“శ్రీకృష్ణ చంద్రా! నేను చక్రవర్తిని కావడం కోసం పదునెనిమిది అక్షోహిణుల సైన్యంలో లక్షల కొద్దీ సైనికులు మరణించారు. ఈ పాపం నన్ను నేనే అసహ్యించుకొనేలా చేస్తోంది. వారిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు - అందరూ వున్నారు. భీష్మ ద్రోణ కర్ణ శల్య దుర్యోధనాదుల దుర్మరణం నా మనసును మహాక్లేశానికి గురిచేస్తున్నది. హే జగత్పతీ! ఈ పాపంనుండి నన్ను బయటపడవేయు ఏ ధర్మాన్నయినా ఉపదేశించండి. నరకార్ణవంలో కూలిపోనున్న నన్ను తరింపజేయండి.”
“కౌంతేయా! గోవత్స ద్వాదశీ వ్రతం సర్వపాప నిర్మూలకం. కృతయుగంలో నామవ్రత ధరయను పర్వతంపై టంటావియను రమణీయ శిఖరంపై శంకరభగవానుల సందర్శ నేచ్ఛతో కోట్లకొలది మునులు తపస్సు చేస్తుండేవారు. అక్కడి తపోవనాలు పరమ దివ్య, పుణ్యప్రదములైన అటవీ భూములలో వుండేవి. అది భృగుమహర్షి ఆశ్రమ మండలం. కోతుల నుండి సింహాలదాకా అన్ని పశువులూ, పిచుక నుండి నెమలిదాకా అన్ని పక్షులూ అక్కడ స్వేచ్ఛగా నిర్భయంగా సంచరిస్తుండేవి. ఆ తపోధనులకు దర్శన మివ్వడానికి ముందు పరమేశ్వరుడొక వృద్ధ బ్రాహ్మణవేషంలో కర్ర పట్టుకొని వణకుతూ నడుస్తూ అక్కడికి వచ్చాడు. జగన్మాత పార్వతీదేవి ఒక చక్కని గోవురూపంలో దూడతో సహా వచ్చింది.
ధర్మజా! గోవు లేదా ఆవు అంటే సామాన్య జంతువేమీ కాదు. ప్రాచీనకాలంలో క్షీర సాగరమథనం జరిగినపుడు అమృతంతోబాటు నంద, సుభద్ర, సురభి, సుశీల, బహుళ అను పంచ మహాధేనువులుద్భవించాయి. వీటిని లోకమాతలుగా దేవదానవులు సంభావించారు. లోకోపకారానికీ, దేవతలను తృప్తి పఱచడానికే ఇవి జనించాయి. వీటిని క్రమంగా జమదగ్ని, భరద్వాజ, వసిష్ఠ, అసిత, గౌతమ మహర్షులకు ప్రసాదించడం జరిగింది. గోవు యొక్క ఆరు అంగములు - గోమయ, రోచన, మూత్ర, దుగ్ధ, దధి, ఘృతములు - అత్యంత పవిత్ర, సంశుద్ధి సాధనాలు. గోమయం నుండి శివప్రియ, శ్రీమాన్ బిల్వవృక్షం పుట్టింది. అందులో పద్మహస్త శ్రీలక్ష్మి నివసిస్తుంది. అందుకే దానిని శ్రీవృక్షమని కూడా అంటారు. గోమయం నుండియే కమలబీజాలు కూడా వచ్చాయి. గోరోచనం అతిశయ మంగళమయం. ఇది పవిత్రం, సర్వార్థ సాధకం. గోమూత్రం నుండి గుగ్గిలం పుట్టింది. ఇది అందంగానూ, సుగంధియుక్తంగానూ వుంటుంది. ఇది అందరు దేవతలకూ ఆహారమే; ముఖ్యంగా శివునికి. సృష్టిలోని మూల భూత బీజాలన్నీ ఆవుపాల నుండి పుట్టినవే. ప్రయోజన సిద్ధిని కలిగించు మాంగళిక పదార్ధాలన్నీ పెరుగు నుండి పుట్టి పెరిగినవే. నేతి నుండి అమృతాన్ని దేవతలు ఆహారంగా పొందుతారు. బ్రాహ్మణులు, గోవు ఒకే వర్ణము యొక్క రెండు భాగాలు. వేద మంత్రాలూ, యజ్ఞ హవి(హవిస్సులూ) వీరి హృదయాల్లోనే కొలువుంటాయి. ఆవులోనే ఆరు అంగాల వేదమూ సమాహితమై వుంటుంది. ఆవు అంగాలలోనే అందరు దేవతలూ వుంటారని ఇలా చెప్పబడింది.
శృంగమూలే గవాం నిత్యం బ్రహ్మావిష్ణుశ్చ సంస్థితౌ ।
శృంగాగ్రే సర్వతీర్థాని స్థావరాణి చరాణిచ॥
శివోమధ్యే మహాదేవః సర్వకారణ కారణం।
లలాటే సంస్థితా గౌరీ నాసావంశేచషణ్ముఖః॥
కంబలాశ్వతరో నాగౌ నాసాపుట సమాశ్రితౌ।
కర్ణయోరశ్వినౌదేవౌ చక్షుర్భ్యాం శశిభాస్కరౌ ॥
దంతేషు వసవః సర్వే జిహ్వాయాం వరుణః స్థితః ।
సరస్వతీ చకుహరే యమయక్షౌచ గండయోః॥
సంధ్యాద్వయం తతోష్ఠాభ్యాం గ్రీవాయాంచ పురందరః।
రక్షాంసి కకుదేద్యౌశ్చ పార్ష్ణికాయే వ్యవస్థితా॥
చతుష్పాత్సకలోధర్మో నిత్యంజంఘాసుతిష్ఠిత।
ఖురమధ్యేషు గంధర్వాః ఖురాగ్రేషుచపన్నగాః॥
ఖురాణాం పశ్చిమేభాగే రాక్షసాః సంప్రతిష్ఠితాః।
రుద్ర ఏకాదశ పృష్ఠే వరుణః సర్వ సంధిషు।
క్షోణీతటస్థాః పితరః కపోలేషు చమానవాః॥
శ్రీరపానే గవాంనిత్యం స్వాహాలంకార మాశ్రితాః।
ఆదిత్యారశ్శయోబాలాః పిండీభూతావ్యవస్థితాః॥
సాక్షాద్గంగాచగోమూత్రే గోమయే యమునాస్థితా॥
త్రయస్త్రింశద్ దేవకోట్యో రోమకూపే వ్యవస్థితాః।
ఉదరేపృథివీ సర్వా సశైల వనకాననా॥
చత్వారః సాగరాప్రోక్తా గవాంయేతుపయోధరాః।
పర్జన్యః క్షీరధారాసు మేఘా విందు వ్యవస్థితాః॥
జఠరే గార్హపత్యోఽగ్నిః దక్షిణాగ్నిః హృది స్థితః ।
కంఠే ఆహవనీయోఽగ్నిః సభ్యోగ్నిస్తాలుని స్థితః॥
అస్థివ్యవస్థితాఃశైలా మజ్జాసు ఋతవః స్థితాః।
ఋగ్వేదోఽథర్వవేదశ్చ సామవేదో యజుస్తథా॥ (ఉత్తరపర్వం 69/25 - 37)
గోవు ఇంత పవిత్రమైనది గనుకనే జగన్మాత గోమాత రూపంలో ఆరుస్థానాల్లో ఉన్న తంగా, అయిదు స్థానాల్లో నిమ్నంగా, మండూక నేత్రాలతో, సుందరవాలంతో, తామ్ర సమాన రక్తస్తనాలతో, వెండివలె మెరుస్తున్న ఉజ్జ్వల కటి భాగంతో, సుందర ముఖంతో, ఖరాలతో, శ్వేతవర్ణములో, సుశీలయై, పుత్రస్నేహవతియై, మధురదుగ్ధదాయినిగా, శోభనమైన పొదుగుతో సర్వసులక్షణాలనూ పుణికి పుచ్చుకున్న గోమాతగా - దూడతో సహా శివునితో అక్కడికి వచ్చింది. శంకరుడు ప్రసన్న చిత్తుడై ఆమెను తోలుకుంటూ వచ్చాడు.
శంకరుడు తిన్నగా అక్కడి కులపతి భృగుమహర్షి వద్దకు పోయి తాను జంబూ క్షేత్రానికి వెళుతున్నాననీ రెండు రోజుల్లో వస్తాననీ అంతవఱకు తన కత్యంత ప్రీతిపాత్రమైన ఆ గోవును కాపాడవలసిందనీ కోరాడు. మునులంతా దానిని ప్రాణప్రదంగా కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. శివుడు వెడలిపోయి ఒక అరగంటలో ఒక పెద్దపులి రూపంలో వచ్చి ఈ ఆవునూ దూడను భయపెట్టసాగాడు. మునులంతా పెద్దపెట్టున ఆర్తనాదాలు చేస్తూ ఆ పులిని తరిమి వేయడానికి ప్రయత్నాలు చేశారు. అంతేగాని గోవును వదలి పారిపోలేదు. వారంతా కలిసి ఆవు ఆర్తిని ఇక చూడలేక పులిని హింసించాలనే నిర్ణయానికి వచ్చి ఒకప్పుడు వారికి బ్రహ్మ ఇచ్చిన భయంకర శబ్దాలను చేసే గంటను వాయించ సాగారు. ఏ జంతువుకైనా ఆ మోత వినేసరికే ప్రాణం పోతుంది. ఈ వ్యాఘ్రము గోవును వదిలి పారిపోయింది. మరుక్షణమే శంకరభగవానుడు అక్కడ వృషభారూఢుడై సాక్షాత్కరించాడు. గోవు మాయమై పార్వతీదేవి శివుని ఎడమవైపు నిల్చుని సాక్షాత్కరించింది. ఆరోజు కార్తిక శుద్ధ ద్వాదశి. ఒక శ్రేష్ఠమైన గోవుకి నందినీ ధేనువని పేరుపెట్టి దానినే పార్వతీమాతగా భావించుకొని పూజించారు అక్కడి మునులు. నాటి నుండి ఆరోజు గోవత్స ద్వాదశిగా పుడమిపై ప్రసిద్ధి చెందింది. ఉత్తానపాద మహారాజు ఈ వ్రతాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చాడు అతని కథను విను.
ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు వారు. సురుచి, సునీతి. సునీతి ద్వారా ఆయనకు ధ్రువుడనే పుత్రుడు జన్మించాడు. సునీతి ఎక్కువగా పతి క్షేమంకోసం రాజ్య సంక్షేమం కోసం పూజలలోను, పతిసేవలలోనూ మునిగియుండేది. పిల్లల ఆలనా పాలనా సురుచి చూస్తుండేది. సునీతి అలాగే వుంది కానీ, కొన్నాళ్ళకు, సురుచి మారింది. సపత్నీ ద్వేషమామెను వివశురాలిని చేసింది. ఆవివశతలో ఆమె ఒకరోజు సునీతి శిశువును చంపేసింది. కాని, ఆ శిశువు మరుక్షణంలోనే బ్రతికిపోయి వచ్చేసి ఆమె ఒడిలోనే కూర్చుని ఆడుకోసాగాడు. సురుచి మరల మరల అదే పనిని చేసింది కాని శిశువు మరల మరల అలాగే బతికి వచ్చేసేవాడు.
ఇక ఉండబట్టలేక సురుచి సునీతి వద్దకు పోయి ఆమెనే అడిగేసింది ఇలా మార్చి, ‘అక్కా! మన ధ్రువుణ్ణి మొన్న ఎవరో చంపేశారు. నేను గట్టిగా అరిచి ఏడిచేలోగానే వీడు బతికి వచ్చేసి నా ఒడిలో ఆడుకోసాగాడు. ఈ విచిత్ర ఘటన నన్ను ఆశ్చర్య చకితురాలిని చేసింది. నాకు చాలా ఆనందంగా కూడా వుంది కానీ, విషయం అర్థం కావడం లేదు. నీ దగ్గర మృత సంజీవని వుందనుకోడానికి కుదరదు ఎందుకంటే నువ్వు దానిని వాడడం వల్ల వాడు బతకలేదు. ఏదో వ్రతమో, నోముల సమూహమో, రత్నమో, మహారత్నమో వాడిని బ్రతికించి వుండాలి. చెప్పక్కా, ఏమిటీ విచిత్రం?’
‘నేను కార్తిక ద్వాదశినాడు గోవత్స వ్రతం చేశాను. దాని ప్రభావం వల్ల ధ్రువుని ఎవరెక్కడ చంపి పడేసినా నేను వాడి పేరును తలచుకోగానే వాడు నీ ఒడిలోనో నా వళ్ళోనో పడవలసిందే. నేనున్నంతకాలం వానికి మృత్యు భయముండదు.’ అని నవ్వుతూ చెప్పింది సునీతి. (ఆనాడు ఆమెకి అంతే తెలుసు. ధ్రువునికి ఎప్పటికీ మృత్యుభయం లేదని ఈనాడు మనందరికీ తెలుసు) సునీతి సలహాపై సురుచి కూడా ఈ వ్రతాన్ని చేసి పుత్ర, ధన, సుఖప్రాప్తిని పొందింది. సృష్టికర్త బ్రహ్మ ఆమెకు కూడా నక్షత్ర మండలంలో స్థానం కల్పించాడు. పది నక్షత్రాలతో కూడిన ధ్రువమండలాన్ని చూస్తే పాపాలు నశిస్తాయి.
ఆ ఈ కథలో మరికొన్ని విశేషాలున్నాయి. పులివేషంలో నున్న పరమశివుడు తనను వెంటాడి వేధించినపుడు గోమాత రూపంలోనున్న పార్వతి పారిపోతూ ఒక శిలపైకి దుమికింది. నేటికీ ఆ గోవుయొక్క నాలుగు గిట్టలూ ఒక శిలామధ్యంలో దర్శనమిస్తున్నాయి. అక్కడ శంభుతీర్థంలో శివలింగ మొకటుంది. దానిని భక్తితో స్పృశించిన వారికి మహాపాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ గిట్టలూ, లింగమూ నర్మదానదీ తీరంలో వున్నాయి.”
“భగవన్! ఈ వ్రతవిధానాన్ని తెలుసుకోగోరుతున్నాను” అన్నాడు ధర్మజ్ఞుడు. చెప్పాడు శ్రీకృష్ణుడు ఇలా:
“కార్తిక శుద్ధ ద్వాదశినాడు ఒక శ్రేష్ఠ జలాశయంలో సంకల్పపూర్వకంగా స్నానం చేసి ఒకేమారు భోజనం చేయాలి. తరువాత మధ్యాహ్నం దూడతోడి ఆవును గంధ, పుష్ప, అక్షత, కుంకుమ, అలక్తక, దీప, విశాలపుష్ప, మాలాదులతో ఈ మంత్రం ద్వారా పూజించాలి:
ఓం మాతారుద్రాణాం దుహితా వసూనాం
స్వసాదిత్యానామమృతస్య నాభిః
ప్ర ను వో చం చికితుషే జనాయ మా
గామనాగామదితిం వధిష్ట
నమో నమః స్వాహాః॥ (ఋగ్వేదం 8/101/15)
ఈ రకంగా పూజించి గ్రాస ప్రదానం చేసి ఈ క్రింది మంత్రాన్ని పలుకుతూ ఆవును స్పృశించి క్షమాభిక్ష వేడాలి.
ఓం సర్వదేవమయేదేవి లోకానాం శుభనందిని।
మాతర్మమాభిలషితం సఫలం కురు నందిని॥ (ఉత్తరపర్వం 69/85)
ఈ రకంగా ప్రార్థించి ఆవుపై నీటిని చిలకరించి భక్తిపూర్వకంగా ప్రణామం చెయ్యాలి. ఆరోజు పొయ్యిపై వేడిచేసిన భోజనాన్ని తినకుండా వుండాలి. బ్రహ్మ చర్యాన్ని పాటించి పుడమిపై పడుకోవాలి. ఈ వ్రత ప్రభావం వల్ల ప్రతి సర్వసుఖాలనూ భోగిస్తూ జీవించి దేహాంతంలో గోలోకం చేరుకొని గోవుకెన్ని రోమాలున్నాయో అన్నేళ్ళు నివసించగలరు. (గోలోకమనగా అన్ని లోకాలకూ పైన గల రాధాకృష్ణ సాన్నిధ్యం.)