137 - రక్షాబంధన విధి

“ధర్మజా! ప్రాచీన కాలంలో ఒకమారు దేవ దానవ సంగ్రామంలో చిత్తుగా ఓడిపోయిన దైత్యులు బలిచక్రవర్తిని ముందిడుకొని రాక్షస గురువైన శుక్రాచార్యుల వద్దకు పోయి ఆయనకు తమ పరాజయ వృత్తాంతాన్ని వినిపించారు. శుక్రాచార్యుడు వారి రాజుతో బాధ వలదనీ, దైవవశాన, కాలగతి వలన జయపరాజయాలు వస్తూనే వుంటాయనీ చెప్పి ఓదార్చి ఇంకా ఇలా అన్నాడు, ‘దైత్యరాజా! మీరు ఒక యేడాదిపాటు దేవరాజు ఇంద్రునితో సంధి చేసుకొని వుండండి. ఎందుకంటే ఇంద్రపత్ని శచీదేవి ఇంద్రునికొక రక్షా సూత్రాన్ని కట్టి అతనిని అజేయుని గావించింది. అదే మీ ఓటమికి కారణం. ఒక సంవత్సరం వేచివుండు. ఆ తరువాత నీకు శుభం కలుగుతుంది.’ దైత్యరాజు అలాగే చేశాడు. ఈ రక్షా బంధనానికి విలక్షణ ప్రభావం వుంటుంది. దానివల్ల విజయ, సుఖ, పుత్ర, ఆరోగ్య, ధనాలు ప్రాప్తిస్తాయి.”

అని శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు ఏ తిథిలో ఏ విధితో రక్షాబంధనం చేయాలని అడుగగా ఆయన ఇలా ఉపదేశించాడు.

“మహారాజా! శ్రావణ పూర్ణిమనాడు ప్రాతర్వేళనే లేచి శ్రుతి - స్మృతి - విధితో స్నానం చేసి దేవతలకు, పితరులకు నిర్మల జలాలతో తర్పణలిచ్చి ఉపకర్మ విధి ద్వారా వేదోక్త ఋషులకు కూడా తర్పణలివ్వాలి. బ్రాహ్మణ వర్గ దేవతలనుద్దేశించి శ్రాద్ధాలు పెట్టాలి. తరువాత అపరాహ్ణ కాలంలో రక్షాపోటలిని ఈ విధంగా తయారుచేయాలి: పత్తి లేదా పట్టు వస్త్రంలో అక్షతలను, ఎఱ్ఱ ఆవాలను, బంగారాన్నీ, ఆవాలనూ, దూర్వాచందనాది పదార్ధాలనూ వుంచి దానినొక రాగి పాత్రలోపెట్టి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించాలి. గృహ ప్రాంగణాన్ని పేడతో బాగా అలికి ఒక చతురస్ర మండలాన్ని తయారుచేసి దానిపై ఒక పీఠాన్ని స్థాపించి దానిపై రాజునీ, మంత్రినీ, రాజపురోహితునీ కూర్చోబెట్టాలి. అక్కడ కూడిన జనులంతా ప్రసన్న, ప్రశాంత చిత్తులై వుండాలి. మంగళ ధ్వనులు చేస్తుండాలి. సర్వప్రథమంగా బ్రాహ్మణులూ ముత్తయిదువలైన స్త్రీలూ అర్ఘ్యాదుల ద్వారా రాజును అర్చించాలి. తరువాత పురోహితులు అంతకు ముందు ప్రతిష్ఠింపబడిన రక్షాపోటలిని ఈ క్రింది మంత్రం చదువుతూ రాజు కుడిచేతికి కట్టాలి:

యేనబద్ధోబలీరాజా దానవేంద్రోమహాబలఃః

తేనత్వామపి బధ్నామిరక్షేమాచలమాచల॥ (ఉత్తరపర్వం 137/20)

తరువాత రాజు సుందర వస్త్రాలతో, భోజనాలతో, దక్షిణలతో బ్రాహ్మణులను పూజించి వారిని సంతుష్టులను చేయాలి. ఈ రక్షాబంధనమును నాలుగు వర్ణాలవారూ చేయించు కోవాలి.