భవిష్య పురాణము

1 - ఉత్తరపర్వం - యుధిష్ఠిర మహారాజు వద్దకు వ్యాసాదుల ఆగమనం, ఉపదేశానికి యుధిష్ఠిరుని ప్రార్థన

కల్యాణానిదదాతువో గణపతిర్యస్మిన్నతుష్టేసతి

క్షోదీయస్యాపి కర్మణి ప్రభవితుం బ్రహ్మాపి జిహ్మాయతే।

భేజే యచ్చరణారవింద మసకృత్సౌభాగ్య భాగ్యోదయై-

సైనైషా జగతి ప్రసిద్ధి మగమద్ దేవేంద్ర లక్ష్మీరపి

శశ్వత్పుణ్య హిరణ్య గర్భర సనాసింహా సనాధ్యాసినీ

సేయం వాగధిదేవతా వితరతుశ్రేయాంసి భూయాంసివఃః

 యత్పాదామలకోమలాంగులినఖ జ్యోత్స్నాభిరుద్వేల్లితః

శబ్దబ్రహ్మసుధాంబుధిర్బుధ మనస్యు చ్ఛృఖలం ఖేలతి (ఉత్తరపర్వం 1/1,2)

ఎవరి ప్రసన్నత తన పట్ల లేకపోతే ఆ బ్రహ్మదేవుడే ఒక చిన్నపనినైనా చేయలేడో, ఎవరి చరణాల నాశ్రయించినాకనే దేవేంద్రుని భాగ్యరేఖ తళుక్కున మెరిసి అఖండ రాజ్యలక్ష్మి ప్రాప్తించిందో, ఆ భగవానుడైన గణపతి దేవుడు అందరికీ శుభములను కురియించుగాక!

బ్రహ్మదేవుని జిహ్వగ్రమే తనకు సింహాసనం కాగా, తన చరణ నఖచంద్ర కాంతులచే ప్రకాశితమై శబ్ద బ్రహ్మజ్ఞాన సముద్రంగా మారి ప్రపంచ మేధావుల హృదయాలలో నాట్యం చేస్తుండగా లోకాలనేలే చల్లని తల్లి సరస్వతీదేవి మనందరినీ కరుణించాలిగాక.

‘శంకర మహాదేవుని ధ్యానించి, కృష్ణభగవానుని స్తుతించి, బ్రహ్మదేవునికి నమస్కరించి సూర్యాగ్నీత్యాది దేవతలకు ప్రణామం చేసి ఈ గ్రంథాన్ని స్పృశించాలి. (ఉత్తర - 1/7)

ఇది ప్రార్ధన.

ఒకనాడు ధర్మపుత్రుడూ, ధర్మవేత్తాయైన యుధిష్ఠిర మహారాజును చూడడానికి వ్యాస, మార్కండేయ, మాండవ్య, శాండిల్య, గౌతమ, శాతాతప, పరాశర, భరద్వాజ, శౌనక, పులస్త్య, పులహ మహర్షులు, దేవర్షి నారదాది బ్రహ్మజ్ఞులు వచ్చారు. ఆ తపస్వులను, వేదవేదాంగ పారంగతులైన మహర్షులను చూడగానే పరమభక్త్యాగ్రేసరుడైన ధర్మరాజు సంభ్రమంగా సింహాసనము నుండి దిగిపోయి సోదరులతో, కులపురోహితుడైన ధౌమ్యునితో ఎదురేగి మిక్కిలి వినయంతో నమస్కరించాడు. ఆ సమయానికి అక్కడ వున్న లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు కూడా బ్రహ్మజ్ఞాన స్వరూపులైన మహర్షుల కెదురేగి నమస్కరించాడు. యుధిష్ఠిర మహారాజు వ్యాసమునీంద్రునితో ఇలా అన్నాడు:

“భగవాన్! దుర్యోధనాదులు పరాజితులై నాకీ రాజ్యం సంప్రాప్తించిందంటే అది కేవలం మీ ప్రసాదమే. కాని, రోగికి మంచి మందే దొరికి రోగం కుదిరినా సుఖం దొరకనట్టు, నేను నా బంధు బాంధవులను చంపి పొందిన ఈ సామ్రాజ్య సుఖం నాకు ప్రియాన్ని గావించడంలేదు. వనంలో కందమూలాలూ, ఫలాలూ తింటూ మునుల మధ్య గడిపినప్పుడే నాకు సుఖంగా వుండేది. ఇప్పుడు సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపతిగా పాలిస్తున్నాని లోకం అంటున్నది కాని నా మనసుకి ఆనందం లేదు. రాజ్యలోభంతో బంధు సంహారం - అనే వివేక శూన్య కార్యం నాచేతితో నేనే చేశాను. భీష్మపితామహులు - నాకు గురువు, బంధువు, రక్షకుడు, కల్యాణకారి, కవచస్వరూపుడనైన మా తాతగారు నా స్వార్థానికి బలైపోయారు. నా బతుకే పాపలిప్తమై పోయింది. వ్యాసభగవాన్! మీ జ్ఞాన రూపజలంతో నా పాపపంకాన్ని కడిగి వేయగలరు. నన్ను సర్వధా నిర్మలుని చేయగలరు. ప్రజ్ఞాదీపాన్ని నా చీకటి గుండెలో వెలిగించి నన్ను ధర్మమార్గంలో నడిపించగలరు. ధర్మ రక్షకులైన ఈ మునిగణమంతా నన్ను అనుగ్రహించడానికే నా కొలువుకి కదిలివచ్చి నన్ను ధన్యుని చేశారు. మహనీయుడైన గంగాపుత్రుడు, ఆదర్శ పురుషుడునైన మా భీష్మపితామహుల వద్ద నేను అర్థశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్నీ, మోక్ష శాస్త్రాన్నీ విస్తారంగా విని యున్నాను. ఆయన దేవునిలో కలిసిపోయినా నీకు భయంలేదు, మేమున్నామ’ని వెన్ను తట్టి నిలిచిన వాసుదేవ కృష్ణుడూ, మీరూ ఇక నాకు పథప్రదర్శకులు.”

“మహారాజా! మీకు మేమంతా అంటే నేనూ, భీష్ముడూ, మార్కండేయ, ధౌమ్య, లోమశ మహర్షులూ అన్ని ధర్మాలనూ, కర్తవ్యాలను ఇదివఱకే బోధించియున్నాము. ఈరోజు మీకంటే గుణీ, ధర్మజ్ఞుడూ, మేధావి, ధీమంతుడూ ఎక్కడా దొరకడు. ధర్మాధర్మ నిర్ణయంలో మిమ్ము మించినవాడు లేడు. అయినా, ఋషులకే శిరఃకేశము వంటి హృషీకేశుడు, భగవానుడు శ్రీకృష్ణుడిక్కడుండగా ధర్మోపదేశానికి పూనుకొనే సాహస మెవడు చెయ్యగలడు? ఈయనే సృష్టి స్థితి పాలకుడు, ప్రత్యక్షదర్శి. మీవంటి వానికి ఈ గీతాచార్యుడే ఎటువంటి ఉపదేశాన్నైనా ఇవ్వగలడు” అని సెలవిచ్చి పాండవులు భక్తితో చేసిన పరిచర్యలను దయతో పరిగ్రహించి బాదరాయణ వ్యాసమహర్షి తపోవనానికి వెళ్ళి పోయాడు.