విప్రవరులారా! శ్రీకృష్ణుడు అవతారం చాలించిన కొద్దిరోజులకే కలియుగ ఆగమనం జరిగింది. ఇది నాలుగువేల నాలుగువందల సంవత్సరాలు గడిచేసరికి భారత భూమి కొంత మ్లేచ్ఛాక్రాంతమయింది. న్యూహుడను పేరుగల యవనుడు ఈ సంపూర్ణ జగత్తునే మ్లేచ్ఛ పరిపూర్ణంగావించాడు. కలియుగంలో వేయి సంవత్సరాలు గడిచే సమయానికి దేవరాజు మహేంద్రుడు కశ్యపుడను బ్రాహ్మణుని బ్రహ్మావర్తానికి పంపించాడు. ఆయనను దేవశక్తియైన ఆర్యావతి ఆనందంగా వివాహం చేసుకొంది. వారికి పదిమంది కొడుకులు పుట్టారు. వారి పేర్లను ఇదివఱకే చెప్పుకోవడం జరిగింది కదా!
తరువాత కశ్యపుడు మిస్రదేశానికి విచ్చేశాడు. అక్కడున్న పదివేలమంది మ్లేచ్ఛులను తన వంశంలోకి తెచ్చుకొని బ్రహ్మావర్తానికి మరలివచ్చి వారందరినీ శిష్యులుగా తన ఆశ్రమంలో, ఆశ్రయంలో వుంచి గొప్ప విద్యావంతులుగా తీర్చిదిద్దాడు. వారంతా ఆ తరువాత సరస్వతీ దృషద్వతీ నదుల మధ్య శ్రేష్ఠ బ్రహ్మావర్తంలో స్థిరపడ్డారు. మనుధర్మ ప్రవర్తకుడైన కశ్యపుడు తన పుత్రుడు ద్విజశ్రేష్ఠుడునైన శుక్లుని పిలచి అతనికి ముందు మనుధర్మ శాస్త్రాన్ని క్షుణ్ణంగా ఉపదేశించి రైవత (గిరనార్) శిఖరం పైకిపోయి తపస్సు చేసుకొమ్మని ఆదేశించాడు. మిగతా పుత్రులకూ, శిష్యులకూ కూడా సనాతనమను ధర్మాన్నుపదేశించాడు.
శుక్లుడు తన తపస్సు ద్వారా సచ్చిదానంద విగ్రహుడు, జగన్నాథుడునైన వాసుదేవునికి సంతుష్టపరచాడు. ద్వారకానాథుడైన ఆ భగవానుడు దర్శనమివ్వడమే కాక అతని చేతిని పట్టుకొని తీసుకొనిపోయి తాను రెండువేల యేళ్ళ క్రింద పాలించిన దివ్య శోభా సంపన్నమైన ద్వారకానగరిని సముద్రతటానికి గొనిపోయి చూపించాడు. ఆ బ్రాహ్మణునికి సర్వజ్ఞత్వాన్ని ప్రసాదించి దేవకీ నందనుడంతర్ధానం చెందాడు. అపుడు శుక్లుడు అర్బుద (ఆబూ) పర్వతంపైకి వెళ్ళి అక్కడ తన సోదరులతో ఇతర బ్రాహ్మణులతో కలసి బౌద్ధులను పూర్తిగా ఓడించాడు. ఆ తరువాత హరికృపవల్ల ద్వారకను పునః ప్రతిష్టించగలిగాడు. ద్వారకలో శ్రీకృష్ణ ధ్యాన తత్పరుడై ప్రసన్నంగా జీవిస్తూ పశ్చిమ భారత వర్షాన్ని పదేళ్ళపాటు రాజుగా పాలించాడు.
నారాయణుని కృపవల్ల శుక్లునికి విష్వక్సేనుడను పుత్రుడు జనించాడు. అతడు ఇరువది సంవత్సరాలు రాజ్యపాలన చేయగా అతని పుత్రుడు జయసేనుడు ముప్పదేళ్ళూ, అతని తనయుడు విసేనుడు అర్ధ శతాబ్దమూ రాజ్యం చేశారు. విసేనునికిద్దరు పిల్లలు; ప్రమోద, మోదసింహుడు. ప్రమోదను విక్రమునికిచ్చి వివాహం చేసి, మోదసింహునికి తన ఉత్తమ రాజ్యాన్నిచ్చి తపోవనాలకు నిష్క్రమించాడు విసేనుడు. మోదసింహుని పుత్రుడైన సింధువర్మపై తృక స్థానాన్ని వదిలేసి సింధునదీ తటము నుండి రాజ్యపాలన గావించాడు. పృథ్విపై ఆ స్థానం సింధు దేశమను పేరిట ప్రసిద్ధి చెందింది. సింధు వర్మ పుత్రుడు సింధుద్వీపుడు. అతని తనయుడు శ్రీపతి గౌతమవంశంలో పుట్టి కచ్ఛదేశంలో వున్న కాచ్ఛపియను కన్యను చేపట్టి, అక్కడ కలకలం రేపుతున్న పులిందులను యవనులను జయించి పారద్రోలి అక్కడే ఒక దేశాన్ని యేర్పాటు చేసి పరిపాలన సాగించాడు. సింధురాజ్యం శ్రీపతి రాజ్యంగా పిలువబడింది. అతని పుత్రుడు రాజ్యపు సరిహద్దుల్లో నున్న శబరులనూ, భిల్లులనూ జయించి రాజ్యాన్ని బాగా విస్తరింపజేయగా మొత్తం దేశానికి భుజదేశమని పేరు వచ్చింది. అతని తరువాత పుత్రుడు రణవర్మ, మనుమడు చిత్రవర్మ రాజ్యానికి వచ్చారు. చిత్రవర్మ ఒక అడవి మధ్యలో ‘చిత్ర’మను పేరిట గొప్ప నగరాన్ని నిర్మించాడు. అతని తరువాత వంశపారంపర్యంగా ధర్మవర్మ, కృష్ణవర్మ, ఉదయుడు, రాజులైనారు. ఉదయుడు కూడా ఒక వనమధ్యంలో ‘ఉదయపుర’మను సుందర నగరాన్ని నిర్మించాడు. అతని తనయుడు వాప్యకర్మ పేరుకు తగ్గట్టుగానే వాపీ కూప తటాకాలతో దేశాన్ని నింపివేసి కనీసం వందేళ్ళదాకా నీటికి ఇబ్బంది లేకుండా చేశాడు. సుందరభవనాలను నిర్మింపజేశాడు. అతడు సహజంగా గొప్ప ధర్మాత్ముడు కావడంవల్ల ఎన్నో ధర్మకార్యాలను నిర్వర్తించాడు.
ఈ సమయంలోనే బీరబలదుడను రాజొకడు, మహామదుని అనుయాయి, ఒక లక్ష సైన్యంతో వచ్చి వాప్యకర్మపై దాడి చేశాడు. అదంతా పైశాచీ, మ్లేచ్ఛ సైన్యమే. వాప్యకర్మ వారిలో చాలామందిని సంహరించి మిగిలివారు పారిపోగా తన విజయోత్సవానికి బదులు శ్రీకృష్ణ భగవానుని పేరిట కృష్ణోత్సవాన్ని చేయించాడు. అతని కొడుకు గుహిలుడు, మనుమడు కాలభోజుడు, మునిమనుమడు రాష్ట్ర పాలుడు. ఈ రాష్ట్రపాలుడు రాజ్యాన్ని మంత్రులకిచ్చి, సర్వమంగళప్రదాయినియైన శారదాదేవి నారాధించగా ఆమె అతని తపస్సుకి మెచ్చి మణిదేవునిచే రక్షితమైన అత్యంత రమణీయమైన ‘మహావతీ’ నగరాన్ని నిర్మించి ఇచ్చింది. అతనికి వైష్ణవీ శక్తి కూడా ప్రాప్తించింది. అతడందులో నివసిస్తూ పదేళ్ళపాటు రాజ్యపాలన చేశాడు. (అందులో అనగా మహావతీ నగరంలో)
రాష్ట్రపాలమహారాజుకి విజయుడని ప్రజయుడని ఇద్దరు పుత్రులు. ప్రజయుడు యుక్తవయసు రాగానే గంగాతటానికి పోయి అక్కడ శారదాదేవికై పన్నెండేళ్ళపాటు ఘోరతపస్సు చేశాడు. ఆ దేవి ఒక కన్య రూపంలో వేణువాదనం చేస్తూ గుఱ్ఱంమీద స్వారీ చేస్తూ వచ్చి అతనికి దర్శనమిచ్చి ప్రసన్నంగా, ‘రాజపుత్రా! నీ తపఃఫలము నాద్వారా నీకు దక్కాలని దైవేచ్ఛ. నీకేమి కావాలో కోరుకో’ అని సెలవిచ్చింది.
‘దేవీ! నీకు నమస్కారము. నాకొక నవీన నగరాన్ని ప్రదానం చెయ్యి’ అన్నాడతను.
ఆమె అతనికొక సుందరమైన జాతి గుఱ్ఱానిచ్చి వేణుగానాన్ని వినిపిస్తూ దక్షిణ దిశగా సాగిపోయింది. కొంత దూరం వెళ్ళాక అతనికి ముందు మర్కణమను పేరుగల రాక్షసపక్షి కనిపించింది. తరువాత ఒక శుభ లక్షణాలున్న సుందర నగరం కనిపించింది. దేవి అదృశ్యమై పోయింది. ఆ నగరంలో ఒకచోట మూపురంలాగా ఎత్తు, గుండ్రన వుండి మరల మామూలుగా వుంది కుబ్జలాగ. కన్య ఇచ్చిన నగరం కూడా కాబట్టి దానికి కన్యాకుబ్జమనే పేరు ప్రజయుడు పెట్టుకున్నాడు. అది మిక్కిలి ప్రసిద్ధిచెందింది. దాని సరిహద్దులివి:
దదర్శనగరం రమ్యం
కన్యయారచితం శుభం।
ఉత్తరేతస్య వైగంగా
దక్షిణేనాస పాండురా॥
పశ్చిమే ఈశ సరితా
పూర్వేపక్షీ సమర్కణఃః
కుబ్జభూత మభూద్గామం
కన్యకుబ్జమితి శ్రుతః ॥ (ప్రతిసర్గ. 4/3/50,51)
రాష్ట్రపాలుని పుత్రుడు జయపాలుడు పదేళ్ళపాటు రాజ్యపాలన చేశాడు. అతని పుత్రుడు వేణుకుడు. వీలైనపుడల్లా వేణువాదనము చేయుట యందు తత్పరుడు కనుక ఆయనకా - పేరు వచ్చింది. ఆయన భక్తికి మెచ్చి దేవి అత్యంత సుందరీమణియైన కన్యామతి అను కన్యతో ఆయనకు వివాహం చేసింది. సప్తమాతృకా మంగళ కళా సంపన్నలైన ఏడుగురు పుత్రికలను ప్రసాదించింది. వారి పేర్లు శీతల, పార్వతి, కన్య, పుష్పవతి, గోవర్ధని, సింధూర, కాళి. తరువాత వేణుకునికి యశోవిగ్రహుడను పుత్రుడు జనించాడు. అతడు పెరిగి మహాబలశాలియై, ధర్మాత్ముడుగా రూపొంది మొత్తం ఆర్యదేశాన్ని ఇరువదేళ్ళు పరిపాలించాడు. అతని వంశంలో వరుసగా మహీచంద్రుడు, చంద్రదేవుడు ఇరువదేసి సంవత్సరాలు, మందపాలుడు పదేళ్ళు, అతని పుత్రుడు కుంభపాలుడు ఇరవై సంవత్సరాలు రాజ్యం చేశారు. ఆ కాలంలో రాజనీయా అని ఒక నగరముండేది. దాని అధిపతి మ్లేచ్ఛుడు మరియు పైశాచ ధర్మావలంబియగు మహామోదుడు. అతడు ఎన్నో దేశాలను దోచుకొని అతులిత ధనసంపదలను కూడబెట్టాడు. బుద్ధిమంతుడు, బలశాలియగు కుంభపాలుని వద్దకు అతడే స్వయంగా వచ్చి అపార ధనరాశులను సమర్పించాడు.
కుంభుని అతని కొడుకు దేవపాలుడు అనంగపాలుడను రాజు కూతురైన చంద్రకాంతిని వివాహం చేసుకున్నాడు. కన్యాకుబ్జానికి రాజైన తరువాత అతడు దండయాత్రలు చేసి ఎందరో రాజులను గెలిచివచ్చి పది సంవత్సరాలు రాజ్యపాలనము చేశాడు. దేవపాలునికిద్దరు పుత్రులు జయచంద్రుడు, రత్నభానుడు. ఇద్దరూ క్రమంగా తూర్పు, ఉత్తర దిశల్లో నున్న ఆర్యదేశాన్ని జయించి ఒక పెద్ద వైష్ణవ రాజ్యాన్ని స్థాపించారు. రత్నభానుని కొడుకు లక్షణుడు మహావీరునిగా జీవించి కురుక్షేత్ర యుద్ధంలో వీరస్వర్గాన్ని పొందాడు.
విష్వక్సేన వంశంలో విసేనవంశజులు విసేన వంశీయ క్షత్రియులనీ, గుహిలుని వారసులుగా గౌహిల క్షత్రియులని, రాష్ట్రపాలుని పుత్రపౌత్రాదులు రాష్ట్రపాలవంశీయ క్షత్రియులని వ్యవహరింపబడ్డారు. శుక్లవంశ రాజులతోబాటు చాలామంది రాజులు కురుక్షేత్రంలో నేలకొరిగారు. మిగిలిన చిన్న చిన్న రాజులు వర్ణసంకరం, మ్లేచ్చ సంయోగం వంటి దూషిత కార్యాలకు పాల్పడడంవల్ల భయానకమైన మ్లేచ్ఛ రాజ్యాలు భరత ఖండంలో ఏర్పడ్డాయి.