భవిష్య పురాణము

139 - ఇంద్ర ధ్వజోత్సవం - ఉపరిచర వసువు ప్రసక్తి

ధర్మనందనా! పూర్వకాలంలో దేవాసుర సంగ్రామ సమయంలో ‘ఇంద్రునికి విజయం కలగాలిగాక’ అంటూ దానికై బ్రహ్మాది దేవతలొక ధ్వజయష్టిని నిర్మించారు. దానిని సిద్ధ, విద్యాధర, నాగాది దేవతలు మేరు పర్వతంపై స్థాపన చేసి దానికి పుష్ప ధూప దీపాదులతో పూజలు చేసి అనేక ప్రకారాల ఆభూషణ, ఛత్ర, కింకిణీ, ఘంటాదులతో అలంకరించారు. ఆ ధ్వజయష్టిని చూడగానే దైత్యులు భయపడ్డారు. దేవతలు వారిని యుద్ధంలో గెలిచి మరల స్వర్గానికి పాలకులు కాగా దైత్యులు పాతాళానికి పారిపోయారు. ఆ రోజు నుండి దేవతలు ఆ ఇంద్రయష్టికి పూజలు చేసి ఉత్సవాన్ని నిర్వహించసాగారు.

ఉపరిచరవసు మహారాజు తన పుణ్య ప్రతాపాల బలం వల్ల స్వర్గ సందర్శనానికీ విహారానికీ రాగలిగాడు. దేవతలతనిని ఘనంగా సన్మానించారు. ఇంద్రుడు అతనిని గని కడు ప్రసన్నుడై తన ధ్వజాన్ని అతనికి బహూకరించి ఇలా చెప్పాడు: ‘వసు రాజేంద్రా! భూమిపై దీనిని మీరు పూజించండి. అందువల్ల మీ రాజ్యంలోని సకల దోషాలూ పోతాయి. మీరే కాదు, భాద్రపద శుద్ధ ద్వాదశినాడు (శ్రవణ నక్షత్రం పడితే ఆ వేళలో) దీనిని ఏ రాజు పూజించినా అతని రాజ్యం క్షేమంగా సుభిక్షంగా వుంటుంది. ప్రజలు నిరంతరం ప్రసన్నంగా, రోగరహితంగా జీవిస్తారు; ధనం, ధర్మం, యజ్ఞం శాశ్వతంగా వుంటాయి.’

ఇంద్రాదేశం మేరకు ఉపరిచరవసువు దానిని తెచ్చి పూజించి ఆ చంద్రతారార్కమైన కీర్తితో వెలుగొందాడు.