భవిష్య పురాణము

186 - శుద్ధి ప్రకరణం

            అరుణా! బ్రాహ్మణులు మధురభాషణులై నిత్యం పవిత్రంగా వుండాలి. స్వయంగా చందనాదులను పూసుకొని స్వచ్ఛులై దేవ పూజాదులు చేయాలి. ప్రయోజనం లేకుండా సూర్యుని చూడరాదు. నగ్నస్త్రీని ఎప్పుడూ చూడరాదు. మైథునానికి, ఒకదశ దాటగానే, దూరంగా వుండాలి. మలమూత్రాలను నీటిలో విసర్జించరాదు. శాస్త్రోక్త నియమానుసారమే ఏ కర్మనైనా చేయాలి. ఎట్టి పరిస్థితులలోనూ శాస్త్రవర్ణిత కర్మానుష్ఠానమునతిక్రమించరాదు.

            అభక్ష్య భక్షణ - అనగా తినకూడని దానిని తినుట అనేది అన్ని వర్ణాలవారికీ నిషిద్ధమే. ద్రవ్యశుద్ధి ద్వారానే కర్మశుద్ధి కూడా కలుగుతుంది. అశుద్ధ ద్రవ్యాలతో కర్మచేస్తే ఫలితం సందేహాస్పదమే! జాతిదుష్టులు, క్రియాదుష్టులు, కాలదుష్టులు, సంసర్గదుష్టులు, ఆశ్రయదుష్టులు, స్వభావతః నిందితులు, అభక్ష్యాలు బాగుపడడం దాదాపు అసంభవం. దూషిత హృదయులు కపట ప్రవృత్తులు మారరు. వెల్లుల్లి, గాజర (ముల్లంగిలాటి ఒక దుంప) నీరుల్లి, కుక్కగొడుగు, తెల్లవంకాయ, ముల్లంగి జాత్య దూషితాలు. వీటిని తినకూడదు. వీటితో కలిసినవి కూడా దూషితాలే. నిలువ చేయబడినవి కాలదూషితా లనబడతాయి. పెరుగు, తేనె వంటి వికాలదూషితాలు కావు. సారాయి, వెల్లుల్లి, ఆవు ఈనిన ఏడురోజుల లోపలిపాలు, కుక్క ముట్టిన పదార్థాలు సంసర్గ దుష్టాలనబడతాయి. వీటిని పరిత్యజించాలి. శూద్రులు, వికలాంగులు తాకిన వస్తువులు ఆశ్రయ దూషితాలవుతాయి. కొందరికి కొన్నిటిని చూస్తేనే చిరాకు కలుగుతుంది. వాటిని సహ్యల్లేఖ దోషయుక్తాలంటారు. వాటినీ తినరాదు. రసాలను, వండిన వాటిని, చివరకు పాలను కూడా శాస్త్రదూషితం కాని వాటినే స్వీకరించాలి.

            సపిండ ప్రదానక్రమంలో పది, పన్నెండు, పదిహేను లేదా ముప్పది దినాల్లో, తిథిని బట్టి, ప్రేత శుద్ధి జరుగుతుంది. సూతకశౌచం, మరణశౌచం పది దినాలకు గాని రావు కాబట్టి ఆ పదిరోజులు ఇంకెవరి ఇంటికీ భోజనానికి వెళ్ళకూడదు. దశగాత్రం, ఏకాదశాహం గడిచాక సూతకులు (మృతుని రక్త సంబంధికులు) పన్నెండవరోజు స్నానం చేశాక ‘శుద్ధి అవుతారు’. సంవత్సరం దాటిన నాటినుండీ ఆరోజు స్నానంతోనే శుద్ధులవుతారు. సపిండంలో జననం, మృత్యువు జరగగానే సంబంధికులకు అశౌచం అంటుకుంటుంది. (ఇదే మైల) పిల్లలెవరైనా దంతాలు రాకముందే మరణిస్తే ఆరోజే అశౌచం, శుద్ధీ రెండూ జరిగిపోతాయి. పుట్టుజుత్తులు తీయించక ముందైతే ఒకరాత్రీ ఒక పగలూ మైల పాటించాలి. ఈ అపసవ్య మరణమే యజ్ఞోపవీతధారణకి ముందు జరిగితే మూడు రాత్రులపాటు అశుద్ధి అంటివుంటుంది. యజ్ఞోపవీతధారణ తరువాత ఈ అన్యాయ మరణం జరిగితే మాత్రం పదిరోజులపాటు అశుద్ధి వుంటుంది. గర్భస్రావ విషయంలో మూడురాత్రులు దాటాక స్నానం చేయగానే జనులు శుద్ధులవుతారు. సగోత్రులైన వారి మరణం మూడు అహోరాత్రాల పాటు అశుద్ధిని ఆవరింపజేస్తుంది. కేవలం శవయాత్రలో పాల్గొనే సంబంధం మాత్రమే కలవారు స్నానమాత్ర శుద్ధిని పొందగలరు.

            నిప్పుల్లో కాల్చడం ద్వారా, మట్టిని పట్టించి నీటితో తడిపి తోముటద్వారా, స్పర్శద్వారా, నీళ్ళుజల్లడం ద్వారా, మురికిని గోటితో గోకేయడం ద్వారా కూడా, పరిస్థితిని బట్టి ద్రవ్యాలను శుద్ధి చేయవచ్చు.

            పాప నివృత్తిని చేసే స్నానాలు మూడు. ప్రతి ప్రాతఃకాలమూ చేసేది నిత్యస్నానం గ్రహణం కోసం చేసేది కామ్యస్నానం క్షవర, శౌచాదుల తరువాత చేసేది నైమిత్తిక స్నానం.’