“భగవన్! ఈ సంసార సాగరాన్ని సుఖ పూర్వకంగా దాటించేదీ, స్వర్గాన్నీ, ఆరోగ్యాన్నీ ప్రదానించేదీ అయిన వ్రతాన్నొక్క దాన్నుపదేశించండి”
అడిగాడు అర్జునాగ్రజుడు.
అనుగ్రహించసాగాడు అర్జున సఖుడు ఇలా:
“పాండవాగ్రజా! శుద్ధ సప్తమి ఏదైనా, ఆదివారంనాడు పడితే దాన్ని విజయ లేదా కల్యాణ సప్తమి అంటారు. ఈ తిథి మహాపుణ్యమయి. ఈనాడు ప్రాతర్వేళనే ఆవుపాలు కలిసిన జలంతో స్నానం చేసి శుక్ల వస్త్రాలను ధరించి అక్షతలతో ఒక సుందరమైన, స్ఫుట కర్ణికాయుక్తమైన అష్టదళ కమలాన్ని నిర్మించి సర్వోపచారాలతో అష్టదళాలనూ ఒక్కొక్క దిక్కువైపు రేకను ఒక్కొక్క సూర్యమంత్రంతో ఇలా పూజించాలి.
ఓం తపనాయ నమః తో తూర్పులోనూ
ఓం మార్తాండాయ నమః తో అగ్నికోణంలోనూ,
ఓం దివాకరాయ నమః తో దక్షిణంలోనూ,
ఓం విధాత్రే నమః తో నైరృత్యకోణంలోనూ,
ఓం వరుణాయ నమః తో పశ్చిమ దిశలోనూ,
ఓం భాస్కరాయ నమః తో వాయవ్య కోణంలోనూ,
ఓం వికర్తనాయ నమః తో ఉత్తరదిశలోనూ,
ఓం రవయే నమః తో ఈశాన కోణంలోనూ
నున్న దళాలను పూజించి మరల అన్ని మంత్రాలతో సర్వ ఉపచారాలనూ కర్ణికపై వేసి పూజ చేయాలి. శుక్ల వస్త్రాలనూ, ఫల, భక్ష్యాలనూ, ధూప, పుష్పమాల, బెల్లాలనూ, ఉప్పునూ ఇవే మంత్రాలనుచ్చరిస్తూ నమస్కరిస్తూ వేదిపై పెడుతూ పూజించాలి. ఆ తరువాత వ్యాహృతి హోమాన్ని చేసి యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. గురువుగారికి స్వర్ణ, తిలా సహితమైన పాత్రను దానం చేయాలి. రెండవరోజు పెందల కడనేలేచి నిత్యకృత్యాలను తీర్చుకొని నేతినీ పాయసాన్నీ కలిగిన భోజనాన్ని బ్రాహ్మణులతో కలిసి చేయాలి. ఈ విధంగా ఒక యేడాదిపాటు సూర్యపూజను చేసి ఉద్యాపన చెయ్యాలి. జలకలశ, ఘృతపాత్ర, సువర్ణ, వస్త్ర, ఆభూషణ, సవత్స గోవులను బ్రాహ్మణునకివ్వాలి. అంతశక్తి లేనివారు గోదానాన్ని మాత్రం చేయవచ్చు. ఈ కల్యాణ సప్తమీ వ్రతాన్ని చేసిన వారికీ, వ్రతమాహాత్మ్యాన్ని చదివిన వారికీ, విన్నవారికీ కూడా సకల పాప విముక్తీ సూర్యలోక నివాస ప్రాప్తి లభిస్తాయి.