భవిష్య పురాణము

91,92 - పాలీ వ్రతం - రంభా (కదలీ వ్రతం)

(పాలీ శబ్దం జటిలం. శబ్దార్ధ కోశాలలో ఒక ప్రాకృత భాష అనే అర్థం తప్ప వేరొకటి దొరక్కపోవచ్చు. ఇక్కడ ‘పాలీ’ అంటే వాపీ, కూప, తటాకాదుల చుట్టూ వుండే చప్టా, ప్రహరీ, గట్టు, దానిపై కూర్చొని స్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తారు. అన్ని జలాశయాల్లోనూ వరుణ దేవుడుంటాడు. కాబట్టి పాలీయే ఆయనకి సరైన పూజా పీఠం.)

“భగవన్! శ్రేష్ఠ స్త్రీలు వాపీ కూపతటాకాదుల ప్రహరీలపై కూర్చుని వ్రతమేదో చేస్తుండగా చూశాను. స్నానదానాలు కూడా చేస్తుంటారు. ఇదే వ్రతం? దేని నిమిత్తం? దయచేసి ఉపదేశించండి.” అడిగాడు ధర్మరాజు. చెప్పసాగాడు శ్రీకృష్ణుడు.

“మహారాజా! భాద్రపద శుద్ధ చతుర్దశినాడు లోతైన చెఱువులు, నూతులు, పుష్కరిణులు, పెద్ద పెద్ద జలాశయాలు మొదలగు వాటి వద్ద పవిత్రులై వరుణదేవునికి అర్ఘ్య ప్రదానం చేయాలి. వ్రతి స్వయంగా జలాశయ తటం వద్దకు పోయి ఫల, పుష్ఫ, వస్త్ర, దీప, చందన, మహావర, (పారాణి) సప్త ధాన్య, అనగ్ని పక్వాన్న, తిల, వరిధాన్య, ఖర్జూర, నిమ్మ, నారింజ, ద్రాక్ష, దానిమ్మ, వక్క మున్నగు ఉపచారాలతో వారుణీ సహిత వరుణ దేవునికీ, జలాశయానికీ కూడా విధిపూర్వకంగా పూజ చేయాలి.

అర్ఘ్య ప్రదానం చేస్తూ ఈ మంత్రంతో వారిని ప్రార్థించాలి.

వరుణాయ నమస్తుభ్యం

నమస్తే యాదసాంపతే

అపాంపతే నమస్తేఽస్తు

రసానాంపతయే నమః

మాక్లేదం మాచ దౌర్గంధ్యం!

విరస్యం మా ముఖేఽస్తుమే

వరుణో వారుణీ భర్తా

             వరధోఽస్తు సదామమ (ఉత్తరపర్వం - 91/7, 8)

ప్రతి ఈ రోజు అగ్ని పక్వం కాని ఆహారాన్నే తీసుకోవాలి. అంటే ఫలాదులనే తినాలి. ఈ విధంగా పాలీ వ్రతాన్నాచరించినవారు తత్‌క్షణమే సర్వపాప విముక్తులౌతారు. ఆయువు, యశస్సు, సౌభాగ్యం ప్రాప్తిస్తాయి. సముద్రంలో జలంలాగే వారి ధనం కూడా అక్షయమై నిలుస్తుంది.

మహారాజా! ఒకరోజు బ్రహ్మదేవుడు కొలువు దీరియుండగా కొందరు మునులాయనను రంభా వ్రతవర్ణనకై ప్రార్థించారు. ఆయన దేవల మునివైపు చూశాడు. వెంటనే దేవలముని ఆ వ్రతాన్ని గూర్చి చెప్పినదే నేను నీకు వినిపిస్తున్నాను. ఇది కూడా భాద్రపద శుక్ల చతుర్దశి నాడే అనుష్టింపబడాలి. అందరు దేవతలూ, గంధర్వులూ, అప్సరసలూ ఈ వ్రతాన్ని చేసి కదలీ వృక్షానికి ఆదరపూర్వకంగా అర్ఘ్యములనిచ్చారు. ప్రతి ఈచతుర్దశినాడు నానారకాల ఫలాలు, అంకురిత అన్నాలు, సప్తధాన్యాలు, దీప చందనాలు, పెరుగు, దూర్వ అక్షతలు, వస్త్రాలు, పక్వాన్నాలు, జాయఫలాలు, ఏలకులు, లవంగాలు మున్నగు ఉపచారాలతో అరటిచెట్టును పూజించి ఈ నిమ్లిఖిత మంత్రాన్ని చదువుతూ అర్ఘ్యమివ్వాలి.

చిత్యాత్వం కందలదలైః కదలీ కామదాయిని

శరీరారోగ్యలావణ్యం దేహిదేవి నమోఽస్తుతే (ఉత్తరపర్వం - 92/7)

ఇక్కడ కదలీ వృక్షం పేరుతో ప్రతి పూజిస్తున్నది దేవినే. దుర్గా స్తుతిలో ఈ శ్లోకం ఇలా వుంది:

చితిరూపేణయా కృత్స్నమే తద్ వ్యాప్య స్థితా జగత్

నమస్తస్యై నమస్తస్యై

ఆ తరువాత ప్రతి భోజనం చేయాలి. స్త్రీ పురుషులలో నెవరు ఈ వ్రతాన్ని అచంచల భక్తితో చేసినా, వారి వంశంలో దుర్భాగ, దరిద్ర, వంధ్య, పాపి, వ్యభిచారి, కులట, దుష్టా, పతి విరోధినులు పుట్టరు. ఈ వ్రతాన్ని గావించిన స్త్రీకి సౌభాగ్యం, పుత్రులు, పౌత్రులు, ధనం, ఆయువు, కీర్తి లభిస్తాయి. పతితో ఆనందపూర్వకంగా జీవిస్తుంది. ఈ వ్రతాన్నొకప్పుడు గౌరీదేవి కైలాసంలోనూ, ఇంద్రాణి నందన వనంలోనూ, లక్ష్మి శ్వేత ద్వీపంలోనూ, రాజ్ఞి రవి మండలంలోనూ, అరుంధతి దారుకావనంలోనూ, స్వాహాదేవి మేరుపర్వతంపైననూ, సీతాదేవి అయోధ్యలోనూ, వేదవతి హిమాచలం పైననూ, భానుమతి నాగపురంలోనూ చేసి లోకవంద్యలైనారు.”