భవిష్య పురాణము

7 - వివాహ సంబంధి తత్త్వాల నిరూపణ; వివాహ యోగ్యకన్య లక్షణాలు ఎనిమిది రకాల వివాహాలు, ఉత్తమ దేశాల వర్ణన

“మహారాజా! బ్రహ్మ ఇంకా ఇలా చెప్పాడు. బ్రహ్మచారి యొక్క తల్లి నుండి ఏడు తరాలు వెనక్కి వెళ్ళినా ఆమె ఇంటి పేర్లలో కన్య ఇంటి పేరుండరాదు. అలాగే తండ్రి యొక్క గోత్రము ఈ కన్య యొక్క గోత్రము ఒకటి కారాదు. అటువంటి కన్య సంతానోత్పాదకానికి ప్రశస్తమనిపించుకొంటుంది. కన్యకి కనీసం ఒక అన్న లేదా తమ్ముడైనా వుండాలి. అంతేగాని (ఈ కన్య యొక్క పుత్రుడే ఆమె తండ్రికి పిండం పెట్టవలసి వస్తే ఆమెను పుత్రికాధర్మం గల కన్య అంటారు.) పుత్రికాధర్మం గల కన్య ప్రశస్తం కాదు. ధర్మ సాధన సజావుగా సాగాలంటే నాలుగు వర్ణాలవారూ తమ వర్ణానికి చెందిన యువతినే పరిణయమాడాలి.

వివాహాలలో ఎనిమిది రకాలున్నాయి. అవి బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య, ఆసుర, గాంధర్వ, రాక్షస, పైశాచ విధాలు.

ఉత్తమ కులానికి చెందిన మంచి శీల స్వభావాలున్న వరుని మామ యే స్వయంగా తన ఇంటికి పిలచి అలంకరించి, పూజించి కన్యనివ్వడం బ్రాహ్మ వివాహం.

యజ్ఞం చేస్తూ ఋత్విజుని అలంకృతుని చేసి పూజించి కన్యనివ్వడం దైవ వివాహం.

వరుని నుండి ధర్మార్థంగా ఒకటి రెండు జతల ఆవులను ఎద్దులను స్వీకరించి శాస్త్రోక్తంగా పిల్లనిచ్చి పెళ్ళి చెయ్యడం ఆర్షవివాహం.

వధూవరులనొకచోట చేర్చి “మీరిద్దరూ కలసి గృహస్థధర్మాన్ని నిర్వర్తించండి” అని చెప్పి పూజ చేసి కన్యాదానం చేయడం ప్రాజాపత్యం.

కన్యకూ, ఆమె యొక్క తండ్రికీ, ఆతని బంధువులకూ యథాశక్తి ధనాదులనిచ్చి స్వచ్ఛందంగా వరుడే కన్యను గ్రహించడం ఆసుర వివాహం.

కన్య, బ్రహ్మచారీ పరస్పరం ఇచ్ఛాపూర్వకంగా తమకు తామే చేసుకోనేది గాంధర్వం.

కన్యను అపహరించిగొనిపోయి తన ఇంట వరుడు చేసుకొనేది రాక్షసవివాహం.

అన్నిటికన్నా అధమమైనది నిదురిస్తున్న, కామం పట్టిన, లేదా మతిలేని కన్యను ఎవరూ చూడకుండా పట్టుకుపోయి వరుడే చేసుకొనేది పైశాచ నామకమైన వివాహం.

బ్రాహ్మ వివాహం ద్వారా పుట్టిన కొడుకు అటు పది తరాలనూ ఇటు పది తరాలనూ ఉద్ధరిస్తాడు. తనతో తన తరంతో కలిపి ఇరవై ఒకటి. దైవ వివాహం వల్ల పుట్టిన కొడుకు అటు ఏడు తరాలనూ ఇటు ఏడు తరాలనూ ఉద్ధరిస్తాడు. ఆర్ష వివాహం పుత్రుడు అటు మూడు, ఇటు మూడు, ప్రాజాపత్యం వాడు అటు ఆరు ఇటు ఆరు తరాలనుద్ధరిస్తారు.

బ్రాహ్మాది తొలి నాలుగు రకాల వివాహాలనుండి ఉత్పన్నులైన పుత్రులు బ్రహ్మతేజ సంపన్నులు, శీలవంతులు, రూపసులు, సత్త్వాది సద్గుణ యుక్తులు, ధనవంతులు, పుత్రవంతులు, యశస్వులు, ధర్మపరులు దీర్ఘజీవులు కాగలరు. మలి నాలుగు రకాల వివాహాల ద్వారా జన్మించినవారు క్రూర స్వభావులై, ధర్మాన్ని ద్వేషిస్తూ, మిథ్యావాదులౌతారు. సహజమేకదా బ్రహ్మ చెప్పినది, మహారాజా! నింద్యములైన వివాహ ఫలాలు నిందితచరితులౌతారు కదా! వరుని వద్దనుండి సొమ్ము తీసుకునేవాడు సంతానాన్ని అమ్ముకున్నట్టే కదా. పతి లేదా పిత వంటి సంబంధాలు ఆత్మాశ్రయాలు కావాలి గాని ధనాశ్రయాలు, మోహాశ్రయాలు కారాదు. ఆర్షవివాహంలోని గోదానాలు కూడా న్యాయం కాదు. కొంతే తీసుకున్నా ఎంతో తీసుకున్నా, ఇచ్చినా, అది కన్యకి విలువ కట్టడమే అవుతుందిగా. కాబట్టి వరుని పక్షమువారు వధువు కిచ్చు వస్త్ర భూషణాదులు ఆమెకే ఇచ్చివేయవలెను. ఈ విధంగా, బ్రహ్మచారి చేసుకునే వివాహమూ నివసించే దేశమూ కూడా ఉత్తమమైనవై వుండాలి.

ఓ రాజా! అపుడు ఋషులు బ్రహ్మకి అంజలి ఘటించి మరీ అడిగారు - దేవా! ఎక్కడ నివసిస్తే ధర్మమూ యశమూ వర్ధిల్లుతాయి - అని. ఏ దేశం లో ధర్మం నాలుగు పాదాలా నడుస్తుందో, విద్వాంసులెక్కడ ఎక్కువగా వుంటారో, అన్ని వ్యవహారాలూ శాస్త్రోక్త రీతుల్లోనే సంపన్నాలవుతాయో ఆ దేశమే ఉత్తమము, మరియు నివాసయోగ్యము అని బ్రహ్మ తెలిపాడు.

అపుడు మునీశ్వరులు మరల ‘హే భారత జన భాగ్యవిధాతా! విద్వజ్జనులు ఏయే శాస్త్రాలలో చెప్పబడినట్లు వ్యవహరిస్తారు? ధర్మశాస్త్రాలు ఎటువంటి నిర్దిష్ట సూచనలు గావించాయి?’ అంటూ కుతూహల పూర్వకంగా అడిగారు.

పరమేష్టి(పరమేష్టి అంటే బ్రహ్మ.) ఇలా జ్ఞాన ప్రదానం చేయసాగాడు. రాగ ద్వేషవిరహితులై, సజ్జనులైన విద్వాంసులు శుద్ధాంతఃకరణలతో నిత్యం చేసే ఆచరణలివి.

ఈ ప్రపంచంలో ఏ వస్తువును కూడా వాంఛించడం శ్రేష్ఠులు చేసే పనికాదు. కాని వేదాధ్యయనాన్నీ వేద విహిత కర్మాచరణాన్ని కోరికోరి మనసు పెట్టి చేయాలి. అయితే, సంకల్పం కలగాలి, సంకల్పానికి మూలం కామమే కదా అనే వాదముంది కానీ, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు భగవంతుని కరుణను గాని లోక కళ్యాణాన్ని గాని కాంక్షించి చేస్తే కామం కాదు.

ధర్మనిర్ణయం ఎలా చేయాలనేది ఒక ప్రశ్న. శ్రుతి, స్మృతి, సదాచారం, స్వంత ఆత్మ యొక్క ప్రసన్నత అనగా అంతరాత్మ ఆదేశం అనే నాలుగంశాలే ధర్మ నిర్ణయానికి ఆస్కారాలు. ధర్మ నిర్ణయాన్ని అనుసరిస్తూ ధార్మిక ధర్మజీవనాన్నే కొనసాగించే వారికి ఈ లోకంలో గొప్ప యశస్సూ, పిమ్మట ఇంద్రలోక ప్రాప్తీ కలుగుతాయి.

శ్రుతి అంటే వేదం. స్మృతి అంటే ధర్మశాస్త్రాలు అని ఇది వఱకే అనుకున్నాం కదా! ఈ రెండింటిపైనా అభాండాలు వేసి, కుతర్కానికి పాల్పడ్డ వాడెంతటి పండితుడైనా సరే సత్పురుషులు వానినీ, వాని వాక్కునీ తిరస్కరించవలసిందే. ఎందుకంటే వేద నిందకుడే నాస్తికుడౌతాడు.

సరస్వతీ - దృషవ్వతీ అను దివ్య నదుల మధ్యభాగం దేవతా నిర్మితమైన బ్రహ్మా వర్తదేశం. అక్కడి నాలుగు వర్ణాలలోనూ, ఉపవర్ణాలలోనూ ఏ ఆచారమైతే తరతరాలుగా పాటింపబడుతూ వస్తుందో అదే సదాచారము. కురుక్షేత్రము, మత్స్యదేశం, పాంచాల రాజ్యం, మథురయను పేరు గల శూర సేనము - బ్రహ్మర్షుల ద్వారా సేవింపబడి, నివసింపబడినవే అయినా బ్రహ్మావర్తం తరువాత చెప్పుకోవలసినవే. ఈ దేశాలలో పుట్టి పెరిగిన బ్రాహ్మణుల నుండే సర్వదేశ జనులూ సదాచారాన్ని నేర్చుకుని వెళతారు. హిమాలయ - వింధ్యాచలాలకు మధ్య వినశనానికి తూర్పుగా ప్రయాగకి పశ్చిమ దిక్కున నున్నది మధ్యదేశము. ఈ రెండు పర్వతాల మధ్యభాగంలోనే పూర్వ సముద్రం నుండి పశ్చిమ సముద్రం దాకా విస్తరించి యున్న ప్రాంతాన్ని ఆర్యావర్తమంటారు. ఇవి కాక కృష్ణసార మృగాలు యథేచ్ఛగా నిత్యం విహరించే ప్రదేశాలు యజ్ఞకర్మాచరణయోగ్యాలు.”