భవిష్య పురాణము

61 - ధ్వజనవమీ వ్రత కథ

మహారాజా! భగవతి దుర్గాదేవి మహిషాసురుని చంపిన వెంటనే చెల్లాచెదరై పారిపోయిన రాక్షసులు మరల కూడుకొని దేవతలతో పలు పోరాటాలు చేశారు. దుర్గా దేవి ధర్మ సంస్థాపన కోసం అనేక రూపాలను ధరించి దైత్యులను సంహరించింది. మహిషాసురుని కొడుకు రక్తాసురుడనువాడు పెక్కేళ్ళు బ్రహ్మకొఱకు తపస్సు చేసి ఆయనను మెప్పించి త్రైలోక్యాధిపత్యాన్ని వరంగా పొందాడు. వెంటనే దైత్యులందరినీ కూడగట్టి భయంకరమైన సైన్యంతో దేవేంద్రుని అమరావతిపై దాడి చేశాడు. దేవగణాలన్నీ ఇంద్రుని అధ్యక్షతన దానినెదుర్కొన్నాయి. కొంతకాలానికి దేవతలు పరాజయం పాలై పారిపోగా రక్తాసురుడు అమరావతిని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకొని రాజ్యపాలన చేయసాగినాడు. దేవతలందరూ పోయి కరఛత్రాపురిలో నివాసమున్న దుర్గాదేవిని శరణు వేడారు. నవదుర్గలకు నెలవైన అచ్చోటనే చాముండీ దేవికలదు. దేవతలకక్కడ మహాలక్ష్మీ, నందా, క్షేమకరీ, శివదూతీ, మహారుండా, భ్రామరీ, చంద్రమంగళా, రేవతీ, హరిసిద్ధీ అను ఇతర ఎనిమిది దుర్గా రూపాలనూ దర్శించే అదృష్టం కూడా పట్టింది. దేవతలు ఈ రూపనామాలన్నిటితో అమ్మవారిని స్తుతించి ‘అమ్మా’! ఈ ఘోర సంకటస్థితి నుండి మమ్ము నీవే రక్షించాలి. మాకు మరో దారి లేదు’ మాకు మరో దారి లేదు’ - అంటూ పాదాలపై పడిపోయారు.

దేవతల ఆర్తవాణిని విని దేవి ఇరవై భుజాలతో వాటిలో ఇరవై వివిధాయుధాలతో సింహారూఢయై బయలుదేరింది. బ్రహ్మవరాలచే మదించిపోయిన అబ్రహ్మణ్యుడు రక్తాసురుడు ప్రచండ దైత్య గణంతో ఆమె నెదుర్కొన్నాడు. ఆ దైత్యగణంలో ఇంద్ర మారి, గురుకేశి, ప్రలంబుడు, నరకుడు, కుష్ఠుడు, పులోముడు, శంబరుడు, ఇల్వలుడు, దుందుభి, నముచి, భౌముడు, వాతాపి, ధేనుకుడు, మాయావృతుడు, కలి, బలబంధు, కైటభుడు, కాలజిత్తు, రాహువు, పౌండాది భయంకర వీరులెందరో వున్నారు. వీరు ప్రజ్వలితాగ్నుల వలె తేజస్వులు, వివిధ వాహనారూఢులు, సర్వవిధాస్త్ర శస్త్ర ప్రయోగ దురంధరులు. భగవతి దుర్గాదేవిపై శర, శూల, పరిఘ, పట్టిశ, శక్తి, తోమర, కుంత, శతఘ్ని, గద, ముద్గరాది అనేకాయుధాలను మెఱపు వేగంతో వారంతా కలిసి ప్రయోగించారు. దుర్గాదేవి క్రోధాగ్నులు చెలరేగగా కొంతమందిని ఆయుధాలతో చంపుతూ మరికొంతమందిని కనులతోనే కాల్చివేస్తూ క్షణంలోనే వందలమందిని సంహరించి వారి ఆయుధాలనూ ధ్వజాలనూ దేవతలకు బహూకరించింది. రక్తాసురుని కంఠమును ఒంటిచేతితో పట్టుకొని నేలపైకి విసరివేసి త్రిశూలంతో వాడిగుండెను చీల్చిపారేసింది. మిగిలిన కొద్దిమంది అసురులు ‘బతుకు జీవుడా’ అని చావుతప్పి కన్నులొట్టపోయి పారిపోయారు. ఈ ప్రకారంగా అమ్మదయవల్ల అఖండ విజయాన్ని అందుకొన్న దేవతలు ఆమెతో బాటు కరఛత్రపురికి మరలివచ్చి అక్కడొక విశేషమైన ఉత్సవాన్ని బ్రహ్మాండంగా చేశారు. నగరమంతా తోరణాలతో ధ్వజాలతో అలంకరించబడింది. వారంతా అమ్మను అనేక విధాల స్తుతించి అమరనగరికి ప్రస్థానించారు. నాటినుండి విజయాపేక్ష గల వారీవ్రతాన్ని చేసి కృతార్థులు కావడం జరుగుతోంది.

ఇక వత్ర విధానాన్ని వినిపిస్తాను. పుష్య శుద్ధనవమినాడు స్నానం చేసి పూజకి కావలసిన పుష్పాలను స్వయంగా కోసుకొని వచ్చి వాటితో సింహ వాసిని కుమారి భగవతిని పూజించాలి. రకరకాల ధ్వజాలను ఆమె సమ్ముఖంలో స్థాపించాలి. మాలతీపుష్పాలను, ధూపదీప నైవేద్య గంధచందనాదులనూ, వివిధ ఫల, మాలా, వస్త్రాలనూ, దధినీ, అగ్నిని అంటని వివిధ భక్ష్యాలనూ భగవతికి నివేదనం చేసి ఈ మంత్రాన్ని పఠించాలి.

రుద్రాంభగవతీం కృష్ణాం గ్రహం నక్షత్ర మాలినీం

ప్రపన్నోహం శివాం రాత్రిం సర్వశత్రు క్షయంకరీం  

తరువాత కుమారీమణులను, దేవీ భక్త బ్రాహ్మణులనూ సత్కరించి వారికి భోజనాలుపెట్టి ప్రతి మాత్రం ఏకభుక్తం పాటించాలి. ఇలా ధ్వజాలతో భగవతిని అలంకృతను చేసి అన్ని నియమాలతో ఈ వ్రతాన్ని నిర్వర్తించిన వారికి దొంగ, అగ్ని, నీరు, రాజు, శత్రువు మున్నగు భయాలుండవు. సర్వ సుఖాలూ భోగించి వీరులై, విజయులై వీర లోకప్రాప్తి నందుతారు.