భవిష్య పురాణము

55 - శ్రీకృష్ణ జన్మాష్టమి - వ్రతకథ, విధి

“ప్రభో! మీ జన్మదినాన మిమ్మల్నెలా కొలవాలి?” అని ప్రార్థించాడు ధర్మజుడు.

 “మహారాజా! మథురలో కంసవధ తరువాత నా తల్లి దేవకీ దేవి నన్ను ఒడిలో పెట్టుకొని రోదించసాగింది. నా తండ్రి వసుదేవుడు నన్నూ మా అన్ననూ ఆలింగనం చేసుకొని గుండె గొంతుకలో కొట్టాడుతుండగా గద్గద స్వరంతో ఇలా అన్నాడు.

‘నేటికి నా జన్మ సఫలమైంది. నా పుత్రులిద్దరినీ చూడగలిగాను. నా అదృష్టం కొద్దీ ఈరోజు మేము నలుగురమూ ఒకచోట వుండగలిగాము.’

అక్కడికి మా శ్రేయోభిలాషులు చాలమంది వచ్చి చేరి నన్ను ఇలా అభ్యర్థించారు:

‘ప్రభూ! దుష్టుడైన కంసునిచంపి మీరు మా బతుకుల్లోకి సుఖాన్నీ శాంతినీ తీసుకొచ్చారు. మాపై దయవుంచి మీ జన్మదినమెప్పుడో చెప్పండి. ఆ రోజున మేమంతా గొప్ప పండుగను చేసుకుంటాం. మీకు మరల మరల నమస్కరిస్తున్నాం. మేము మీ శరణుజొచ్చియున్నాము. మాపట్ల ప్రసన్నులై ఆ పుణ్యదినమేదో చెప్పండి’

మా తండ్రి వసుదేవుని అనుమతిని పొంది ఇలా చెప్పాను, ‘ఆత్మబంధువులారా! నా పుట్టినరోజు జన్మాష్టమి అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. ధార్మికులందరికీ ఇది అవశ్యాచరణీయ వ్రతము. భాద్రపద బహుళ అష్టమినాటి అర్ధరాత్రి సూర్యుడు సింహరాశిలోనూ చంద్రుడు వృషభరాశిలోనూ వుండగా రోహిణీ నక్షత్రంలో నేను జన్మించాను. సుఖశాంతులతో రోగరహితంగా, ఈ వ్రతం మీరు చేస్తున్నంత కాలం, ప్రపంచం వర్ధిల్లుతుంది తరువాత ధర్మజుని కోరిక మేరకు జన్మాష్టమీ వ్రత విధానాన్ని శ్రీకృష్ణుడిలా ఉపదేశించాడు.’

“మహారాజా! ఈ వ్రతం వల్ల ఏడుజన్మల పాపాలు దగ్ధమౌతాయి. వ్రతానికి ముందు రోజు నిత్యకృత్యాల తరువాత వ్రతనియమ గ్రహణంచెయ్యాలి. వ్రతం రోజు మధ్యాహ్నం దేవకీ మాతకై ఒక పురిటిల్లుని తయారుచేయాలి. దానిని పద్మ రాగమణులతో వనమాలాదులతో(మెడ నుండి మోకాళ్ళ క్రిందిదాకా ఋతు - పుష్పమాల, పద్మరాగం, ముత్యం మున్నగు పంచమణులమాల, తులసిదళాలతో కలుపబడిన వివిధ పుష్పాలమాల ఇవి వన మాలాదులు. వీటికే జయమాల, వైజయంతి అనే పేర్లున్నాయి.) సుశోభితం చేయాలి. ఈ పురిటింటిని గోకులంలా అలంకరించాలి. గోపాలురు, గోపికలు, ఘంటలు, మృదంగాలు, శంఖాలు, మాంగల్యకలశలు గోలోక లేదా గోకుల చిహ్నాలు. ఈ విధంగా అలంకరింపబడిన సూతికా గృహానికి ద్వారరక్షగా ఖడ్గ, కృష్ణఛాగ, ముశలాదులనుంచాలి. గోడలపై స్వస్తికాది మంగళకర చిహ్నాలను చిత్రించాలి. (పార్వతీదేవి)షష్టీదేవిని కూడా నైవేద్య సహితంగా స్థాపించాలి. ఈ రకంగా శక్తిమేరకు ఆ గృహాన్ని అలంకరించి మధ్యలో నొక పర్యంకంపై నన్నూ నా తల్లి, అర్ధసుప్తావస్థలో నున్న తపస్విని యగు దేవకీ దేవినీ ప్రతిమారూపంలో స్థాపించాలి. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కఱ్ఱ, మణిమయం, చిత్రమయం, మట్టి ఈ అష్ట వస్తువులలో దేనితోనైనా, శక్తినిబట్టి, ప్రతిమను నిర్మించవచ్చును. తల్లి వద్ద పాలు తాగుతున్న బాలకృష్ణుని ప్రతిమను ఆ పక్కనే మరొకచోట వుంచాలి. ఒక కన్యతో యశోద నిలబడి వున్న ప్రతిమను కూడా అక్కడ స్థాపించాలి. సూతికా మండపం పైన గోడ లేదా పైకప్పు క్రింది భాగంపై దేవతల, గ్రహాల, నాగుల, విద్యాధరాదుల ప్రతిమలను చేతులలో పుష్పాలు పెట్టుకొని నాపై విసురుతున్న భంగిమలో చెక్కించాలి. వసుదేవుడు కశ్యప మహర్షి అవతారము. ఆయన (వసుదేవుని) ప్రతిమను కత్తిడాలు ధరించి సిద్ధంగా వున్న భంగిమలో చేయించి వుంచాలి. కంసుని అనుచరులను నిద్రావస్థలోనున్నట్లుగా చిత్రించాలి. ఆవుల, ఏనుగుల, నాట్యం చేస్తున్న అప్సరసల, గంధర్వుల బొమ్మలు కూడా వుండాలి. మరొకవైపు కాళింది మడుగు, దాని మధ్య కాళియుడూ వున్న ప్రతిమ వుండాలి.

ఈ విధంగా నవసూతికా గృహాన్ని నిర్మించి దేవకీ దేవిని భక్తిగా గంధ, పుష్ప, అక్షత, ధూప, నారికేళ, దాడిమాదులతో పూజించాలి. ఆ దేశంలో ఆ కాలంలో దొరికే ఫలాలన్నిటినీ (పనస, నారింజ, పోక, కకడీ, బీజపురాలతో సదా) నైవేద్యం పెట్టి ఆమెనిలా ప్రార్ధించాలి:

గాయద్భిః కిన్నరాద్యైః సతతపరివృతా వేణువీణా నినాదై

భృంగారాదర్శ కుంభప్రమరకృతకరైః సేవ్యమానా మునీంద్రైః

పర్యంకే స్వాస్తృతేయా ముదిత తరమనాః పుత్రిణీ సమ్యగాస్తే

సాదేవీ దేవమాతా జయతి సువదనా దేవకీ కాంతరూపా

(ఉత్తరపర్వం 55/42)

లక్ష్మీదేవి తన అత్తగారైన దేవకీ దేవి పాదాలను ఒత్తుతున్నట్లు ధ్యానంలోకి వెళ్ళి ఊహించుకొని ఆ మహాదేవిని ఈ మంత్రంతో పూజించాలి:

‘నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః

తరువాత ఈ క్రింది మంత్రాలతో ఆయా దేవతలను వేరువేరుగా పూజించాలి:

                                             ఓం దేవక్యై నమః

ఓం వసుదేవాయ నమః

ఓం బలభద్రాయ నమః

ఓం శ్రీకృష్ణాయ నమః

ఓం సుభద్రాయై నమః

ఓం నందాయ నమః

ఓం యశోదాయై నమః

చంద్రుడుదయించిన తరువాత ఆయనకు అర్ఘ్య ప్రదానం చేసి హరిని ఈ క్రింది మంత్రాలతో ధ్యానించాలి.

అనఘంవామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం

వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూధనం 

వారాహంపుండరీకాక్షం నృసింహం బ్రాహ్మణ ప్రియం

దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం

గోవిందమచ్యుతం కృష్ణ మనంత మపరాజితం

అధోక్షజం జగద్బీజం సర్గ స్థిత్యంత కారణం 

అనాది నిధనం విష్ణుం త్రైలోక్యేశం త్రివిక్రమం

నారాయణం చతుర్భాహుం శంఖ చక్రగదాధరం

పీతాంబరధరం నిత్యం వనమాలావిభూషితం

         శ్రీవత్సాంకం జగత్సేతుం శ్రీధరం శ్రీపతిం హరిం (ఉత్తరపర్వం 55/46 - 50)

తరువాత ఈ క్రింది మంత్రంతో ప్రతిమకు స్నానం చేయించాలి.

యోగేశ్వరాయ యోగ సంభవాయ

యోగపతయే గోవిందాయ నమో నమః

అనంతరం ఈ క్రింది మంత్రంతో అనులేపన, అర్ఘ్య, ధూప, దీపాదులు నర్పించాలి.

యజ్ఞేశ్వరాయ యజ్ఞ సంభవాయ యజ్ఞపతయే

గోవిందాయ నమో నమః

                       పిమ్మట ఈ మంత్రంతో నైవేద్యం సమర్పించాలి.

విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వసంభవాయ

విశ్వపతయే గోవిందాయ నమో నమః

              మరల దీపాన్ని వెలిగించి ఈ మంత్రం ద్వారా అర్పించాలి.

ధర్మేశ్వరాయ ధర్మపతయే ధర్మ సంభవాయ

గోవిందాయ నమోనమః

ఈ ప్రకారంగా వేదిపై రోహిణీ సహితంగా చంద్రునీ, వసుదేవునీ, దేవకినీ, నందునీ, యశోదనీ, బలరామునీ పూజించాలి. దీనివల్ల సర్వపాపాలూ నశిస్తాయి. చంద్రోదయ సమయంలో ఈ క్రింది మంత్రంతో చంద్రునికి అర్ఘ్యం సమర్పించాలి :

క్షీరోదార్ణవ సంభూత అతినేత్ర సముద్భవ

గృహాణార్ఘ్యం శశాంకేందో రోహిణ్యా సహితో మమ (ఉత్తరపర్వం - 55/54)

అర్థరాత్రి బెల్లంతో నేతితో(కలశ నుండి దారాగా పడు నీరు.)  వసోర్ధారాహుతినిచ్చి షష్ఠీ దేవిని పూజించాలి. నామకరణం వంటి సంస్కారాలు ఆ క్షణంలో చేయడం ప్రశస్తం. నవమినాడు ఇలాగే భగవతీ దేవిని కూడా పూజించి ఉత్సవం చేయాలి. తరువాత బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి కృష్ణోమే ప్రీయతాం అంటూ యథాశక్తి దక్షిణలివ్వాలి. ఈ క్రింది మంత్రాన్ని కూడా చదవాలి.

యం దేవం దేవకీ దేవీ వాసుదేవాదజీ జనత్

భౌమస్య బ్రాహ్మణో గుప్త్యై తస్మై బ్రహ్మాత్మనే నమః (ఉత్తరపర్వం 55/60)

బ్రాహ్మణులకు సాదరంగా వీడ్కోలు పలికినపుడు వారు ఇలా అనాలి శాంతి రస్తు శివంచాస్తు!

ధర్మనందనా! ఈ విధంగా వ్రతం ప్రతివర్షం చేసినవారికి పుత్రసంతానం, ఆరోగ్యం, ధనధాన్యాలు, సద్గృహము, దీర్ఘాయువు, అధికారము మున్నగు మనోవాంఛితాలన్నీ నెరవేరుతాయి. ఏ దేశంలో ఈ ఉత్సవం అవిచ్ఛిన్నంగా చేయబడుతుందో అక్కడ శిశు మరణాలు, అపసవ్య మృత్యువూ, వర్షాభావమూ, ఈతిబాధలూ వుండవు. పాండవాగజ్రా! ఏ గృహంలో ఈ దేవకీ వ్రతం జరుగుతుందో అందు అకాల మృత్యువు, గర్భపాతం, వైధవ్యం, దౌర్భాగ్యం, కలహం వుండవు. ఒక్కమారు ఈ వ్రతం చేసినా విష్ణులోక ప్రాప్తి వుంటుంది.