భవిష్య పురాణము

146 -147 - ఊత్తమ, అధమ భోజకుల లక్షణాలు

 “మునీంద్రా! సూర్యపూజకులైన భోజకులు దివ్యులనీ, ఆయననుండే ఉత్పన్నులైనారనీ, ఆయన కత్యంత ప్రియులనీ వింటుంటాము కదా! మరి ఈ భోజ్యులకి విపరీతంగా అభోజ్యపదమొకటి ‘విన్నాను. ఈ విషయమై వినగోరుచున్నాను.” అన్నాడు శతానీక మహారాజు - చెప్పసాగాడు సుమంతుడు. 

‘రాజేంద్రా! ఈ విషయంలో వాసుదేవుడైన శ్రీకృష్ణభగవానుడు, కృతవర్మల మధ్య జరిగిన సంవాదం చెబుతాను. నీ సందేహం తీరుతుంది. ఒకరోజు నారదుడు, పర్వతుడు సాంబపురికి వేంచేయగా అక్కడి భోజకులు ఈ మహర్షులిద్దరికి ఆనందంగా భోజనం పెట్టి పంపించారు. యదుప్రముఖుడైన కృతవర్మకిది చూసి సందేహం కలిగి శ్రీకృష్ణుని కడకేగి ఇలా అడిగాడు.’

‘పరంధామా! సూర్యపూజకులైన భోజకుల అన్నం అగ్రాహ్యం కదా! మరి ఈ దేవర్షులిద్దరూ వారి అన్నాన్నెలా గ్రహించారు?

‘కృతవర్మా! అవ్యంగాన్ని ధరించకుండా, స్నాన నియమాలను పాటించకుండా సూర్యపూజలను మాత్రం చేయిస్తూ, చేసివేస్తూ శూద్రాన్నాన్ని భుజిస్తూ పొలాన్ని దున్ను కుంటూ, జాత కర్మాది సంస్కారాలుగాని శంఖధారణ కాని లేకుండా, జుట్టు పెంచుకుంటూ జీవించే భోజకులు ఆ జాతిలో అధమ శ్రేణికి చెందినవారిగా పరిగణింప బడతారు. ఇటువంటి వారి ద్వారా కావింపబడిన దేవార్చన, హవన, స్నాన, తర్పణ, దాన, బ్రాహ్మణ భోజనాది సత్కర్మాలన్నీ నిష్ఫలములుగా నిలచిపోతాయి. ఈ విధమైన అశుచిచే ఆవృతులైన వారినే అభోజ్య పదంతో గ్రహించడం జరిగింది. సూర్యభగవానుని పూజలను నియమానుసారం చేయని భోజకులు ఆయనకు ఇష్టులు కారు. భగవానునికి భోగం చేయించకుండా భోజనం చేసేవారు, భోజకులైనా సరే, నరకానికి పోతారు.

ఈ విషయమై స్వయంగా సూర్యభగవానుడే తన సారథియైన అరుణునికి ఇలా చెప్పియున్నాడు. భోజకులలో పరస్త్రీని, పరధనాన్నీ హరించేవారు, దేవతలనూ వేదాలనూ నిందించేవారు, ఉంటే వారు నాకు ప్రియులు కారు. వారు చేసే ఏ సత్కర్మనూ నేను గ్రహించను. భగవతి మహాశ్వేత యజనము చేయని, సూర్యముద్రలను తెలుసుకోని భోజకులు నా పూజకు అధికారులు కారు. నాకిష్టులూ కారు.

‘నియమానుసారం జీవించే భోజకులే నిజమైన సూర్యప్రియులు’ అని వాసుదేవుడు కృతవర్మకు తెలిపాడు. కాబట్టి శతానీక మహారాజా! వేయిమాటలేల? వేదం కంటే శ్రేష్ఠమైన శాస్త్రం లేదు, గంగా సమానమైన నదిలేదు, అశ్వమేధం కన్న గొప్పయజ్ఞం లేదు. పుత్రప్రాప్తి వంటి సుఖం లేదు, కన్నతల్లి కంటె వేరు ఆశ్రయం లేదు, సూర్యభగవానుని కంటె వరిష్ఠ దైవము లేడు. ఆయన నిజమైన భక్తులకంటే ఆయనకు ప్రీతి పాత్రులు లేరు.”