భవిష్య పురాణము

4 - జీవనంలో దోషవర్ణన

“భగవాన్! ఈ జీవుడు ఎట్టి కర్మల వల్ల దేవతా, మనుష్య, పశు మొదలగు యోనుల్లో పుడతాడు? ఏ కర్మ వల్ల భయంకర, దారుణ గర్భవాసమనే కష్టం ప్రాప్తిస్తుంది? ఏ కర్మవల్ల జీవుడు రూపసి, ధనవంతుడు, పండితుడు, పుత్రవంతుడు, త్యాగి, కులీనుడు అవుతున్నాడు?’ ఏ కర్మవలన రోగరహిత జీవనం లభిస్తుంది? సుఖపూర్వక మరణం ఎలా సాధ్యం? ఇదంతా లోతుకి పోతేగాని బుఱ్ఱకెక్కేలాగ లేదు. ఓ విమలమతీ! మీరే ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలి” అని అభ్యర్థించాడు ధర్మరాజు.

“మహారాజా! స్థూలంగా చెప్పాలంటే ఉత్తమ కర్మలవల్ల దేవయోని నుండి, మిశ్రమ కర్మల వల్ల మానవగర్భాన, పాపకర్మవల్ల పశువుల కడుపు ద్వారా జీవులు జన్మిస్తారు. ధర్మాధర్మ నిశ్చయానికి శ్రుతులే ప్రమాణము. పాపంవల్ల పాపయోని పుణ్యం వల్ల పుణ్యయోని ప్రాప్తిస్తాయన్నది ఇలా చెప్పబడింది:

శుభైర్దేవత్వ మాప్నోతి మిశ్రైర్మానుషతాంవ్రజేత్

అశుభైః కర్మభిర్జంతుస్తిర్యగ్యోనిషు జాయతే

ప్రమాణం శ్రుతిరేవాత్ర ధర్మాధర్మ వినిశ్చయే

పాపం పాపే నభవతి పుణ్యం పుణ్యేన కర్మణా (ఉత్తరపర్వం-4/6,7)

గర్భంలో పెరుగుతున్న బిడ్డకి ఎనిమిదవ నెలవచ్చేసరికల్లా అన్ని అంగాలూ ఏర్పడి పోతాయి. తలపై నూగు కూడా వచ్చేస్తుంది. తల్లి నాభి నుండి ఆహారం కూడా అందుతుంటుంది. సుఖదుఃఖాలు తెలియడం మొదలౌతుంది. ప్రాణి ఈవిధంగా దుఃఖిస్తుంది, ‘నేనిప్పటికి ఎన్నోమార్లు గర్భమనెడి చీకటి గుహలో పడ్డాను. అక్కడి నుండి అన్ని వెలుగులూ ఉన్న మరొక గుహలో పడ్డాను. ఎందుకు బతుకుతున్నానో తెలియకుండా బతికేసి మృత్యువాత పడ్డాను. మళ్ళీ మరొక చీకటి గుహ, ఇంకొక కాంతి శరపంజరం. మరల మృత్యుబాధ. ఇప్పుడు మళ్ళా చీకటి గుహలో వున్నాను. లోకంలోకి వెళ్ళబోతున్నాను. ఈమారెన్ని బాధలు పడాలో, దుఃఖాలనుభవించాలో!?”

ఇలా చింతిస్తూనే మోక్షం గురించి ఆలోచిస్తుంది జీవి. మొన్నా నిన్నా చేసిన తప్పులు నేడు చేయకపోతే రేపు అనేది వుండదని ఆశపడుతుంది. గర్భంలో వున్నప్పుడు ఏదో పర్వతం కింద నలిగిపోయి అతికష్టంమీద కదులుతున్న బాధ వుంటుంది. గర్భంలో జఠరాగ్ని ఓ పక్క నుండి కాల్చేస్తున్నట్టుంది. సూదులతో మెత్తటి ఒళ్ళంతటా పొడుస్తున్నట్లుంటుంది. నిజానికి గర్భవాస జీవనం కంటె క్లేశతరమైనది లేదు. గర్భంలోంచి పైకి వస్తున్నప్పుడు జీవికి కలిగే బాధ వర్ణనాతీతం. అతి ప్రబలమైన ప్రసవ వాయుప్రేరణవల్ల జీవి బయటికొస్తుంది. అప్పుడు దానికి కలిగే బాధను, నువ్వులు పిండి నూనె తీసేటప్పుడు ఆ నువ్వులకే గనక ప్రాణం వుంటే, అవి పడే బాధతో కొంతవఱకు పోలిక తేవచ్చు. ఏ శరీరానికైతే నోరే ద్వారమో, పెదవులే కవాటాలో, ఇంద్రియాలు గవాక్షాలో, దంతాలు, జిహ్వ, గొంతు, వాతం, పిత్తం, కఫం, జర, శోకం, కామం, క్రోధం, తృష్ణ, రాగం, ద్వేషం మొదలగునవి ఉపకరణాలో ఆ దేహం అసత్యం, అనిత్యం. దానిలోనే నిత్యమైన ఆత్మ వుంటుంది. అనిత్యమైన శరీరమే శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైన ఆత్మకు కొన్నేళ్ళపాటు నివాస గృహంగా నిలబడుతుంది. ఐతే శుక్ర, శోణితాల సంయోగం వల్ల పుట్టి, నిత్యం మూత్ర, విష్ఠాదులతో నిండి వుండే ఈ శరీరం అపవిత్రం. సామాన్య స్నానాల వల్ల అదేమీ పవిత్రమైపోదు. పంచగవ్యాది పవిత్ర పదార్థాలు కూడా ఈ శరీర సంసర్గం వల్ల అపవిత్రాలైపోతాయి. కాబట్టి ఇంతకంటే అపవిత్ర వస్తువింకేముంటుంది? ఉత్తమ భోజనాలు, తాంబూలాది కమ్మటి పదార్థాలు ఈ దేహ సంసర్గమువల్ల మలంగా మారిపోతున్నాయి. ఎన్ని సుగంధాలు పూసినా దీనికి శాశ్వత వాసనరాదు. విచిత్రమేమిటంటే ఇవన్నీ తెలిసీ, ఇదంతా చూస్తూ కూడా మానవులు తమ శరీరాలను అసహ్యించుకోకపోగా దానినే లేదా వాటినే ప్రేమిస్తారు.

ఇక పూర్వజన్మల్లో చేసిన తప్పులను మరి చేయననీ, మోక్షానికి సాధనంగానే ఈ బ్రతుకును మోస్తాననీ గర్భంలో నున్నప్పుడు ఒట్టుపెట్టుకున్న ఆత్మకు, దైవమాయచేత, నేలమీద పడ్డాక అవేవీ గుర్తురావు. పూర్వజన్మను పూర్తిగా మరిచిపోతుంది ఈ ఆత్మ. మరల జన్మనెత్తిన ఈ జీవి తనను తానే కాదు, భగవంతుని కూడా పూర్తిగా మరచిపోయి సాంసారిక వ్యవహారాల్లో ఆసక్తిని, దానిపై రక్తినీ సుఖభోగాలపై అనురక్తిని పెంచుకుంటూ పోయి మరల అవే దుఃఖాలను అనుభవిస్తూ ఒకప్పుడు చేసిన పాపాలనే చేస్తుంటుంది. కన్నులుండీ దేవుని చూడలేదు. బుద్ధి తెలిసీ మంచిచెడులను విభజించలేదు. ఇలా చక్కటి దారిలో కూడా కాలుజారి పడిపోవడం మోహజనితమైన మాయ. దివ్యదర్శులైన మహర్షులు ఈ గర్భావాస విషయాలన్నిటినీ విపులంగా వర్ణించి చెప్తూనే వున్నారు. మనిషి వింటూనే వున్నాడు. ఐనా వానికి వైరాగ్యం కలగడం లేదు. తనకేది మంచిదో, శుభకరమేదో తెలియడం లేదు. ఇది మహాశ్చర్యము కదా!

బాగా ఆలోచిస్తే బాల్యావస్థ దుఃఖకరమే కదా! బాలకులు తమకేమి కావాలో చెప్పలేరు. తాము చేయదలచుకున్నది ఏదీ చేయలేరు. ఏ విషయం మీదా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చలేరు. ఈ అసమర్థతను తట్టుకోలేకనే రోదిస్తుంటారు. పెద్దల కర్థం కాదు. దంతాలు దుఃఖాన్ని మొలిపిస్తాయి. బాలగ్రహాలు మీద పడతాయి. ఆకలి, దాహం కలుగుతుంటాయి, చెప్పడం రాదు. పాకుతున్న కాలంలో అభక్ష్య భక్షణం జరిగి మరిన్ని బాధలు పుట్టుకొస్తాయి. కుమారావస్థలో చెవికుట్లు గట్టిగానే ఏడిపిస్తాయి. గురువుగారిని తలచుకుంటేనే భయమేస్తుంది. చెప్తే తల్లిదండ్రులు నవ్వుతారు. గట్టిగా వెళ్ళనని మొరాయిస్తే మొట్టికాయలు తప్పవు. అన్నీ తిని (దెబ్బలు, లడ్లు కావు) వెళ్లడమూ తప్పదు.

జీవితానికి వసంతమనే మాటేగానీ యవ్వనమూ సుఖకరం కాదు. అనేక ప్రకారాల ఈర్ష్యలు మనసులో పుట్టి దాన్నే కాల్చేస్తుంటాయి. మనసు మోహంలో లీనమైపోతుంది. రాగాసక్తి తొలినుండే యేడిపిస్తుంది, రాత్రి నిద్ర పోనివ్వదు.

అవ్యక్తేంద్రియవృత్తిత్వాద్ బాల్యే దుఃఖమహత్వునః

ఇచ్ఛన్నపినశక్నోతి కర్తుం వక్త్రుంచ సత్ర్కియాం

దంతోత్థానే మహద్దుఃఖం మౌలేన వ్యాధినా తథా

బాలరోగైశ్చ వివిధైః పీడా బాలగ్రహైరపి

క్రిమిభిస్తు ద్యమానస్య కుష్ఠినః కామినస్తథా

కండూయనాగ్ని తాపేన యద్భవేత్ స్త్రీషుతద్ధితాత్

 (ఉత్తరపర్వం - 4/63, 64, 71)

కాబట్టి స్త్రీ వల్ల కూడ దుఃఖమే ఎక్కువ.

యౌవనం క్రమక్రమంగా వార్ధక్యం కోరల్లోకి వెళ్ళిపోతుంది. స్త్రీ పురుషులు ఒకరి వలలో నొకరు ఆకర్షణ కొద్దీ పడ్డవారైతే ఆ ఆకర్షణ అనే వల తెగి, చిరిగిపోతుంది. ప్రేమబంధం దృఢంగా లేనిచోట పరస్పర ఘృణ ఉత్పన్నమవుతుంది. వినికిడి శక్తి తగ్గడంతో మనతో, మాట్లాడడానికెవరూ ముందుకి రారు. మనమే ఎంత ముఖ్య విషయమైనా మరోమారు అడిగితే, ఈ ఒకనాటి ప్రియ సన్నిహితులందరూ విసుక్కుంటారు. అప్పుడు కూడా విరక్తుడు కాకుండా, భగవంతుని తలవకుండా ఎవడైనా వుంటే వాడికన్న మూర్ఖుడుండడు.

వృద్ధాప్యంలో కొడుకులూ, మనుమలూ, బాంధవులూ, దురాచారులైన సేవకులూ వ్యక్తిని పట్టించుకోరు. ఒక్కొక్కప్పుడు కసికూడా తీర్చుకుంటుంటారు. దానితో మనసు చెడుతుంది. ధర్మమనే అతిముఖ్యమైన పురుషార్ధం శక్తి లేక మూలన పడుతుంది. ఎందుకంటే శరీరం కూడా చెడి, రోగంపాలై, అసమర్థమైపోతుంది కదా!

వాస్తవానికి మన శరీరంలో అనేక మృత్యు స్థానాలుంటాయి. వాటిలో కాలమృత్యువు ప్రముఖమైనది, తప్పనిది. ఇంకొకటి వస్తూ పోతూ వుండే భయంకరమైన ఆధి - వ్యాధి రూపకమైనది. ఇది అర్ధమృత్యు సమానం. దీనిని జపతపాల ద్వారా, ఔషధ సేవనం ద్వారా వెనక్కినెట్టవచ్చు. కాలమృత్యువు వద్ద మాత్రం ఏ ఉపాయమూ పనిచెయ్యదు. రోగం, సర్పం, శస్త్రం, విషం, పులి, సింహం, దస్యులు - ఇవన్నీ ప్రాణి వర్గాలకు మృత్యుద్వారాలే. కాలమృత్యువు కాని దాని నుండి మాత్రమే రక్షణ వుంటుంది. అందువల్ల మృత్యువు కన్న భయంకర రోగంగానీ, భయంగానీ, శంకగానీ, దుఃఖంగానీ లేదు. భార్య, పుత్రులు, కూతుళ్ళు, మిత్రులు, రాజ్యం, ఐశ్వర్యం- ఇలా వేటికోసమైతే మానవుడు బ్రతుకుతుంటాడో వాటన్నిటికీ అతన్ని దూరం చేస్తుంది ఈ మృత్యువు. వైరాన్ని కూడా దూరం చేస్తుంది.

మానవుని ఆయుఃప్రమాణం నూరేళ్ళు. కాని చాలామంది డెబ్భై ఎనభై దాటరు. అరవైదాకా ఎక్కువమంది జీవిస్తారు. పూర్వకర్మానుసారం మనిషి పుట్టకముందే వాడెన్నాళ్ళు లేదా ఎన్నేళ్ళు బతుకుతాడో నిశ్చితమై పోయి వుంటుంది. ఈ బతుకులో సగభాగం రాత్రే కదా! అది నిద్ర వల్ల నిరర్థకంగానే గడిచిపోతుంది. బాల్యంలోనూ, వృద్ధాప్యంలోనూ మనిషి చేయగలిగిన దేమీ వుండదు. యువావస్థలో అనేక ప్రకారాల చింత, కామవ్యథ మనిషిని ఇంకే పనీ చేయనివ్వవు. ఇంతలోకే కాలం మూడి మృత్యువు కదలివచ్చేయడంతో మానవ జన్మ ఒకటి దండగైపోతుంది. కప్పని పాము మింగేసినట్టుగా మనిషిని మృత్యువు పట్టుకుపోతుంది. ‘నా ధనాన్నెవరు రక్షిస్తారు? నా కుటుంబాన్నెవరు కాపాడుతారు’ అని తెగ యాతనపడి పోతూ ఈ లోకం నుండి మనిషి నిష్క్రమిస్తాడు- ఆత్మ బయటపడగానే.

వివేకవంతుడైన మానవునికి ఈ మృత్యువు కన్న నెక్కువ దుఃఖతరం యాచన చేయవలసి రావడం. మృత్యువు వల్ల వచ్చే దుఃఖం క్షణికం. యాచన వల్ల వచ్చే యాతన నిరంతరం విష్ణు భగవానుడంత వాడే యాచన చేయాల్సి వచ్చేసరికి కుంచించుకుపోయి వామనుడై పోయాడు కదా! ఇక ఇతరుల పరిస్థితి చెప్పనేల? ఎవరికైనా యాచించగానే ముందుగా పోయేది ప్రతిష్ఠ. మానవజీవిత ఆదిమధ్యాంతాలలో స్థిరంగా నిరంతరాయంగా నిలిచేది బాధ ఒక్కటే. అతిగా తిన్నా, తినకపోయినా కలిగేది దుఃఖమే. ఆకలి బాధను మించిన నరకమే లేదు. అన్నం తాత్కాలికంగా ఆకలి బాధను ఆపగలదేమోగాని అదీ పరమ సుఖ సాధనమేమీ కాదు.

ఇక ధనం. దీన్ని సంపాదించడం కోసం పడే దుఃఖం, దానివల్ల వచ్చే సుఖం కన్న వెయ్యిరెట్లు ఎక్కువ. డబ్బు సంపాదించడం శ్రమ, ఖర్చు పెట్టడం దుఃఖం, దాచుకోడం కష్టం. అన్నిటికన్నా ఎక్కువ దుఃఖం దాన్ని కాపాడుకోవడం. ఎప్పుడు ఎవరు దాన్ని దోచుకుపోతారో అనే భయం వల్ల మనసు పూర్తిగా చెడిపోయి, బుర్రపాడైపోయి అన్నం నోటికెక్కదు, నిద్ర కంటికి రాదు. కాబట్టి ధనం కూడా సుఖకరం కాదు. సుఖదాయకమూ కాదు. రాజు, దొంగ, నీరు, అగ్ని వీరి వల్ల ధనవంతుడికెప్పుడూ ముప్పు వుండి భయపెడుతుంది. స్వజనులను కూడా అనుమానిస్తూనే జీవిస్తాడు ధనికుడు. అందువల్ల ఆప్యాయతలు, ఆత్మీయతలు లేని బతుకైపోతుంది వానికి. ఇక సుఖమెక్కడ? ఆకాశము నందు పక్షుల చేత, భూమిపై జంతువుల చేత, నీటిలో చేపల చేత భక్షింపబడు మాంసమువలె విత్తవంతుడు సర్వత్ర భక్షితుడగును. ఏదీ అక్కర్లేని వాడొక్కడే సుఖి.

హేమంతర్తువులో చలిబాధ, గ్రీష్మంలో మండుటెండ బాధ, వర్షర్తువులో జంఝావాతం ఇత్యాదులవల్ల ఏ కాలము ఏ ఋతువూ సుఖకరం కాదు. పెళ్ళయిందగ్గర్నుంచీ పిల్లలు పుడతారో లేదోనని బెంగ. పిల్లలు పుట్టిం దగ్గర్నుంచీ వాళ్ళు బతుకుతారో లేదో అని బెంగ, తీరా బతికాక, బాగుపడతారో లేదో అని బెంగ, బాగుపడ్డాక వాళ్ళ పెళ్ళిళ్ళ బెంగ, అవీ అయినాక వాళ్ళు తనను బాగా చూసుకుంటారో లేదోనని బెంగ. చాలామందికి ఇదే చివరి బెంగ. ఎందుకంటే వాళ్ళెలాగూ చూసుకోరు. వీడా బెంగతోనే పోతాడు.

రాజ్యం కూడా సుఖదాయకం కాదు. ఆ విషయం నీకన్న బాగా తెలిసినవాడుండదు. కాబట్టి ఓ ధర్మరాజా! ఈ కర్మమయ శరీరానికి పుట్టిం దగ్గర్నుంచి గిట్టేదాకా దుఃఖాలే దుఃఖాలు. ఏ మానవులైతే జితేంద్రియులై, వ్రత, దాన, ఉపవాసాదులలో తత్పరులై జీవిస్తారో వారే సుఖిస్తారు.”