భవిష్య మహా పురాణము
138 - మహానవమీ (విజయా దశమీ) వ్రతం
(భవిష్య పురాణంలో విజయదశమి అనే మాట వాడబడలేదు. ‘య’కి దీర్ఘమే వుంది)
“మహారాజా! మహానవమి అన్ని తిథులలో శ్రేష్ఠమైనది. అన్ని విధాల మంగళాలకూ భగవతి ప్రసన్నానికీ ముఖ్యంగా రాజులు మహానవమి ఉత్సవాన్ని తప్పనిసరిగా చేయించాలి.” అని శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు ఇలా అడిగాడు:
“పరంధామా! ఈ మహానవమీ వ్రతము ఎప్పుడారంభమైంది? ఏ దేవత ప్రీత్యర్థం చేయాలి?”
“పాండవాగ్రజా! ఇది మహాదేవీ ప్రీత్యర్థం జరిగే వ్రతం. ఆమె పరమశక్తి, సర్వవ్యాపిని, భావగమ్య, అనంత, ఆధ్యాదినామాలతో విశ్వవిఖ్యాతి నొందింది. ఆమెను కాళి, సర్వమంగళ, మాయ, కాత్యాయని, దుర్గ, చాముండ, శంకరప్రియ మున్నగు నామ రూపాలతో అన్ని లోకాలూ పూజిస్తాయి.
దేవ, దానవ, రాక్షస, గంధర్వ, యక్ష, కిన్నర, నాగ, నరాదులంతా అష్టమి, నవమి రోజులలో ఆమె పూజనాచరిస్తారు. కన్యారాశి, ఆశ్వియుజ శుక్ల అష్టమితో యోగిస్తే ఆరోజు మహానవమి అవుతుంది. (మహాష్టమి కాదు). ఇది మూడు లోకాలలోనూ అత్యంత దుర్లభమైన తిథి. ఈరోజూ, ముందురోజూ అంబికామాతను పూజించేవారు శత్రువులపై విజయాన్ని సాధించగలరు. ఈ తిథి పుణ్యాన్నీ, పవిత్రతనూ, ధర్మాన్నీ సుఖాన్నీ ప్రసాదించగలదు. ముండమాలినీ చాముండా దేవినీ రోజు తప్పక పూజించాలి. అన్ని కల్పాల్లో మన్వంతరాల్లో దేవదానవాదులు ఈ రోజు ఈ పూజను చేస్తూనేవున్నారు. యశోదమ్మ గర్భంలో పుట్టి కంసుని చెఱసాలకు చేరి వాని నెత్తిపై పాదాలను మోపి తాండవం చేసిన మహామాయ ఈ జగన్మాత యొక్క మరోరూపమే, అవతారమే. ఆమె అవే నామరూపాలతో కలియుగాంతం దాకా వింధ్యాచలలో మందిరంలో పూజ లందుకోగలదు.
ఈ వింధ్యవాసిని నా చెల్లెలు. ఈమె పూజ మరో పేరుతో కొన్ని యుగాలకు ముందే ప్రారంభమైంది. తొమ్మిదిగాని మూడు గాని ఒకటి గాని రాత్రులు ఉపవాసం చేసి ఈమెను ఉపాసించాలి. అయాచిత వ్రతం, నక్తవ్రతం కూడా చేసి ఈమెను ఆరాధించవచ్చు. ఇంట్లో, గ్రామంలో, నగరంలో ప్రతిచోటా అందరూ స్నానాలు చేసి ప్రసన్నచిత్తులై భక్తి పూర్వకంగా అమ్మవారిని పూజించాలి. అన్ని వర్ణాలవారూ, స్త్రీలూ కూడా ఈ పూజను చేయాలి. విశేషించి రాజులు చేయాలి.
విజయాన్ని కోరుకొనేవారు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అష్టమి పర్యంతం లోహాభిహారిక కర్మ అంటే అస్త్ర శస్త్ర పూజనమును చేయాలి. ముందుగా తూర్పు, ఉత్తరాల వైపుగా నున్న భూమిలో తొమ్మిది లేదా ఏడు హస్తాల పొడవు వెడల్పులతో ఒక మండపాన్ని నిర్మించాలి. దాని చుట్టూ పతాకలను అలంకరించాలి. దానిలోనొక హస్త వైశాల్యంలో సుందరమైన కుండాన్ని మేఖల, పీపల, యోనియుక్తంగా నిర్మించాలి. రాజుగారి చిహ్నాలన్నిటినీ అస్త్ర శస్త్రాలతో సహా అక్కడికి తేవాలి. నిర్దిష్ట మంత్రాలతో బ్రాహ్మణుల ద్వారా ఓంకార పూర్వకంగా రాజ చిహ్నాలను నేతి సహితముగా పాయసంలో హవన కర్మ చేయించాలి.
ప్రాచీన కాలంలో గొప్ప బలవంతుడు, శక్తిశాలి లోహనామకుడునగు దైత్యుడొకడుండేవాడు. అతనిని దేవతలు చంపివేసి ముక్కలు ముక్కలుగా నరికి నేలపై పడవేశారు. ఆ దైత్యుడే నేడు లోహాగా అంటే ఇనుప ఆయుధాలుగానున్నాడు. అతని అంగముల నుండియే వివిధ రకాల ఇనపవస్తువులు ఉత్పత్తి అయినవి. హవనం చేయగా మిగిలిన పాయసాన్ని ఏనుగులకూ గుఱ్ఱాలకూ మేపి వాటిని బ్రహ్మాండంగా అలంకరించి అట్టహాసంగా ఊరంతటా తిప్పాలి.
అష్టమినాడు దుర్గామాత మూర్తిని (విగ్రహాన్ని) ఉత్తమ సుసజ్జిత స్థలంలో స్థాపించి కుంకుమ చందన సిందూరాలను పూసి, కమలాది పుష్పాలతో ధూపదీప నైవేద్యాదులతో ఎప్పటిలాగే పూజించాలి. ఇప్పటి ప్రత్యేకత ఏమిటంటే దుర్గా విగ్రహాన్ని సింహాసనంతో సహా స్థాపించాలి. రాజూ, రాజ పురోహితుడూ బిల్వ పత్రాలతో ఈ మంత్ర శ్లోకం ద్వారా జగన్మాతను పూజించాలి.
జయంతీ మంగళాకాళీ భద్రకాళీ కపాలినీ।
దుర్గా శివాక్షమా ధాత్రీ స్వాహా స్వధానమోఽస్తుతే॥
అమృతోద్భవః శ్రీవృక్షో మహాదేవీ ప్రియః సదా।
బిల్వపత్రం ప్రయచ్ఛామి పవిత్రం తే సురేశ్వరి॥ (ఉత్తరపర్వం 138/86,87)
ద్రోణపుష్పితో ఇప్పటినుండే అమ్మవారిని ఆనందింపజేయాలి. రాక్షస సంహారం వల్ల అమ్మకు కలిగిన అలసట దీనివల్లనే తీరింది.
తరువాత శత్రువధకై నిర్దేశించబడిన ఖడ్గానికి ప్రణామం చేసి దానిని దుర్గమ్మ పాదాలపై పెట్టి రాజ్యం సుభిక్షంగా వుండాలనీ, ప్రజలకూ తనకూ అన్నిటా విజయాలే కలగాలనీ అమ్మవారిని ఇలా ప్రార్థించాలి.
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తుతే॥
కుంకుమేన సమాలబ్ధే చందనేన విలేపితే
బిల్వపత్ర కృతామాలే దుర్గేఽహం శరణం గతః॥ (ఉత్తరపర్వం-138/93,94)
ఈ ప్రకారంగా అష్టమినాడు దుర్గమ్మకి అన్ని రకాల పూజలనూ నిర్వర్తించి రాత్రి జాగరం చేసి నృత్యాదులతో గొప్ప సంబరాన్ని నడిపించాలి. నవమినాడు ప్రాతర్వేళనే భగవతికి గొప్ప అట్టహాసంతో విశేషపూజ చేయాలి. అపరాహ్ణంలో అమ్మవారిని రథమెక్కించి రాజ్యమంతటా తిప్పాలి. సేనా సహితుడై రాజు కూడ రథంతో వుండాలి.
అన్ని విఘ్నాల నివృత్తికై భూత శాంతి చేయాలి. ఈ విధంగా అమ్మవారిని పూజించే రాజుకైనా మరెవరికైనా సర్వపాప విముక్తి, శత్రుచోర గ్రహ విఘ్నాదుల నుండి విముక్తి దేహాంతంలో భగవతిలోక నివాస ప్రాప్తి కలుగుతాయి. రోగం, దుఃఖం, భయం వుండవు. ఈ పూజా ఉత్సవ విధములను విన్నవారికీ చదివిన వారికి అన్ని అమంగళాలూ దూరమవుతాయి.