172, 173 - ప్రపా అగ్నీష్టికా దానమహిమ

(ప్రపాయనగా చలివేంద్రం, జలదానం. అది ఈ పురాణంలోనే ఇదివఱకే చెప్పబడింది.)

“ధర్మజా! ప్రపాదానం చేయలేనివారు ధర్మఘట దానాన్ని చేయవచ్చు. గ్రీష్మ కాలంలో శీతల జలంతో నింపిన కుండలను ప్రతిరోజూ బ్రాహ్మణుల ఇళ్ళల్లో ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. ప్రతి మాసం ఉద్యాపన ఇలా చెయ్యాలి. అనేక ప్రకారాల పక్వాన్నములనూ, వస్త్రాలనూ బ్రాహ్మణునికి ధర్మఘటంతో సహా దానం చేసి దక్షిణలివ్వాలి. ఆ ఘటాన్ని ఈ మంత్రంతో ప్రార్థించాలి:

ఏషధర్మ ఘటోదత్తో బ్రహ్మవిష్ణు శివాత్మకః

అస్య ప్రదానాత్ సఫలా మమ సంతు మనోరథాః ॥ (ఉత్తరపర్వం 172/21)

దానికి కూడా సామర్ధ్యం లేనివారు వేసవి నాలుగు మాసాలలోనూ అశ్వత్థ వృక్షాన్ని సేవించాలి. అంటే నీరుపోసి రక్షించాలి. అశ్వతరూపీ భగవాన్ ప్రీయతాం మే జనార్దనః అంటూ చేతులు జోడించి నమస్కరిస్తూ వీలైనన్ని మార్లు ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల పాపాలు నశిస్తాయి, ప్రపాదాన ఫలం కూడా దక్కుతుంది.

చలికాలంలో అగ్నీష్టికాదానం బహుపుణ్య ప్రదం. మార్గశిర మాసారంభంలో నొక ఉత్తమ ముహూర్తాన్ని చూసుకొని దేవాలయంలో గాని మఠంలోగాని ఇంట్లోగాని పెద్ద నాలుగుమార్గాల కూడలిలోగాని సాయంకాలము, ప్రాతర్వేళ బాగా ఎండిన కట్టెలను కుప్పబోసి అగ్నిని ప్రజ్వలింపజేసి వ్యాహృతులతో హవనం చేయాలి. దీనివల్ల అంటే చలికాలమంతా ఇలా చేయడం వల్ల దీనులనూ, అనాథులనూ, వస్త్రహీనులనూ సేవించిన లాభం కలుగుతుంది. చలికాచుకొనే వారితో ఆదరంగా మాట్లాడుతూ తినడానికేమైనా పెడితే గొప్ప పుణ్యం దక్కుతుంది. ఈ విధంగా చేసినవారు దేహాంతంలో సూర్య సమాన తేజస్సుతో వెలిగిపోతున్న విమానాన్నెక్కి బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. అక్కడ అరవై వేల సంవత్సరాలు సుఖభోగాలననుభవించి మరల భూమిపైకి మరలి రావలసి వచ్చినపుడు చతుర్వేదవేత్త, యాజ్ఞికుడు, రోగరహితుడు, ధనవంతుడు, తేజస్వియగు బ్రాహ్మణునిగా జన్మిస్తారు.