18 - బ్రహ్మదేవుని రథయాత్ర - కార్తీకశుక్ల ప్రతిపదా మహిమ

(రథాయాత్ర, కార్తీక అని అనవసర దీర్ఘాలు పెట్టి చాలా మంది పలుకుతుంటారు. అవి అపశబ్దాలు.)

మహారాజా! ఎవరైతే కార్తికమాసంలో బ్రహ్మరథయాత్ర చేయిస్తారో వారికి బ్రహ్మలోకంలో బ్రహ్మరథం పడతారు. ఆ పున్నమి నాడు మృగచర్మ ఆసనంపై బ్రహ్మదేవుడు ప్రకాశిస్తుంటాడు. వివిధ వాద్య ధ్వనుల మధ్య రథం బయలుదేరుతుంది. విశిష్ట ఉత్సవం చేసి బ్రహ్మని రథంలో కూర్చోబెట్టాలి. రథానికి ముందలి భాగంలో ఆయన పరమ భక్తుడైన బ్రాహ్మణుడు శాండిల్యుని స్థాపించి పూజించాలి. బ్రాహ్మణులు స్వస్తి వాక్యాలను పలుకుతూ పుణ్యాహవాచనము చేస్తుండాలి. ఆ రాత్రి బ్రహ్మభక్తులు జాగారణచేయాలి. నృత్య గీతాది ఉత్సవాలు, వివిధ క్రీడలు బ్రహ్మదేవుని సమ్ముఖంలో ప్రదర్శించాలి. తెల్లవారక మునుపే పూజలను ప్రారంభించాలి. బ్రాహ్మణులకు మంచి భోజనం పెట్టించి, అపుడు సుశబ్దాలతో రథయాత్రను ప్రారంభించాలి.

నాలుగు వేదాలనూ కూలంకషంగా చదివిన బ్రాహ్మణుడు రథమును ముందు లాగాలి. రథానికి ముందు వేదపఠనం చేస్తూ బ్రాహ్మణులు సాగాలి. బ్రహ్మ కుడివైపు సావిత్రినీ ఎడమవైపు భోజకునీ స్థాపించాలి. రథానికి ముందు శంఖం, భేరీ, మృదంగం మున్నగు వివిధ వాయిద్యాలు మ్రోగుతూ సాగుతూ వుండాలి. ఈ విధముగా రథాన్ని నగర వీధుల్లో తిప్పాలి. తరువాత నగర ప్రదక్షిణము చేయించాలి. తరువాత దాన్ని స్వస్థానానికి గొనిరావాలి. హారతిచ్చి బ్రహ్మదేవుని ఆయన మందిరంలో స్థాపించాలి. ఈ రథయాత్రలో పాల్గొన్న వారందరికీ బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. దీపావళి రోజున బ్రహ్మాలయానికి దీపాలంకారణ చేసిన వారికి బ్రహ్మలోకనివాసం సిద్ధిస్తుంది. మరునాటి ప్రతిపదనాడు బ్రహ్మపూజను చేసి మంచి బట్టలతో ఆభరణాలతో అలంకరించుకోవాలి. ఈ ప్రతిపదతిథి బ్రహ్మకి చాలా ఇష్టం. ఆయన తన భక్తులు అందంగా ఆనందంగా కనబడాలని కోరు కుంటాడు. ఈ తిథినాడే బలిచక్రవర్తి యొక్క రాజ్యపాలన ప్రారంభమైంది. ఈ దినాన బ్రహ్మను పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన వానికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. చైత్రమాసంలో కృష్ణ ప్రతిపద దినమున, అంటే హెూలీ మరునాడు, చండాలుని స్పృశించి స్నానం చేస్తే ఆధివ్యాధులన్నీ నశిస్తాయి. ఆ రోజు గోవులను, మహిషాలను బాగా అలంకరించి బ్రహ్మమండపానికి దిగువనుంచి పూజించాలి. బ్రాహ్మణులను భోజనాలచే తృప్తులను చేయాలి. చైత్ర, ఆశ్వియుజ, కార్తిక ప్రతిపద దినాలు మంచివి. వీటిలో కార్తిక ప్రతిపదం పరమ శ్రేష్ఠము. ఈ దినం గావించే స్నాన దానాది పవిత్ర కార్యాలకు మామూలుకు నూరురెట్లు పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే దీనిపై బలి చక్రవర్తి ప్రభావముంటుంది. “