ్వయోనినా॥

ఏకతః సర్వసత్యాని తథానృత శతానిచ

ధర్మాధర్మ కృతాం మధ్యే స్థాపితాసి జగద్ధితే॥

త్వంతులే సర్వభూతానాం ప్రమాణమిహ కీర్తితా।

మాంతోలయంతీ సంసారాదుద్ధరస్వనమోఽస్తుతే॥

యోఽసౌ తత్త్వాధిపే దేవః పురుషః పంచవింశకః

సఏకోఽధిష్ఠితో దేవి త్వయి తస్మాన్నమోనమః॥

నమో నమస్తే గోవింద తులాపురుష సంజ్ఞకః

త్వంహరే తారయస్వాస్మానస్మాత్ సంసారసాగరాత్ ॥ (ఉత్తరపర్వం 175/71-76)

తరువాత దాని (దాని=దాత) ఆతులపై కూర్చోవాలి. ఆ సమయంలో నతడు కత్తి, డాలు, కవచం మున్నగు అన్ని వృత్తి సంబంధిత వస్తువులచే అలంకృతుడై వుండాలి.

పిడికిళ్ళలో సూర్య సహితయమ ప్రతిమలను పెట్టుకొని పిడికిళ్ళు బిగించి తదేక ధ్యానంతో ఎదురుగా విష్ణుమూర్తి మూర్తిని పెట్టుకొని దానివైపే చూస్తుండాలి. బ్రాహ్మణులు తూకంలో స్వర్ణాన్ని వేస్తూ అది బాగా క్రిందికి దిగాక ముల్లు వైపు చూసి నమస్కరించి తూచుటను ఆపి తులను ఇలా ప్రార్థించాలి:

నమస్తే సర్వభూతానాం సాక్షిభూతే సనాతనే!

పితామహేన దేవిత్వం నిర్మితా పరమేష్ఠినా।।

త్వయా ధృతం జగత్సర్వం సహస్థావర జంగమం।

సర్వభూతాత్మ భూతస్థే నమస్తే విశ్వధారిణి॥ (ఉత్తరపర్వం 175/81,82)

తరువాత దాని తులనుండి దిగి స్వర్ణంలో సగ భాగాన్ని ముందు గురువుగారి కిచ్చివేసి తరువాత మిగిలిన భాగాన్ని చేతిలో నీటిని పెట్టుకొని సంకల్ప పూర్వకంగా ఋత్విజులకు దానం చేయాలి. ఆ తరువాత గురువుగారి ఆదేశం మేరకు ఇతర దానాలు చేయాలి. దీనులకు, అనాథులకు, వికలాంగులకు అన్నంతో బాటు అన్నీ దానం చేయాలి.

తులాదానం బంగారంతోనే చేయాలని లేదు. వెండి, కర్పూరంలతో కూడా ఇవ్వవచ్చు. సౌభాగ్య కాంక్ష గలిగిన స్త్రీలు బహుళ తదియనాడు కుంకుమ, లవణము, బెల్లము తులా దానంలో ఇవ్వాలి. దీనికి మంత్ర హవనాలు అవసరం లేదు. ఈ దానం చేసిన స్త్రీగాని పురుషుడుగాని దేహాంతంలో శ్రేష్ఠ సుందరవిమానంలో సూర్యలోకానికి పోయి అక్కడ ఒక కల్పందాకా నివాసముంటారు. ఆ తరువాత దిక్పాలకుల లోకాలలో అనేక కల్పాలుండి మరల భూలోకంలో పుట్టవలసి వచ్చినపుడు ధర్మాత్ముడు, దాని, శత్రుంజయుడునగు రాజుగా పుడతారు. ఈ మహాదాన మాహాత్మ్యాన్ని శ్రద్ధగా విన్నవారి పాపాలన్నీ నశిస్తాయి.

ధర్మరాజా! బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మించిన దైవంగాని, అశ్వమేధ సమానమైన యజ్ఞంగాని, గంగవలె పవిత్రమైన మరో జలాశయంగాని, తులాదాన తుల్యమైన వేరొక దానముగాని లేవు.”