కలియుగంలో పెక్కు ప్రాణులకు యజ్ఞాలుగానీ దానాలుగానీ చేసే శక్తివుండదు కదా, మరి అలాటి వారెలా తరిస్తారని ధర్మజుడడుగగా స్వామి ఇలా చెప్పాడు:
“ఓ దయార్ద్ర హృదయా! నీకొక రహస్య పూర్ణ విషయాన్ని చెప్తాను విను. ప్రళయ కాలంలో భూమి నీటిలో మునిగిపోయి రసాతలందాకా వెడలి పోయినపుడు ఆమె తన నుద్ధరించే సాధనంగా ఒక వ్రతాన్ని చేసింది. వ్రత ప్రభావం వల్ల ప్రసన్నుడైన మహావిష్ణువు వారాహ రూపమును ధరించి ధరణినుద్ధరించి యథాస్థానంలో స్థాపించాడు. వ్రతవిధానం ఇలా వుంటుంది:
మార్గశిర కృష్ణ దశమినాడు ప్రాతఃకాలమే నిత్యకృత్యాలన్నీ చూసుకొని దేవార్చన హవనాది కర్మలను విధి విధానంగా గావించాలి. ఆరోజు పవిత్ర, అత్యల్ప హవిష్యాన భోజనం చేయాలి. తరువాత అయిదడుగులు నడచి చేతులూ కాళ్ళూ కడుక్కొని పాలుకారే చెట్టు యొక్క ఎనిమిదంగుళాల కర్రతో పళ్ళు తోముకోవాలి. ఆచమనం చేసి నీటితో అంగాలను స్పృశించుకొని ఆరోజంతా జనార్దనుని ధ్యానంలోనే గడపాలి. ఏకాదశినాడు ఉపవాసముండి భగవానుని నామాలన్నిటితో జపంచేస్తుండాలి. ద్వాదశిరోజు పెందలకడనే నదిలో లేదా ఒక పవిత్ర జలాశయంలో స్నానంచేయాలి. కాని, అంతకు ముందే జలాశయ తీరంలోని పవిత్ర, శుద్ధమైన మట్టిని ఒంటికి రాసుకొని నోటిలో వేసుకుంటూ ఈ క్రింది మంత్రాన్ని పలకాలి:
ధారణం పోషణం త్వత్తో భూతానాందేవి సర్వదా।
తేన సత్త్వేన మాంపాహి పాపాన్మోచయ సువ్రతే॥ (ఉత్తరపర్వం-83/17)
తరువాత ఆ మట్టిని సూర్యునికి చూపించి నమస్కరించి ఒంటికి పూసుకొని స్నానం చేయాలి. అప్పుడు ఆచమనం చేసి దేవమందిరంలోకి పోయి విష్ణు భగవానునికి అంగపూజ చేయాలి. నారాయణుని కెదురుగా నాలుగు మట్టికుండలను పెట్టి వాటిని నీటితో నింపి నాలుగు సముద్రాలనూ వాటిలో పరికల్పనం చేసి స్థాపించాలి. ఆ నాలుగు కుండలపై నువ్వులు నింపిన పాత్రలను పెట్టాలి. కుండలో మధ్యలో ఒక పీటపై జలపాత్రనుంచి దానిలో బంగారంతో, వెండితో లేదా కఱ్ఱతో చేసిన మత్స్యావతార భగవానుని ప్రతిమను స్థాపించాలి. యథావిధి ఉపచారాలతో ఆ స్వామినిపూజించి ఆ రాత్రంతా అక్కడే జాగరముండాలి. తెల్లవారినాక నిత్యస్నానానంతరం ఋగ్వేది, యజుర్వేది, సామవేది, అథర్వవేది ఈ తరగతుల బ్రాహ్మణులను పూజించి ఈ నాలుగుకుండలనూ వారికిచ్చెయ్యాలి. బ్రాహ్మణదంపతుల నాహ్వానించి సత్కరించి వారికి మత్స్య ప్రతిమను దానం చేయాలి. బ్రాహ్మణులందరినీ పాయసంతో కూడిన భోజనంతో సంతృప్తి పఱచి తరువాత వ్రతి కూడా భోంచెయ్యాలి. మహారాజా! ఈ ప్రకారంగా మార్గశిర కృష్ణద్వాదశి వ్రతం చేసిన వానికి దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది. జన్మాంతరాలలో చేసిన బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా దగ్ధమైపోతాయి. మనసులో ఏ వాంఛలేకుండా ఈ వ్రతాన్ని చేసేవారికి బ్రహ్మలోక నివాసం, నిస్సందేహంగా ప్రాప్తిస్తుంది.
పుష్య శుక్ల ద్వాదశినాడు కూడా ఇలాగే స్నానాదులుగావించి శ్రీమన్నారాయణుని కూర్మరూపాన్ని పూజించాలి. ఇలా అన్ని మాసాల శుక్ల ద్వాదశులలో భగవంతుని ఇతర అవతార ప్రతిమలకు క్రమంగా ఇదే పద్ధతిలో చేయాలి. చివరగా భాద్రపద శుక్ల ద్వాదశినాడు కల్కిదేవుని ప్రతిమ పూజింపబడాలి.
ఈ దశావతార పూజనం ముగిసిన వెనుక ఆశ్వియుజ శుక్ల ద్వాదశినాడు పద్మనాభుని ప్రతిమకూ, కార్తీకమాసంలో వాసుదేవ ప్రతిమకూ పూజలు చేసి ఎప్పటిలాగే చతుర్వేదులకూ బ్రాహ్మణ దంపతులకూ భోజనదానాల తరువాత దీనులనూ, అనాథులనూ సాదరంగా ఆహ్వానించి వారిని భోజనాలతో బట్టలతో ఆనందింపజేసి ప్రతి భుజించాలి.
మహారాజా! ఈ విధంగా పన్నెండు ద్వాదశులలోనూ ఈ వ్రతాన్నాచరించిన వారికి పాపాలన్నీ కడుక్కుపోయి విష్ణు సాయుజ్యం లభిస్తుంది. ధరణీదేవి తొలుతగా ఈ వ్రతాన్ని చేసింది కాబట్టి దీనిని ధరణీ వ్రతమన్నారు. ప్రాచీనకాలంలో దక్షప్రజాపతి ఈ వ్రతాన్నాచరించి ప్రజాధ్యక్ష పదవిని పొందాడు. యువనాశ్వమహారాజు ఈ వ్రతం ద్వారానే మహనీయుడైన మాంధాతను పుత్రునిగా వడసి తాను దేహాంతంలో శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తినందినాడు. హైహయాధిపతి కృతవీర్యుడు ఇలాగే కార్తవీర్యార్జునునీ, శకుంతల దుష్యంతుని పతిగా, భరతుని పుత్రునిగానూ పొందారు. తరువాత విష్ణు సాయుజ్యాన్ని పొందారు.