భవిష్య పురాణము

159 - గో సహస్ర దాన విధి

“జనార్దనా! గోసహస్రదానాన్ని గూర్చి విన్నానుగాని ఆ విధానమేమిటో తెలియరాలేదు. దయచేసి చెప్పండి” అని ధర్మరాజు ప్రార్థించాడు.

“కుంతీ నందనా! గోవు పరమ పవిత్రము సర్వగుణ, సర్వలక్షణ సంపన్నయగు ఒక్క గోవుని దానమిస్తేనే ఆ కుటుంబమంతా తరిస్తుందంటారు కదా; అలాంటిది, ఆ గోవుల సంఖ్య పెరిగితే ఇక చెప్పాలా?

ప్రాచీనకాలంలో నహుష చక్రవర్తి, మహామతి యయాతి సహస్రగోదానాలను చేశారు. దాని ప్రభావం వల్ల వారు బ్రహ్మస్థానాన్ని పొందారు. పుత్రులు కావాలనే కోరికతో అదితి కూడా గంగాతటంపై అపార గోదానం చేసింది. ఫలితంగా ఆమె అఖిలలోక స్వామి నారాయణునే పుత్రునిగా పొందగలిగింది.

ఈ గోసహస్ర దానయజ్ఞాన్ని శాస్త్రోక్తంగా ఇలా చేయాలి. దాత వీలైతే తీర్థంలోగానీ, గోశాలలోగానీ లేకుంటే ఇంట్లోగానీ పది లేదా పన్నెండు హస్తాల పొడవు వెడల్పులతోనొక సుందర మండపాన్ని నిర్మించాలి. దానికి తోరణాలు కట్టాలి. నాలుగు దిశలలోనూ ద్వారాలను పెట్టించాలి. మండప మధ్యంలో నాలుగు హస్తాలమేర ఒక సుందరమైన వేదిని నిర్మించి దానికి ఈశాన్యమువైపు ఒక హస్తం చోటులో గ్రహవేదిని నిర్మించాలి. గ్రహయజ్ఞ విధానం ప్రకారం దానిపై ఒక క్రమంలో గ్రహాలను స్థాపించాలి. ముందుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అర్చించాలి. యజ్ఞానికై ఋత్విజులను ఎంచుకొని తెచ్చుకోవాలి.

మరల వేదికి ఈశాన్య భాగంలో ఒక శివకుండాన్ని కట్టించి దాని ద్వార ప్రదేశాన్ని చిగురుటాకులతో కప్పబడిన రెండు కలశలు స్థాపించి సుశోభితం చేయాలి. ఆ కలశలలో పంచరత్నాలను వేసి వుంచాలి. తరువాత హవనం చేయాలి. తులాపురుష దానం వలెనే ఇందులో కూడా లోకపాలకుల నిమిత్తమై బలి - నైవేద్యాలను సమర్పించాలి.

పది సవత్స గోవులను దూడలతో సహా లవణ లేదా స్వర్ణ లేదా ప్రత్యక్ష వృషభాన్ని కూడా ఇదివఱకు చెప్పిన పద్ధతిలోనే పూజించి ఈ పూజనే మిగతా గోవులకూ పరికల్పన చేసి దానం చేయాలి. అన్ని గోవులనూ ఒక బ్రాహ్మణునికే దానం చేయాలని శాస్త్రం చెప్పలేదు. ఋత్విజులూ, ఆచార్య దేవులూ ఎందరికి ఎన్నివ్వాలో చెప్తారు. అలాగే చెయ్యాలి.

ఈ దానం చేసినవారు ఊర్థ్వలోకాలకు పోయి, లోకపాలకులచే పూజితులవుతారు.”