భవిష్య పురాణము

95 - శ్రవణికా వ్రత కథ - వ్రతవిధి

యుధిష్ఠిరుడడిగిన మీదట శ్రావణీ దేవీ మణులను గూర్చి చెప్పాడు శ్రీకృష్ణుడు ఇలా:       “ధర్మజా! బ్రహ్మ వీరిని తన సృష్టిలో జరుగు శుభాశుభకార్యాలను గూర్చి తెలుసు కోవడం కోసం (వీరిని) సృష్టించాడు. వీరిచ్చే సమాచారాన్ని స్వయంగా బ్రహ్మయే శ్రవణం చేస్తాడు కాబట్టి. ఈ దేవతలకు ‘శ్రావణీ’లని పేరు వచ్చింది. ప్రాణికోటిని వీరు బాగా దూరం నుండే తెలుసుకోగలరు, వినగలరు, కనగలరు. తర్కమునకుగానీ హేతువుకుగాని లొంగని విలక్షణ శక్తులను బ్రహ్మ వీరికి ప్రసాదించాడు. దేవతలనూ విద్యాధరాదులనూ ఈ లోకం ఎలా పూజిస్తుందో అలాగే శ్రావణీ దేవతలనూ పూజించాలి. వీరు కడు వందనీయులు, పుణ్యమయులు, స్త్రీలు పురుషులు వీరి ప్రసన్నతకై వ్రతం చేయాలి. జల, చందన, పుష్ప, ధూప, పక్వాన్నాదులతో వీరిని పూజించి పారణ గావించినపుడు భోజనాలు పెట్టాలి.

సుఖజీవనం కోసం, అనాయాస మరణం కోసం, యమయాతనారాహిత్యం కోసం ఈ వ్రతాన్ని చేయాలి. ఈ విషయమై ఒక కథ వుంది.

ప్రాచీన కాలంలో నహుషుడని ఒక రాజు వుండేవాడు. అతని రాణిపేరు జయశ్రీ. ఆమె సుందరి, శీలవతి, పతివ్రత. ఒకమారామె గంగాస్నానానికి పోయి వస్తూ వసిష్ఠాశ్రమ సమీపంలో అరుంధతీదేవి కనబడితే నమస్కరిద్దామని వెళ్ళింది. అక్కడ అరుంధతీ మాత కొందరు మునిపత్నులకు వివిధ రకాల పదార్థాలతో మంచి భోజనాన్ని స్వయంగా వడ్డిస్తూ దర్శనమిచ్చింది. జయశ్రీ ఆమెకు ప్రణామం చేసి ‘అమ్మా భగవతీ! మీరేదో వ్రతదీక్షలో నున్నట్లున్నారు. ఏమిటా వ్రతం?’ అని అడిగింది.

“దేవీ! నేను శ్రవణికా వ్రతాన్ని చేస్తున్నాను. దీనిని నాకు వషిష్ఠ మహర్షి ఉపదేశించారు. ఇది అత్యంత గుప్తము మరియు బ్రహ్మర్షులకు సర్వస్వము. కన్యలకు శ్రేష్ఠము మరియు ఉత్తమ పతి ప్రదాయకము. నువ్వు లోనికి రా. నీకు ఆతిథ్యమిస్తాను’ అంటూ అరుంధతి అలాగే చేయగా రాణి భక్తితో అందుకొని తన రాచనగరుకు మరలి వచ్చింది.

తరువాత ఈ విషయాన్నే పూర్తిగా మరచిపోయింది జయశ్రీ. కొన్నేళ్ళకు ఆమెకు మరణం ఆసన్నమైంది. గొంతు నుండి గురక రాసాగింది. కంఠంలో ఏదో అడ్డుపడి పోయింది. నోటి నుండి నురగ రాసాగింది. ముఖం భయంకరంగా తయారైంది. ఇలా ఆమె పదిహేనురోజులపాటు మరణ యాతన పడింది. పదహారవరోజు ఆమె వద్దకు అరుంధతి వచ్చి చూసింది. వెంటనే ఆమె నహుష రాజుకు శ్రవణికావ్రత మాహాత్మ్యాన్ని తెలుపగా ఆయన ఆలసించకుండా ఆ వ్రతాన్ని ప్రారంభం చేయించి ఫలాన్ని జయశ్రీకి చెందునట్లు చేయించాడు. ఈ మరణ వేదన అంతా ఆగిపోయి ముఖమండలం ఒక తేజస్సుతో వెలిగిపోతుండగా జయశ్రీ నవ్వుతూ ప్రశాంతంగా మరణించింది. ఇంద్రలోక ప్రాప్తినందింది.

రాజా! ఈ వ్రతాన్ని మార్గశిర మాసం నుండి కార్తిక మాసందాకా పన్నెండు నెలలూ చతుర్దశి లేదా అష్టమి తిథుల్లో భక్తి పురస్సరంగా చేయాలి. ప్రాతఃకాలమే నదిలోగాని పవిత్ర జలాశయంలో గాని స్నానం చేసి పవిత్రులై పన్నెండుగురు బ్రాహ్మణ దంపతులను గాని వ్రతియొక్క గోత్రమే గల పన్నెండు గురుదంపతులను గాని ఆహ్వానించి గంధ, పుష్ప, రోచనా, వస్త్ర, అలంకార, సిందూరాదులతో వారిని భక్తిగా పూజించాలి. చూడ ముచ్చటగా, అచ్ఛిద్రంగా, నున్నగా నున్న వర్ధనీ (జలపూర్ణకలశ)లను పన్నెండింటిని సూత్రంతో చుట్టి పుష్పాల మాలలతో అలంకరించి (సాధ్యమైనంత వఱకు బంగారు కలశలనే వాడాలి). బ్రాహ్మణీ మణులకెదురుగా విడివిడిగా వుంచాలి. వాటిలో మధ్యలో నున్న కలశము తీసి నెత్తిపై పెట్టుకొని వ్రతి తాను బాల్య కౌమారవస్థలలో చేసిన, ఇకపై తెలియక చేయబోయే పాపాల నుండి విముక్తి కోసం, సుఖపూర్వక మృతికొఱకు, పరమపద ప్రాప్త్యర్థమై వారిని ప్రార్థించాలి. వెంటనే ప్రతి బ్రాహ్మణీ ‘తథాస్తు’ అనాలి. తరువాత బ్రాహ్మణులనూ అలాగే వేడాలి. వారు కూడా అలాగే అంటారు. అప్పుడొక బ్రాహ్మణుడు ప్రతి శిరస్సుపై నుండి వర్ధనిని దించి ఆశీర్వదించాలి. తరువాత భూసురపత్నులకు ఒక్కొక్కటిగా కలశలను దానం చేసివేయాలి.

ఓ పార్థా! సునాయాస భోగజీవనం, అనాయస మరణం, ఉత్తమలోక ప్రాప్తి ఈ వ్రతం వల్ల సమకూడుతాయి.