భవిష్య పురాణము

31 - చతుర్థీ కల్పంలో శివా, శాంతా, సుఖా అనే ఫలాలకై వ్రత విధానం

శతానీకుడడిగిన మీదట సుమంతుడిలా అన్నాడు.

“మహారాజా! చతుర్థీ తిథి మూడు ప్రకారాలుగా వుంటుంది. ఆ ప్రకారాలు శివ, శాంత, సుఖ అనేవి. భా

ద్రపద శుక్ల చతుర్థికి శివ యని పేరు. ఈ రోజు చేసే స్నాన, దాన, జప ఉపవాసాది సత్కర్మలకు వచ్చే ఫలం గణపతి అనుగ్రహం వల్ల నూరురెట్లు అధికము. ఈ రోజు బెల్లం, నెయ్యి, ఉప్పులను దానమివ్వాలి. బెల్లంతో చేసే మాలపూవా మిఠాయితో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. వారిని పూజించాలి. ఈ రోజు తన అత్త మామలకు పూవా (తీపి మైదాపిండి వంట) మరియు నమ్ కీన్ (ఉప్పు కలిసిన) వంటకాలతో భోజనం పెట్టు స్త్రీకి గణపతి అనుగ్రహము వల్ల సర్వసౌభాగ్యాలు లభిస్తాయి. మంచి పతిని కోరుకొని బ్రాహ్మణులకు ఈ పూజ ద్వారా సంతుష్టిని కలిగించిన కన్యకు గణపతి పూజ కూడా చేస్తే మంచి భర్త లభిస్తాడు. ఇది శివా - చతుర్థి పూజా విధానం.

మాఘ శుద్ధ చవితికి శాంతయని పేరు. ఇది నిత్యశాంతిని కలిగిస్తుంది. ఈనాడు చేసే స్నాన జపాది సత్కర్మలు గణేశుని అనుగ్రహం వల్ల వెయ్యిరెట్లు ఫలితాన్నిస్తాయి. ఈ శాంతా చతుర్థినాడు ఉపవాసం చేసి గణేశపూజ, హెూమం చేసి బెల్లం, ఉప్పు, కూరలు, బెల్లం మిఠాయిలు బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. విశేషించి స్త్రీలు తమ మామగారికి ఇతర పూజ్యులైన పెద్దలకీ పూజ చేసి మంచి భోజనం పెట్టాలి. ఈ వ్రతం చేసిన స్త్రీ అఖండ సౌభాగ్యవతి కాగలదు. గణేశుని దయవల్ల సర్వవిఘ్నాలు నశించగలవు.

ఏ నెలలోనైనా మంగళవారం (భౌమదినమందు) వచ్చు శుక్ల చతుర్థికి సుఖ చవితియని పేరు. ఇది స్త్రీలకు సౌభాగ్యాన్నీ, ఉత్తమరూపాన్నీ, సుఖాన్నీ ప్రసాదిస్తుంది. శంకర భగవానుడు, పార్వతీ మాతల సంయుక్తతేజస్సుతో భూమి ద్వారా రక్తవర్ణ మంగళకారుడు జన్మించాడు. భూమిపుత్రుడు కావున భౌముడని వ్యవహరిస్తారు. అతనినే కుజ, రక్త, వీర, అంగారక నామాలతో పిలుస్తారు. శరీరాంగాలను రక్షించేవాడు కాబట్టి ఆయన అంగారక నామంతో ప్రసిద్ధుడయ్యాడు. ఈ రోజు స్త్రీ పురుషులెవరైనా ఉపవాసము చేసి సామాన్యంగా గణేశుని పూజించి, రక్తపుష్పాలు, రక్తచందనంతో భౌమదేవుని పూజిస్తే సకల సంపదలు, ఉత్తమరూపాలు వచ్చి వర్ధిల్లుతాయి.

ఇక పూజా విధానం:

ఇహత్వం వందితా పూర్వం కృష్ణేనోద్ధరతా కిల

          తస్మాన్మే దహ పాప్మానం యన్మయా పూర్వ సంచితం    (బ్రాహ్మ31/24)

 ముందుగా సంకల్పం చెప్పుకొని స్నానం చేసి గణేశుని స్మరిస్తూ చేతిలో శుద్ధ మృత్తిక(మట్టి)ను పట్టుకొని పైన చెప్పిన మంత్రాన్ని పఠించాలి.

తరువాత ఆ మట్టికి కాస్త గంగాజలాన్ని కలిపి సూర్యునివైపు చేతిని చాచి ఆయననూ స్మరించాలి. అప్పుడు ఆ మట్టిని తల నుండి పాదాలదాకా వీలైనంతవరకు పూసుకుని నీటి మధ్యలో నిలబడి ఈ మంత్రాన్ని చదివి నమస్కరించాలి.

త్వమాపోయోనిః సర్వేషాం దైత్యదానవ ద్యౌకసాం

స్వేదాండ జోద్భిదాం చైవ రసానాం పతయేనమః (బ్రాహ్మ 31-27)

అంగారకునికే పై విధంగా నమస్కారం చేసి ఏదో ఒక తటాకంలో నాలుగైదు మార్లు దిగి స్నానం చేసి ఒక్కొక్క మారు ఒక్కొక్క తీర్థం, నదీ, సరోవరం, పుష్కరిణి మనస్సులో పెట్టుకుని నేను అన్ని పుణ్యతీర్థాలలోను స్నానం చేశాను. నాకు వాటి ఫలం దక్కాలి గాక అని మనసా భావిస్తూ ఇంటికి వచ్చి గరిక, శమీ రావి చెట్లను గోమాతను స్పృశించి ఆ చేతిని కళ్ళకద్దుకుంటూ ఈ మంత్రాలను పఠించాలి.

గరిక స్పర్శా మంత్రము

త్వం దూర్వేఽమృతనామాసి సర్వదేవైస్తు వందితా

 వందితా దహ తత్సర్వం దురితం యన్మయా కృతం

 శమీ స్పర్శ మంత్రము

పవిత్రాణాం పవిత్రా త్వం కాశ్యపీ ప్రథితా శ్రుతౌ

శమీ శమయ మేపాపం నూనం వేత్సి ధరాధరాన్

పీపల వృక్ష స్పర్శమంత్రము

నేత్ర స్పందాదిజం దుఃఖం దుస్స్వప్నం దుర్విచింతనం

శక్తానాంచ సముద్యోగ మశ్వత్థం త్వ క్షమస్వమే 

గోవును స్పృశించేటప్పటి మంత్రము

సర్వదేవమయీ దేవి మునిభిస్తు సుపూజితా

     తస్మాత్ స్పృశామి వందే త్వాం వందితా పాపహా భవ    (బ్రహ్మ31-32,36)

ముందు భక్తి పూర్వకంగా ఆవుకి ప్రదక్షిణ చేసి ఈ మంత్రం చదవాలి. గో ప్రదక్షిణ చేసిన వారికి సంపూర్ణ భూ ప్రదక్షిణ ఫలం దక్కుతుంది.

ఈ విధంగా చేసి గోవుని స్పృశించి చేతులూ, కాళ్ళూ కడుక్కొని ఆసనంపై కూర్చొని ఆచమనం చేయాలి. అనంతరం(తాంబూలంలో వేసుకొనే కాచు) ఖదిర సమిధలతో అగ్నిని ప్రజ్వలింపజేసి వివిధ భోజన పదార్థాలతో మంత్రాలను చదువుతూ హవనం చేయాలి.

ఆహుతిని ఈ క్రింది మంత్రాలతో ఇవ్వాలి.

ఓం శర్వాయస్వాహా, ఓం శర్వ పుత్రాయస్వాహా

ఓం క్షోణ్యత్సుంగ భవాయస్వాహా,

ఓం కుజాయ స్వాహా,

ఓం లలితాంగాయ స్వాహా,

ఓం లోహితాంగాయ స్వాహా

ఈ ప్రత్యేక మంత్రముతో నూట ఎనిమిది లేదా శక్త్యనుసారము ఆహుతులివ్వాలి. ఆ తరువాత బంగారం లేదా వెండి లేదా చందన, దేవదారు చెక్కలతో ప్రతిమను చేసి దానిని వెండి లేదా రాగి పాత్రలో స్థాపించాలి. నెయ్యి, కుంకుమ, రక్తచందనం, రక్తమాల్యాలతో పూజా నైవేద్యాలు సమర్పించాలి. స్తోమతు లేనివారు రాగి పాత్రలో గాని, మట్టి పాత్రలో గాని కుంకుమతో మూర్తిని చేసి ఎర్రని పువ్వులు పెట్టి మనస్సుతో పూజ చేయవచ్చును. అగ్నిర్మూర్ధా

అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయం

 అపాంరేతాంసి జిన్వసి (యజుర్వేదం 3/12)

     అను యజుర్వేద మంత్రము పఠించి అన్ని ఉపచారాలు సమర్పించి ఆ మూర్తిని బ్రాహ్మణునకు సమర్పించి, శక్తికొలది నెయ్యి, పాలు, బియ్యం, బెల్లం, గోధుమలు ఆయనకే దానమివ్వాలి. ధనవంతులు పీనాసితనమును త్యాగం చేసి ఉన్న స్థితికి తగినట్లుగా చెయ్యాలి. లేకుంటే ఫలం దక్కదు.

ఈ విధంగా నాలుగు మార్లు చతుర్థీవ్రతము చేసి పదిగాని అయిదు గాని తులాల బంగారం పెట్టి గణపతి మూర్తిని తయారు చేయించాలి. దానిని బంగారు, వెండి లేదా రాగి పాత్రలో భక్తి పూర్వంగా స్థాపించాలి. దానిని సర్వోపచారాలతో పూజించి సత్పాత్రుడు, అర్హుడునైన బ్రాహ్మణునికి దక్షిణతో సహా ఇచ్చి వేయాలి. అపుడే ఈ వ్రతం యొక్క సంపూర్ణ ఫలం వ్రతికి దక్కుతుంది. ఈ విధంగా చతుర్థీ వ్రతాలను భక్తి శ్రద్ధలతో చేసిన వానికి చంద్రునితో సమానమైన కాంతి, సూర్యతేజస్సు, వాయుసమాన బలం ప్రాప్తిస్తాయి. చివరికి గణపతి అనుగ్రహ వశాన భౌమలోక నివాసం లభిస్తుంది. దీనిని భక్తిగా విన్నా, చదివినా మహా పాతకాలు నశించి గొప్ప సంపదలబ్బుతాయి.