భవిష్య పురాణము

14-17 - పుష్పవాటిక, తులసిల ప్రతిష్ఠ

మునులారా! పూలతోట ప్రతిష్ఠ కొరకు మూడుహస్తాల పరిమాణంలో నొక వేదిని నిర్మించి దానిపై ఘటాన్ని స్థాపించాలి. పుష్పాధివాసానికి ముందురోజే బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. కలశపై గణేశ, సూర్య, సోమ, అగ్నిదేవ, నారాయణులను ఆవాహన చేసి పూజించాలి. హోమవేదిలో తేనెనూ పాయసాన్ని హవనం చేయాలి. విధిననుసరించి ఈశాన కోణంలో యూపాన్ని పెట్టించి గురువారం నాడు దాని మూలంలో గోధుమలను నాటాలి. వాటిక లేదా తోట మొత్తాన్ని ఎఱ్ఱదారంతో చుట్టాలి. బ్రాహ్మణులకు ధాన్య, యవ, గోధుమలను దక్షిణగా ఇవ్వాలి.

తులసీ ప్రతిష్ఠను పద్ధతి ప్రకారం జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో చేయాలి. శుద్ధ ఏకాదశి రోజు శ్రేష్ఠం, రాత్రి ఘట స్థాపన గావించి విష్ణు, శివ, సోమ, బ్రహ్మ, ఇంద్ర దేవులను పూజించాలి. గాయత్రి మరియు ఇతః పూర్వం చెప్పబడిన వివిధ దేవతల మంత్రాలతో ఆయా స్వరూపాలకు స్నానంచేయించాలి. కయానశ్చిత్ర.. (యజు. 27/39) అనే మంత్రం చదువుతూ గంధమునూ, అశునా... (యజు. 20/27) అనే మంత్రంతో అత్తరునూ, త్వాంగం ధర్వా.. (యజు. 12/98) మానస్తోకే .. (16/16) మున్నగు మంత్రాలతో పుష్పాలను, శ్రీశ్చతే... (31/22) వైశ్యదేవీం.. (19/44) అనే మంత్రాలతో దూర్వనూ, రూపేణవో.. (7/45) తో దర్పణాన్నీ, యాఃఫలినీర్యా.. (12/89) అనే మంత్రంతో ఫలాలనూ అర్పించాలి. సమిద్ధో.. (యజు. 29/1) అనే మంత్రంతో అంజనాన్ని అర్పించాలి. తులసిని పచ్చదారంతో చుట్టి నీటితో పాలతో తడపాలి. కలశనూ, తులసినీ వస్త్రాలతో బాగా కప్పి ఇంటికి తిరిగి వచ్చెయ్యాలి. రెండవరోజు తద్విష్ణోః.. (6/5) అనే మంత్రంతో, ముత్తయిదువుల చేత మంగళవాద్యాల మధ్య తులసికి స్నానం చేయించాలి. ఆచార్య, హోత, బ్రహ్మాదుల నెంచుకొని, పది హస్తాల విస్తీర్ణముండే మండపంపై గోలాకార వేదిని నిర్మింపజేసి అక్కడ నారాయణుని పూజను చేయించాలి. వేది మధ్యంలో గ్రహ, లోకపాల, సూర్య, మరుద్గణాలను పూజించాలి. కలశకు నలువైపులా రుద్రునీ, వసువులనూ అర్చించాలి. కుశకండికను చేసుకొని తిలలనూ, యవలనూ హవనం చేయాలి. విష్ణువునుద్దేశించి 108 ఆహుతులివ్వాలి. ఇతర దేవతలకు శక్తికొలది ఇవ్వాలి. యూపాన్ని స్థాపించి చరు అన్నం ముద్దలను బలివ్వాలి. నాలుగు దిక్కులలో అరటి స్తంభాలను పాతి జండాలను పెట్టాలి. దక్షిణగా బంగారం, తిలధాన్యాలు, పాలిచ్చే గోవులను ప్రదానం చెయ్యాలి. తులసికి పాలతో అభిషేకం చేయాలి.