22, 23 - భవిష్య పురాణం అక్బరాదుల, సూరదాసాదుల పూర్వజన్మ వృత్తాంతము, గురుండ, మౌన మ్లేచ్ఛ రాజ్యాల విస్తరణ

“శౌనకాచార్యా! ఈవిధంగా బలివద్దకు పోయిన దైత్యులు అతనికి తమ పరాజయ వృత్తాంతాన్ని విన్నవించుకొన్నారు. దైత్యరాజైన బలిని దేవ, వేద విజయం బాధించడంతో అతడు మరొక మారణాయుధాన్ని బయటికి తీశాడు. రోషణుడను, రాక్షసుని పిలిచి వానిని ఇలా ఆదేశించాడు. ‘దైత్యేంద్రా! నీవు తిమిరలింగ మహీపతి పుత్రుడవై జన్మించి సరుష నామంతో ప్రసిద్ధుడవై దైత్యుల కార్యాలను సంపన్నం కావించవలసి వుంది. పొమ్ము.’ అతడు ఢిల్లీ (పురాణంలో దెహలీ అని వుంది) చేరుకొని వేదమార్గస్థులైన పురుషులను నాశనం చేయసాగాడు. అతడు అయిదేళ్ళపాటు రాజ్యం చేశాడు. అతని కొడుకే బాబరు.

బాబరు కొన్నేళ్ళు సమర్కంద్ లోనూ కొన్నేళ్ళు భారత్ లోనూ మొత్తం ఇరవై సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అతని కొడుకు పేరు హెూమాయు (హుమయూన్) ఇతడు మదాంధుడై దేవతలను నిరాదరణ పాల్జేశాడు. దేవతలపుడు నదీహా ఉపవనంలో నున్న శ్రీకృష్ణ చైతన్యుని స్తుతించి శరణు వేడారు. ఆయన హుమయూనుపై కోపించి తన తేజస్సుచే అతని రాజ్యంలో అన్ని విధాల విఘ్నాలనూ కలుగజేశాడు. తత్ఫలితంగా హుమయూనూ తన సైనికుల చేతిలోనే పరాజితుడై అజ్ఞాతంలోకి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ సమయంలో శేషశాకుడు (షేర్‌షా) అనే మహావీరుడు ఢిల్లీనాక్రమించి అయిదేళ్ళపాటు చక్కగా కుశలతా పూర్వకంగా ప్రజానురంజక పాలనాన్ని గావించాడు. ఇది ఇలా వుండగా.

అప్పటికి కొన్నేళ్ళ క్రిందట శంకరాచార్య గోత్రోద్భవుడైన ముకుందుడను శ్రేష్ఠబ్రాహ్మణ గురువు తన ఇరువదిమంది శిష్యులతో సహా ప్రయాగలో తపస్సు చేయసాగాడు. ఆయన చెవులలో పడిన ఒక మాటతో తపోభగ్నమై జీవన విఘ్నం కూడా అయింది. ఆ మాటయే మనగా మ్లేచ్ఛ రాజైన బాబరు ద్వారా మన మతం, మన దేవతల విగ్రహాలు నష్టములు, భ్రష్టములు అయిపోతున్నాయి. వెంటనే పరమదుఃఖితుడైన ముకుందుడు అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేశాడు. అతని ఇరువదిమంది శిష్యులూ కూడా, గురువుగారిలాగే తమ ప్రాణాలను అగ్నికి ఆహుతిగావించారు.

ముకుందుడొకప్పుడు ఆవుపాలతో బాటు పొరపాటున కొంత కొవ్వును కూడా తాగి వేశాడు. అందువల్ల నతడు మరుజన్మలో మ్లేచ్ఛ యోని నుండి పుట్టాడు. హుమయూను అజ్ఞాతంగా కాబూలు - కాశ్మీర సరిహద్దుల్లో తన సోదరుడైన మకరానుని వద్ద నున్న రోజుల్లో అతనికొక పుత్రుడు జనించాడు. అతడు పుట్టగానే ఆకాశవాణి, ‘ఈ బాలకుడు గొప్ప ప్రతాపవంతుడును, యశస్వియునై వర్ధిల్లగలడు’ అని శబ్దించింది. హుమయూన్ వెంటనే పరమానందభరితుడై ‘నాకు దేవతలు’ ‘అకస్మాత్తుగా నిచ్చిన ‘వరం’ కాబట్టి వీనిని ‘అకబర్’ అని పిలుస్తాను అన్నాడు. వీడు మ్లేచ్ఛ లేదా పిశాచమార్గంలోకి పోకుండా పెరిగి జీవించగలడు అని కూడా పలికాడు. అతని ఆశయాన్ని బలపరుస్తూ ఆకాశవాణి ఇలా పలికింది. ‘ఈ బాలకుడు పూర్వజన్మలో ముకుందుడను మహాసంపన్నుడైన బ్రాహ్మణ మహర్షి. నీ భాగ్యం కొద్దీ నీ ఇంట పుట్టాడు. కేశవ, శ్రీధర, శంభు, మాంధాతాది ఇరవైమంది ఇతని శిష్యులు కూడా జన్మించారు. వారంతా ఈ అక్బరు చక్రవర్తిని కలిసి అతని రాజ్యాన్నీ దానితోబాటు నీ పేరునీ చరిత్రలో నిలబెడతారు’ అని మరల పలికింది.

ఇటువంటి భవిష్యద్వాణిని విని, పరమ ప్రసన్నుడైన హుమయూను వెంటనే క్షుధా పీడితులకు అన్నమును ఇతర దానాలనూ గావించాడు. మ్లేఛ్ఛ భావాలకు దూరంగా వుంటూ పుత్రుని ప్రేమాతిశయంతో పెంచాడు. మరొక వంక తగిన సైన్యాన్నీ, బలగాన్నీ సమీకరించుకొని ఢిల్లీపై దాడిచేసి శేషశాకు నోడించి తానే మరల రాజ్యాధిపతి అయినాడు. తరువాత మూడేళ్ళకు హుమయూను కన్నుమూయగా అక్బరు రాజైనాడు. అప్పటికతని వయసు పదమూడేళ్ళు.

ముకుంద బ్రాహ్మణుడు (అక్బరు) రాజు కాగానే అప్పటికే పునర్జన్మ నొంది పెరిగిన అతని ప్రియ శిష్యులలో ఏడుగురు (కేశవుడు, మాధవుడు, మధువు, దేవాపి, సోమపుడు, సూర్యుడు, మదనుడు) ఆతని దర్బారులో కాలుపెట్టారు. కేశవుడు గానసేనునిగా (అంటే సంగీత్ సమ్రాట్ తాన్‌సేన్ గా ) ఉత్పన్నుడైనాడు. మాధవుడు అక్బరు కాలంలో వైజవాక్ (బైజూ బావ్రాగా) ప్రసిద్ధిచెందాడు. నాటిజన్మలోని మధు నేటి జన్మలో సర్వ సురాగజ్ఞాత ‘హరిదాసగాయకు’డైనాడు. ఈయన మధ్వాచార్య మతానుయాయియైన ప్రసిద్ధ వైష్ణవుడు కూడ. ముకుంద జన్మలోని దేవాపి అక్బరు జన్మలో వీరబలుడు లేదా బీర్బల్ నామంతో ఒక మేధావిగా మంత్రిగా వెలుగొందాడు. ఈయన పశ్చిమం నుండి వచ్చిన బ్రాహ్మణుడు. ఈయన నాలుకపై సరస్వతీదేవి నాట్యమాడేది. ఆనాడు గౌతమ వంశీయుడైన సోమపుడు ఈనాడు రాజా మాన్‌సింహ్ గా పుట్టి ఆర్యభూప శిరోమణి అక్బరుకి సేనాపతియైనాడు. తొలిజన్మలోని ముకుంద శిష్యుడైన సూర్యుడు మలిజన్మలో దక్షిణ దేశంలో బ్రాహ్మణ కుటుంబంలోనే జనించి బిల్వమంగళుడను పేరుతో పండితునిగా ప్రసిద్ధుడై అక్బరు మిత్రునిగా అతని దర్బారు నలంకరించాడు. ముందు జన్మలో ముకుంద శిష్యుడైన, తూర్పుదేశపు బ్రాహ్మణుడునైన మదనుడు మరుజన్మలో అక్బరు కాలంలో ‘చందల్‌గురు’గా ప్రసిద్ధుడైనాడు. ఈయన గొప్ప నర్తకుడు, నాట్యాచారుడు, రహఃక్రీడా విశారదుడు.

ఈ యేడుగురూ అక్బరు ఆస్థానంలోనే ప్రతిష్ఠితులు కాగా మిగతా పదముగ్గురూ అదే కాలంలో ఇతరేతర స్థానాల్లో వుండి జగత్ప్రసిద్ధులైనారు. శ్రీధరుడు పురాణ నిపుణుడైన తులసీ శర్మగా పుట్టి తులసీదాసుగా ప్రసిద్ధుడైనాడు. శ్రీపతి అక్బరు కాలంలో అంధకవి మహాత్మ సూర్‌దాస్ గా పుట్టి ప్రఖ్యాతిగాంచాడు. వీరిద్దరూ హిందీ సాహిత్యానికి రెండు కళ్ళు; సూర్యచంద్రులు రామానంద శిష్యుడై ప్రసిద్ధ విరక్త వైష్ణవుడై గోస్వామి తులసీదాసు రామాయణ గానం చేస్తే మధ్వాచార్య శిష్యుడై మహామతి సంపన్నుడై సూరదాసు కృష్ణలీలలను పాడి తరించాడు. ముకుంద శిష్యుడైన శంభుడు అక్బరు కాలంలో చంద్రభట్టుని కుటుంబంలో జనించి పెరిగి పెద్దవాడై హరిప్రియ నామంతో రామానంద మతానికి పెద్దగా పేరు పొందాడు. వరేణ్యుడను మరొక ముకుంద శిష్యుడు అగ్రఛుక్ అను సిద్ధునిగా మహాత్మునిగా జనించి పాలను మాత్రమే పుచ్చుకొని జీవించే పయహారీ సంప్రదాయానికి ప్రవక్తగా, జాతకరత్నగా చరిత్రలో నిలచిపోయాడు. ముకుంద శిష్యుడూ, జ్ఞాన - ధ్యాన పరాయణుడూ, భాషలో, చందశ్శాస్త్రంలో ప్రవీణుడూ, మహాకవీయైన మధు ప్రతి అక్బరు కాలంలో ‘కలిక’ నామంతో విఖ్యాతుడయ్యాడు. ధీమంతుడై, రామానంద మతంలో వరిష్ఠుడై పెరిగిన కలికుడు ‘రామలీలా’ యను ప్రశస్తమైన గ్రంథాన్ని రచించాడు. పూర్వజన్మలోని విమలుడు ఇపుడు దివాకర నామంతో ప్రసిద్ధ కవియై రామానంద మతానుయాయిగా, భగవతీ సీతపావన చరిత్ర అనే కావ్యరచయితగా చరిత్రలో స్థానాన్ని పొందాడు. అక్బరు కాలంలో కేశవుడను కవి కవిప్రియాది రచనలను చేసి మరణించి ప్రేతత్వాన్ని పొంది ఆ దశలో కూడా ‘రామజ్యోత్స్న’ అను అద్భుత గ్రంథాన్ని రచించి స్వర్గప్రాప్తి నొందాడు. ఈ మహామనీషి పూర్వజన్మలో ముకుందుని శిష్యుడైన దేవవాన్. ముకుంద శిష్యుడైన సోముడు వ్యాసదాసుడను పేరుతో అక్బరు కాలంలో పుట్టాడు. ఇతడు నింబాదిత్యుని అనుసరించాడు. ‘రహఃక్రీడా’ అనే గ్రంథాన్ని రచించి స్వర్గ ప్రాప్తి నొందాడు. మరొక ముకుంద శిష్యుడు, వర్ధనుడను పండితుడు మరుజన్మలో ‘చరణదాస్’ అనే పేరుతో విఖ్యాతుడైనాడు. ఆయన రైదాస్ అనుచరుడై, జ్ఞానమాలయను గ్రంథాన్ని రచించాడు. వర్తకుడను వేరొక శిష్యుడు ‘రత్నభానుని’గా జనించాడు. జైమిని భాషా రచయితయైన ఈయన రోపణ మతావలంబి. పూర్వజన్మలో రుచినామకుడీ జన్మలో ‘రోచను’నిగా జన్మించి మధ్వాచార్య మతాన్ని స్వీకరించి ఎన్నో భక్తిపాటలను, కవితలను ‘గానమయీ లీలా’ అనే శీర్షికతో రచించి స్వర్గస్తుడైనాడు. మాంధాతయను శిష్యుడిప్పుడు కాయస్థ గృహంలో ‘భూపతి’ నామంతో జనించి మధ్వమతాన్ని స్వీకరించి తన్మతాను సరణాభిజ్ఞుడై భాగవతానికి హిందీభాషలో ఒక సుందరానువాదాన్ని వెలయించాడు. ఆనాటి మానకారుడీనాడు స్త్రీగా, అదీ ‘మీరా’గా పుట్టాడు. మీరాబాయిగా ఎప్పటికీ కృష్ణభక్తుల నీరాజనాలందుకొంటూనే వుంటాడు.

అక్బరు యాబది సంవత్సరాలు నిష్కంటకంగా సామ్రాజ్యాన్ని పాలించి స్వర్గప్రాప్తి నొందాడు. అతని పుత్రుడు సలోమా లేదా సలీమ్ అనునాతడు ‘జహంగీర్’ అనే పేరుతో సింహాసనస్థుడయ్యాడు. అతడు తన తండ్రిలాగే పాలించాడు కాని అతని కొడుకు ఖుస్రో (షాజహాన్) పదేళ్ళే పరిపాలించగలిగాడు. అతనికి నలుగురు కొడుకులు. వారిలో మూడవవాడైన నవరంగ్ తండ్రినీ, అన్నదమ్ములనూ పరాజయం పాల్జేసి ఔరంగజేబు అనే బిరుద నామంతో సింహాసనాన్నెక్కి కూర్చున్నాడు. ఇతడు పూర్వజన్మలో అంధకుడను పేరుగల రాక్షసుడు. ఈ కర్మభూమికి దైత్యరాజు ఆదేశం మేరకు వచ్చి పడ్డాడు. అతడు చక్రవర్తి కాగానే వైదిక మతానికి చెందిన విగ్రహాలను నలుమూలలా వెతికించి మరీ ధ్వంసం చేయించాడు. ఈ దారుణాన్ని సహించలేక దేవతలు దుఃఖితులై శ్రీకృష్ణ చైతన్యుల వారి వద్దకు వచ్చి ‘హే భగవాన్! దైత్య రాజాంశ సంభూతుడైన ఒక చక్రవర్తి, ఔరంగజేబనువాడు మన దేవతామూర్తులనూ వేద గ్రంథాలనూ సర్వనాశనం చేస్తూ దైత్యపక్షాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. మీరే కాపాడాలి మన వైదిక ధర్మాన్ని’ అని అభ్యర్థించారు. (నిజానికి చైతన్య మహాప్రభువులకూ ఔరంగజేబుకూ మధ్య మూడు వందల సంవత్సరాల వార వుంది. దేవతలు చైతన్య పీఠాధిపతియైన అప్పటి కృష్ణచైతన్యుల వారి నాశ్రయించి వుంటారునుకోవాలి. కొందరు సాక్షాత్తు జగన్నాథ స్వామియే ఈ సమయంలో చైతన్యుల వారిగా అవతరించాడని విశ్వసిస్తారు.) చైతన్యులు ‘ఈ దురాచారి వంశం నశించాలిగాక’ అని శపించారు. ఈ దుష్టాత్ముడు నలభై తొమ్మిదేళ్ళు పరిపాలించాడు.

ఆ సమయంలో దేవపక్షాన్ని వృద్ధి చేయడానికి సేవాజయుడు (ఛత్రపతి శివాజీ) అను రాజు ఉదయించాడు. మహారాష్ట్రమున జనించిన ఆయన సకల యుద్ధ విద్యా విశారదునిగా ప్రఖ్యాతి గాంచాడు. ఆయన వచ్చి దురాచారియగు ఈ చక్రవర్తిని సంహరించి అతని కొడుకైన ఆలోమాను రాజును చేసి తన ప్రాంతానికి మరలిపోయాడు. ఆలోమా అయిదేళ్ళకే మరణించాడు. తాలన వంశం నుండి ‘ఫలరూషు’డను ఒక బలవంతుడైన మ్లేచ్ఛుడు ఢిల్లీపై దాడిచేసి ముకల (మొగల్) వంశీయులందరినీ చంపి తాను రాజయ్యాడు. అతడు పది సంవత్సరాలు రాజ్యం చేసి శత్రువుల కుట్రవల్ల మరణించాడు. అతని కొడుకైన మహమదు ఆ శత్రువులను తుదముట్టించి ఈ రాజ్యాన్ని ఇరవై యేళ్ళపాటు పరిపాలించాడు.

ఆ కాలంలోనే నాదర్ (ఫారస్ నివాసి నాదిర్షా దుర్రానీ) అను ఒక బందిపోటు ఈ దేశంలో జొరబడి ఆర్యులను గెలిచివారిలో కొందరిని చంపి అపార ధనరాసులను దోచుకొని ఖురజ్ (ఇరాన్) దేశానికి వెళ్ళిపోయాడు. మహామదు పుత్రుడు మహామత్స్యుడు తండ్రి తరువాత రాజైనాడు కాని దుష్టుడైన ఈ రాజును అయిదేళ్ళకే మహారాష్ట్రీయులు చంపివేశారు. మాధవుడను మహారాజు ఢిల్లీని మ్లేచ్ఛులను తరిమేసి పదేళ్ళదాకా పరిపాలించాడు. అప్పటికే దేశం చాలా చాలా ముక్కలై పోయింది. ముక్క కొకడు చొప్పున రాజులు బయలుదేరారు. మొత్తం భారతవర్షమంతా ఒకే దేశమనే భావన సన్నగిల్లింది. చక్రవర్తిగాని సమ్రాట్టుగాని ఎవరూ లేకపోవడంతో రాజులు అదుపు తప్పిపోయారు. చిన్న చిన్న మండలీకులు (తాలుక్ దారులు) అధికారాన్ని చలాయించసాగారు. ఇలా ముప్పదేళ్ళు గడిచింది.

కృష్ణచైతన్య మహాప్రభువులు దేవలోకాని కెగసి అప్పటికి నాలుగు వందల యాభై సంవత్సరాలైనా ఆయన మఠం అలాగే వుంది. ఆ మఠాధిపతి కృష్ణ చైతన్యులవారి వద్దకు దేవతలు కార్యార్ధులై వచ్చారు. ఆయన వారి కార్యాన్ని తెలుసుకొని ఒక ముహూర్తం సేపు సమాధి (ధ్యానసమాధి) లోనికి వెళ్ళి వచ్చి ఇలా అన్నారు. ‘పూర్వకాలంలో జగదేకవీరుడు, ధర్మవిగ్రహుడు నైన శ్రీరామచంద్రుడు రావణుని చంపి సుధావృష్టి ద్వారా వానరులను బ్రతికించాడు. వికట, వృజిల, జాల, బరలీన, సింహల, జవ, సుమాత్ర నామకులైన చిన్న చిన్న వానరులపట్ల ప్రసన్నుడై శ్రీరాముడు వారికీ ఈవిధంగా వరమిచ్చాడు. ‘ఆత్మబంధువులారా! రావణుని ద్వారా దేవాంగనలకు పుట్టిన కన్యలు మీకు భార్యలై మీ వంశాభివృద్ధికి తోడ్పడతారు. మీ పేర్లతో జలంధరుని ద్వారా ద్వీపాలు నిర్మింపబడతాయి. వాటికి మీరు రాజులవుతారు. నందినీ గోవు యొక్క కొవ్వు నుండి కొందరు మ్లేచ్ఛులు గురుండ నామంతో పుడతారు. మీరు వారిని గెలిచి శ్రేష్ఠరాజ్యాన్ని స్థాపిస్తారు. వారంతా హరికి నమస్కరించి ఆనందంగా ఆయా ద్వీపాలను చేరుకున్నారు. వికట ద్వీపం నుండి కొందరు శ్వేతవదనులైన గురుండులు వ్యాపార దృష్టితో ఆర్యా వర్తానికి వచ్చియున్నారు. వారి హృదయంలో ఈశపుత్రయను దేవుడు (ఏసుప్రభువు) వెలుగొందుతుంటాడు. ఆయన సత్యవ్రతి, కామజితుడు, క్రోధరహితుడు, సూర్యోపాసకుడు. మీరు వికటునికి తోడ్పడండి.’

దేవతలంతా ముందుగా సూర్యుని పూజించి ఆ తరువాత కలికతాయను పేరు గల రేవు పట్టణమునకు వచ్చి అదృశ్యరూపంలో అక్కడి పశ్చిమ ద్వీపరాజు వికటునికి సాయం చేశారు. అతని రాణి వికటావతి (విక్టోరియా) అష్ట కౌశల మార్గం (పార్లమెంటరీ వ్యవస్థ)ను స్థాపించి ప్రజారాజ్యాన్ని నెలకొల్పింది. సామాన్య ప్రజలకు కూడా రాజ్యపాలనలో పాత్రను పోషించే అవకాశాన్ని కల్పించింది. (ఈ తరహా పాలన అంతకుముందు భారతదేశంలో లేదనుకోవడం అజ్ఞానమే. ఎందుకంటే ‘రాముని యువరాజుగా చేస్తాను. నాకు అనుమతినివ్వండి’ అని దశరథుడు సర్వప్రజాప్రతినిధుల పరిషత్తులో అడిగినట్టు రామాయణంలో చెప్పబడింది. ప్రజల బాధ పడలేకనే ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి అర్ధరాజ్యమిచ్చినట్లు భారతంలో వుంది.)

వీరి వంశంలో ఏడుగురు రాజులు అరవై నాలుగేళ్ళవరకు పాలించిన తరువాత గురుండులలో ఎనిమిదవరాజు న్యాయపూర్వక శాసనం సాగుతున్న రోజుల్లో కలిపక్షీయుడైన బలిదైత్యుడు మురుడను పేరుగల మహా అసురుని దేవదేశం (అంటే మనదే) పైకి పంపించాడు. అతడు అప్పటి రాజైన వార్డిల్ ను వశపఱచుకొని ఆర్యధర్మాన్ని అంచెలంచెలుగా నాశనం చేయించసాగాడు. మూర్తులలో నిండిన దేవతలు అప్పటి కృష్ణచైతన్య స్వామి నాశ్రయించగా ఆయన మురాది అసురులను, తన్మార్గగాములను శపించాడు. ఒక యేడాది లోపలే, కాలప్రచోదితులై, గురుండులలో మురానుచరులు సేనలతో సహా నాశనమై పోయారు. ఆ తరువాత తొమ్మిదవ వీరుడు, శిక్షా పండితుడునగు మేకలుడు (అనగా లార్డ్ మెకాలే) అను గురుండుడు భారత్ వచ్చాడు. అతడు న్యాయపూర్వకంగా పన్నెండు సంవత్సరాలు రాజ్యం చేసిన తరువాత పదవ లార్డల్ (లార్డ్ వేవెల్) అను విఖ్యాత గురుండుడు ముప్పది రెండేళ్ళు ధర్మపూర్వకంగా రాజ్యం చేశాడు.

కొన్ని శతాబ్దాల క్రిందట మకరంద కులోత్పన్నులైన ఆర్యులు, తదనంతరం హిమతుంగ నివాసులైన మౌనులు రాజ్యం చేశారు. వీరు బౌద్ధులు, బభ్రువర్ణులు, గుండ్రటి చిన్నముక్కులవారు, పొడవైన బుర్రలు గలవారు. లక్షల సంఖ్యలో వలస వచ్చి ఢిల్లీ చేరుకున్నారు. వారి నాయకుడు ఆర్జికుడు. అతడు ఢిల్లీ ప్రాంతానికి రాజయ్యాడు. అతని కొడుకు దేవకర్ణుడు. గంగోత్రి గిరి శిఖరంపై, రాజ్యవృద్ధి కోసం, పన్నెండేళ్ళ కాలం ఘోర తపస్సు చేశాడు. ఆ బుద్ధిమంతుని తపస్సుకి ప్రసన్నయై భగవతిగంగ అతనికి దర్శనమిచ్చింది. తపఃఫలితంగా కుబేరుడతనికి ఆర్యమండలీక పదవిని ప్రదానం చేశాడు. తదనంతరం మండలేశ్వర దేవకర్ణుడు అరవై సంత్సరాలు మహీతలంపై ప్రజాపాలన గావించాడు. అతని వంశంలో ఎనమండుగురు దేవపూజకులైన రాజులు రెండువందల సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. పదకొండవ మౌనవంశరాజు పేరు పన్నగారి. అతడు నలభై సంవత్సరాలు రాజ్యం చేసి పన్నగుల ద్వారా మృత్యుప్రాప్తి నొందడంతో మౌనరాజ వంశం అంతరించిపోయింది.

వీరి తరువాత నాగవంశీయులు, ఆంధ్ర వంశీయులు, కౌసలేయులు, నైషధులు, సౌరాష్ట్ర, గుర్జర దేశీయులు పెక్కేండ్లు పరిపాలించారు. కలిపురుషుడే స్వయంగా గుర్జరదేశంలో ఆభీరీ, సింహికా దంపతులకు పుత్రునిగా రాహువను పేర జన్మించాడు. అమృతమయుడైన దేవతామూర్తిని ఏవిధంగానైతే సింహిక కొడుకైన రాహువు ఆకాశంలో పీడిస్తాడో అదేవిధంగా పుడమిపై దేవతలను హింసించడానికి ఈ రాహువు పుట్టుకొచ్చాడు.

ఇతడు పుట్టగానే చాలాచోట్ల భయంకరమైన భూకంపాలు వచ్చాయి. అన్ని విపరీత గ్రహాలూ కూటములుగానేర్పడి భయంకర ఉత్పాతాలను, తద్వారా జాతికంతటికీ దుఃఖాలను కలిగించాయి. దేవతలంతా భయ విహ్వలులై మూర్తుల నుండి తమ తమ అంశలను ఉపసంహరించుకొని సుమేరు పర్వత శిఖరంపై నున్న మహేంద్రుని శరణు జొచ్చారు. అక్కడ వారంతా కలిసి జగన్మాత జగదంబికను స్తుతించారు. కన్యా మూర్తి, కల్యాణకారియైన ఆ దేవి ప్రత్యక్షమై ‘దేవతలారా! మీకిక ఆకలిదప్పులు కలుగకుండా వరమిస్తున్నాను’ అని ప్రకటించి అంతర్ధానం చెందింది.

ఆభీరీ పుత్రుడైన రాహువు వందేళ్ళపాటు పుడమిని పాలించి ప్రాణత్యాగం చేసి కలిపురుషునిలో కలిసిపోయాడు. అతని వంశంలో రెండువందల యాభైమంది రాజులు పదివేలయేళ్ళపాటు రాజ్యపాలనం చేశారు. క్షీణించిపోయిన మహామదు మతాన్ని పునరుద్ధరించారు. అందరూ మ్లేచ్ఛులై పోయారు. అప్పట్లో కలియుగంలో వేదాధ్యయనం లేదు, వర్ణవ్యవస్థ లేదు, దేవతలూ లేరు. ఏ మర్యాదా, కట్టుబాటూ లేవు. అప్పుడు శేషించిన బ్రాహ్మణులు అర్బుద శిఖరంపైకి పోయి పన్నెండేళ్ళపాటు దేవతారాధనను పరమదీక్షా పరులై చేశారు. వారి తపఃఫలంగా అర్బుద శిఖరంపై ఖడ్గధారీ, అమిత తేజస్వీయైన క్షత్రియపురుషుడు ఉదయించాడు. అతని పేరు అర్వబలి. అతడు భయంకరులైన మ్లేచ్ఛులతో తలపడివారిని గెలిచి అయిదు యోజనాల వైశాల్యంలో భూమిపై ‘అర్వపురి’ని నిర్మించాడు. తానే శాసకునిగా అక్కడ పరిపాలనను చేపట్టి వైదిక మతాన్ని బతికించే ప్రయత్నం చేయసాగాడు. మెల్లమెల్లగా దేశం విడిచి అడవులలోకో, కొండలపైకో పోయిన ఆర్యులంతా తిరిగి వచ్చి అక్కడ నివసించసాగారు. ఆర్యవర్ణాలు వృద్ధి చెందాయి. అర్వబలి అర్ధశతాబ్ద కాలం రాజ్యం చేశాడు. అతని వంశంలో రెండువందల యాభైమంది రాజులు పదివేల సంవత్సరాలపాటు పాలించారు. ఆ తరువాత మరల వైదికాచార విద్వేషకులు బయలుదేరారు. వీరు వర్ణ సంకరం ద్వారా ఈ జాతి, మతాలను నాశనం చేయ సమ కట్టారు. ఈ మ్లేచ్ఛ మిత్రులు మ్లేచ్ఛ కన్యలను వివాహమాడి ఒక శతాబ్దంలోపలే ఆర్యమార్గానుగాములను బలహీనపఱచారు. అప్పుడు మధ్యదేశస్థులైన ఒక లక్షమంది మ్లేచ్ఛులు ఆర్యరాజులతో భయంకరమైన యుద్ధం చేశారు. మహాబలశాలులైన మ్లేచ్ఛులు తమ పరాక్రమానికి కొంత మాయను, మరికొంత మోసాన్ని, ఇంకొంత మిత్రభేదాన్ని కూడా జోడించ గలగడంతో ఆర్యరాజులపై తిరుగులేని విజయాన్ని సాధించి భూమినంతటినీ మ్లేచ్ఛమయం చేశారు. అంత భూమి అలక్ష్మికి నిలయమైపోయింది.