భవిష్య పురాణము

46 - కార్తికేయ, షష్ఠీవ్రత మహిమ

భాద్రపద షష్ఠి అన్ని పాపాలనూ హరించి పుణ్యప్రదానం చేసే ఉత్తమ తిథి. సర్వ మంగళాలనూ, కళ్యాణాలనూ సమకూర్చే ఈ తిధి అంటే కార్తికేయునికి చాలా ఇష్టం. ఈ రోజు చేసే స్నాన, దానాదులు అక్షయ ఫలదాయకాలు. దక్షిణం వైపు కుమారిక క్షేత్రమందున్న కార్తికేయుని ఈ తిథినాడు దర్శించినవారు బ్రహ్మహత్య వంటి మహా పాతకాలనుండి కూడా విముక్తులౌతారు. భక్తిపూర్వకంగా కార్తికేయుని పూజ చేసినవారు ఇహలోకమందు మనోవాంఛిత ఫలప్రాప్తినీ, తదనంతరం ఇంద్రలోక నివాసాన్నీ పొందుతారు. ఇటుక, రాయి, కర్రలతో శ్రద్ధాసక్తులతో కార్తికేయ మందిరాన్ని తయారు చేసుకున్నవాడు బంగారు విమానంలో ఊరేగి చివర కార్తికేయ లోకాన్ని చేరుకుంటాడు. స్వామి మందిరంలో ధ్వజాన్నెత్తించి, చీపురుతో మందిరాన్ని తుడిచేవానికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది. చందనం, అగరు, కర్పూరాదులతో ఈ స్వామిని పూజించేవానికి గుఱ్ఱాలు, ఏనుగులు, సేనాపతి పదవి లభిస్తాయి. స్వామిని పూజించి యుద్ధానికెళ్ళిన రాజుకి అపజయముండదు. చంపకాది వివిధ పుష్పాలతో కార్తికేయుని పూజించిన వానికి శివలోక ప్రాప్తి సిద్ధిస్తుంది. భాద్రపద షష్ఠి నాడు నూనె పదార్థాలు తినరాదు. వ్రతమును, పూజను చేసి ఆరోజు రాత్రి మాత్రమే భోజనం చేసేవాడు సర్వపాప విముక్తుడై కార్తికేయలోకాన్ని చేరుకుంటాడు. కార్తికేయ స్వామిని నిత్యం పూజించేవాడు, కుమారికా క్షేత్రంలో స్వామిని దర్శించేవాడు అఖండ శాంతిని పొందుతాడు.