(బ్రాహ్మపర్వం, 20వ అధ్యాయములో అశూన్యశయన వ్రతమింకొకటి చెప్పబడింది - అను)
ధర్మరాజా! ఒకప్పుడు యమున తన సోదరుడైన యమునికి కార్తిక శుద్ధ విదియనాడు తన ఇంట్లో అద్భుతమైన ఆత్మకింపైన భోజనం పెట్టింది. అప్పుడు యముని ముఖంలో కనిపించిన అనిర్వచనీయ అసీమిత ఆనందాన్ని చూసి యమలోకవాసులు ఒక గొప్ప పండుగను చేసుకున్నారు. నాటినుండి ఈ తిథికి పరమ ప్రాచుర్యమేర్పడింది ఈ తిథికి యమద్వితీయ అనే పేరు కూడా వచ్చింది.
ఆ రోజు అన్నదమ్ములు తమ ఇంటిలో కాకుండా అక్క లేదా చెల్లెలి గృహంలో ప్రేమ పూర్వకంగా ఆమె చేతివంటను భోంచేయాలి. స్వంత సోదరి లేనివారు చిన్నాన్న, పెదనాన్నల కూతుళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆరోజు సోదరి చేతి అన్నంతిన్న పురుషునికి ధన, యశ, ఆయు, ధర్మ, అర్థ, అపరిమిత సుఖప్రాప్తి కలుగుతుంది.”
“పరంధామా! సర్వధర్మాలకూ ఆలంబనం గృహస్థాశ్రమమేనని మీలాటి పెద్దలు చెప్పగా విన్నాను. మరి ఈ ఆశ్రమం స్త్రీ పురుష యుగ్మ ప్రతిష్ఠితం కదా! పత్నిలేని పురుషుడు, పురుష హీన స్త్రీ ధర్మాది సాధనాలను సంపాదించుకోవడానికి సామర్థ్యం లేని వారైపోతారు కదా! వారెంత ధనవంతులైనా ఈ చింత తప్పదు. కాబట్టి అసలు దాంపత్య వియోగమే కలుగకుండా యేదైనా వ్రతమున్నదా?”
“ఉన్నది ధర్మజా! శ్రావణ బహుళ తదియనాడు చేయవలసిన అశూన్య శయన వ్రతమొకటుంది. దీనిని ఆచరించే స్త్రీ విధవ కాబోడు; పురుషుడు విధురుడు కాబోడు. ఈరోజు విష్ణుదేవుని లక్ష్మీ సమేతంగా శయ్యపై నుంచి అనేకోపచారాల ద్వారా పూజించుకోవాలి. ఉపవాసంగాని నక్తవ్రతంగాని అయాచితవ్రతంగాని పాటించి పెరుగు, అక్షతలు, కందమూలాలు, ఫలపుష్ప జలాదులను బంగారు గిన్నెలో నుంచి క్రింది మంత్రాన్ని చదువుతూ చంద్రునికి అర్ఘ్యమివ్వాలి.
గగనాంగణ సంభూత దుగ్ధాబ్ధి మథనోద్భవః
భాభాసితదిగాభోగ రామానుజ నమోఽస్తుతే॥
ఇలా నాలుగు మాసాలపాటు ఈ వ్రతాన్నాచరించిన వానికి ఎన్నటికీ స్త్రీ వియోగ ముండదు. అన్ని ప్రకారాల ఐశ్వర్యాలూ కలుగుతాయి. భక్తిపూర్వకంగా ఈ వ్రతాన్ని చేసిన స్త్రీకి మూడు జన్మలదాకా వైధవ్యం రాదు; దౌర్భాగ్యముండదు.
సర్వకామనలనూ సంతృప్తిపఱచి ఉత్తమ భోగాలనిచ్చే వ్రతమిది.”