141 - శాంతిక పౌష్టిక కర్మలు మరియు నవగ్రహ శాంతి

“శ్రీకృష్ణ చంద్రా! సంపూర్ణ కామనల అవిచలసిద్ధి కోసం శాంతిక, పౌష్టిక కర్మలను ఏ ప్రకారంగా చేయాలో శలవివ్వండి” అని అడిగాడు ధర్మరాజు.

“ధర్మనందనా! సిరిని కోరుకొనేవారుగాని శాంత్యభిలాషులు కాని పుష్టి కావలసిన వారుగాని వృష్టి దీర్ఘాయు రిచ్ఛగలవారుగాని సమారంభం వెంటనే చేయవలసినది గ్రహయజ్ఞాన్ని. సంపూర్ణ శాస్త్రాలూ వేదాలూ ఈ విషయాన్ని నొక్కి వక్కాణిస్తాయి. దీనికి జ్యోతిష్యుని ద్వారా శుభముహూర్తం, బ్రాహ్మణుల ద్వారా స్వస్తి వాచనం, గ్రహాధిదేవుల స్థాపనం ముందుగా అవసరం. హవనం ప్రారంభించాలి. పురాణ, శ్రుతి జ్ఞాతులైన విద్వాంసులు మూడు రకాల గ్రహయజ్ఞాలను పేర్కొన్నారు. మొదటిది పదివేల ఆహుతులున్న అయుత హోమం, రెండవది లక్ష ఆహుతులు గల లక్ష హోమం మూడవది కోటి ఆహుతులతోడి కోటి హోమం. పదివేల ఆహుతుల గ్రహయజ్ఞాన్నే నవగ్రహ యజ్ఞమంటారు. దీనికై యజమాన మండప నిర్మాణం తరువాత హవన కుండానికి పూర్వోత్తర దిశలో ఒక వేదిని నిర్మించాలి. అది రెండు బీతాల పొడవు, అంతే వెడల్పు, ఒక బీతా ఎత్తును కలిగి రెండు పరిధులతో సుశోభితమై చతురస్రాకారంలో వుండాలి. అది ఉత్తరాభిముఖమై వుండాలి. ముందు కుండంలో అగ్నిని స్థాపించి ఆవేదిపైకి దేవతలను ఆవాహనం చేయాలి. ఇలా దానిపై ముప్పది ఇద్దరు దేవతలను స్థాపించాలి.

సూర్యుడు, చంద్రుడు, మంగళుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు - ఇవి ప్రజలకు హితాన్ని కలిగించే గ్రహాలుగా చెప్పబడ్డాయి. ఈ గ్రహాల ప్రతిమలను క్రమంగా (తొమ్మిది గ్రహాలకీ ఆరు ప్రతిమల ద్రవ్యాలే ఇవ్వబడ్డాయి.) రాగి, స్ఫటికం, రక్తచందనం, బంగారం, వెండి, ఇనుములతో చేయించాలి. తెల్లబియ్యం వేది మధ్యలో సూర్యునీ, దక్షిణంలో మంగళునీ, ఉత్తరంలో బృహస్పతినీ, పూర్వోత్తర కోణంలో బుధునీ, తూర్పులో శుక్రునీ, దక్షిణ పూర్వకోణంలో చంద్రునీ, పశ్చిమంలో శనినీ, పశ్చిమ దక్షిణ కోణంలో రాహువునీ, పశ్చిమ ఉత్తర కోణంలో కేతువునీ స్థాపించాలి. ఈ గ్రహాలకి అధిదేవత లుంటారు. సూర్యునికి శివుడూ, చంద్రునికి పార్వతీ, మంగళునికి స్కందుడూ, బుధునికి విష్ణువూ, బృహస్పతికి బ్రహ్మ శుక్రునికి ఇంద్రుడూ, శనైశ్చరునికి యముడూ, రాహువుకి కాలుడూ, కేతువుకి చిత్రగుప్తుడూ అధి దేవతలుగా పరిగణింపబడుతున్నారు. అలాగే క్రమంగా అగ్ని, జలము, పృథ్వి, విష్ణువు, ఇంద్రుడు సౌవర్ణ దేవత, ప్రజాపతి, సర్పము, బ్రహ్మ వీటికి ప్రత్యాధిదేవతలైనారు. వీరేకాక వినాయకుడు, దుర్గ, వాయువు, ఆకాశం, సావిత్రి, లక్ష్మి, ఉమ వారి పతిదేవతలతో బాటు అశ్వినీ కుమారులు - వీరికి కూడ వ్యాహృతులను ఉచ్చారణపూర్వకంగా ఆవాహనలు చేయాలి. ఆ సమయంలో మంగళ సహితుడైన సూర్యునికి ఎఱ్ఱరంగూ, చంద్రునికీ శుక్రునికీ తెలుపులోనూ, బుధునికీ బృహస్పతికీ పసుపురంగులోనూ, శనికీ రాహువుకీ నలుపులోనూ, కేతువుకి ధూమ్ర వర్ణంలోనూ వున్న పూజా ద్రవ్యాలను వేస్తూ ధ్యానం చేయాలి. అందరికీ ఆయా రంగుల వస్త్రాలను సమర్పించి సుగంధిత ధూపాలనివ్వాలి. ఫలాలను కూడా సమర్పించిన పిమ్మట నైవేద్యాలుగా సూర్యునికి బెల్లపు పరమాన్నమునూ, చంద్రునికి నెయ్యితో పాలతో చేసిన వంటకాన్నీ, మంగళునికి కజ్జికాయలనూ, బుధునికి పాలలో చెఱకురసంలో ఉడికించిన అన్నాన్నీ, బృహస్పతికి పెరుగుతో చేసి ఉప్మానీ, శుక్రునికి నేతి ఉప్మానీ, శనైశ్చరునికి అన్నీ కలిపిన కిచిడీనీ, రాహువుకి అజశృంగీలతనూ పండునూ కలిపిన వంటకాన్నీ, కేతువుకి విచిత్రమైన రంగుల్లో ఉప్మానీ సమర్పించాలి.

వేదికి పూర్వోత్తరకోణంలో ఛిద్రరహితమైన ఒక కలశను స్థాపించి దానిపై పెరుగుతో అక్షతలతో సుశోభితమైన మామిడి చిగురాకును వుంచి రెండు వస్త్రాలతో చుట్టి పండ్ల మధ్య వుంచాలి. అందులో పంచరత్నాలనుంచి పంచభంగాలను అనగా రావి, మఱ్ఱి, దోస, అత్తి, మామిడి చిగురాకులను దాని క్రింద పరవాలి. దానిలోకి పవిత్ర జలాన్ని పోస్తూ గంగాది నదులను, వరుణదేవుని, సముద్ర, సరోవరాదుల జలాలను ఆవాహన చేయాలి.

ధర్మజ్ఞుడైన పురోహితునిచే గజశాల, అశ్వశాల, కూడలి, పుట్ట, నదీ సంగమ, కుండం, గోశాలల నుండి మట్టిని తెప్పించి దానిని సర్వౌషధీ జలాలచే అభిషేకింపజేసి యజమానుని స్నానానికి అక్కడ పెట్టించాలి. ఆ పురోహితుడే మంత్ర సహితంగా ‘యజమానుని పాప నాశమునకై అన్ని సముద్రాలు, నదీ నదాలు, మేఘాలూ, సరోవరాలూ జలరూపంలో ఇక్కడికి దయ చేయాలి’ అంటూ ఆయా దేవతలను ఆవాహన చేయాలి.

తరువాత నెయ్యి, గోధుమలు, బియ్యం, నువ్వులతో హవనాన్ని ప్రారంభించాలి. గ్రహాలకు క్రమంగా మదార, పలాశ, కాచు, ఉత్తరేణి, రావి, గూలర, శమీ, గరిక, కుశలనే సమిధలుగా వాడాలి. ప్రతి గ్రహానికీ తేనె, నెయ్యి, పెరుగు లేదా పాయసంతో నూట యెనిమిది లేదా ఇరవై యెనిమిది ఆహుతులివ్వాలి. సమిధలు చిటికెన వేలంతగానీ చూపుడు వేలంతగానీ వుండాలి. కన్నాలు, బొడిపెలు, ఆకులు వుండకూడదు. పరమార్థ వేత్తయైన యజమానుడు అందరు దేవతల మంత్రాలను ఎవరికి ఆహుతులిస్తున్నపుడు వారి నుద్దేశించి మందస్వరంతో ఉచ్చరిస్తూ సమిధలను హవనం చేయాలి. బ్రాహ్మణులు ఈ మంత్రాలను చదువుతూ ఈయీ దేవతలకు ఆహుతులివ్వాలి.

మంత్రం                 వేదంలో సంఖ్య        దేవత

                                    యజుర్వేదంలోనే

ఆకృష్ణే నరజసాం       33/43                        సూర్య

ఇమందేవాం              9/40                           చంద్ర

అగ్నిర్మూర్ధాం              13/14              మంగళ

ఉద్భుధ్య స్వం              15/14              బుధ

బృహస్పతే అతిం        26/3                           బృహస్పతి

అన్నాత్పరిం                19/75             శుక్ర

శంనోదేవీరభిష్టయం 36/12                        శని

కయానశ్చిత్రం            27/39                        రాహు

కేతుం కృణ్వన్ం          29/37                        కేతు

చరు మున్నగు హవనీయ పదార్థాలలో నేతిని కలిపి మంత్రోచ్ఛారణ పూర్వకంగా హవనాలు చేసి వ్యాహృతులనుచ్చరిస్తూ నేతితో పది ఆహుతులను అగ్నిలో వేయాలి. తరువాత శ్రేష్ఠుడైన బ్రాహ్మణుని ఉత్తరాభిముఖంగా కాని పూర్వాభిముఖంగా కాని కూర్చుండబెట్టి ఆయనచేత ప్రతియొక్క దేవతకూ మంత్రోచ్చారణ పూర్వకంగా చరు ఆది పదార్థాలను హవనం చేయించాలి.

తరువాత క్రింది వేదమంత్రాలతో మరికొందరు దేవతలకు హవనాలు చేయించాలి.

మంత్రం                                   వేదంలో సంఖ్య                 దేవత

                                             యజుర్వేదంలోనే

ఆవోరాజానమధ్వరస్య రుద్రం            ఋం 4/3/1                             రుద్ర

                                              కృష్ణయజుం తైంసం 1/3/24/1

ఆపోహిష్ఠాం                                      వాజసం సం 11/50                ఉమ

            స్యోనాం                                  (ఇవ్వబడలేదు)                        కార్తికేయ

ఇదం విష్ణుర్విం                                   యజుం 5/15             విష్ణు

తమీశానం                                         వాజసం 25/17                      బ్రహ్మ

ఇంద్రమిద్దేవతాయం                         (ఇవ్వబడలేదు)                        ఇంద్ర

ఆయంగౌః                                          యజుం 3/6                           యమ

బ్రహ్మజ జ్ఞానం                                    యజుం13/3              కాల

అగ్నిందూతం వృణీమహేం               ఋక్సం 1/12/1                        అగ్ని

ఉదుత్తమం వరుణ పాశం                 ఋక్సం 1/14/15                      వరుణ

పృథివ్యంతరిక్షం                                 (ఇవ్వబడలేదు)                        పృథ్వి

సహస్రశీర్షాపురుషః                           వాజసం సం 31/1                   విరాడ్రూపం

హవనాలివ్వడం పూర్తయినాక నలుగురు బ్రాహ్మణులు తూర్పుకి గాని ఉత్తరానికిగాని అభిముఖముగా కూర్చొని అభిషేక మంత్రాల ద్వారా సిద్ధం చేసిన కలశ నుండి జలంతో యజమానికి అభిషేకం చేస్తూ దేవతలను ఇలా ప్రార్థించాలి. ‘బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా! మీరు ఈ యజమానిని అభిషేకించాలి. జగదీశ్వరా, వసుదేవ నందన శ్రీకృష్ణా! సామర్ధ్య శీలీ, సంకర్షణా, బలరామా! ప్రద్యుమ్న, అనిరుద్ధులారా! మీరంతా మా యజమానికి సర్వత్ర విజయాన్ని కలిగించాలి. ఇంద్రాది దిక్పాలక గణములారా! మీరంతా ఈయనను రక్షిస్తుండాలి. కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, మతి, బుద్ధి, లజ్జ, శాంతి, కాంతి, తుష్టి యను పేర్లతో విరాజిల్లు దేవీమతల్లులారా! వచ్చి ఈ యజమానుని అభిషేకించండి. నవగ్రహములుగా పేరొందిన మహాదేవ మూర్తులారా! మీరును మా యజమానునభిషేకించండి. దేవ, దానవ, గంధర్వ, యక్ష, రాక్షస, సర్ప, ఋషి, గౌ, దేవమాతా, దేవపత్నీ, వృక్ష, నాగ, దైత్య, అప్సర, అస్త్ర, శస్త్ర, నృప, వాహన, ఔషధ, రత్న, కాల, నదీనద, సాగర, పర్వత, తీర్థ, మేఘ గణములారా! ఈ యజమానుని అన్ని కోరికలు సిద్ధించాలని, సంపూర్ణ కామనల సిద్ధి కావాలని ఆశీర్వదిస్తూ అభిషేకించండి.’

ఈ ప్రకారం సర్వౌషధీ జల స్నానం పూర్తయిన తరువాత యజమాని పత్నితో సహా శ్వేతవస్త్రాలు ధరించి, తెల్లచందనాన్ని పూసుకొనివచ్చి ప్రశాంత చిత్తుడై ఋత్విజులకు దక్షిణలిచ్చి ఆ తరువాత సూర్యుని కోసం కపిల గోవునూ, చంద్రునికి శంఖాన్నీ, మంగళునికై ఎద్దునీ, బుధునిపేరిట బంగారాన్నీ, బృహస్పతి నామంతో ఒక జత పీతాంబరాలనూ, శుక్రుని పేర శ్వేతాశ్వాన్నీ, శనికి నల్లావునీ, రాహువుకేదైనా ఇనుప వస్తువునీ, కేతువు కోసమై ఉత్తమమైన మేకనీ దానం చేయాలి. యజమానుడు దక్షిణగా వీలైనంత సువర్ణాన్నే ఇవ్వాలి. ఆచార్యుని సంప్రదించి ఆయన ఏ రూపంలో బంగారాన్నిమ్మంటే ఆ రూపంలోనే మంత్రోచ్చారణ పూర్వకంగా దానం చేయాలి.

తాను దాన మిస్తున్న ప్రతి వస్తువునీ వేరు వేరుగా పేరు పేరునా ఇస్తున్నప్పుడు యజమాని ఈ విధంగా ప్రార్థించాలి.

‘ఓ కపిలగోవా! నీవు రోహిణీ రూపానివీ సర్వదేవతలూ అన్ని తీర్థాలూ నీ రూపాలే. అందరు దేవతలకూ పూజనీయమైన నీవు నాకు శాంతిని ప్రసాదించు. శంఖమా! నీవు పుణ్యాలకే పుణ్యానివి, మంగళాలకే మంగళానివి. విష్ణువు చేతిలో వెలుగొందే నీవు నాకు శాంతిని ప్రసాదించు. జగత్తుకి అన్నాన్నీ ఆనందాన్నీ ఇచ్చే వృషభమా! ధర్మమూర్తి, అష్టమూర్తియునగు శివమహాదేవుని వాహనమైన నీవు నాకు శాంతిని ప్రసాదించు. సువర్ణమా! నీవు బ్రహ్మయొక్క ఆత్మస్వరూపానివి, అగ్నిలోని స్వర్ణమయ బీజానివి, అనంత పుణ్యప్రదాతవి. నాకు శాంతిని ప్రసాదించి కరుణించు. పీతాంబరమా! నిజానికి నీవు ప్రీతాంబరానివి. శ్రీకృష్ణుని దేహవర్తివి. నాకు శాంతిని ప్రదానించు. అశ్వమా! నువ్వు అశ్వరూపంలో నున్న విష్ణువువి. అమృతం నుండి పుట్టి, సూర్యచంద్రులంతటి వారికి నిత్య వాహనమైనదానవు. నాకు శాంతిని ప్రసాదించు. అమ్మా పృథ్వీ! నీవు సమస్తధేను రూపివి, వసుంధరవి, శ్రీకృష్ణునికే ఇష్టురాలవు. నన్ను కరుణించి శాంతిని ప్రసాదించు. లోహమా! విశ్వంలో అస్త్రాల నుండి నాగళ్ళదాకా నీవుంటేనే వుంటాయి. విశ్వానికి వీరత్వాన్నీ అన్నాన్నీ సుఖాన్నీ ఇచ్చే నీవు నాకు శాంతిని ప్రసాదించాలి. సంపూర్ణ యజ్ఞానికి ముఖ్యాంగముగా నిరూపితమైన, అగ్నిదేవుని వాహనమైన మేక నాకు శాంతిని ప్రసాదించాలి గాక! రత్నాలలో సమస్త దేవతలూ నివాసముందురు. నేను రత్నాలను దానమిచ్చేటప్పుడు ఆ దేవతలంతా నాయందు దయవుంచి నాకు శాంతిని ప్రదానం చేయాలిగాక!

ధర్మజా ఇప్పుడు చిత్రప్రతి మాది విధానాలలో గ్రహాల స్వరూపం ఎలా వుండాలో వర్ణిస్తాను. సూర్యభగవానుడు కమలాసనంపై వుండాలి. ఆయన రెండు చేతులలోనూ ఒక్కొక్క కమలం వుండాలి. ఏడు గుఱ్ఱాల రథారూఢుడై వుండాలి.

చంద్రుడు గౌరవర్ణుడు. తెల్లబట్టలు, తెల్లగుఱ్ఱం, తెల్లటి భూషణాలు వుండాలి. ధరణీ నందనుడైన భౌముడు చతుర్భుజుడు. మూడుచేతుల్లో కత్తీ, డాలూ, గదా వుండగా నాలుగో చేయి వరద ముద్రను ధరించి వుంటుంది. ఆయన శరీరకాంతి గన్నేరుపూచాయలో వుండాలి. ఆయన ఎఱ్ఱబట్టలు కట్టుకుంటాడు. ఎఱ్ఱపూమాల ధరిస్తాడు.

బుధుడి పూలూ బట్టలూ పసుపు పచ్చవే. పచ్చ చందనాన్ని పూసుకుంటాడు. దివ్య కాంచన రథంపై వుంటాడు. బృహస్పతి, శుక్రుల ప్రతిమలకు క్రమంగా పచ్చని, తెల్లని బట్టలూ, పూలమాలలూ వుంటాయి. ఇద్దరూ చతుర్భుజులు. ఇద్దరూ దండాన్నీ, రుద్రాక్ష మాలనీ, కమండులువునీ, వరముద్రనీ ధరించేవారే. శనైశ్చరుని శరీరకాంతి ఇంద్ర నీలమణితో తుల్యము. ఆయన వాహనం గ్రద్ద. ధనుర్బాణాలూ, త్రిశూలమూ ధరించి వుంటాడు. వరముద్రాహస్తుడు. రాహువు ముఖము సింహంలా భయంకరంగా వుంటుంది. అతని చేతుల్లో కత్తి, కవచం, త్రిశూలం, వరముద్రా వుంటాయి. నీలిరంగు సింహాసనంపై కూర్చుని వుంటాడు. కేతువు శరీరాదులు ధూమ్రవర్ణంలో వుండాలి. ముఖం వికృతంగా వుండాలి. రెండు చేతులలో నొకటి గదను ధరించగా మరొకటి వరముద్రలో వుండాలి. నిత్యం గ్రద్దపైనే వుంటాడు. ఈ గ్రహాలన్నీ కిరీటాలను ధరించి వుండాలి. ప్రతిమ ఎత్తు ఎనిమిదంగుళాలు అనగా నాలుగున్నర హస్తాలుండాలి.                                                              (ఇది చింత్యము)

హే పాండునందనా! విద్వాంసులైన వారు ఇపుడు నేను వర్ణించిన పద్ధతిలోనే నవగ్రహాల ప్రతిమలను నిర్మించి అలంకరిస్తారు. పైవిధంగా నవగ్రహపూజలను గావించిన వారికి ఈలోకంలో సమస్త వాంఛలూ తీరగా దేహాంతంలో స్వర్గలోకంలో ప్రతిష్ఠితులౌతారు. నిర్దనుడైన పురుషుని ఏదైనా ఒక గ్రహం బాధిస్తుంటే అతడు ఒక గ్రహానికే యత్న పూర్వకంగా విశేష పూజలను చేసి మిగతా వాటికి భక్తిగా నమస్కరించి అర్చన చేసి ఆపవచ్చును. ఎందుకంటే గోవులు, గ్రహాలు, రాజులు, బ్రాహ్మణులు తమను పూజించిన వారిని రక్షిస్తారు. వీరిని అవహేళన చేసినవారు భస్మమై పోతారు.

వైభవాభిలాష ఉన్నవారు దక్షిణలివ్వకుండా యజ్ఞం చేయరాదు. స్తోమతుకి తగినట్లుగా యజ్ఞ దక్షిణలిచ్చు వానిని చూసి యజ్ఞ ప్రధాన దేవతలు కూడా ఆనందిస్తారు.

నవగ్రహ యజ్ఞంలో పదివేల ఆహుతుల హవనాలుంటాయనుకున్నాం కదా! అలాగే పెండ్లి, ఉత్సవం, యజ్ఞం, దేవప్రతిష్ఠాది కర్మలకూ, మానసిక బాధలనూ, ఆకస్మిక విపత్తులనూ తొలగించే పూజలకూ కూడా పదివేల ఆహుతులీయవలసిన హవనాలే చెప్పబడ్డాయి. పితరులను సంతోషపఱచి సాక్షాత్ భోగాలూ మెక్షరూప ఫలాలూ ఇచ్చే లక్ష ఆహుతుల యజ్ఞం కూడా వుంది. ఇందులో అందరు దేవతలతోబాటు గరుడుని కూడా పూజిస్తారు.