భవిష్య పురాణము

8,9 - స్త్రీ కీ, ధనమునకూ మూడు ఆశ్రయాలు - స్త్రీ పురుష పరస్పర వ్యవహార వర్ణన

మునీశ్వరులారా! అని సంబోధించి చెప్పాడు బ్రహ్మ. శతానీక మహారాజుతో అదే గృహస్థు జీవన విధానాన్ని చెప్పసాగాడు సుమంత మహర్షి.

“అన్నింటికన్న ముందు గృహస్థు ఒక మంచి ప్రదేశంలో ఇల్లు చూసుకోవాలి. తన ధనానికి, స్త్రీకి గట్టి భద్రత ఉండేదే మంచి ప్రదేశము. ఈ ఆశ్రయమనేది లేకుంటే మనశ్శాంతి కూడా ఉండదు. పురుష, స్థాన, గృహాలనే మూడు ఆశ్రయాలంటారు. ధనాదికముల రక్షణము మరింత అర్థోపార్జనము ఈ మూడింటి వల్లనే సాధ్యము. కులీనుడు, నీతిమంతుడు, బుద్ధిమంతుడు, సత్యవాది. వినయవంతుడు, ధర్మాత్ముడు, దృఢవ్రతి అయిన పురుషుడు ఎటువంటి ఆశ్రయానికైనా అర్హుడు, యోగ్యుడు. ధర్మాత్ములెక్కువగా నున్న నగరంలోగాని గ్రామంలో గాని ఇల్లు చూసుకోవాలి. గురువుల అనుమతినిగాని, గ్రామంలో నివసించే శ్రేష్ఠజనుల అనుమతిని గాని గైకొని అవివాదిత స్థలంలో ఇల్లు కట్టుకోవాలి. ఇరుగు పొరుగులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలి. నగర ద్వారం, కూడలి, యజ్ఞశాల, శిల్పులుండే చోటు, జూదగృహం, మాంసవిక్రయ కేంద్రం, సారాదుకాణం, రాజుగారి నౌకర్లుండే చోటు, దేవాలయానికి పోయే మార్గంలో జాగా కొనుక్కోకూడదు, రాజమార్గము, రాజమహలు, ఈ పదకొండింటికీ సాధ్యమైనంత దూరంలోనే ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి. దుష్టులుగా పేరుపొందిన వారి నివాసాలకు దూరంగా వుండాలి. తూర్పు లేదా ఉత్తరం వైపు భూమిడాలుండాలి. వంటగది, స్నానమందిరం, గోశాల, అంతఃపురం, పడకగది దేనికదే ప్రత్యేకంగా నిర్మింపబడాలి. అంతఃపుర రక్షణకై వృద్ధులు, జితేంద్రియులు, విశ్వాసపాత్రులు (పురాణంలో ఇక్కడ ‘విశ్వస్త’ అనే పదం వాడబడింది.) భర్తగాని, భార్యగాని లేనివారు అయిన వ్యక్తులనే నియమించుకోవాలి. స్త్రీలను సక్రమంగా రక్షించుకోకపోతే వర్ణ సంకరం జరిగే ప్రమాదముంది. ఇంకా చాలా కష్టాలు వస్తాయి.

స్త్రీలలో ఈ క్రింది దోషాలు కుటుంబాన్నే నాశనం చేస్తాయి. కాబట్టి ఆ దోషాలున్న స్త్రీలను చేరదీయరాదు. ఆ దోషాలు - దారిద్య్రం, రెచ్చగొట్టే అందం, అంతగా మంచిపేరు లేని వారితో సహవాసం, చిరుతిళ్ళు, అతిగా రసాలు త్రాగుట, కథలు గోష్టులలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ పనివైపు మళ్ళకపోవడం, గారడీలు, కనికట్టు చేయడం, అడుక్కునే అలవాటు, నటన, సరదా, నాట్యకత్తెలతో స్నేహం, దుష్ట స్త్రీలతో విహారాలకు, పిలుపులకు, యాత్రలకు పోవుట, అత్యధిక తీర్థయాత్రల, అతిగా దైవ దర్శనాల పిచ్చి, పతికి దూరంగా వెళ్ళి వుండుట, కఠోర ప్రవర్తన, పరపురుషులతో అతిగా మాట్లాడుట, అతి క్రూరత, అతి సౌమ్యము, మరొక స్త్రీని ఆరాధించి ఆమె మార్గాన్నే ఆలోచించకుండా అవలం బించుట. ఈ దోషాల వల్ల ముందు ఇల్లాలు, పిమ్మట ఆమెను కట్టుకున్నవాడు నిందల, కష్టాలపాలవుతారు. ముఖ్యంగా ఇది పురుషుని అనగా ఇంటి యజమాని చేతకానితనం గానే పరిగణించబడుతుంది. పనివారు కూడా యజమాని అతిగా కరుణ చూపిస్తే నెత్తికెక్కడమే కాక ఊళ్ళో అతడి పరువు తీస్తారు. స్త్రీ కూడా అంతే. కాబట్టి మొత్తం గృహాన్నంతటినీ తన అదుపులోనుంచుకొనడం గృహస్థుకి చాలా అవసరం. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. భార్య అనేది భర్తకు సర్వస్వము. అతనిలో సగం. ఆమె లేకుంటే అతనికి ధర్మక్రియసాధనే వుండదు. కాబట్టి స్త్రీని అనుకూలవతిగా మలుచుకొని ఆదర, గౌరవాలతో, ప్రేమతో సంభావించి ఆమె సహకారంతోనే సంసారాన్ని నడపడం గృహస్థు ప్రథమ కర్తవ్యం. ఆమెకు ప్రతికూలంగా అతడు పోరాదు.

ఉత్తమ స్త్రీ లేదా పతివ్రతకి సాధారణంగా మూడు లక్షణాలుంటాయి. అవి పరపురుషుల పట్ల విరక్తి, తన పతిపై ప్రీతి, తనను తాను రక్షించుకొనే సామర్ధ్యము.

సామ, దానోపాయాల ద్వారా ఉత్తమ స్త్రీని అధీనంలో ఉంచుకోవడం పతికి మంచిది. మధ్యమ స్త్రీకి దాన, భేదోపాయాలూ, అధమ స్త్రీకి భేద దండోపాయములు ప్రయోగార్హములు. దండన తరువాత మళ్ళా ఆమెను సామ, దానోపాయాలతో గౌరవించుకోవాలి. ప్రసన్నం చేసుకోవాలి. భర్తకు కీడు తలపెట్టే ఆడదీ, వ్యభిచరించే వనితా కాలకూట విషంతో సమానం. అటువంటి స్త్రీని వెంటనే పరిత్యజించాలి. ఉత్తమ కుటుంబంలోంచి వచ్చి, పతివ్రతగా పేరుపొంది, నీతిగా జీవిస్తూ, భర్త మేలునే ఎప్పుడూ కోరే స్త్రీని భర్త బాగా గౌరవించాలి. ఇటువంటి భాగ్యశాలియైన భర్తకు అన్ని ఆశ్రమధర్మాలు ఫలిస్తాయి. అన్ని లోకాల్లోనూ సుఖమే ప్రాప్తిస్తుంది.

ఇక పురుషునితో స్త్రీ యొక్క ప్రవర్తన ఎలా వుండాలో ఆదేశిస్తూ బ్రహ్మ చెప్పినదిది. పుత్ర సంతానమైనా, స్వర్గ ప్రాప్తియైనా స్త్రీకి భర్తకు తనపై గల ప్రేమ ఆధారంగానే సంక్రమిస్తాయి. కాబట్టి ప్రతి ఆడదీ తన పత్యారాధనా ఫలితంగా, నిరంతర సేవాఫలంగా పతి ప్రేమను పొందాలి. సాధారణ స్త్రీకి శాస్త్రాలను గాని, గ్రంథాలను గాని పఠించే అర్హత లేదు. కాని భర్త ద్వారా వాటన్నిటినీ ఆమె వినవచ్చును. విధి, నిషేధపూర్వకంగా భర్త, చెప్పే ధర్మాచరణను సాంతమూ చేయడం ద్వారా మోక్షప్రాప్తిని చెందవచ్చును. భర్త అనంతరం కొడుకే ఆమెకు ధర్మశాస్త్ర గురువు కాగలడు. అధికారాలు పరిమితమే అయినా స్త్రీ యొక్క సాన్నిహిత్య, సామీప్య అవసరాలు సమాజ కళ్యాణానికి అపరిమితం. గృహస్థు యొక్క అన్ని ధర్మాలకూ మూలం పతివ్రతయగు స్త్రీ మూర్తియే.”