భవిష్య పురాణము

14 - రుద్రమాహాత్మ్యం రామానుజాచార్యుల ఆవిర్భావం

సూతమహర్షి బృహస్పతి తనకు వినిపించిన మరిన్ని విశేషాలను శౌనకాదులకు అనుగ్రహించసాగాడు. “మునులారా! సృష్టి ప్రారంభంలో విరాట్ పురుషుని నాభి నుండి ఒక విస్తృత కమలం ఉత్పన్నమైంది. దాని నుండి కమలాసనుడైన బ్రహ్మ ఉద్భవించాడు. ఆయనకు నాలుగు ముఖాలున్నాయి. ‘నేనెవరిని? నేనెక్కడి నుండి వచ్చాను? నన్ను సృష్టించిన దెవరు?” అని చింతామగ్నుడైన ఆతని హృదయము నుండే ‘తపస్సు చెయ్యి’ అనే ఆజ్ఞ వినిపించింది. వెంటనే నాలుగు భుజాలతో నుండి యోగగమ్యుడు, సనాతనుడైన విష్ణువుకై ఒక వెయ్యేళ్ళు తపస్సు చేశాడు కమలాసనుడు. అపుడు నవీన మేఘ సమాన శ్యామలుడు, చతుర్భుజుడునైన విష్ణుభగవానుడు ఆయుధాలతో దివ్యాలంకృతుడై బ్రహ్మదేవునికి సంపూర్ణ సర్వదర్శన మిచ్చాడు. బ్రహ్మ ఆశ్చర్యచకితుడై అలాగే చూస్తూ వుండిపోగా విష్ణుభగవానుడు ప్రహసితాననుడై ‘వత్సా! నేనే నీ తండ్రిని’ అని చెప్పాడు. అంతవరకూ బ్రహ్మ తానే అతని తండ్రి ననుకొనేవాడు. ఆమాటే పైకి అనేశాడు కూడ ఇద్దరి మధ్య ఈ వాదం కొనసాగుతుండగా తమోమయుడైన రుద్రుడు జ్యోతిర్లింగరూపంలో గోచరించాడు. తమ వాదాన్ని కట్టిపెట్టి హంసరూపంలో బ్రహ్మ, వరాహరూపంలో విష్ణువూ పైకీ క్రిందికీ ఆలింగం ఆద్యంతాలను కనుగొనడానికి వెళ్ళారు. ఒక యేడాది గడిచింది కానీ వారికవి తెలియలేదు. ఇరువురూ మరలివచ్చి నిష్ఠగా కూర్చొని ఏకాగ్రచిత్తులై శివుని స్తుతించారు. ఆయన ప్రసన్నుడై స్వస్వరూపంలో దర్శనమిచ్చి ఎవరి పనిలో వారుండాలని చెప్పి తాను కైలాసానికి పోయి యోగ సమాధిగతుడై రుద్ర దివ్య సంవత్సరాలు అయిదు (మనకైతే అయిదు లక్షలు) గడిచేదాకా తపస్సు చేస్తానని సంకల్పించాడు.

ఈలోగా తారకాసురుడను ఒక భయంకర దానవుడు వెయ్యేళ్ళు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఆయన ప్రసన్నుడు కాగానే తనకు మరణం లేకుండా వరం కావాలని కోరాడు. అది అసహజమనీ, అసాధ్యమనీ బ్రహ్మ చెప్పడంతో శివుడెలాగూ అయిదు రుద్ర సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించి తపస్సు చేస్తుంటాడు కదా, ఆయనకి పుత్రుడు పుట్టాలంటే ఈ తపమేదో ముగియాలి. అంటే కనీసం అయిదు రుద్ర దివ్య సంవత్సరాల దాకా తనకీ ప్రపంచంలో ఎదురుండదని ఆలోచించి శివపుత్రుడు తప్ప ఇంకెవరూ తనను సంహరించే సమర్థులు కారాదని వరం పొందాడు.

వరరక్షితుడు, వరగర్వితుడు, సురవైరియైన తారకాసురుడు వెంటనే స్వర్గంపై దండెత్తి దేవతలను పరాజితులను చేసి ఇంద్రుని తగిలేసి ఆయన సింహాసనాన్ని తాను అధిష్ఠించాడు. అప్పుడు దేవతలంతా కైలాసానికి పోయి అక్కడ పరమశివుని గూర్చి తపము చేయగా ఆయన ప్రసన్నుడై ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. దేవతలపుడు విస్తారంగా ఇలా విన్నవించారు: భగవాన్! తారకుడనే రాక్షసునికి బ్రహ్మదేవులు శివ - శక్తి నుండి ఉత్పన్నుడైన వానివల్ల తప్ప ఇంకెవరి చేతిలోనూ చావు లేకుండునట్లు వరమిచ్చారు. కాబట్టి ఓ దేవదేవా! మీరు వెంటనే వివాహం చేసుకొని మమ్ము కాపాడాలి. సర్వజ్ఞులైన తమకు తెలియనిది లేదు. స్వాయంభువ మన్వంతరంలో దక్షయజ్ఞ గుండంలో దగ్ధమైన మీ ధర్మపత్ని సతీదేవి నేడు పార్వతియను పేరుతో హిమవంతుని కూతురుగా జన్మించి వర్ధిల్లుతున్నది. తాను మీ కోసమే పుట్టిందని ఆమెకూ తెలుసు. అందుకే, మీ కోసమై ఎన్నడూ ఏ స్త్రీ చేయనంత ఘోర తపస్సు చేస్తున్నది. వందేళ్ళు జలమధ్యంలో నిలబడి, వందేళ్ళు పంచాగ్ని మధ్యంలో స్థిరపడి, మరొక వందేళ్ళు వాయుభక్షణ మాత్రమే చేస్తూ, ఇంకొక నూరేళ్ళు శ్వాసను బంధించి తపస్సు చేసింది. ఇంకా ఆకాశ, చంద్ర మండలాదుల్లో అపర్ణయై జపము చేయుచున్నది. కాబట్టి హే సతీ వల్లభా! ఆ సతినీ, మమ్మూ కూడా అనుగ్రహించి తమరు పార్వతీ వల్లభులు కావలసిన అవసరం ఎంతైనా వుంది. తారకాసుర భంజకుడైన సత్పుత్రుని తమరు ప్రపంచానికి అందించడం చారిత్రకావసరం.’

‘దేవతలారా! మీ మాటలు నాకు అనుచితాలుగా తోస్తున్నాయి. నేను సంపూర్ణ రుద్రుడను కాను. జ్యేష్ఠ జ్యోతి నుండి పుట్టిన ఏకాదశ రుద్రులలో నేను చివరివాడను, చిన్నవాడను. లోక పరిభాషలో మిగిలిన పదిమంది రుద్రులూ నా అన్నలు. వారి వివాహాలు కానిదే నేనెట్లు పెండ్లాడగలను? పైగా, మీరు చెప్తున్న పార్వతీదేవి అందరికీ అంబ, జగద్‌వ్యాపి. చరాచర బ్రహ్మాండానికే మాతృరూపియైన ఆ భగవతిని నేనెట్లు పెండ్లాడగలను? కాబట్టి నేను మీకు నా శక్తినిస్తాను. అది మీకు కల్యాణకారి కాగలదు’ అని చెప్పి తన శక్తిని అగ్నికి సమర్పించి మరల తపస్సమాధిలోకి వెళ్ళాడు పరమశివుడు. ఇంద్రాగ్నులు బ్రహ్మదేవుని సన్నిధికి పోయి జరిగిందంతా చెప్పారు. బిడియపడి భీష్మించి పెండ్లికొడుకైనట్టి జగమేలు తండ్రి పరమేశుని పరిణయ గాథ లోక ప్రసిద్ధం. అనేక పురాణాలలోనూ కాళిదాసు కుమార సంభవంలోనూ మొన్నటి నన్నెచోడ కవి కుమార సంభవంలోనూ నిన్నటి యక్షగానాల్లోనూ ఈ కథ అద్భుతంగా వర్ణింపబడింది.

దక్షయజ్ఞపు అగ్నికి సతీదేవి స్వయంగా ఆహుతైపోయిన తరువాత తాను ముందుగా పంపిన ఇతర రుద్రుల, తన యొక్క, క్రోధాగ్ని జ్వాలల్లో దక్షుని యొక్కయు, అతని యజ్ఞము యొక్కము విధ్వంసం జరిగిన పిమ్మట శివుడు తపస్సమాధిలోకి వెడలి పోయినాడు. దేవతలు తారకాసురుని వధకై అతనిని ప్రార్థించి వెడలిన తరువాత శివుడు తన తపస్సును మరింత తీవ్రతరం చేశాడు. మొత్తం రుద్రులంతా ఆయనలో కలిసి పోయారు. ఆయన తపోగ్ని జ్వాలల్లో మంచుకొండలలోని కొన్ని శిఖరాలే కరిగిపోసాగాయి. ఆ సమయంలో ఒక్క పార్వతీదేవి తప్ప ఎవ్వరు అటువెళ్ళినా కాలిబూడిద కావలసినదే. అటువంటి సమయంలో అటుపోయి, బాణం వేసిన మన్మథుడు భస్మమై పోయాడు. అతని ఆత్మ శివునిలో కలిసిపోయింది. తన తపస్సుకి విఘ్నం కలిగిందని అక్కడి నుండి అదృశ్యమైపోయి కైలాసమున కొలువుతీరిన శివుడు మరల బ్రహ్మాదిదేవతల మొఱ విని కరుణతో కదిలిపోయి తన శక్తిని భరించగలిగే శక్తి పార్వతికుందో లేదో పరీక్షించి చూసుకొని ఆమెను పెండ్లాడాడు.

తరువాత చాలా కాలానికి దేవతల అకుంఠిత ప్రజ్ఞామూలక ప్రయత్నానికీ గిరిజాదేవి అనన్య సామాన్య తపః ప్రభావానికీ ప్రసన్నుడైన శివుడు ఆమెకు సాక్షాత్కరించి తనకు కావలసిన వరాన్నిచ్చాడు. ఆమెను పెండ్లాడతానన్నాడు. భావితరాలకు ఆదర్శంగా కన్యాధర్మానికి ఆధారభూతంగా నిలచిన భగవతి పార్వతి శివునితో ‘దేవదేవా! నేను తండ్రి చాటుబిడ్డను దయచేసి నా తల్లిదండ్రులతో మాట్లాడి, వారి అనుమతితో నన్ను వివాహం చేసుకోవలసింది’ అంది.

సంప్రీతుడైన శంకరభగవానుడు సప్తర్షులను హిమవంతుని వద్దకు పెండ్లిమాటలాడుటకు పంపించాడు. ఆ తరువాత సర్వలాంఛనాలతో గిరిజా కల్యాణం సంపన్నమైంది. బుద్ధి, సిద్ధి అనే రెండు శక్తులు ఈ సందర్భంలోనే సృష్టించబడ్డాయి. పార్వతీదేవి తన అత్తవారి ఊరేగింపుకి ఎదురుసన్నాహం కోసం ఈ శక్తులను తన తపోబలంతో సృష్టించింది. ఆ శక్తులు బ్రహ్మాదిదేవతలను అన్నిరకాల ఆతిథ్యాలతో సంతుష్టిపఱచగా వారు ఆశ్చర్యచకితులై పార్వతీ దేవిని అనేక విధాల స్తుతించి తమను తారకాది రాక్షస భయం నుండి రక్షింపుమని వేడుకోగా ఆమె ప్రసన్నురాలై అభయమిచ్చింది. వివాహానంతరము పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసంలో సుఖంగావుండగా రతీదేవి మరల ఆయనను తన పతికొఱకై ప్రార్థించగా శివుడు తన తపస్సునే భగ్నం చేయబోయి భస్మమైపోయిన రతీపతిని అనగా మన్మథుని గుర్తుకు తెచ్చుకొని జాలిపడి ఇలా వరమిచ్చాడు:

‘నీ భర్త ఇపుడు నీకు మాత్రమే కనిపిస్తాడు. వైవస్వత మన్వంతరంలో ఇరవై యెనిమిదవ ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్మ పుత్రునిగా ప్రద్యుమ్నుడను పేర నీ భర్త అవతరిస్తాడు. అప్పటి నుండి సంపూర్ణ దేహ ప్రాణాలతో అందరికీ గోచరిస్తాడు. ‘

తరువాత కుమారస్వామి శివశక్తి స్వరూపునిగా జనించి తారకాసురుని వధించి దేవతలనుద్ధరించాడు.

మునులారా! అనంతరం శివుని ముఖము నుండి ఉత్పన్నమైన ఒక రుద్రాంశ కలియుగంలో గొదావరీ తీరాన ఆచార్య శర్మ పుత్రునిగా జనించింది. ఈయన రామశర్మ తమ్ముడు. రామానుజాచార్య అను పేరిట జగత్ప్ర సిద్ధి చెందాడు.