సూతుని ప్రవచనం ఇలా కొనసాగుతోంది. “భృగుశ్రేష్ఠా! శౌనకాచార్యా! బృహస్పతి ఇంద్రాదులకు చెప్పిన వసుదేవతల మాహాత్మ్యాన్ని నేను మీకు విన్నవిస్తున్నాను. వైవస్వత మన్వంతరం మొదటి సత్యయుగంలో విశ్రవామునికి ఇల్వల యని ఒక పత్ని వుండేది. ఆమె పార్థివార్చన ద్వారా శివుని ఆరాధిస్తుండేది. ఈ కాలంలోనే దీక్షిత కులోత్పన్నుడైన యజ్ఞశర్మ అనుపేరుగల ద్విజుడొకడు యక్షిణీ - పూజలను పరమ శ్రద్ధగా చేస్తుండేవాడు. కాని, అతడు తన మిత్రుని కోడలితోనే వ్యభిచరించడంతో ఆ పూజ బెడిసికొట్టి కుష్టురోగ గ్రస్తుడైనాడు.
అతనిని విసర్జించిన యక్షిణీదేవి శివలోకంలోని కైలాసపురిని చేరింది. ఇక్కడ యక్షశర్మ తన ప్రారబ్ధానికి చింతిస్తూ ఎలాగో జీవిస్తూ, తిండి దొరకక శివరాత్రి పగలంతా ఉపవాసముండి, రాత్రంతా శివదర్శనం పూజనం అందరితోబాటే చేస్తూ తెల్లవారుతుండగా ఆలయ ప్రాంగణంలోనే మరణించాడు ఈ పుణ్య ప్రభావాన అతడు మరుజన్మలో కర్ణాటక దేశానికి రాజుగా పుట్టాడు. మహాబలవంతుడైన రాజరాజను పేర ప్రసిద్ధుడైనాడు. అతడు ప్రతిదినము తాను స్వయంగా శివార్చన చేస్తూ మరిన్ని గొప్ప అర్చనలనూ శివపూజలనూ బ్రాహ్మణుల చేత చేయిస్తుండేవాడు. ఒక నూరేళ్ళపాటు రాజ్యాన్ని పాలించి దానిని పుత్రునికి ధారవోసి తాను కాశీపోయి అక్కడ మూడేళ్ళపాటు అఖండజపం చేసిన రాజరాజుకు శివుడు ప్రసన్నుడై జ్యోతిర్లింగ స్వరూపంతో దర్శనమిచ్చాడు. అనంతర కాలంలో ఆచోటు శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధిచెందినది.
శివదర్శనంతో పవిత్రుడైన ఆరాజు వెంటనే మరణించి శివుని పార్థివార్చన ద్వారా పూజిస్తున్న ఇల్వల గర్భంలో పడ్డాడు కానీ ఘోరమైన చీకటిచే ఆక్రమింపబడిన ఒక రాత్రి. అదీ ఒక కుత్సితవేళలో భూమిపై జన్మించాడు. అందుకే అతనికి అన్నీ శుభలక్షణాలేవున్ననూ కుబేరుడను పేరిట ప్రసిద్ధుడైనాడు. అతడు బాలకుడిగా నున్నప్పుడే ఘోరతపస్సు ద్వారా బ్రహ్మను మెప్పించాడు. బ్రహ్మదేవుడు సువర్ణమయంగా, రమణీయంగా సుందరంగా ఒక పురాన్ని సముద్ర మధ్యంలో నిర్మించి ఆలంకాపురాన్ని కుబేరునికి వరంగా ఇచ్చాడు. కుబేరుడు మూడుకోట్లమంది యక్షులపై ఆధిపత్యాన్ని సాధించి యక్షరాట్ అనే పేరుతో ప్రసిద్ధుడైనాడు. అనేక రూపాలతో సంచరించే కిన్నరులకూ, శక్తిమంతులైన గుహ్యకులకూ కూడా కుబేరుడే పాలకుడు.
రావణుడు బ్రహ్మవర ప్రసాదియై వీరవిక్రముడై తిరుగుతున్నపుడు ఈ లంక నిర్మింపబడక ముందు అక్కడ రాక్షసులే ఉండేవారనీ కనుక ఆ లంకారాజ్యం చారిత్రకంగా తమదేనని ఎవరో చెప్పారు. వెంటనే అతడు లంకపై దండెత్తి కుబేరుని ఓడించి, హింసించి అక్కడి నుండి యక్ష కిన్నర గుహ్యకులతో సహా ఆయన్ని తగిలేసి మొత్తం లంకా రాజ్యాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. పరమదుఃఖితుడైన కుబేరుడు సకల దుఃఖ నాశకుడైన పరమేశ్వరుని శరణుజొచ్చాడు. శివుడు లోక కల్యాణ కారకుడైన కుబేరుని మిత్రునిగా స్వీకరించాడు. విశ్వకర్మతో చెప్పి కుబేరునికి అలకాపురియను సుందర నగరాన్ని నిర్మింపజేసి ఇప్పించాడు. సిరిసంపదలకు, భోగభాగ్యాలకు లోటు లేకుండా, కిన్నర యక్ష, గుహ్యకులకు పాలకునిగా అలకాపురిలో రాజ్యం చేయసాగాడు కుబేరుడు.
బ్రహ్మవరాలతో అమితబలశాలిగా మారిన రావణుడీ మారు పరమశివునికై కైలాస పర్వతానికే పోయి ఘోరతపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై అతనికి అనేక శిరస్సులు, ఒకటి తెగితే మరొకటి వచ్చేటట్లుగా వరమిచ్చాడు. అంతేకాక అతని శరీరాన్ని వజ్రకాయం చేశాడు. ఈ విధంగా ద్విమూర్తుల వరాల బలంతో లోకైక బలశాలిగా ఉద్దండునిగా పరిణమించిన రావణుడు సంపూర్ణ విశ్వాన్ని హింసించసాగాడు.
రావణ శబ్దానికి అర్థం బొబ్బలు పెట్టించేవాడని పేరుకి తగినట్లుగా తాను ఆనందంతో కేకలు వేస్తూ దేవతల చేత ఏడ్పుల బొబ్బలు పెట్టించాడు రావణుడు. లోకంలో ఎక్కడా యజ్ఞయాగాదులు జరగకుండా చేశాడు. హవిస్సులు అందక దేవతలంతా బక్కచిక్కి పోయారు. ఊర్ధ్వ జగత్తులో ప్రాణికోటి అంతా ఆకలితో అలమటించిపోసాగింది. దేవతలంతా బ్రహ్మను ముందిడుకొని క్షీరసాగరంలోకిపోయి విష్ణుమూర్తి వద్ద గుండె లవిసేలా ఏడ్చి మొత్తుకున్నారు. సగుణ నిర్గుణాకారుడైన హరి జాలిపడి ‘దేవతలారా! సనాతనియైన విష్ణుమాయను శరణువేడి, జగత్కల్యాణానికై ప్రార్ధనలు చేయండి’ అని చెప్పాడు. వెంటనే దేవతలంతా మహామాయయైన పరాప్రకృతిని స్తుతించారు. ఆమాయ సంతృప్తిచెంది బ్రహ్మజ్యోతిర్మయీ, శివానీ రూపము ప్రకటించగా ఆ రూపము రెండు భాగములుగా విడిపోయి సీతారాములుగా భూమిపైకి అవతరించింది. పరాప్రకృతియైన సీత పరమమంగళదాయని.
సహస్రం రామరామేతి
జపితం యేన ధీమతా ।
సీతానామ్నా చతస్యైవ
ఫలం జ్ఞేయం చ తత్సమం ॥ (ప్రతిసర్గం 4/15/57)
జగత్కారణ భూతయైన సీతాదేవి భూమిపై ఉత్పన్నం కావడం ఈలోకం, లోకులూ చేసుకున్న అదృష్టం. ఆమె అయోనిజ. సర్వులకూ మాతృస్వరూపిణి. రామనామాన్ని వెయ్యిమార్లు జపిస్తే వచ్చే ఫలం సీతానామాన్ని ఒక్కమారు జపిస్తేనే వస్తుంది. పరాత్పరుడు, భగవానుడునైన శ్రీరాముడు రావణాది రాక్షసులందరినీ సంహరించి తన పవిత్ర కీర్తినీ ఆదర్శ పురుషత్వాన్నీ పృథ్విపై మానవులకు మాననీయ ప్రవర్తనకు ఉదాహరణగా ప్రతిష్ఠితం చేశాడు. కుబేరుని తన్ని రావణుడు లాగుకొన్న పుష్పక విమానాన్ని తిరిగి కుబేరునికే పంపించాడు. పదకొండు వేల సంవత్సరాలపాటు భూమిని ఆదర్శంగా పరిపాలించి రామరాజ్యమే నిజమైన స్వర్ణయుగమని తరతరాల ప్రజలు భావించేలాగ జీవించి పరమ పదానికి వెళ్ళాడు.
శౌనకా! ఆ తరువాత ప్రథమ వసుదేవతయైన కుబేరుడు తన అంశను భూమికి పంపగా అది ధరదత్తుడను వైశ్యునిలో ప్రవేశించగా అతనికి మధురలో త్రిలోచనుడను కొడుకు పుట్టాడు. అతడు ధర్మపథాన్ని వీడకుండా కొంత ద్రవ్యాన్ని సంపాదించి దానిని హర్షపూర్వకంగా పూర్తిగా దానధర్మాలు చేసి వ్యాపారాన్ని పుత్రుల కొప్పగించి కాశీ వెళ్ళి రామానుజుని శిష్యునిగా జీవించదలచాడు. కొన్నేళ్ళ తరువాత రామానుజాచార్యులు త్రిలోచనుని మరల మధుర వెళ్ళాలని ఆదేశించారు. అతడు రామభక్త పరాయణునిగానే జీవిస్తూ గురువాజ్ఞనే రామాజ్ఞగా పాటించి వెనక్కి రాగా రాముడే అతని దాసుని రూపంలో అతని ఇంట్లో పదమూడు మాసాలుండి పోయాడు. రాముడే త్రిలోచనునికి అన్ని అభీష్ట ఫలాలనూ తెచ్చి ఇచ్చేవాడు. త్రిలోచనుని గృహంలో మణులను, రత్నాలను, చీని చీనాంబరాలను, ఇతర వస్త్రాలను, చివరికి వివిధ వ్యంజనాలను కూడా శ్రీరాముడు పడవేస్తుండేవాడు. భక్త త్రిలోచనుడు వాటన్నిటినీ స్వయగా బ్రాహ్మణులకూ, వైష్ణవులకూ, యతులకూ, వారుకోరుకున్న పరిమాణంలో దానం చేసేస్తుండేవాడు. ఒకరోజా దాసుడు త్రిలోచనునితో ‘వత్సా! నేను శ్రీరాముడను. నీ భక్తికి దాసుడనై ఇన్నాళ్ళూ నీ దాసరూపంలో నివసించాను. ఇక నీ హృదయంలో నివాసముంటాను’ అని చెప్పి అంతర్ధానం చెందాడు. వెంటనే త్రిలోచనుడు తన వారినందరినీ పరిత్యజించి పరమవైరాగ్యంతో సరయూ తటానికి చేరి శ్రీరామునే ధ్యానిస్తూ కొన్నాళ్ళకు ఆయనలోనే కలిసిపోయాడు.