భవిష్య పురాణము

29 - ఆనంతర్య తృతీయా వ్రతము

ఒకనాడు త్రిమూర్తులు కొందరు మహర్షుల కుపదేశించిన ఆనంతర్యమనే వ్రతరాజమును తనకు తెలపాలని ధర్మజుడు ప్రార్థించగా శ్రీకృష్ణుడిట్లు చెప్పసాగాడు.

“మహారాజా! ఈ వ్రతాన్ని మార్గశిర శుద్ధ తదియనాడు ఆరంభించాలి. ఆ ముందు రోజు అనగా విదియనాటి రాత్రి వ్రతం చేసి తదియనాడుపవాసం చేయాలి. గంధ పుష్పాదులతో ఉమాదేవిని పూజించి చక్కెరను పూరీనీ నైవేద్యం పెట్టాలి. వ్రతి పెరుగును మాత్రమే స్వీకరించి నిద్రించాలి. మరునాడు తెల్లవారగానే లేచి స్నానాదికములను ముగించి బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. దీని ఫలం సంపూర్ణ అశ్వమేధం చేసిన ఫలం.

మార్గశిర కృష్ణ తదియనాడు భగవతి కాత్యాయని’ని పూజిస్తూ నారికేళాలను సమర్పించాలి. ప్రతి పాలను మాత్రమే తీసుకోవాలి. కామక్రోధాలను త్యజించి రాత్రి నిద్రించి తెల్లవారక బ్రాహ్మణ దంపతులకు భోజనాలు పెట్టాలి. వ్రతఫలం అనేక యజ్ఞఫలం.

పుష్య శుద్ధ తదియనాడు ఉపవాసం చేసి గౌరీపూజను గావించి లడ్డూలను (లడ్లను) నైవేద్యం పెట్టి వ్రతి మాత్రం కాస్త నేతిని స్వీకరించి శయనించాలి. తెల్లవారాక బ్రాహ్మణుని అతని పత్నితో సహా పూజించి భోజనం పెట్టాలి. ఇలా చేసిన స్త్రీకి మహాయజ్ఞ ఫలం లభిస్తుంది.

ఇలాగే పుష్య మాసంలో కృష్ణ తదియనాడు కూడా పార్వతీదేవిని పూజించి నైవేద్యాల నర్పించి రాత్రి(ఇక్కడ పూరియనగా గడ్డిలాంటిది.) పూరీని గోమయాన్నీ మాత్రమే ప్రాశించి నిద్రించాలి. తెల్లవారాక యథావిధిగా బ్రాహ్మణ దంపతులను పూజించాలి. ఇలా చేసిన స్త్రీకి అశ్వమేధ యాగం చేసిన ఫలం దక్కుతుంది.

మాఘశుద్ధ తదియనాడు పార్వతీ దేవిని ‘సురనాయికా’ నామంతో పూజించి ముతక పంచదారనీ బిల్వాన్నీ నైవేద్యంగా సమర్పించాలి. రాత్రి కుశోదకాన్ని త్రాగి నిర్మల మనస్కయై నేలపై శయనించాలి. తెల్లవారాక స్నానాదులు గానిచ్చి బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. దీనివల్ల సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుంది. ఇలాగే మాఘకృష్ణ తదియనాడు పవిత్రురాలై, ప్రతి, జగదంబను ‘ఆర్యా’ నామంతో పూజించి కొన్ని భక్ష్య పదార్థాలను నైవేద్యం పెట్టి రాత్రి తేనెను సేవించి దేవీ ప్రతిమ కెదురుగా నేలపై శయనించాలి. మరునాడు భక్తిపూర్వకంగా బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. దీనివల్ల నామేకు వాజపేయ యజ్ఞఫలం లభిస్తుంది.

ఫాల్గున శుద్ధ తదియనాడు దేవిని ‘భద్రా’ నామంతో పూజించాలి. కాసార నైవేద్యాన్ని సమర్పించి రాత్రి పంచదారనే ప్రాశించి శయనించాలి. తెల్లవారాక స్నానాదులు ముగించి బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. దీనివల్ల ‘సౌత్రామణి’ అనే యాగం చేసిన పుణ్యం దక్కుతుంది. ఫాల్గున బహుళ తదియనాడు ‘విశాలాక్షీ’ నామంతో దేవిని పూజించి పూరీ భోగాన్ని చేయించి జలాన్నీ బియ్యాన్నీ కూడా నివేదించి జలాన్ని ప్రాశించి నేలపై శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. దీనివల్ల అగ్నిష్టోమ యజ్ఞఫలం ప్రాప్తిస్తుంది.

చైత్ర శుక్ల తదియనాడు దేవిని ‘శ్రీ’ నామంతో పూజించి పెరుగు గారెలను నైవేద్యం పెట్టాలి. రాత్రి బిల్వపత్రాన్ని ప్రాశించి దేవీ స్తుతి చేసుకుంటూ శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులను సత్కరించాలి. ఈ వ్రతం వల్ల రాజసూయయజ్ఞ ఫలం వస్తుంది. ఇలాగే ఈ నెలలో కృష్ణ తదియనాడు ‘కాళీ’ నామంతో దేవిని పూజించి అప్పాలను నైవేద్యం పెట్టి నానబోసిన కాసింత మినపప్పును తిని శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులకు భోజనంపెట్టాలి. దీనివలన అతిరాత్రయజ్ఞ ఫలం ప్రాప్తిస్తుంది.

వైశాఖ శుద్ధ తదియనాడు స్త్రీ జితేంద్రియయై ఉపవాసముండాలి. భగపతి పార్వతిని ‘చండికా’ నామంతో పూజించి మధుకనైవేద్యాన్ని సమర్పించి శ్రీఖండ చందనాన్ని పూసుకొని దేవి సమక్షంలో శయనించాలి. తెల్లవారినాక బ్రాహ్మణ దంపతులను పూజించాలి. (పూజించాలి, సత్కరించాలి అంటే భోజనం కూడా పెట్టాలని అర్థము) దీనివల్ల చాంద్రాయణ వ్రతఫలం దక్కుతుంది. అలాగే బహుళ తదియనాడు మత్సరాన్ని మఱచి ఉపవాసం చేసి దేవిని కాళరాత్రీ నామంతో గంధ పుష్ప ధూప దీపాదులతో పూజించి కొన్ని నైవేద్యం పెట్టాలి. తాను మాత్రం నువ్వులను నోట్లో వేసుకొని మంచినీళ్ళు త్రాగి శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులను పూజించాలి. దీనివల్ల ఆ వనితకు అతికృచ్ఛ్ర వ్రతఫలం సిద్ధిస్తుంది.

జ్యేష్ఠ శుద్ధ తదియనాడు దేవిని ‘శుభా’ నామంతో పూజించి మామిడి పళ్ళను నైవేద్యం పెట్టి తాను ఉసిరికాయను తిని గౌరమ్మను తలచుకుంటూ సుఖంగా శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులను పూజించాలి. దీనివల్ల సర్వతీర్థ యాత్రలనూ చేసిన పుణ్యం లభిస్తుంది.

అలాగే ఈ నెల కృష్ణ తదియనాడు ఉపవాసముండి ‘స్కందమాతా’ నామంతో దేవిని పూజించి నచ్చిన భోగాన్ని నివేదించి తాను మాత్రం పంచగవ్యాలను ప్రాశించి దేవీ ప్రతిమ కెదురుగా శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులను సత్కరించాలి. దీనివల్ల కన్యాదాన ఫలం లభిస్తుంది.

ఆషాఢ శుద్ధ తదియనాడు దేవిని ‘సతీ’ నామంతో పూజించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. గోశృంగ జలాన్ని ప్రాశించి శయనించాలి. తెల్లవారాక బ్రాహ్మణ దంపతులను పూజించాలి. దీనివల్ల కన్యాదాన ఫలం దక్కుతుంది. అలాగే ఆషాఢ బహుళ తదియనాడు ‘కూష్మాండీ’ నామంతో దేవిని పూజించి బెల్లం, నెయ్యి, సక్తు (పేలపిండి)లను నైవేద్యం పెట్టాలి. రాత్రి కుశోదకాన్ని సేవించి శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులను పూజించాలి. దీనివల్ల వేయిగోవులను దానమిచ్చిన ఫలం దక్కుతుంది.

శ్రావణ శుద్ధ తదియనాడు దేవిని ‘చంద్రఘంటా’ నామంతో పూజించి ఉలవల నైవేద్యం పెట్టి రాత్రి పుష్పోదకాన్ని ప్రాశించి శయనించాలి. మరునాటి ఉదయం బ్రాహ్మణ దంపతులను పూజించాలి. దీనివలన అభయ దానఫలం ప్రాప్తిస్తుంది. (దీనివలన అభయదానఫలం ప్రాప్తిస్తుంది)  శ్రావణ బహుళ తదియనాడు పార్వతీదేవిని ‘రుద్రాణీ’ నామంతో పూజించి సిద్ధ పిండాది నైవేద్యాన్ని సమర్పించి రాత్రి తిలకుటాన్ని నోట్లో వేసుకొని శయనించాలి. మరునాడు తెల్లవారినాక బ్రాహ్మణ దంపతులకు భోజనాలు పెట్టాలి. ఇలా చేసినవారికి ఇష్టపూర్త యజ్ఞఫలం లభిస్తుంది.

భాద్రపద శుద్ధ తదియనాడు ‘హిమాద్రిజా’ నామంతో దేవిని పూజించి గోధుమల నైవేద్యం పెట్టాలి. రాత్రి శ్వేత చందనం, గంధోదకాలను ప్రాశించి శయనించాలి. ఉదయం బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. దీనివలన వందలకొద్దీ ఉద్యాన వనాలను వేయించిన ఫలం లభిస్తుంది. కృష్ణ తదియనాడు దేవిని దుర్గా నామంతో పూజించాలి. పిండి, బెల్లాలనూ పండ్లనూ నైవేద్యంగా సమర్పించాలి. రాత్రి గోమూత్రాన్ని ప్రాశించి శయనించాలి. ప్రాతర్వేళ బ్రాహ్మణ దంపతులను సత్కరించాలి. దీనివల్ల సదావర్త ఫలం ప్రాప్తిస్తుంది.

ఆశ్వయుజ శుద్ధ తదియనాడు నారాయణీ నామంతో పార్వతీ దేవిని పూజించాలి. పక్వాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఎఱ్ఱ చందనాన్ని నోటిలో వేసుకొని శయనించాలి.

మరునాడు బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. ఈ వ్రతం వల్ల అగ్నిహోత్ర యజ్ఞ ఫలం లభిస్తుంది. ఈ నెలలో బహుళ తదియనాడు ‘స్వస్తీ’ నామంతో పార్వతీదేవిని పూజించాలి. బెల్లమునూ అన్నమునూ నైవేద్యం పెట్టాలి. కుంకుమ పువ్వు బీజాలను ప్రాశించి శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులకు భోజనాలు పెట్టాలి. ఈ వ్రతం వల్ల గవాహ్నిక (అంటే అన్న, ఘాసాదులతో ఒకరోజంతా ఆవును సేవించిన) ఫలం దక్కుతుంది.

కార్తిక శుద్ధ తదియనాడు ‘స్వాహా’ నామంతో ఉమాదేవిని పూజించాలి. నెయ్యి, ముతక పంచదార, పాయసాలను నైవేద్యం పెట్టాలి. కుంకుమ, కుంకుమ పువ్వులను నోటిలో వేసుకొని శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులకు భోజనాలు పెట్టాలి. దీనివల్ల ఏకభుక్త వ్రతం చేసిన ఫలితందక్కుతుంది. బహుళ తదియనాడు ‘స్వధా’ నామంతో జగదంబను పూజించి, పెసర పులగాన్ని నైవేద్యం సమర్పించి రాత్రి నేతిని ప్రాశించి నిదురపోవాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. దీనివల్ల నక్తవ్రత ఫలం లభిస్తుంది.

ఉద్యాపన ఇలా చేయాలి. ఏడాది దీక్ష ముగిసినాక మార్గశిర శుద్ధ తదియనాడు ఉపవాసం చేసి శాస్త్రోక్తంగా ఒక మండపాన్ని నిర్మించి శివపార్వతుల సువర్ణప్రతిమను తయారు చేయించాలి. ప్రతిమ కన్నులకి బదులు ముత్యాలనూ, నీలాలనూ పొదిగి వుంచాలి. పెదాలకు పచ్చల నుంచి చెవులకు రత్నకుండాలను పెట్టాలి. శివునికి యజ్ఞోప వీతాన్నీ పార్వతీదేవికి హారాన్నీ అలంకరించి(కస్తూరి, చందనం, కుంకం, కర్పూరం సమపాళ్ళలో కలుపగా వచ్చు సుగంధ ద్రవ్యం)  చతుస్సమాలతో శోభితం చేయాలి. తరువాత గంధ, పుష్ప, ధూపాది ఉపచారాలతో మండపంలో ప్రతిమకు పూజలుచేసి అగరుతో హవనంచేయాలి. మట్టిని మాత్రమే నోటిలో వేసుకొని రాత్రంతా జాగరం చెయ్యాలి. నృత్య గీతాదులతో ఉత్సవం నడపాలి. సూర్యోదయం దాకా జపం చెయ్యాలి. తెల్లవారాక ఒక ఉత్తమ మండలాన్నేర్పాటు చేసి శయ్యపై శివపార్వతుల ప్రతిమనుస్థాపించాలి.

ఈలోగా మండపాన్ని వితాన, ధ్వజ, మాలా, కింకిణీ, దర్పణాలతో సుశోభితం చేసి అక్కడ శివపార్వతుల ప్రతిమను స్థాపించి పూజించాలి. బ్రాహ్మణ దంపతులను భోజనాదికములతో సంతుష్ట పఱచాలి. వారికి తాంబూలమిచ్చి ‘హే భగవాన్ శివ భగవతి పార్వతీ దేవులారా! ‘మీరిరువురూ నాపట్ల ప్రసన్నులు కండి’ అని ప్రార్థించాలి. తరువాత భోజనం చేసిన ప్రదేశాన్ని స్వయంగా ప్రతియే శుభ్రపఱచాలి. ఒక కపిల గోవును కొమ్ములపై సువర్ణమును గిట్టలకు వెండి తొడుగును పాలుపితకడానికి కంచు గిన్నెను కలిపి గురువుగారికి దానం చేయాలి. ఆ కపిల గోవుకి ఘంటాది ఆభరణాలు సంపూర్ణంగా వుండాలి. గోవుకి గురువుగారికి కూడా ప్రదక్షిణలు నమస్కారాలు గావించాలి.

ఈ విధంగా ఈ ఆనంతర్య వ్రతాన్ని సంపూర్ణంగా గావించిన స్త్రీ, పురుషులు దేహాంతంలో దివ్య విమానంలో గంధర్వ, యక్ష, దేవ, విష్ణు లోకాలను చేరుకొని నివసిస్తారు. చివరికి శివలోక ప్రాప్తినొంది కలకాలం అక్కడ వుంటారు. మరల భూమిపై పుట్టి ప్రతాపవంతులైన రాజులుగా చక్రవర్తులుగా జన్మిస్తారు. శివునితో పార్వతిలాగ, ఇంద్రునితో శచివలె, వసిష్ఠునితో అరుంధతీ తుల్యంగా, విష్ణువుతో లక్ష్మి పోలిక, బ్రహ్మతో సరస్వతి సమంగా ఈ వ్రతాన్ని సంపూర్ణంగా చేసిన స్త్రీ తన పతితో చరిత్రలో నిలచిపోతుంది. పతి వియోగమనేది ఏ జన్మలోనూ లేకుండా పుత్రపౌత్ర ఐశ్వర్యాభి వృద్ధులతో విరాజిల్లుతుంది.”