భవిష్య పురాణము

86 - మదన ద్వాదశి -మరుద్గణాల ఆఖ్యానం

“శ్రీకృష్ణ చంద్రా! దైత్యమాత దితి మరుద్గణాలను పుత్రులుగా పొందిందనీ ఆమె దానికై ఒక గొప్ప వ్రతాన్నాచరించిందనీ విన్నాను. నాకా వ్రత విషయాన్ని తెలుప వలసిందిగా మిమ్ము ప్రార్థిస్తున్నాను” అన్నాడు ధర్మరాజు.

చెప్పసాగాడు మదన జనకుడు.

“ధర్మనందనా! ఆ వ్రతం పేరు మదన ద్వాదశీ వ్రతం వసిష్ఠాది మహర్షులు ఆమెకీ వ్రతాన్నుపదేశించారు. చైత్ర శుద్ధ ద్వాదశి నాడీ వ్రతాన్ని చేయాలి. ఛిద్రరహితమైన ఒక కుండను తెల్ల బియ్యంతో నింపి ఒకచోట స్థాపించాలి. దానికి తెల్లచందనాన్ని పూసి రెండు తెల్లని బట్టలతో చుట్టాలి. ఆ సమీపంలోనే విభిన్న ప్రకారాల ఋతుఫలాలనూ, చెఱకుముక్కలనూ వుంచాలి. రకరకాల తినుబండారాలను కూడా పెట్టాలి. ఆ ఘటంపై యథాశక్తి బంగారమును ముక్కలు చేసివుంచి వాటిపై నొక బెల్లం నింపిన రాగిపాత్ర నుంచాలి. దానిపై అరిటాకుల నుంచి వాటిపై కామదేవుని ప్రతిమనూ దాని వామభాగంలో చక్కెరతో చేసిన రతీదేవి బొమ్మనూ అమర్చాలి. గంధ, ధూపాది ఉపచారాలతో వీరిని పూజించి గీత, వాద్యాలనూ, విష్ణు కథాశ్రవణాన్నీ ఏర్పాటు చేయాలి. ఇలా రాత్రంతా ఉత్సవం చేయించి తెల్లవారినాక ఆ ఘటాన్నీ పాత్రనీ బ్రాహ్మణునికి దానం చేయాలి. భక్తి పూర్వకంగా బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వ్రతిమాత్రం ఉప్పులేని భోజనాన్ని తినాలి. బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి ఇలా అనాలి ‘సంపూర్ణ ప్రాణికోటి హృదయాలలో స్థితుడై ఆనందనామంతో పిలువబడే జనార్దనుడీనాడు కామదేవ స్వరూపుడై నా ఈ వ్రతాన్నంగీకరించి నాపట్ల ప్రసన్నుడు కావాలిగాక.’

ఇలాగే ప్రతి మాసమూ మదన ద్వాదశీ వ్రతాన్ని చెయ్యాలి. వ్రతి ద్వాదశిరోజున ఉసిరికాయను మాత్రమే తిని నేలపై శయనించాలి. త్రయోదశినాడు విష్ణుభగవానుని పూజించాలి. ఇలా పన్నెండు నెలలు చేసి పదమూడవనెలలో  ఘృతధేను సహిత సమస్త సామగ్రులతో సంపన్నమైన శయ్యనూ, కామదేవుని స్వర్ణప్రతిమనూ పాలిచ్చే తెల్లావునూ బ్రాహ్మణునికి సమర్పించాలి. ఆపై యథాశక్తి బ్రాహ్మణ దంపతులను పూజించి వారికొక శయ్యనూ సుగంధ ద్రవ్యాలను సమర్పిస్తూ వారిలో రతీమన్మథుల నారోపించుకొని ‘మీరు నా పట్ల ప్రసన్నులు కండి’ అని ప్రార్థించాలి. పిమ్మట ధర్మజ్ఞుడైన ప్రతి కామదేవ నామ సంకీర్తనం చేస్తూ ఆవుపాలతో తయారుచేసిన హవిస్సులతో శ్వేత తిలలతో హవనం చేయాలి. తదుపరి విశాల హృదయంతో బ్రాహ్మణులకు భోజనాలుపెట్టి వారికి చెఱకు గడలనూ పూమాలలనూ సమర్పించాలి. ఈ ప్రకారంగా మదనద్వాదశిని అనుష్టించిన వారికి ఈలోకంలో శ్రేష్ఠపుత్ర ప్రాప్తి, సర్వసౌభాగ్యాలూ కలిగి, పాపాలన్నిటి నుండి విముక్తి ఏర్పడి, దేహాంతంలో విష్ణు సారూప్యం లభిస్తుంది.

దితి యొక్క ఈ వ్రతం వల్ల ప్రభావితుడైన ఆమె భర్త కశ్యప మహర్షి ఆమె సమీపానికి వచ్చి పరమ ప్రసన్నుడై ఆమెకు రూప - యౌవన సంపదలను ప్రసాదించి ఇంకా ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. ఆమె ఇలా కోరింది: ‘గొప్ప ఆత్మ బల సంపన్నుడు, అమిత పరాక్రమవంతుడు, ఇంద్రుని వధించగల సమర్ధుడునగు పుత్రుడు కావాలి’ వెంటనే ‘తథాస్తు’ అన్నాడు కశ్యపుడు. కొన్నాళ్ళకే గర్భవతి అయింది దితి. మహాజ్ఞానీ, గొప్ప బోధకుడూనైన కశ్యపుడు గర్భరక్షణ నెలా చేసుకోవాలో దితికి బోధించాడు. ‘సంధ్యాకాలంలో భోజనం చేయకూడదు. వృక్షమూలం వద్ద కూర్చొనరాదు. ఇంటి సామానులైన రోలు, తిరగలి మున్నగు వాటిపై కూర్చొనరాదు. నీటిలోకి దుమికి స్నానం చేయరాదు. శ్మశానానికి వెళ్ళకూడదు. వాద వివాదాలు, సాము గరిడీలు చేయరాదు. జుత్తు విరగబోసుకోకూడదు. ఎప్పుడూ శుచిగానే వుండాలి. (ఒకే ఒక క్షణంలో ఆమె అశుచిగా వుంటే అదే క్షణంలో ఇంద్రుడు ఆమె గర్భ విచ్ఛిత్తికి కారణమైన కథ ఈ పురాణంలోనే చెప్పబడింది. మహాత్ములేదీ అనవసరంగానో గొప్ప కోసమో చెప్పరు.) ఒక్కక్షణం కూడా అపవిత్రంగా ఉండకూడదు. ఉత్తరదిశ వైపు తలపెట్టి శయనించడంగాని, నేలపై తలను పెట్టి పడుకోవడంగాని కూడదు. నగ్నంగా వుండరాదు. ఆవేశం, ఉద్విగ్నత పనికిరావు. తడి కాళ్ళతో శయనించరాదు. అమంగళం పలుకరాదు. పగలబడి నవ్వకూడదు. గోరువెచ్చని నీటిలో ఔషధాలను కలిపి స్నానం చేయాలి. మంగళకరములైన కర్మలను చేపట్టి గురుజనులను సేవిస్తూ వుండాలి. చెడ్డ స్త్రీలతో మాట్లాడడం, గుసగుసలాడటం వర్ణించాలి. గుడ్డతో గాలి విసురుకోకూడదు. భయంకర బీభత్స దృశ్యాలను చూడడం, పిల్లలు పోయిన స్త్రీ వద్ద కూర్చొనడం, ఇరుగు పొరుగుల ఇళ్ళకు పోయి పెత్తనాలు వెలగబెట్టడం, పరుగులు పెట్టడం, మహానదిని దాటడం, అరగని తిండి తినడం, కఠిన వ్యాయామాలు చేయడం - ఇలాంటివన్నీ మాను కోవాలి. హృదయంలో మత్సరాన్ని ప్రవేశించనీయరాదు. ఔషధులను అవసరం మేరకు సేవిస్తూ నిత్యం భగవంతుని ధ్యానిస్తూ వుండాలి.’ అని చెప్పి ఆయన అంతర్ధానం చెందాడు. నూరేళ్ళకు ఆమె కడుపున మరుద్గణాలు పుట్టారు. ఇదీ మదన ద్వాదశీ వ్రత ఫలం.”