191 - 193 - భువన ప్రతిష్ఠా మాహాత్యము రజియను ధర్మాత్మ చక్రవర్తి ప్రశంస - నక్షత్ర - తిథి దానాలు

“మధుసూదనా! ఈ లోకంలో మనకి శాశ్వత ప్రతిష్ఠ, మహనీయకీర్తి, అక్షయ సంతతి, ప్రచుర సంపత్తి, పరలోకంలో పితరులకు సద్గతి - వీటన్నింటినీ ప్రాప్తింపజేసే ఉపాయం చెప్పండి.”

“లోక కళ్యాణం కోసం నీవడిగిన ప్రశ్న ఇది. ధర్మరాజా! ఒక రహస్యమయమైన విధానం ద్వారా నీవడిగినవన్నీ లభిస్తాయి. దీని పేరు భువన ప్రతిష్ఠాదానం. ఇందులో దేవత, గంధర్వ, అసుర, నాగ, కిన్నర, యక్ష, రాక్షస, ప్రేత, పిశాచ, భూతాది అందరి ప్రతిష్ఠా జరుగుతుంది. వ్రతి ముందుగా ఉత్తమ ముహూర్తాన్ని చూసుకొని ఏడు హస్తాల పొడవు వెడల్పులలో నొక బలమైన శుద్ధ స్ఫటిక సమానమైన తెల్లగుడ్డను తీసుకుని చిత్రకారునిచే దానిపై చతుర్దశ భువనాలనూ చిత్రింపజేయాలి. అతనిని వస్త్ర, ఆభూషణ, పుష్పాలతో సత్కరించాలి. ఆచార్యునీ బ్రాహ్మలనూ కూడా ఆహ్వానించి వారిని వస్త్రాదులచే పూజించాలి. బ్రాహ్మణులచే వేదధ్వనినీ పుణ్యాహ వాచనాన్నీ చేయించాలి. శంఖభేరీ నినాదాలను మార్మోగించాలి. వస్త్ర మధ్యమంలో జంబూద్వీపం, దాని మధ్యలో మేరు పర్వతం దానిపై దేవతా స్థాపన చిత్రంలో జరగాలి. అష్ట దిశల్లో వాటి పాలకుల నగరులనూ, దేవతాయుక్త ద్వీపాలతో పృథ్విని చిత్రించాలి. ఆ పుడమి ఏడుకులాచలాలతో, సప్త సముద్రాలతో, నదీనదాలతో, సరోవరాలతో నుండాలి. దాని క్రింద ఏడు పాతాళాలనూ వేయాలి. పైని ఏడులోకాలూ, బ్రహ్మాది దేవతలోకాలూ, ధ్రువమార్గమూ, గ్రహ తారాగణాలతో సూర్యభగవానుడూ నేను ఇందాక చెప్పిన గంధర్వాసురాదులూ, దిగ్గజాలూ చిత్రింపబడాలి. ఈ కల్పిత భవనంలో తేజవాయురాది పంచతత్వాలూ, అహంకార, బుద్ధి సత్త్వాది గుణాలూ, ప్రకృతి, పురుషుడు సర్వత్ర వ్యాపిస్తున్నట్లుగా చిత్రించాలి.

కార్తిక పూర్ణిమ, అయన సంక్రాంతి, విషువయోగ, గ్రహణ తిథుల్లో ఈ పూజను చేయవచ్చు. ఒక సుందరమండపాన్ని నిర్మించి దాని మధ్యలో ఈ చిత్రపటాన్ని స్థాపించాలి. ఒక హస్తం పొడవు వెడల్పులతో నొక చతురస్ర కుండాన్ని నిర్మించి మరో మూడిటిని కూడా నిర్మించి ప్రతికుండము దగ్గరా ఇద్దరేసి వేదపారంగతులైన బ్రాహ్మణులను వస్త్రా భూషణాదులతో అలంకరించి కూర్చుండబెట్టి చిత్రపటాంకితులైన దేవతలందరికీ నామమంత్రాలతో హవనాలిప్పించిన పిమ్మట యజమాని కూడా వస్త్రాద్యలంకృతుడై సర్వోపచారాలతో ఆచార్యునికీ చిత్రపటానికీ పూజ చేసి ఈ మంత్రం ద్వారా అందరినీ ప్రార్థించాలి.

బ్రహ్మాండోదర వర్తిని భువనాని చతుర్దశ ।

తాని సంనిహితాన్యత్ర పూజితాని భవంతుమే

బ్రహ్మా విష్ణు స్తథారుద్రోహ్యాదిత్యా వసవస్తథా

పూజితాః సుప్రతిష్ఠాశ్చభవంతు సతతం మమ ॥ (ఉత్తరపర్వం 191/30,31)

అనంతరం ఆ భువనమయ చిత్రపటానికి ప్రదక్షిణ చేసి అనేక ప్రకారాల భోజన సామాగ్రినీ పలురకాల మిష్టాన్నాదులనూ నైవేద్యం పెట్టాలి.

రాత్రి జాగరం చేసి వివిధ రకాల వాద్యయంత్రాలను మ్రోయింపజేస్తూ వేదధ్వనిని చేయించాలి. గీత నృత్యాలతో ఉత్సవాన్ని చేయించాలి.

తెల్లారగానే యజమాని స్నానం చేసి వస్త్రాలంకారభూషితుడై ముందటి వలెనే మరల చిత్రపటానికన్ని పూజలూ చేసి వందగోవులను గాని, కనీసం రెండుగోవులను గాని చెప్పులు, గొడుగు, గృహోపకరణాలను ఋత్విజులకు దానం చేయాలి. ఒక సుందరమైన రథాన్ని తెచ్చి దానిని పతాక, ధ్వజ, తోరణాదులతో అలంకరించి దానికి ఏనుగుని గాని గుఱ్ఱాలను గాని కట్టాలి. దానిపై చిత్రపటాన్ని స్థాపించి బ్రాహ్మణుని తోడ్కొని పోయి దేవమందిరంలో స్థాపించి పూజించాలి. అక్కడ మళ్ళా మహోత్సవాన్ని చేయించాలి. గురువుగారికి బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి, పేదలకు, అనాధులకు, వికలాంగులకు కడుపునిండా అన్నం పెట్టించి ఇంటికి వచ్చి మిత్రులతో బంధువులతో కలిసి భోంచెయ్యాలి.

ఈ విధంగా చేసిన వారి వంశం ఉద్ధరింపబడుతుంది. కీర్తి మూడులోకాల్లో వ్యాపిస్తుంది. ఆ చిత్రపటం ఎన్నాళ్ళు ఆ కోవెలలో పూజింపబడుతుందో అన్ని వేలయేళ్ళదాకా యజమానులు గంధర్వాప్సరలచే సేవలందుకొంటూ స్వర్గంలో వుంటారు. మరల పుడమిపై పుట్టినపుడు పది జన్మల దాకా ఈ పుణ్యం వ్యాపించడం వల్ల అన్ని జన్మల్లోనూ ధర్మాత్ములు, దీర్ఘాయువులు, ఐశ్వర్యవంతులు, ప్రతాపవంతులు, పుత్ర పౌత్ర సమన్వితులునగు మహారాజులుగానే జీవిస్తారు.

ఈ సందర్భంలోనే పరమ పరాక్రమవంతుడైన రజిచక్రవర్తి కథను చెప్పుకోవాలి. అతడు జితేంద్రియుడు, జగద్విజేత. రాక్షసులను, దైత్యులను అనేక యుద్ధాలలో గెలిచి స్వర్గానికీ ఇంద్రునికీ సమర్పించి ఆయన ఆధిపత్యాన్ని పెంచినవాడు. ఒకనాడా చక్రవర్తి సభలోనికి బ్రహ్మపుత్రుడైన పులస్త్యమహర్షి ప్రవేశించాడు. రజి పరమానందభరితుడై స్వయంగా ఆ మునికాళ్ళు కడిగి అర్ఘ్య మధుపర్కాదులతో పూజించి సుఖాసీనుని చేసి ఆయన్ను ఇలా అడిగాడు. ‘మహానుభావా! మీ ఆగమనం నా పూర్వజన్మ సుకృతఫలమే గాని వేరొకటి కాదు. నేను పూర్వజన్మల్లో చాలా గొప్పకర్మలు చాలానే గావించివుంటాను. ఇంత గొప్పజన్మ ఏ కర్మ ఫలం ? మీరు సర్వజ్ఞులు. దయచేసి చెప్పండి.

‘మహారాజా! ఏడు జన్మల క్రిందట మీరు వారాణసిలో ధన - ధాన్య సంపన్నుడు. ధర్మాత్ముడు. సత్యవాదియునగు వైశ్యునిగా జన్మించారు. ఎన్నో పురాణ కథలు విన్నారు. ఎన్నో దానాలు చేశారు. భువన ప్రతిష్ఠాదానం కూడా శాస్త్రోక్తంగా చేశారు. దాని ప్రభావం వల్లనే గత ఏడు జన్మలూ మీకు రాజ జన్మలే వచ్చాయి. ఈ జన్మలలో కూడా మీరు చాలా పుణ్యకార్యాలు చేశారు కాబట్టి మరొక ఏడుజన్మల దాకా మీరిలా మహారాజుగానే జీవిస్తారు. ఆ తరువాత మోక్షం ప్రాప్తిస్తుంది.” అని చెప్పాడు పులస్త్యముని.

ధర్మరాజా! ఈ భువన ప్రతిష్ఠ దానం వల్ల ధర్మవృద్ధి, అభీష్ట సిద్ధి, పాపక్షయం, సర్వకార్యాల్లో విజయం కూడా లభిస్తాయి.

ఇలాటిదే నక్షత్ర దానం. అంటే ఏయే నక్షత్రాల్లో ఏయే దానాలు ప్రశస్తమనే జ్ఞానం. దీనినొకనాడు నారదమహర్షి మా అమ్మ దేవకీదేవికుపదేశించాడు.

సాధుజనులకూ, సన్యాసులకూ, ఆచార్యులకూ, బ్రాహ్మణులకూ ఈ దానాలివ్వాలి.

నక్షత్రం                  దానం                   ఫలం

కృత్తిక                          పాయసభోజనం                    ఉత్తమలోకం

రోహిణి                       నేతితో అన్నం                         శ్రేష్ఠలోకాలు

మృగశిర                     పాలు, సవత్సగోవు                  ఋణవిముక్తి, స్వర్గం

ఆర్ధ్ర                              తిలమిశ్రిత ఉప్మా                    సంకటమోచనం

పునర్వసు                    నేతి అప్పాలు                          ఉత్తమజన్మ

పుష్య                           స్వర్ణం                                      చంద్రప్రకాశం

ఆశ్లేష                          వెండి                                       శాస్త్రవిద్వాంసుడు

మఘ                           నూలకుండలు                        పుత్ర, ధన, పశుప్రాప్తి

పూర్వఫల్గుని               ఆడగుఱ్ఱం                              పుణ్యలోక నివాసం

ఉత్తర ఫల్గుని              స్వర్ణ కమలం                           సూర్యలోక ప్రాప్తి

హస్త                            స్వర్ణగజం                                స్వర్గప్రాప్తి

చిత్ర                             వృషభం                                  ఉత్తమ పుణ్యం

స్వాతి                           స్వయంగా మెచ్చేవి                 యశం, సద్గతి

విశాఖ             ధాన్యం, వస్త్రాలు,        ఎడ్లబండి పితరులు తృప్తి, కష్ట నాశం,

                                                                                                ఉత్తమగతి

అనురాధ                    కంబళి, ఉత్తరీయం                వంద దివ్య సంవత్సరాలు

                                                                                    స్వర్గ నివాసం

జ్యేష్ఠ                            కాలశాకాలు, ముల్లంగి          అభీష్టగతి

మూల             కంద, మూల, ఫల                   పితృతృప్తి, సద్గతి

పూర్వాషాఢ                 పాత్రతో పెరుగు                     ఐశ్వర్యప్రాప్తి, ఉత్తమ వర్ణంలో

                                                                                    జన్మం

ఉత్తరాషాఢ                 యవలు, నెయ్యి, తేనె             ఇష్టకామ్యార్థ సిద్ధి

                                    ఫాణితం

అభిజిత్                      నెయ్యి, తేనె, పాలు                 స్వర్గలోక నివాసం

శ్రవణం                       పుస్తకం                                   స్వర్గలోక విహారం

ధనిష్ఠ                          రెండు ఆవులు                        ఎన్నో జన్మల దాకా

                                                                                    సర్వ సుఖాలు

శతభిష                       అగరు, చందనం                    సుందర అప్సర లోకం

పూర్వాభాద్ర                 రాజమాష                               సర్వభక్ష్య భోజ్యప్రాప్తి

                                                                                    జన్మాంతర సుఖం

ఉత్తరాభాద్ర                 సుందరవస్త్రాలు                      సద్గతి, పితృతృప్తి

రేవతి                           గోదానం, కంచు                    సర్వ మనోరధ సిద్ధి, సద్గతి

                                    పాలు పితుకు పాత్ర

అశ్విని             ఉత్తమాశ్వాలు, రథం             రాజవైభవం తేజస్సు

భరణి                          తిలధేను                                  ఉత్తమ గోవులు, యశము

                                                                                    సద్గతి.

మహారాజా! ఈ దానాన్ని రాత్రి, పగలు అనక ఎపుడైనా చేయవచ్చు.

శ్రద్ధయే ప్రధానము.

ఇటువంటిదే తిథిదానం. అంటే ఏయే తిథుల్లో ఏయే దానాలు చెయ్యాలనే జ్ఞానం. మహారాజా! ఈ దానం వల్ల కాయిక, వాచిక, మానసిక పాపాలన్నీ ఆ క్షణంలోనే దగ్ధమై పోతాయి. శ్రావణ, కార్తిక, చైత్ర, వైశాఖ, ఫాల్గుణ మాసాల్లో ఏదో ఒక శుక్ల పాడ్యమి తిథినాడు ఈ పుణ్య వర్ధక దానాన్ని ప్రారంభించాలి. ధనము, శ్రద్ధ, సహకారం, సత్పాత్రుడు - ఈ నాలుగూ కలిసిన సమయమే నిజానికి ఉత్తమ దాన సమయం, తీర్థం, కోవెల, గోశాల, ఇల్లు ఎక్కడైనా ఈ దానం చెయ్యవచ్చు. శ్రద్ధ ముఖ్యం. పాడ్యమినాడు ఒక బంగారు అష్టదళకమలాన్ని తయారుచేసి దానిపై బ్రహ్మదేవుని స్వర్ణమూర్తిని స్థాపించాలి. ఈ కమలాన్ని సువాసనతో కూడిన నేతిలో నింపిన ఔదుంబర పాత్రలో నుంచి పుష్పధూపాదులతో బ్రహ్మను పూజించి ఒక బ్రాహ్మణుని సాదరంగా పిలిచి ఆయనకు బ్రహ్మప్రతిమను దానం చేయాలి. దాతకు దీని వల్ల అభీష్టకామనలన్నీ సిద్ధిస్తాయి. నిష్కామభావనతో ఈ దానాన్నా చరించినవాడు బ్రహ్మీభూతుడైపోతాడు.

విదియనాడు అగ్నిదేవుని స్వర్ణప్రతిమను బెల్లం, నెయ్యిలతో నింపిన రాగిపాత్రలో వుంచి దానిని జలపూర్ణ కలశపై స్థాపించాలి. తరువాత వ్యాహృతులతో నెయ్యి, తిలలతో ఒక వంద ఆహుతులనిచ్చి పూర్ణాహుతిని కూడా ఇవ్వాలి. వస్త్రాలతో, మాలలతో పూజించి అనేక ప్రకారాల భక్ష్య భోజ్యాలను నివేదిస్తూ పూజించి ఆ మూర్తిని బ్రాహ్మణునికిచ్చి వహ్నిర్‌మేప్రీయతాం అనే వాక్యాన్నుచ్చరించాలి. ఈ దాతకి ఆ జన్మలో చేసిన పాపాలన్నీ నశించి దేహాంతంలో వహ్నిలోక నివాస ప్రాప్తి కలుగుతుందని నారదమహర్షి చెప్పాడు.

తదియనాడు రాధాదేవి మూర్తిని బంగారంతో చేయించి దానిని రాగిపాత్రలో లవణంపై స్థాపించి రెండు రక్త వస్త్రాలతో దానిని కప్పి కుంకుమతో అలంకరించాలి. జీలకఱ్ఱ, కటుకం, బెల్లం కూడా ప్రక్కనే వుంచాలి. గంధ పుష్ప ధూప దీప నైవేద్యాదులతో దానిని పూజించి బ్రాహ్మణునికి దానంచేయాలి. ఈ రాధార్చన వల్ల అనంత పుణ్యం ప్రాప్తిస్తుంది. స్వర్ణ భవనాలూ, పాలనదులూ, గంధర్వులూ, అప్సరసలూ వుండేలోకంలో ఈ రాధార్చకుడైన దాత పెద్ద కాలం సుఖభోగాలనుభవిస్తూ నివసిస్తాడు. మరల పుడమిపై పుట్టాల్సి వచ్చినపుడు రూపవంతుడు, భాగ్యశాలి, మహాదాత, భోగి, ధనాడ్యుడు, పుత్ర పౌత్ర యుక్తునిగా జన్మిస్తాడు. ఈ వ్రతాన్ని స్త్రీ చేసినా ఇదే ఫలమబ్బుతుంది.

చవితినాడు ఒక పలం యెత్తు బంగారంతో అంకుశయుక్తమైన ఏనుగు ప్రతిమను తయారుచేయించి ఒక ద్రోణం తిలలపై స్థాపించి వస్త్ర పుష్ప నైవేద్యాదులతో పూజించి బ్రాహ్మణునికి దానమిచ్చెయ్యాలి. ప్రతిమను దానమిస్తున్నపుడు గణేశో మే ప్రీయతాం అనాలి. ఈ దానాన్ని చేసిన వారికి ఏ పనిని చేపట్టినా విఘ్నమన్నది వుండదు. ఏడు జన్మల దాకా ఎన్నో ఏనుగులకు యజమానిగా జీవిస్తాడు. గజేంద్రునిపై నెక్కి అన్నిలోకాలనూ గెలుచుకువస్తాడు.

పంచమినాడు ఇలాటిదే నాగప్రతిమను చేయించి ఘృత - దుగ్ధ పూర్ణ పాత్రలో స్థాపించి దానం చేయాలి. ఈ దానం నాగోపద్రవాలను దూరం చేస్తుంది. దాతకు ఇహ పరాల్లో సుఖం ప్రాప్తిస్తుంది. పాము కాటు వల్ల మరణించబోయేవాడు ఈ దానమిచ్చి వుంటే మరల బ్రతుకుతాడని పరమశివుడు చెప్పియున్నాడు.

షష్ఠినాడు మయూరంపై వుండి చేతిలో శక్తి ఆయుధాన్ని ధరించి స్వర్ణమాలను ధరించి వున్న కార్తికేయ స్వామి బంగరు ప్రతిమను చేయించి ఒక ద్రోణం బియ్యంపై స్థాపించి గంధ పుష్ప ధూపది ఉపచారాలతో పూజించి దానిని ఒక కుటుంబీకుడైన బ్రాహ్మణునికి దానమివ్వాలి. దీనివల్ల గొప్ప ఐశ్వర్యమూ దేహాంతంలో స్వర్గలోక నివాసమూ ప్రాప్తిస్తాయి. శూద్రుడీ దానమును చేస్తే వచ్చే జన్మలో బ్రాహ్మణుడై పుడతాడు. సప్తమినాడు అశ్వయుక్త స్వర్ణ సూర్య ప్రతిమను ఇదే విధంగా దానం చేస్తే గంధర్వులు సంతుష్టులై అన్ని కోరికలూ నెరవేరుస్తారు. దేహాంతంలో సూర్యలోక నివాస ప్రాప్తి కలుగుతుంది.

అష్టమినాడు ఒక సర్వలక్షణ సంపన్నమైన వృషభానికి రెండు తెల్లగుడ్డలను కప్పి మెడలో గంటను కట్టి పూజించి వృషభధ్వజో మే ప్రియతాం అంటూ బ్రాహ్మణునికి దానం చేసి వారిద్దరికీ ప్రదక్షిణ చేసి ఆయనను ఇంటి దాకా దిగబెట్టాలి. దీనివల్ల శివలోక నివాసం ప్రాప్తిస్తుంది. ధర్మరాజా! ఇందులో ఇంకొక విశేషముంది. వృషస్కంధ ప్రదేశంలోనే పదునాల్గు భువనాలు ప్రతిష్ఠితములై వుంటాయి. అందువల్ల వృషదానం వల్ల చతుర్దశ భువన దానం చేసిన ఫలం కూడా సిద్ధిస్తుంది. నవమిరోజు స్వర్ణంతో సింహ ప్రతిమను తయారుచేసి దానిని నీల వస్త్రంతో కప్పాలి. సింహంలో ఎనిమిది ముత్యాలను పొదగాలి. దైత్య వినాశినియగు భగవతీ దేవిని ధ్యానిస్తూ దానిని బ్రాహ్మణునికి దానం చేయాలి. దీనివల్ల ఉత్తమఫలాలు లభించి, భయంకరవనాల్లో, దుర్గాల్లో, సర్పాలవల్ల, హింస్రక మృగాలవల్ల, క్రూరమానవుల వల్ల ఏ ఆపదారాకుండా రక్షింపబడతారు. దేహాంతంలో దేవీలోకం ఆపై భూలోకంలో రాజ జన్మా ప్రాప్తిస్తాయి.

దశమినాడు దశ దిక్పాలకులు రాణుల స్వర్ణ ప్రతిమలను తయారుచేయించాలి. పదిపాత్రలలో ఉప్పు, బెల్లం, పాలు, నిష్పావం, నువ్వులు, పెరుగు, నెయ్యి, గోమయం, బియ్యం, ఉడద ధాన్యాలను నింపి ఒక్కొక్క పాత్రపై ఒక్కొక్క దేవతను స్థాపించాలి. వస్త్ర పుష్పాదులతో వాటిని పూజించి బ్రాహ్మణునికి దానమివ్వాలి. ఈ దానం వల్ల దానకర్త యొక్క అన్ని మనోరథాలూ నెరవేరుతాయి. దేహాంతంలో స్వర్గలోకంలో పూజింపబడతాడు. మరల పృథ్విలో ఉత్తమ వంశంలో జన్మిస్తాడు.

ఏకాదశినాడు విష్ణు భగవానుని స్వర్ణ ప్రతిమను తయారుచేయించి నేతితో నింపిన తామ్రపాత్రపై స్థాపించి సర్వోపవిచారాలతో పూజించాలి. తరువాత దానిని పంచాగ్నిహోత్రి, పౌరాణికుడునైన బ్రాహ్మణునికి దానం చేయాలి. దీనివల్ల విష్ణులోక నివాసం ప్రాప్తిస్తుంది. ద్వాదశినాడు గోవు, వృషభం, సువర్ణం, సప్తధాన్యాలు, బెల్లం, పండ్లు, నెయ్యి, అనేక ఫల రసాలు, ఫల వృక్షాల మొక్కలు పూలు - యధాశక్తి ఒకచోట చేర్చి కొత్త బట్టతో కప్పి సత్పాత్రుడైన బ్రాహ్మణునికి దానంచెయ్యాలి. దీనివల్ల దాతకి ఈ లోకంలో కీర్తి, ఐశ్వర్యాలూ, అంతంలో విష్ణులోక నివాసమూ ప్రాప్తిస్తాయి. మరల పుడమిపై పుట్టినపుడు యాజ్ఞికుడూ, ప్రతావంతుడూ, శతాయువూనగు రాజుగా జన్మిస్తాడు.

త్రయోదశినాడు పదముగ్గురు సత్పాత్రులైన బ్రాహ్మణులకు స్నానాలు చేయించి ఉత్తమ వస్త్రాలతో గంధ పుష్ప ధూపాదులతో నలంకరించి అర్చించి కమ్మటి భోజనాలు పెట్టి దక్షిణగా సువర్ణాన్నిస్తూ ధర్మోమే ప్రీయతాం అనాలి. ఆ తరువాత యమధర్మరాజు పదమూడు నామాలనూ అనగా - ధర్మరాజ, కాల, చిత్రగుప్త, దండి, మృత్యు, క్షయరూప, అంతక, యమ, ప్రేతనాథ, రౌద్ర, వైవస్వత, మహిషస్థ, దేవ - అను నామాలనుచ్చరిస్తూ ఒక్కొక్క బ్రాహ్మణునికీ నమస్కారం చేసి వీడ్కోలు చెప్పాలి. ఈ విధంగా యమధర్మరాజు నర్చించువారు సర్వరోగ విముక్తి నొంది, అంతంలో యమమార్గంలో కష్టాలు పడకుండా పితృలోకం చేరి అక్కడ పెద్ద కాలముండి మరల పుడమిపై పడ్డపుడు సర్వసుఖాలతో పుత్రవంతులై జీవిస్తారు.

చతుర్దశినాడు ఉత్తమ సుందర స్వర్ణమహిష ప్రతిమను నిర్మింపజేసి జలపూర్ణ కలశపై స్థాపించి, వస్త్రంతో కప్పి అలంకారాలతో శోభింపజేసి ఒక వృషభంతో బాటు కుటుంబీకుడైన బ్రాహ్మణునికి దానం చేయాలి. దీనివల్ల శివలోకప్రాప్తి, ఆపై ఆరోగ్య, ధనాలున్న ఉత్తమ కుటుంబం జన్మ, సఫల మనోరథత్వం ప్రాప్తిస్తాయి.

పున్నమనాడు వృషోత్సర్గం చేసి, చంద్రుని వెండి ప్రతిమను చేయించి అన్ని పూజలూ నిర్వర్తించి వస్త్రాభూషణాలతో సహా బ్రాహ్మణునికి దానం చేయాలి. ఇలా చేసినవారు చంద్రునితో సమానమైన కాంతి గలవారౌతారు. అంతంలో అప్సరసలచే పూజింపబడతారు.

ఈ విధంగా పాడ్యమినుండి పున్నం దాకా అన్ని తిథులలోనూ బ్రాహ్మణులకు దానం చేసినవారి పట్లు అందరు దేవతలూ ప్రసన్నులౌతారు. ఒక్కొక్క దానానికీ గల ఫలము ననుభవించిన పిమ్మట దాతకు బ్రహ్మలోక, విష్ణులోకాలలో పెద్దకాలం నివాసప్రాప్తి వుంటుంది. తరువాత శివ సాయుజ్యంతో ముక్తి లభిస్తుంది.”