భవిష్య పురాణము

75 - నారదకృత సూర్య విరాడ్రూ పవర్ణన

శ్రీకృష్ణుడు తన పుత్రుడైన సాంబనికి శాపవిమోచన మార్గాన్ని చూపాడని విని యున్నావు కదా రాజా! ఆ సందర్భంలో ఆయన ఇలా కూడా అన్నాడు. ‘వత్సా! సూర్యారాధన ద్వారా నీ సంతాపాలు తొలగి, సంతోషాలు వెల్లి విరుస్తాయన్నది ఘంటాపథమే. సూర్యనారాయణుని ఆరాధనా విధానాన్ని నారదుని ద్వారా తెలుసుకొని ధన్యుడువుకా!’

సాంబని అదృష్టంకొద్దీ ఒకరోజు నారదుడే శ్రీ కృష్ణ దర్శనార్థం ద్వారకకు విచ్చేశాడు. సాంబడు కొత్తగా నేర్చుకొన్న వినయజ్ఞాన సంపన్నతతో నారదుని ప్రసన్నుని చేసుకోగలగడంతో ఆమహర్షి ఇలా చెప్పసాగాడు.

‘అన్నిలోకాలూ తిరిగే అలవాటున్న నేను ఒకప్పుడు సూర్యలోకం చేరాను. అక్కడ దేవతలు, గంధర్వులు, నాగులు, యక్షులు, రాక్షసులు, అప్సరసలు సూర్యదేవుని సేవలో నిమగ్నులై తరించడం చూశాను. గంధర్వులు గానం చేస్తుండగా అప్సరసలు నృత్యం చేస్తుండగా యక్ష రాక్షస నాగగణాలు శస్త్రధరులై పహరా కాస్తున్నారు. ఋగ్యజు స్సామవేదాలు ఆకారాలు ధరించి ఆయనను స్తుతిస్తుండగా ఋషులు వేద మంత్ర స్తవనంతో ఆయనను ఆరాధిస్తున్నారు. ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలాలు సంధ్యలతో సహా సుందరరూపాలు ధరించి శ్రీ సూర్యభగవానునికి నలువైపులా అంజలి ఘటించి నిలబడి వున్నాయి. ప్రాతస్సంధ్య రక్తవర్ణంలోనూ, మధ్యాహ్నసంధ్య చంద్రసమాన శ్వేతవర్ణంలోనూ, సాయంసంధ్య గులాబీరంగులోనూ మెరిసి పోతున్నాయి. ఆదిత్య, వసు, రుద్ర, మరుద్గణాలు, అశ్వినీ కుమారులు ఆయనను పూజిస్తున్నారు. స్వయంగా ఇంద్రుడే అక్కడ నిలబడి సూర్యదేవునికి జయ జయ ధ్వానాలు చేయసాగినాడు. గరుత్మంతుని అన్నయైన అరుణుడు సూర్యసారథి. ఆకు పచ్చని ఏడు గుఱ్ఱాలు ఆయన రథానికి పూన్చబడివున్నవి. ఆ రథము కాలముయొక్క అవయవాలచే నిర్మితము. సూర్యునికిరువైపులా ఆయన పత్నులు రాజ్ఞీ, నిక్షుభా కూర్చుని వున్నారు. పింగల, లేఖక, దండనాయకాది గణాలు, కల్మాష నామకములైన రెండు పక్షులు ద్వారపాలకులుగా సేవిస్తున్నాయి. బ్రహ్మ, దిండి కూడా అక్కడే వుండి సూర్యస్తుతి చేస్తున్నారు. ఆ వైభవాన్ని, ప్రభావాన్ని కనులారా గాంచి చెప్తున్నాను. సాంబకుమారా! నీవాయనను శరణువేడు.’

‘దేవమునీంద్రా! ఆస్వామి నారాధించుటకే కృతనిశ్చయుడనై సూర్యజ్ఞానప్రాప్తి కోసమే మిమ్ము ఆశ్రయించాను. ఈయన సర్వగతుడెట్లయ్యెనో, ఆయన రశ్ములెన్నో, మూర్తులెన్నో, ఈ కల్మాషపక్షులెవరో, పింగల, లేఖక, దండనాయక గణాలవారేం చేస్తుంటారో - ఇవన్నీ మీద్వారా తెలుసుకోగోరుచున్నాను’ అన్నాడు సాంబడు.

చెప్పసాగాడు దేవర్షి నారదుడు.

‘వివస్వతుడైన సూర్యదేవుడు అవ్యక్తకారణ కారకుడు. నిత్య, సత్య, అసత్ స్వరూపుడు. తత్త్వచింతకులైన మహాపురుషులు ఆయనే ప్రధాన - ప్రకృతి రూపాలని చెప్తారు. గంధ, వర్ణ, రస, శబ్ద, స్పర్శరహితుడైన ఆయన నుండే అన్నీ ఉద్భవించాయి. జగద్యోనీ ఆయనే, సనాతనపరబ్రహ్మా ఆయనే. అన్ని ప్రాణులకూ నియంతా ఆయనే. ధర్మాన్నీ ఐశ్వర్యాన్నీ ప్రదానం చేయగల బ్రాహ్మీబుద్ధి ఆయనది. ఆదిదేవుడు కాబట్టి ఆదిత్యుడనీ అజాతుడు కాబట్టి అజుడనీ ఆయననే అంటారు. దేవతలకే దేవుడు కాబట్టి దేవదేవు డంటారు. సమస్తలోకాలకీ ఈశుడూ, అధీశుడూ కాబట్టి ఈశ్వరు డంటారు. ప్రజారక్షకుడు కావున ప్రజాపతి అంటారు. పుర్‌శయనుడు కాబట్టి పురుషుడు, అపూర్వుడు కాబట్టి స్వయంభువు.’

ఈ సృష్టి సూర్యనారాయణునిచే ఎలా చేయబడిందో నారదుడు సాంబునికి చెప్పాడు. ఈ పురాణ ప్రారంభంలో శతానీకుడు విన్నదానికి అదనంగా ఇక్కడ నారదుడు మరికొంత చెప్పాడు.

ప్రజాహితం కోసం ప్రజాపతులను సృష్టించగోరి సూర్యభగవానుడే అదితి గర్భాన జన్మించాడు. అప్పటికే తాను సృష్టించిన ప్రజాపతుల వంశాలను వృద్ధిచేశాడు.

దక్షకన్య అదితి వివాహం కశ్యపమహర్షితో జరిగింది. వారి సంతానంగా ‘భూర్భువఃస్వః’ సంయుక్తమైన ఒక అండం జనించింది. దాని నుండి ద్వాదశాత్మలతో తేజోమండల సహితుడై సూర్యభగవానుడు ప్రకటితుడయ్యాడు. ఈ సూర్యమండలం వ్యాసం తొమ్మిది వేల యోజనాలు. కదంబపుష్పంలో కేసరాల్లాగా ఈ మండలమంతటా కిరణాలు పరివ్యాప్తమై వుంటాయి. సహస్రశీర్షాఃపురుషః - అంటూ మనం పూజించే మహాపురుషుడు ఈ మండల మధ్యభాగంలో వుంటాడు. సూర్యకిరణాలు అగ్నిలో రాత్రి ప్రవేశిస్తాయి. అందుకే ప్రకాశత్వ, ఉష్ణత్వగుణాలు సూర్య, అగ్ని దేవతలిద్దరిలో వుంటాయి.

సూర్యభగవానుని కిరణాలని ఇరవై పేర్లతో పూజిస్తారు. హేతి, కిరణ, గౌ, రశ్శి, గభస్తి, అభీషు, ఘన. ఉస్త్ర, వసు. మరీచి, నాడీ, దీధితి, సాధ్య, మయూఖ, భాను, అంశు, సప్తార్చి, కర, పాద అనేవి కిరణ నామాలు. సూర్యదేవుని సహస్ర కిరణాలలో నాలుగువందలు వర్షకారకాలు. వాటిని ‘చందన’ అంటారు. వీటి స్వరూపం అమృతమయం. మూడువందల కిరణాలు హిమాన్ని వహిస్తాయి. అవి పచ్చగా వుండి ‘చంద్ర’ నామంతో పిలువబడతాయి. మిగిలిన మూడువందల కిరణాలూ ‘శుక్ల’ నామకాలు. ఇవి ఎండలని సృష్టిస్తాయి. లోకాన్ని నిలబెడతాయి. ఉదయం ఋగ్వేదం, మధాహ్నం యజుద్వేదం, సాయంత్రం సామవేదం ఆ స్వామిని స్తుతిస్తాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ద్వారా ఈ పూజ నిత్యం జరుగుతూనే వుంటుంది. నక్షత్రాల, గ్రహాల, తారాగణాల అధిష్ఠాన దైవం సూర్యుడే. స్వామి సహస్ర కిరణాలలో ఏడు కిరణాలు ముఖ్యములు.అవి - సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, సూర్య, రశ్మి, విష్ణు, సర్వబంధు నామాలతో అవి వుంటాయి.

అగ్నులలో మనం వేసే ఆహుతులన్నీ సూర్యనారాయణ స్వామినే చేరతాయి. వృష్టి కూడా ఆయన నుండే ఉత్పన్నమవుతుంది. ఆ వృష్టివల్లే అన్నం పుడుతుంది. లోకాన్ని నిలబెడుతుంది, కాబట్టి జగదానందకారకుడు, లోకబాంధవుడు దారిద్ర్య విద్రావణుడు సూర్యనారాయణుడే.’

సూర్యనారాయణ మాహాత్మ్యాన్ని ఇంకా చాలాసేపు వర్ణించి చెప్పాడు నారదుడు. (అదంతా శతానీకుడింతకు ముందు అధ్యాయాలలో విన్నదే.) ఆ తరువాత సాంబడు సూర్యభగవానుని పరివారాన్ని గూర్చి వినగోరాడు. చెప్పసాగాడు నారదుడు.