భవిష్య పురాణము

34 - శాంతి వ్రతం

మహారాజా! పంచమీ కల్పంలో నొక శాంతి వ్రతం చెప్పబడింది. దానినాచరించిన గృహస్థు జీవితం నిండా శాంతి పఱచుకొని వుంటుంది. దీనిని కార్తిక శుద్ధపంచమినాడు మొదలుపెట్టాలి. నాటి నుండి ఒక యేడాది దాకా పుల్లని పదార్ధములను తినరాదు. ఆ నక్తవ్రతం చేసి శేషశయనుడైన విష్ణుభగవానుని పూజించాలి. ప్రతిమనుగాని ఏ ఇతర విష్ణు స్వరూపాన్ని గాని ఎదురు పెట్టుకొని ఈ క్రింది మంత్రాలతో సర్వాంగ పూజనం చేయాలి.

ఓం అనంతాయనమః, పాదౌ పూజయామి

(అంటూ పాదాలను, అలాగే మిగతా అంగాలను పూజించాలి.)

ఓం ధృతరాష్ట్రాయ నమః, కటింపూజయామి

ఓం తక్షకాయ నమః, ఉదరం పూజయామి

ఓం కర్కోటకాయ నమః, ఉరః పూజయామి

ఓం పద్మాయనమః, కర్ణౌ పూజయామి

ఓం మహాపద్మాయ నమః, దోర్యుగం పూజయామి

ఓం శంఖ పాలాయ నమః, వక్షః పూజయామి

ఓం కులికాయ నమః, శిరః పూజయామి

తరువాత మౌనంగా విష్ణుభగవానునికి పాలతో స్నానం చేయించాలి. పాలు, తిలలతో హవనం చేయాలి. ఏడాది పూర్తయిన తరువాత నారాయణుని, శేషనాగుని సువర్ణ ప్రతిమలను వేయించి వాటిని పూజించి బ్రాహ్మణునకు దానం చేయాలి. ప్రతిమలతో బాటు ఒక ఆవునూ, దాని దూడనూ, పాయస పూర్ణ కాంస్య పాత్రనూ, రెండు వస్త్రాలనూ, యథాశక్తి, మరింత సువర్ణాన్నీ కూడా దానంచేయాలి. తరువాత బ్రాహ్మణులకు భోజనాన్ని పెట్టి వ్రత సమాప్తి గావించాలి. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసిన వ్యక్తికి నిత్య శాంతి ప్రాప్తిస్తుంది, సర్వభయమూవుండదు.”