భవిష్య పురాణము

2 - భువనకోశ సంక్షిప్త వర్ణన

యుధిష్ఠిర మహారాజు చేతులు జోడించి శ్రీకృష్ణుని ఇలా అభ్యర్థించాడు. “భగవన్! ఈ జగత్తు ఎవనిలో ప్రతిష్ఠితమై వుంది? ఎక్కడి నుండి పుట్టింది? ఎవనిలో లయమై పోతుంది? ఈ విశ్వానికి హేతువేది? పృథ్విపై ఎన్ని ద్వీపాలూ, సముద్రాలూ, కుల పర్వతాలూ వున్నాయి? ఎన్ని భువనాలున్నాయి? దయచేసి ఈ విషయాలపై జ్ఞానాన్ని ప్రసాదించండి.”

జగద్గురువైన శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు, “మహారాజా! మీరడిగినవన్నీ పౌరాణిక సంబంధితములైన విషయాలు. అయినా, నేనీ ప్రపంచంలో పరిభ్రమిస్తూ విన్న విషయాలన్నిటినీ సంక్షిప్తంగా వినిపించే ప్రయత్నం చేస్తాను. సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశాను చరితాలనే అయిదు లక్షణాలు ప్రతి పురాణానికీ వుంటాయి.

సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశోమన్వంత రాణిచ

వంశాను చరితం చైవ పురాణం పంచలక్షణం (ఉత్తరపర్వం 2/11)

అనఘా! మీరడిగిన ప్రశ్నలకు చాలావఱకు సర్గ (సృష్టి)లోనే సమాధానాలుంటాయి.

అవ్యక్త ప్రకృతి నుండి మహత్తత్త్వ బుద్ధి పుట్టింది. దానినుండి త్రిగుణాత్మకమైన అహంకారముత్పన్నం కాగా అహంకారం నుండి పంచతన్మాత్రలూ, వాటి నుండి పంచమహాభూతాలూ వాటి నుండి చరాచర జగత్తూ వచ్చాయి. స్థావర జంగమాత్మక జగతి నశించినపుడు సర్వత్ర జలమే నిండి వుంటుంది. అందులో విష్ణువుంటాడు. ఆయన నుండి భూతాత్మకమైన అండం జనిస్తుంది ఈ కల్పంలో కూడా. ఈ అండం కొన్నేళ్ళ తరువాత రెండు భాగాలుగా విడింది. ఒక భూభాగం పృథ్వి కాగా ఇంకొకటి ఆకాశమైంది. అండ జరాయువు నుండి మేరు పర్వతము వంటి కొండలు, నాడుల నుండి నదులు, ఇతర ప్రవాహములు పుట్టాయి. మేరు పర్వతము పదహారువేల యోజనాల విస్తృతిలో ఈ భూమిపైకి నిలబడి వుంది. మేరు శిఖరము యొక్క విస్తారం ముప్పది రెండు వేల యోజనాలు. భూమిది కమల స్వరూపమైతే దాని కర్ణిక మేరు పర్వతం. అయ్యండము నుండి ఆదిదేవుడయిన ఆదిత్యుడుత్పన్నుడైనాడు. ఆయనే ప్రాతఃకాలంలో బ్రహ్మ, మధ్యాహ్నమందు విష్ణువు, సాయం సమయాలలో రుద్ర రూపాలలో విరాజిల్లుతాడు. ఒక ఆదిత్యుడే త్రివిధ దైవతమూర్తులకు మూలము. బ్రహ్మ నుండి మరీచి, అత్రి, అంగిరా, పులస్త్య, పులహ, క్రతు, భృగు, వసిష్ఠ, నారదులు ఆయన మానసపుత్రులుగా ఉద్భవించారు. పురాణాలు వీరిని బ్రహ్మపుత్రులుగానే పేర్కొన్నాయి. బ్రహ్మ యొక్క కుడి బొటన వ్రేలినుండి దక్షుడు, ఎడమ బొటన వ్రేలినుండి ప్రసూతి ప్రకటితులయ్యారు. వారి పుత్రుడే హర్యక్షువు. సంతానాన్ని కని ప్రపంచాన్ని వృద్ధి చేయవలసిన హర్యక్షువు, అతని సోదరులు నారదుని బోధలు విని విరక్తులై పోయారు. అప్పుడు దక్షుడు ప్రజాపతిగా తను విరాగి కాలేడు కాబట్టి అరవైమంది కన్యల నుత్పన్నం చేసి వారిలో పదిమందిని ధర్మునికీ, ఇరవై యేడుగురిని చంద్రునికీ, ఇద్దరిని బహుపుత్రునికీ, మరో ఇద్దరిని కృశాశ్వునికీ, నలుగురిని అరిష్టనేమికీ, ఒకరిని భృగునికీ, ఒకరిని శంకరునికీ ఇచ్చి వివాహం చేశాడు. వీరి వల్ల చరాచర జగత్తు ఉత్పన్నం చేయబడింది. మేరు పర్వతపు మూడు శిఖరాలపై బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు క్రమంగా వైరాజ, వైకుంఠ, కైలాసపురాలేర్పడినవి. పూర్వాది దిశలలో ఇంద్రాది దిక్పాలకుల నగరాలు నిర్మింపబడ్డాయి. హిమవాన్, హేమకూట, నిషధ, మేరు, నీల, శ్వేత, శృంగవాన్- ఈ యేడూ జంబూ ద్వీపంలోని కులపర్వతాలు. జంబూ ద్వీపం లక్షయోజనాలు ప్రమాణంలో వుంది. జంబువు కాక ఇంకా శాక, కుశ, క్రౌంచ, శాల్మలి, గోమేద పుష్కర ద్వీపాలున్నాయి.(మత్స్యాది పురాణాల్లో ప్లక్ష ద్వీపమొకటి అదనంగా చెప్పబడింది.) ఇవి సప్త సముద్రాలచే పరివేష్టింపబడి వున్నాయి. క్షార, దుగ్ధ, ఇక్షురస, సుధ, దధి, ఘృత, స్వాదిష్ట జల - ఇవి సప్త సముద్రాలు. (లోకాల పేర్లు వాటిలో నివసించే జాతుల పేర్లు ఇదివఱకే చెప్పబడ్డాయి) ఇక మనువులలో ఇప్పటికి ఆరుగురి పాలన అయిపోయింది వారు స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుస మనువులు. ప్రస్తుతం వైవస్వత మన్వంతరం నడుస్తోంది. నేటి పృథ్వి వైవస్వతుని పుత్ర పౌత్ర ప్రపౌత్రాదులతోనే పరివ్యాప్తమై వున్నది. ఈ మన్వంతరానికి ముప్పది ముగ్గురు దేవతలు. వారు ద్వాదశాదిత్యులు, అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, అశ్వినీకుమార ద్వయము. విప్రచిత్తి నుండి దైత్యగణము, హిరణ్యాక్షుని నుండి దానవగణమూ పుట్టుకొచ్చాయి.

ద్వీప, సముద్ర సహితమైన ఈ భూమి ప్రమాణం యాభైకోట్ల యోజనాలు. ఇది నౌకలాగా అఖండ జలరాశిపై తేలియాడుతున్నది. దీనికి నాలుగువైపులా లోకా లోక పర్వతాలున్నాయి. ప్రళయాలు కూడా నాలుగు రకాలే. అవి నైమిత్తిక, ప్రాకృత, ఆత్యంతిక, నిత్య ప్రళయాలు ఈ ప్రపంచం ఎందులోంచి వచ్చిందో ప్రళయవేళ అందులోనే కలిసి పోతుంది. వృక్షాల పుష్పఫలాలు ఋతువుననుసరించి పుడతాయి. ఆ ఋతువు దాటినాక మరి కనబడవు. పృథ్వి కూడా అంతే. సంపూర్ణ విశ్వం లీనమైపోయాక మహేశ్వరుడు వేద శబ్దాల ద్వారా మరల దీనిని నిర్మిస్తాడు. జీవి తన కర్మల ఫలంగానే పుట్టడం జరుగుతుంది. భూమి జలం చేతా, జలం తేజస్సు చేతా, తేజస్సు వాయువు చేతా, వాయువు ఆకాశం చేతా చుట్టబడి వుంటాయి. ఆకాశం అహంకారం చేతా, అహంకారము మహత్తత్త్వం చేతా, అది ప్రకృతి చేతా, ఆ ప్రకృతి అవినాశ పురుషుని చేతా పాలింపబడుతుంటాయి. ఈ రకంగా వేలకొలది అండాలు పుడుతుంటాయి. పోతుంటాయి. సుర, నరాదులతో నిండిన ఈ విశ్వమంతా నారాయణుని కుక్షిలోనే వుంటుంది. నిర్మలబుద్ధీ, శుద్ధ అంతఃకరణా గలిగిన ముని గణాలు ఆయన బాహ్య, ఆభ్యంతర స్వరూపాలన్నిటినీ చూడగలరు.”