11 - గిరిశర్మ, వనశర్మ, పురీశర్మల ఆవిర్భావాఖ్యానం

బృహస్పతి ఇంకా ఇలా చెప్పసాగాడు. ‘దేవేంద్రా! ప్రాచీన కాలంలో నైమిషారణ్యంలో అజగరుడను పేరుగల బ్రాహ్మణుండేవాడు. ఆయన వేదాంత శాస్త్ర విశారదుడు, జ్ఞానవంతుడు, శివోపాసకుడు. పన్నేండేళ్ళపాటు పార్థివ పూజను చేసి రుద్రుని సంతుష్టపఱచాడు. శంకర భగవానుడతనికి జీవన్ముక్తిని ప్రసాదించాడు ఆ ద్విజోత్తముడు తన జన్మాంతానికి ముందే సంకర్షణుని ఆరాధించి అనేక సుమధుర స్తోత్రాల ద్వారా ఆయనను ప్రసన్నం చేసుకోగా ఆయన సాయుజ్యాన్ని ప్రసాదించాడు. దానితో అజగరుడనే పేరున్నందుకు అది సార్ధకమై విష్ణుదేవుడు శయనించే సర్పంగా నిలిచే అదృష్టం కలిగింది. బ్రహ్మవచ్చి విష్ణువుకి నమస్కరించినపుడు అజగర శబ్దాన్నుచ్చరించి అతని తేజస్సుని ఇనుమింపజేయడంతో అతడు సూర్యుడు కర్కాటక రాశిలో నున్నప్పుడు, చంద్రుడు నక్షత్రమండలంలో నున్నప్పుడు వారి తేజస్సును గ్రహించి నిలబెట్టుకొనే వరాన్ని పొంది ఈ మొత్తం తేజస్సుతో భూలోకంలో దేవదత్తుడను బ్రాహ్మణుని ఇంట అవతరించాడు. గిరిశర్మ నామంతో ప్రసిద్ధుడై వింధ్యాద్రి నుండి కాశీదాకా గల పండితులందరినీ వాదంలో గెలుచుకుంటూ పోయి చివరగా శంకరాచార్యుని శిష్యుడై అనేక ధర్మ ప్రసంగాలను చేశాడు.”

సూతుడు కాస్త ఆగి మరల చెప్పసాగాడు. “శౌనకాచార్యా! ఇపుడు మీకు బృహస్పతి చెప్పిన మరొక ఆఖ్యానాన్ని వినిపిస్తాను. ఆయన ఇలా ప్రవచించాడు. ‘దేవేంద్రా! పూర్వకాలంలో ప్రయాగలో నైరృతుడని ఒక ప్రసిద్ధ బ్రాహ్మణుడుండేవాడు. అతడు విద్యలో ప్రసిద్ధుడే కాని మందభాగ్యుడు, దరిద్రుడు. భిక్షాటన చేసి బ్రతికేవాడు. రోజంతా కష్టపడి భిక్షమెత్తినా తనూ భార్యా కొడుకూ తినడానికి సరిపోయేది కాదు. ఒకరోజు వైష్ణవ ప్రియుడు, దేవర్షియైన నారదుడు అతని వద్దకు వచ్చి, ‘విప్రశ్రేష్ఠా! ఈ సంపూర్ణ బ్రహ్మాండము దేవమయము. అందరికీ స్వామి ఆ శివశంకరుడే. నువ్వు కూడా వెంటనే ఆ స్వామిని భజించు. నీకు శుభం కలుగుతుంది’, అని మంత్రము నుపదేశించాడు. దేవర్షి ఉపదేశాన్ని విన్న నైరృతుడు పరమభక్తితో ఒక సంవత్సరంపాటు పార్థి వార్చన ద్వారా శంకర భగవానుని సంతుష్టపఱచాడు. ఆయన ప్రసన్నుడై అపార ధనరాసులను ప్రసాదించాడు. ఆ ధనంతో నైరృతుడు అనేకానేక ధర్మకార్యాలను నిర్వర్తించి పరమ పుణ్యాత్మునిగా ప్రసిద్ధి చెందాడు. శివభక్తి ప్రభావం వల్ల ధర్మ కార్యతత్పరత వల్ల అతడు ఒక వేయి సంవత్సరాలు ఆదర్శ జీవనం గడిపి దేహాంతంలో స్వర్గప్రాప్తిని పొందాడు. ఆ తరువాత వృషరాశిలో సూర్యుడున్నప్పుడు శివుడు ఇతనిని రుద్రులలో నొకనిగా చేశాడు.

అతడు మరుజన్మలో గిరినాలగిరి అను పేరు గల వనంలో నివసిస్తున్న సిద్ధయోగి, సాంఖ్యాచార్యుడునగు ఒక బ్రాహ్మణునికి పుత్రునిగా జన్మించాడు. పెరిగి పెద్దవాడై వేదశాస్త్ర పరాయణుడై వనశర్మయను పేరుతో విఖ్యాతుడయినాడు. అతడు తన పన్నెండవ యేటనే విద్వాంసులను వాదంలో ఓడించాడు. తరువాత తత్త్వజ్ఞాన ప్రాప్తిపై అభిలాషతో శంకరాచార్యుని చేరి ఆయన వద్ద శిష్యునిగా స్థిరపడ్డాడు.

దేవేంద్రా! మాహిష్మతిలో వసుశర్మయని శివభక్తుడుండేవాడు. అతడు పుత్ర సంతానానికై పార్థివార్చనను విశేష తత్పరుడై చేశాడు. ఎన్నో ప్రయత్నాల తరువాత శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అపుడా విప్రవరుడు, ‘హే భక్తవత్సలా! నాకు పుత్రుని ప్రసాదించండి’ అని అడిగాడు. శంకరుడు, వత్సా నీ భాగ్యరేఖలో స్వీయపుత్ర సంతానం లేదు కాబట్టి నా అంశతో ఒక తేజస్వియైన పుత్రుని ఇస్తాను అని ఆయన ఒక తేజస్సును సృష్టించగా దాని నుండి ఒక శిశువు జన్మించాడు కాని, వానికి ఒక కాలు మనిషిదీ మరొక కాలు మేకదీ వున్నాయి. అందువల్ల అతడు ‘అజైకపాద’ నామంతో పిలువబడినాడు. అతడు పండితుడై ప్రసిద్ధుడై నాలుగు వందల సంవత్సరాలు జీవించాడు. అపుడు మృత్యుదేవత అతనిని తీసుకొని పోవడానికి రాగా ఆ తపస్వియైన విప్రుడు మృత్యువుతో తలపడి భయంకర యుద్ధం చేసి గెలిచాడు. మృత్యుదేవత ఓడిపోయి బ్రహ్మ శరణుజొచ్చగా ఆయన వచ్చి అజైకపాదుని బుజ్జగించి అతనిని కొంతకాలం సూర్యకుంభంపై నివసించడానికీ ఆ తరువాత భయహారీ రుద్రునిరూపంలో చంద్రమండలాధిపతిగా ఉండడానికీ ఒప్పించి భూలోకం నుండి పైకి గొనిపోయాడు.

ఆ తరువాతి పరిణామాన్ని సూతమహర్షి ఇలా చెప్పాడు, “మునులారా! ఆ తరువాత ఆయన మాహిష్మతీ పాలకునిగా పురీశర్మ అను పేరుతో ఒక జన్మను పొంది కలిని అదుపులో పెట్టాడు. మరుజన్మలో యతిదత్తుడను బ్రాహ్మణుని ఇంట పురశర్మగా పుట్టి పదహారేళ్ళ వయసు వచ్చేసరికే అఖిల వేదవిద్యా పారంగతుడై ఇతర మతస్థులైన విద్వాంసులపై వాదంలో జైత్రయాత్ర చేసి చివరగా జగద్గురు శంకరాచార్యుల నాశ్రయించి ఆయన శిష్యునిగా   ప్రసిద్ధి చెందాడు. “