“శ్రీకృష్ణదేవా! ఒకప్పుడు అగ్నిదేవుడు అదృశ్యమైపోయాడని విన్నాను. మరి అప్పుడు అగ్ని కార్యాలెలా సాగాయి? దయచేసి చెప్పండి.”
“ధర్మరాజా! ఒకమారు ఉతత్తమునికీ అంగిరస మునికీ పరస్పర శ్రేష్ఠత విషయంలో వాదం వచ్చింది. తమలో ఎవరు తపస్సులో విద్యలో గొప్పవారో తేల్చి చెప్పాలని వారు బ్రహ్మనే ఆయన లోకానికి పోయి అడిగారు. ఆయన వెంటనే అందరు దేవతలనూ, లోకపాలకులనూ, దిక్పాలకునూ తన వద్దకు గొని రమ్మనీ వారి ముందర ఈ నిర్ణయం చేయబడుతుందనీ చెప్పాడు. బ్రహ్మదేవుని ఈ వచనాన్ని వినగానే వారిద్దరూ పోయి అందరినీ యక్ష రాక్షస కిన్నర ఋషులతో సహా పిలుచుకొచ్చారు. సూర్య భగవానుడు మాత్రం రాలేదు. బ్రహ్మ ఆదేశం మేరకు ఉతత్థముని మళ్ళా వెళ్ళి సూర్యుని పిలువగా ఆయన ‘స్వామీ! నేను వచ్చి వేస్తే ఈ జగత్తు అంధకారమయమై పోతుందని తెలిసీ నేనెలా రాగలను?’ అన్నాడు. ఆ ముని పోయి బ్రహ్మకు ఈ వైనాన్ని తెలుపగా బ్రహ్మ అంతా విని అంగిరామునిని (అంగీరస అని ఒక్క తెలుగులోనే కనిపిస్తోంది) సూర్యుని పిలుచుకు రమ్మని పంపించాడు. అంగిరామునికి కూడా సూర్యుడదే మాటను చెప్పగా ‘మీ స్థానంలో నేనుండి లోకాలను వెలిగిస్తాను. మీరు బ్రహ్మలోకానికి వెళ్ళిరండి’ అన్నాడా ముని. సూర్యుడు వెంటనే బయలుదేరి బ్రహ్మను చేరుకొని ‘దేవదేవా! నన్నెందుకు పిలిపించారు?’ అని అడిగాడు.
బ్రహ్మ ఆ విషయాన్ని విస్మరించి ‘ఓ సూర్యదేవా! మీరు వెంటనే మీ పనిలోకి వెళ్ళిపొండి. ఆ అంగిరాముని తన ప్రచండ తేజంతో లోకాలని వెలిగించడానికి బదులు కాల్చిపారేస్తున్నాడు. ఆ వేడికి లోకాలన్నీ మాడిపోయేలోగా మీరు మీ స్థానం చేరుకోండి’ అని హడావుడిగా ఆదేశించగా హుటాహుటిన తన స్థానాన్ని చేరుకొన్న సూర్యుడు పరమ తేజోమయుడైన అంగిరామునిని స్తుతించి సాదరంగా వీడ్కొలిపాడు. ఆ ముని మరల బ్రహ్మలోకానికి రాగానే అక్కడి దేవతలందరూ ముందే కూడబలుక్కున్నట్టుగా చేతులు జోడించి నిలబడి, ‘భగవన్! అంగిరామునీందా! అగ్నిదేవుడు అదృశ్యమయ్యాడు. మీ తపన, దాహక శక్తులను మేము స్వయంగా చూశాం కాబట్టి మిమ్మల్ని వేడుకొంటున్నాం. మేము అగ్ని దేవుని అన్వేషిస్తున్నాం. మా అన్వేషణ ఫలించే దాకా మీరు అగ్నిస్థానంలో వుండి ఆయన చేసే పనులన్నీ నిర్వర్తించండి’ అని ప్రార్థించారు. అంగిరాముని అగ్నిదేవుడై లోకాలను కాపాడాడు. కొన్నాళ్ళకు అగ్నిదేవుడు వచ్చి తన స్థానంలో నుండి దేవకార్యాన్ని సంపన్నం చేస్తున్న మునిని చూసి ప్రసన్నుడై ‘స్వామీ! ఇక మీరు విశ్రమించండి. మీకు ప్రత్యుపకారంగా నేనే మీకు బృహస్పతి నామక పుత్రునిగా జన్మిస్తాను. మీకు ఇంకా చాలామంది పుత్రులు పుడతారు’ అన్నాడు. ఈ వరాన్ని పొంది ప్రసన్నుడై అంగిరాముని అగ్నిస్థానాన్ని వదిలి వచ్చేశాడు.
ధర్మనందనా! అగ్నిదేవుడు తన పనిలోకి మరలి వచ్చినరోజు చతుర్దశి. ఆ తిథి అంటే ఆయనకు చాలా ప్రీతి. అందుకే ఆగ్నేయీ చతుర్దశి అనే పేరు దీనికి వచ్చింది. ఈరోజు శివునికై వ్రతాన్ని చేస్తారు కాబట్టి దీనికి రౌద్రీ చతుర్దశి అనే ప్రసిద్ధి కూడా కలిగింది. స్వర్గంలో దేవతలూ, భూమిపై మాంధాతా, మనువూ, నహుషాది మహారాజులూ ఈ తిథినాడు వ్రతం చేశారు. యుద్ధంలో మరణించిన పురుషులకూ, పాముకాటువల్లనో ఆత్మహత్య ద్వారానో పోయిన వారికి ఈ తిథి నాడు శ్రాద్ధం పెట్టాలి. వారికి సద్గతులు లభిస్తాయి. వ్రత విధానమేమనగా చతుర్దశినాడు ఉపవాసముండి గంధపుష్ప ధూపదీప నైవేద్యాదులతో త్రిలోచనుడైన పరమశివుని పూజించాలి. రాత్రి జాగరం చెయ్యాలి. దానికి అశక్తులైనవారు పంచగవ్యాలను ప్రాశించి నేలపై శయనించవచ్చు. మరునాడు మంత్రాల ద్వారా అగ్నికి నల్ల నువ్వులతో నూటయెనిమిది ఆహుతులనివ్వాలి. ప్రాతర్వేళనే స్నానం చేసి శివుని పంచామృతాలతో అభిషేకించి పూజించి అగ్నికిచ్చినట్లే ఆహుతులివ్వాలి. ఆయనకు ఆరతులిచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలిచ్చి వ్రతి మౌనంగా భోంచేయాలి. ఇలా ఒక సంవత్సరంపాటు చేసి శివుని స్వర్ణ ప్రతిమను నిర్మించి దానిని వెండి వృషభంపై కూర్చుండబెట్టి రెండు శ్వేత వస్త్రాలతో కప్పి రాగిపాత్రలో స్థాపించాలి. తరువాత గంధం, తెల్లపూలు, ధూప దీపనైవేద్యాదులతో దానిని పూజించాలి. పిమ్మట ఆ మొత్తం సామగ్రిని బ్రాహ్మణునికి సమర్పించాలి. ఈ పద్ధతిలో వ్రతాన్నాచరించినవారు దీర్ఘాయువులై తీర్థంలో ప్రాణపరిత్యాగం చేసి శివలోక ప్రాప్తి నొంది అక్కడ దేవతలతో విహరిస్తారు. పెద్ద కాలముండి మరల భూమిపై ఐశ్వర్య సంపన్నులై, ధర్మపరాయణులైన రాజులుగా జన్మిస్తారు. పుత్రపౌత్రాదులతో సఫల మనోరథులై సుఖంగా జీవిస్తారు.