భవిష్య పురాణము

142 - కోటి హోమ విధానం

మహారాజా! ప్రాచీన కాలంలో ప్రతిష్ఠానపురంలో సంవరణుడని ఒక మహాభాగ్య శాలియైన రాజుండేవాడు. ఆయన అన్ని శాస్త్రాల్లో నిపుణుడు బ్రహ్మతత్త్వ జ్ఞాత, పితృభక్తి గలవాడు, దేవ బ్రాహ్మణోపాసకుడు.

ఒకనాడు బ్రహ్మపుత్రుడూ మహాయోగీ అయిన సనకుడు సంవరణ మహారాజు వద్దకు వచ్చాడు. ఆయనను చూడగానే ఆ రాజు పరమ ప్రసన్నుడై తానే స్వయంగా అర్ఘ్య పాద్యాది సత్కారం చేసి సుఖాసీనుని గావించి తన రాజ్యాన్నీ తన శరీరాన్నీ సనక మహర్షికి సమర్పించి ఆయన పాదాల వద్ద కూర్చున్నాడు. మహర్షి మహదానందభరితుడై మంచినీళ్ళు తప్ప మిగతా అన్నిటినీ రాజుకే తిరిగి ఇచ్చివేసి రాజుని సింహాసనంపై కూర్చుండబెట్టి తాను సమీపంలోనే కూర్చొని ఎన్నో ధర్మాలనూ, రాజవంశ చరిత్రాలను చెప్పాడు. ఇతిహాస, పురాణాదులను తనివి తీరావిన్న సంవరణుడు జగత్తులో అన్ని ప్రాణుల హితదృష్టితో మహర్షినిలా ప్రార్థించాడు: ‘దేవర్షి! భూకంపం, ఉపలవృష్టి, గ్రహయుద్ధం, అనావృష్టి, రాజ్యోపద్రవం వంటి ఉత్పాతాల నుండి విడుదలకు ఏదైనా ఉపాయాన్ని ప్రసాదించండి. రాజ్యంలోని వారికి ధనధాన్యవృద్ధి, ఆరోగ్యం, సుఖం, చివరిలో స్వర్గం ప్రాప్తింపజేసే సాధనాన్ని అనుగ్రహించండి.’ దేవర్షి సంతోషించి ఇలా చెప్పసాగాడు:

‘మహారాజా! అన్ని కార్యాలనూ సిద్ధింపజేసి సర్వారిష్టాలనూ శాంతింపజేసేది ‘కోటి హోమం’ అనే గొప్ప కర్మం. తద్విధిని వివరిస్తాను.

ముందుగా శుద్ధ ముహూర్తాన్ని చూసుకొని, దేవాలయ, నదీతట, వనాంతర లేదా స్వగృహంలో కోటిహోమం చేయాలి. ముందుగా

త్వంనో గతిః పితామాతా త్వ౦గతిస్త్వం పరాయణః

త్వత్ప్రసాదేన విప్రర్షే సర్వంమే స్యాన్మనోగతం!॥

ఆపద్విమోక్షాయచ మే కురుయజ్ఞ మనుత్తమం।

కోటిహోమాఖ్యమతులం శాంత్యర్థం సార్వకామికం॥ (ఉత్తరపర్వం-142/17,18)

వేదవేత్తయైన బ్రాహ్మణోత్తముని వరణం చేసుకొని ఆయనను పైవిధంగా ప్రార్థించాలి. ఆయన అంగీకారంతో ఆయననే ఆచార్యునిగా పెట్టుకోవాలి. ప్రథమంగా ఆచార్యుడు కూడా శ్వేత వస్త్రాలుధరించి సాలంకృతుడై కొందరు విద్వాంసులైన బ్రాహ్మణులతో కలిసి పుణ్యాహవాచనం చేయాలి. తూర్పు, ఉత్తరం వాలున్న సమతల భూమిపై వంద లేదా యాభై హస్తాల కొలతలతో నొక మండపాన్ని నిర్మింపజేసి దానిని బ్రాహ్మణుల ద్వారా సూత్రబద్ధం చేయించాలి. దాని మధ్యలో ఎనిమిది హస్తాల పొడవు వెడల్పులతో, చతురస్రంగా, మూడు హస్తాల పొడవు వెడల్పులతో, చతురస్రంగా, మూడు మేఖలలతో నున్న, పన్నెండంగుళాల విస్తారంతో వుండే యోని సహితంగా నొక కుండాన్ని నిర్మించాలి. దానికి తూర్పున నాలుగు హస్తాల పొడవు వెడల్పులున్న ఒక హస్తం ఎత్తు వున్న వేదిని నిర్మించి దానిలోనే అందరు దేవతలనూ స్థాపించాలి. మండప భూమిని పేడతో, మన్నుతో బాగా అలికి పంచపల్లవాలతో కప్పబడిన పదునాల్గు నీటితో నింపిన కలశలను దానిపై స్థాపించాలి. మండపం పైకి ఒక వితానాన్నీ తోరణాన్ని యేర్పాటు చేయాలి. సామగ్రి నంతటినీ ఒకచోట చేర్చి మంచిరోజున పురోహితుని ఆహ్వానించి ఆయన ద్వారా పుణ్యాహవాచనాన్ని, స్వస్తివాచనాన్ని, జయశబ్ద పూర్వకాలను చేయించి హవనాన్ని ప్రారంభించాలి. మండపానికి తూర్పులో బ్రహ్మ, మధ్యలో విష్ణు, పశ్చిమంలో శివ, ఉత్తరంలో వసు, ఈశాన్యంలో గ్రహ, అగ్నికోణంలో మరుత్తు, శేషదిశల్లో ఇంద్రాది దేవతలను వేదిపై స్థాపించాలి. గంధాక్షత పుష్పధూప దీపనైవేద్యాలతో, వైదిక పౌరాణిక మంత్రాల ద్వారా ఈ దేవతలందరికీ వేరు వేరుగా పూజలనూ ప్రార్థనలనూ చేయాలి.

దీని తరువాత వేదపాఠులైన బ్రాహ్మణులతో విధి విధానంగా కుండ సంస్కారాన్ని గావించాలి. కుండంలో అగ్నిని ప్రజ్వలింపజేసి దానిని ఘృతార్చిష నామంతో పూజించాలి. విద్యా వయోవృద్ధులు, గృహస్థులు, జితేంద్రియులు, స్వకర్మ నిష్ఠులు, శుద్ధులు, జ్ఞానశక్తి సంపన్నులు నగు నూరుగురు గాని దొరికినంతమందిగాని ఉత్తమ బ్రాహ్మణులను హవనానికి నియమించుకోవాలి. తరువాత పంచముఖాగ్నిని ధ్యానించి పేరు పేరునా ఏడు జిహ్వలనూ పూజించాలి. పొగలేకుండా చూసుకోవాలి.

ఋగ్వేద బ్రాహ్మణులు తూర్పువైపు, యజుర్వేదులు ఉత్తరంవైపు, సామవేదులు పశ్చిమంవైపు, అథర్వవేదులు దక్షిణంవైపు తిరిగి కూర్చొని ఆఘార, ఆజ్యభాగ ఆహుతుల నివ్వాలి. ముందుగా బ్రహ్మదేవుని స్థాపించి ఈ కర్మను ప్రారంభించాలి. ఓం కారాన్ని ముందూ ‘స్వాహా’ని చివరా ఉచ్చరిస్తూ వ్యాహృతులను హవనం చేయాలి. నెయ్యినీ నల్ల నువ్వులనూ పలాశ సమిధలతో కోటి హోమం చేయాలి. ఒక వెయ్యి ఆహుతులు పూర్తి కాగానే పూర్ణాహుతినిచ్చి మరల అలాగే ఆహుతులను మొదలు పెట్టాలి. ఇలా పదివేల మార్లు పూర్ణాహుతి జరుగుతుంది. ఈ యజ్ఞకాలంలో అందరు బ్రాహ్మణులూ, యజమానీ కామ, క్రోధాది దోషాలకు లోనుకారాదు.

సంవరణ మహారాజుకి ఈ కోటి హోమం అధిక సమయం పట్టే ప్రక్రియ కదా, మరి అన్నాళ్ళపాటు సంయమనంతో వుండడం కష్టమనిపించింది. అందుచేత సంక్షిప్తంగా ఈ మహా యజ్ఞాన్ని చేసే అవకాశం వుంటే బాగుండుననిపించింది. ఆ విషయమే ఆ ఋషి నడిగాడు.

సనక మహర్షి ఇలా ఆనతిచ్చాడు ‘మహారాజా! శతముఖ, దశముఖ, ద్విముఖ, ఏకముఖ అని కోటి హోమంలో నాలుగు ప్రకారాలున్నాయి. సమయానుసారంగా ఈ నాలుగింటిలో ఏది వీలైతే ఆ హోమాన్ని చేయవచ్చు.

ఒక హస్త ప్రమాణం గల ఉత్తమ కుండాలను నూరింటిని నిర్మింపజేసి ఒక్కొక్క కుండం దగ్గరా ఒక్కొక్క బ్రాహ్మణుని హవనం చేయడానికి నియమించాలి. సమయం చాలదనుకొంటే ఒక్కొక్క కుండం దగ్గర పదేసిమంది బ్రాహ్మణులను వినియోగించుకోవచ్చు. ఒక కుండలో అగ్నిని రగిల్చి దానితోనే అన్ని ఇతర కుండాలనూ జ్వలింపజేయాలి. దీనిని శతముఖహోమమంటారు. అప్పటికీ సమయం చాలదనుకొంటే ఒక్కొక్క కుండం దగ్గరా ఇరవయ్యేసిమంది బ్రాహ్మణులచేత హవనం చేయించవచ్చు. అది దశముఖ హోమమవుతుంది. నెలా, రెండు నెలలకంటే ఎక్కువ సమయంలేకపోతే రెండే కుండాల నేర్పాటు చేసి ఒక్కొక్క దాని వద్దనూ యాభయ్యేసిమంది బ్రాహ్మణులను నియోగించి హవనం చేయవచ్చు. ఇది ద్విముఖ కోటి హోమము. సమయం అధికంగా వుంటే ఒకే కుండాన్ని నిర్మించి అగ్నిస్థాపనం చేసి ఉత్తమ వర్ణోత్పన్నులూ, వేదవేత్తలూ సదాచారులూ నైన బ్రాహ్మణులను సంఖ్యతో నిమిత్తం లేకుండా, కాలావధి పెట్టకుండా రావించి వారిచేత హవనాలను చేయించే కోటిహోమ ప్రకారాన్ని ఏకముఖ కోటి హోమ స్వేచ్ఛాయజ్ఞ మంటారు.

యజ్ఞం పూర్తయినాక గొప్ప మహోత్సవాన్ని నిర్వహించాలి. అందరు బ్రాహ్మణులకూ కటక, కుండల, వస్త్ర, దక్షిణ, స్వర్ణ, శతగో, శతాశ్వాదులను దానంగా సమర్పించాలి. అంతంలో కలశలోని నీటితో ఆచార్యుడు యజమానుని అభిషేకించాలి. దీనికి ముందు యజమాని చేసే స్నానాన్ని అవభృథ స్నానమంటారు’ అని చెప్పి సనక మహర్షి సంవరణుని ఆశీర్వదించి వెడలిపోయినాడు.

ధర్మజా! కోటి హోమం వల్ల సర్వ సత్ఫలితాలు కలుగుతాయి. ఇంద్రలోకం ప్రాప్తిస్తుంది.