భవిష్య పురాణము

39 - షష్ఠీకల్పం - స్కంద షష్ఠీ వ్రత మహిమ

శతానీకుని అభ్యర్ధన మేరకు షష్ఠీతిథిని గూర్చి సుమంతుముని ఇలా చెప్పసాగాడు.

“మహారాజా! ఇది గొప్ప తిథి. అన్ని కోరికలను తీర్చే శక్తి కార్తికషష్ఠి కున్నది. రాజ్యచ్యుతుడైన రాజు ఈ వ్రతాన్ని చేస్తే పునఃరాజ్యం లభించగలదు. విజయం, ఏ రంగంలో కోరేవారైనా దీన్ని అనుష్ఠించి దాన్ని పొందగలరు.

కార్తికేయునికత్యంత ప్రియమైనది షష్ఠి. ఆయన పుట్టినదీరోజే. ఆయనను శంకరపుత్రుడని, అగ్నినందనుడనీ, గంగాసుతుడనీ, కూడా సంభావిస్తారు. ఈ షష్ఠినాడే ఆయన దేవసేనాని యైనాడు. ఈ రోజు వ్రతం చేసి పెరుగు, నెయ్యి, జలము, పుష్పాలతో దక్షిణం వైపు తిరిగి కార్తికేయ స్వామికి అర్ఘ్యమివ్వాలి.

అర్ఘ్యమంత్రమిట్లుండును.

సప్తర్షి దారజ స్కంద స్వాహాపతి సముద్భవ

 రుద్రార్యమాగ్నిజ విభోగంగా గర్భ నమోస్తుతే

                         ప్రీయతాం దేవ సేనానీః సంపాదయతు హృద్గతం (బ్రాహ్మ 39/6)

బ్రాహ్మణునికి అన్న దానం చేసి, రాత్రి పండ్లు మాత్రమే తిని కటిక నేలపై పడుకోవాలి. వ్రత దినాల్లో పవిత్రంగా వుంటూ బ్రహ్మచర్యం పాటించాలి. శుక్ల కృష్ణ రెండు పక్షాల షష్ఠి దినాలనాడూ ఈ వ్రతం చేయాలి. ఈ వ్రతం చేస్తే స్కంద భగవానుని దయచేత సిద్ధి, ధృతి, తుష్టి, రాజ్య, ఆయు, ఆరోగ్యములు ముక్తి లభిస్తాయి. ఉపవాసం చేయలేని పురుషులు రాత్రి వ్రతం మాత్రమే చేయవచ్చు. అలా చేసినా మొత్తం ఫలం అనగా రెండు లోకాలలోనూ ఉత్తమ ఫలప్రాప్తి - లభిస్తుంది. ఈ వ్రతాన్ని చేసిన పురుషునికి దేవతలు కూడా నమస్కరిస్తారు. ఆ పురుషుడు మరల ఈ లోకంలో పుట్టినపుడు చక్రవర్తి కాగలడు. భక్తి పూర్వకంగా ఈ వ్రత మాహాత్మ్యాన్ని గూర్చి విన్నవారికి కూడా అన్ని సత్ఫలితాలూ కలుగుతాయి.”