167 - ఆపాకదాన ప్రసంగంలో హవ్యవాహనుడను రాజు ప్రసక్తి

“భగవన్! మనుష్యుని ధన, పుత్ర, సౌభాగ్య సంపన్నుని చేసే దానమేదైనా వుంటే సెలవీయండి” అని అడిగాడు కురుచక్రవర్తి చెప్పసాగాడు గోపాలక చక్రవర్తి.

“ధర్మజా! ఒకప్పుడు మీ చంద్రవంశం వాడే హవ్యవాహనుడని ఒక రాజుండేవాడు. అతడు గొప్ప ప్రతాపి, నిగ్రహం కలవాడు, మహాబలుడు, శత్రుంజయుడు. అతని రాజ్యంలోని ప్రజలంతా రోగ, దుఃఖ, శత్రురహితులై వుండేవారు కాని ఆ రాజుకే ఏ పూర్వ కర్మఫలమో కాని మంత్రులు, మిత్రులు, పుత్రులు దక్కేవారు కాదు ఆయన ఎవరిని దరిజేర్చుకున్నా మిగిలేవారు కారు.

ఆ రాజు అదృష్టం బాగుండి ఒకరోజు పిప్పలాద మహర్షి అతని రాజ్యంలోకి వచ్చాడు. అతడు సంభ్రమంగా కదిలి ఎదురేగిపోయి తన పట్టపురాణి శుభావతితో సహా ఆ మునికి పాదపూజను చేసి రాచనగరుకు గొనివచ్చి చక్కటి ఆతిథ్యమిచ్చాడు. ముని బాగా విశ్రాంతి తీసుకున్నాక రాజు ఆయనతో తన బాధను చెప్పుకోగా మహర్షి ఇలా చెప్పాడు:

‘రాజదంపతులారా! పూర్వజన్మలో చేసిన కర్మల ఫలాలు అవశ్యమను భోక్తవ్యాలవుతుంటాయి. ఈ కర్మభూమిలో ప్రాజ్ఞులు దానికై శోకింపరు. పూర్వజన్మలో మనం సంపాదించుకోలేని దాన్ని ఇప్పుడింక ఎవరూ సంపాదించి పెట్టలేరు కదా! పూర్వజన్మలో మీరు రాజ్యాన్నే దానం చేసేశారు. అందువల్లనే ఇప్పుడు మీకు నిష్కంటకమై సుభిక్షమై స్వర్గసదృశమైన రాజ్యం లభించింది. కాని, మీరు పూర్వజన్మలో ఎవరినీ చేరదీయలేదు, లెక్కజేయలేదు, అభిమానించలేదు, ఆదరించలేదు. అందుకే నేడు మీకెవరూ లేరు.’

‘మహర్షీ! మనిషిగా పుట్టిన తరువాత మనుష్యుల మధ్య బతికితేనే అది బ్రతుకవుతుంది మాకు అందరూ కావాలి. పుత్ర, మిత్ర, భృత్య - ఇత్యాదులు శాశ్వతంగా మాకు మిగిలే దైవకార్యమో వ్రతమో దానమో ఆదేశించండి. మాకు అందరిలా, అందరితో బ్రతకాలని వుంది’ అని ఆక్రోశించింది మహారాణి శుభావతి.

‘విచారించకమ్మా! ఆపాకదానమని ఒక మహాదానముంది. అది సర్వసంపదలనూ ఇస్తుంది. నీకు కావలసిన సంపద పుత్ర, మిత్ర మంత్రి, బాంధవులే కాబట్టి వాటినే ఇస్తుంది.’ అని ఆమెకా దానవిధిని ఉపదేశించి ‘శుభమస్త’ని దీవించి నిష్క్రమించాడు పిప్పలాద మహర్షి. ముని కథనానుసారము శుభావతి వెంటనే ఆ దానాన్ని శ్రద్ధాభక్తులతో చేసింది. అచిరకాలంలో ఆమె కోరిన మానవ రూప సంపద పుష్కలంగా లభించింది.

ధర్మజా! ఈ దానవిధానం విను. బుద్ధిమంతుడైన వ్యక్తి ముందుగా గ్రహబలాన్నీ తారాబలాన్నీ విచారించుకొని శుభ ముహూర్తంలో ఒక కుమ్మరిని పిలచి ఆయనను అగరు, చందనం, ధూపం, వస్త్రం, ఆభూషణాలు, ఆహారం మున్నగువానిచే సంతుష్ట పఱచి, ‘అయ్యా! మీరు విశ్వకర్మ స్వరూపులు. నాకు చిన్నా పెద్దా మట్టి కుండలను, పాత్రలను, కలశలను నిర్మించి ఇవ్వండి’ అని ప్రార్థించాలి. ఆయన అలా ఇచ్చిన తరువాత బట్టీని నిర్మించుకొని అందులో వెయ్యి మట్టిపాత్రలనుంచి అగ్నిని రగిల్చి రాత్రంతా జాగరణ చేసి ఉత్సవాన్ని గీత నృత్యాదులతో చేయించాలి. తెల్లవారేసరికి ఈ (యజమాని) దాని బట్టీ వద్దకు పోయి స్వయంగా అగ్నినార్పి పాత్రలన్నిటినీ బయటికి తీయాలి. స్నానం చేసి తెల్లబట్టలు కట్టుకొని ఒక పదహారు పాత్రలను తీసి ఎదురుగా స్థాపించి వాటికి ఎఱ్ఱటి గుడ్డలను కప్పి పుష్పమాలలతో వాటిని తానే పూజించి, స్వస్తి వాచనాదులను బ్రాహ్మణులచే చెప్పించాలి. కుమ్మరిని రావించి ఆయనను సన్మానించాలి. సౌభాగ్యవతులైన స్త్రీలను పిలిపించి వారిని కూడా పూజించాలి. తరువాత పాత్రల చుట్టూ చేతులు జోడించి ప్రదక్షిణం చేసి వాటిని ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ దానం చేయాలి.

ఆపాక బ్రహ్మరూపోఽసి భాండానీమాని జంతవః

ప్రదానాత్ తేప్రజాపుష్టిః స్వర్గశ్చాస్తు మమాక్షయః॥

భాండరూపాణి యాన్యత్ర కల్పితానిమయాకిల

భూత్వా సత్పాత్రరూపాణి ఉపతిష్ఠంతు తాని మే ॥ (ఉ.పర్వం 167/32,33)

తరువాత వెయ్యి పాత్రలనూ అలావుంచెయ్యాలి. ఎవరు ఏ పాత్రను తీసుకొన్నా అడ్డుకోరాదు. అందరికీ తాను దానం చేస్తున్నాననే భావనతో నమస్కరించి నిలబడాలి. ఇలా ఈ దానాన్ని గావించే స్త్రీ పురుషుల పట్ల విశ్వకర్మ ప్రసన్నుడై మూడు జన్మలదాకా వారికి పుత్ర, భృత్య, మిత్ర, గృహ, ధనాదులను పుష్కలంగా ఇస్తాడు. అంతంలో స్వర్గ ప్రాప్తినీ ఇస్తాడు.